గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 16, 2014

కబ్జాకోరులు


రాష్ట్ర విభజన సాగుతున్నా కూడా వీలైనంత మేరకు హైదరాబాద్‌ను కబ్జా చేయాలనే సీమాంధ్ర పాలకుల కుట్రకు ఆర్టీసీలో సాగుతున్న వివాదం ఉదాహరణ. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్తులను సీమాంధ్ర (ఆంధ్ర ప్రదేశ్)కు శాశ్వతంగా కట్టబెట్టే కుట్రలను ఆర్టీసీ కార్మికులు సాహసోపేతంగా అడ్డుకున్నందుకు వారిని ప్రశంసించాలె. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద గల బస్ భవన్ పధాన కార్యాలయం, తార్నాకలోని ఆస్పత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్ లింగంపల్లిలోని కల్యాణ మండపం, మియాపూర్‌లోని వర్క్‌షాపు మరికొన్ని ఆస్తులపై సీమాంధ్రకు హక్కు దత్తం చేసే విధంగా ఆర్టీసీలోని ఉన్నతాధికారులు కుతంత్రానికి దిగారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మాయోపాయాన్ని పసిగట్టిన ఆర్టీసీలోని తెలంగాణ బిడ్డలు తీవ్రంగా అడ్డుకున్నారు. మెరుపు సమ్మె చేస్తామని బెదిరించారు. దీంతో ఇప్పటికైతే ఈ కబ్జా నిర్ణయాలు వాయిదా పడ్డాయని తెలుస్తున్నది. కర్నూలులో గుడారాలలో గడిపిన సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌కు ఉత్త చేతులతో వచ్చారనేది జగద్విదితం. ఎక్కడి ఆస్తులు అక్కడి వారికే అనేది విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. గతంలోని రాష్ర్టాల విభజన సంప్రదాయాలు ఇదే విధంగా ఉన్నాయి. ఎవరి సొమ్ము ఎవరు తిన్నారనే లెక్కలు తీసినా తెలంగాణ వారికే సీమాంధ్రలోని ఆస్తులు కూడా దక్కుతాయని సీమాంధ్ర పెద్దలు గ్రహించాలె. 

ఎక్కడి ఆస్తులు అక్కడే అనే సూత్రాన్ని సీమాంధ్ర అధికారులు తమకు అనువైన చోట మాత్రమే అమలు చేస్తున్నారు. ఉదాహరణకు- ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఆస్తుల కథ తెలంగాణకు గుండుకొట్టేదిగానే ఉన్నది. పారిశ్రామిక సంస్థల కోసం ఏపీఐఐసి భూమిని సేకరించింది. తెలంగాణలో సేకరించిన భూముల్లో తొంబై శాతం ప్రభుత్వ భూమి, పది శాతం పట్టా భూమి. సీమాంధ్రలో సేకరించినది మాత్రం పది శాతమే ప్రభుత్వ భూమి, తొంభై శాతం పట్టా భూమి.

తెలంగాణలో సేకరించిన భూములు అమ్మడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరోవైపు సీమాంధ్రలో లాండ్ బ్యాంక్‌లో తొంభై శాతం భూమి ప్రైవేట్‌దే కనుక వాటి కొనుగోలుకు ఈ ధనం వెచ్చించింది. ఇప్పటి వరకు తెలంగాణలో మిగిలిన లాండ్ బ్యాంక్ ఐదు వేల ఎకరాలు కాగా, సీమాంధ్రలో యాభైవేల ఎకరాలు ఇంకా మిగిలే ఉన్నది. ఇప్పుడు విభజన వల్ల సీమాంధ్రలోని లాండ్ బ్యాంక్ అంతా వారికే పోతున్నది. గిడ్డంగుల శాఖ కూడా తెలంగాణ కన్నా సీమాంధ్రలోనే ఎక్కువగా గిడ్డంగులు నిర్మించింది. డెబ్బయి శాతం గోదాములు అక్కడే ఉన్నాయి. వీటి విలువ రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా.వీటిని తమకే అంటున్నారు. కానీ ఇదే సూత్రం ఆర్టీసీ తదితర హైదరాబాద్‌లోని ఆస్తులకు వర్తింప చేయడం లేదు. 

హైదరాబాద్ హైండ్లూం కోఆపరేటివ్ సొసైటీ (హైకో) ఒకప్పుడు లాభాలతో నడిచేది. ఇది తెలంగాణకు గర్వకారణమైన సంస్థగా ఉండేది. దీనిని సీమాంధ్రకు చెందిన నష్టాలతో నడిచే సంస్థలతో విలీనం చేశారు. ఇప్పుడు విభజన సందర్భంగా గతంలో హైకోకు ఉన్న ఆస్తులను తెలంగాణకు అప్పగించాలని కోరడంలో తప్పేమీ లేదు. వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ది మరో వింత కథ. హైదరాబాద్ నడిబొడ్డున కోఠీలో వైద్య, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ క్యాంపస్ ఉన్నది. ఇది నిజాం కాలం నాటి కట్టడం. వైద్య విధాన పరిషత్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థతో పాటు మరికొన్ని ఇతర వైద్య ఆరోగ్య శాఖలు ఈ విశాలమైన క్యాంపస్‌లో ఉన్నాయి.

దీనికి సంబంధించి సీమాంధ్ర పెద్దలు అనుసరిస్తున్న నీతి ఆశ్చర్యకరంగా ఉన్నది. వైద్య విధాన పరిషత్‌కు చెందిన దాదాపు రెండెకరాల భూమిని మెట్రో రైలు ప్రాజెక్టు కోసం అప్పగిస్తారట. ఇక్కడ శిక్షణ పొందే వైద్యులు, నర్సులను సుల్తాన్ బజార్ ఆస్పత్రికి అప్పగిస్తారట. ప్రజలకు అందించే వైద్య సేవలకు ఆటంకం గురించి ఆలోచించడమే లేదు. మిగిలిన వసతులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తారట. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిబ్బందిని మొదట జూబిలీ హిల్స్ తరలిస్తామన్నారు. ఆ తరువాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నారు. ఇప్పుడు సోమాజిగూడలోని కిరాయి కొంపలో సర్దుకోమంటున్నారు. ఈ ఒక్కటే కాదు, ప్రతి శాఖలో ప్రధాన భవనాలను, ఏసీ వంటి అధునాతన వసతులున్న గదులను సీమాంధ్రకు కేటాయిస్తున్నారు. దుమ్ము కొట్టుకుపోయే శిథిల భవనాలను తెలంగాణకు అప్పగిస్తున్నారు. 

సీమాంధ్ర పాలకుల వైఖరి చూస్తే పోతూపోతూ కూడా హైదరాబాద్‌లో లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తమ రాష్ట్రం పేర దోచుకుపోవాలనే కుట్ర పన్నుతున్నట్టుగా ఉన్నది. సీమాంధ్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అక్కడ రాజధాని నిర్మాణానికి ఎక్కువలో ఎక్కువ రెండేండ్లు పడుతుంది. ఈ లోగా దశల వారిగా ఇక్కడి భవనాలను ఖాళీ చేయవచ్చు. బుద్ధి కుశలత ఉంటే మొదటి రోజు నుంచే అక్కడ తాత్కాలిక వసతుల్లో కొత్త ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చు. కానీ వీలైనంత కాలం ఇక్కడే పడి ఉండాలని, అందిన కాడికి కబ్జా పెట్టాలని సీమాంధ్ర పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే అందమైన భవంతులలో తిష్టవేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల మాదిరిగానే అన్ని శాఖలలోని తెలంగాణ బిడ్డలు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రలను అడ్డుకోవాలె.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి