బ్లాగు వీక్షకులకు, తెలంగాణ సోదరులకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఏ అభివృద్ధి వ్యూహం రచించాలన్నా, అమలు చేయాలన్నా ఆ సమాజ సూక్ష్మ వివరాలు సమగ్రంగా తెలిసి ఉండటం అవసరం. ఈ అవగాహనతోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న రీతిలో సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమపథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు ఈ సర్వే గణాంకాలను ప్రాతిపాదిక చేయనున్నది. ఇందుకని ఈ నెల 19న దాదాపు మూడు లక్షల అరవై తొమ్మిదివేల ప్రభుత్వోద్యోగులను, ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులను, మొదటిసారిగా పోలీసులను కూడా సర్వేలో భాగస్వాములను చేస్తున్నది. నాలుగో తరగతి ఉద్యోగులను కూడా ఎన్యూమరేటర్లుగా రంగంలోకి దించుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల పల్లెనుంచి పట్నం దాకా ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి సకల సన్నాహాలను చేస్తున్నది.
స్వతంత్ర భారతంలో ఇప్పటికి ఒక్కసారి కూడా జనాభా గణనలో భాగంగా కులాల వారు ఎంత మంది ఉన్నదీ లెక్కలు తీయలేదు. ఇక ఉప కులాల లెక్కింపు లేనే లేదు. గంప గుత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీల గణన ఆధారంగానే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో ఆయా కులాలకు, ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు అందడం లేదనే వాదనలున్నాయి. సంక్షేమ పథకాలు అందించాలంటే ఎంత మంది పేదలున్నారు, వారి వృత్తులు ఏమిటి? వారి అభివృద్ధికి ఎటువంటి వ్యూహాలు రచించాలె, వాటిని నిర్దేశిత సామాజిక వర్గాలకు ఎట్లా అందించాలే అంశంపై స్పష్టత కొరవడింది.
పేదల కన్నా, తెల్ల కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మరోవైపు ఇంకా తెల్లకార్డులు అందని పేదలు ఉండడం విచిత్రం. కోట్లాది రూపాయల ప్రజా ధనం అర్హులైన పేదలకు అందకుండా ఇటువంటి నకిలీ పేదలకు చేరుతున్నది! సీమాంధ్ర పాలనలో పేదల అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేల కోట్ల రూపాయలు పలారం మాదిరిగా పంచిపెట్టారనేది ఇప్పుడు బోధపడుతున్నది. ఈ నేపథ్యంలో పేదల అవసరాలు గుర్తించి, వారి అభివృద్ధి కోసం నిధులను పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చేయడానికి సమగ్ర సర్వే అవసరమైంది. ఇటువంటి సదుద్దేశంతో, సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయడానికి తోడ్పడాలే తప్ప దీనిపై లేనిపోని అనుమానాలు కలిగించడం తగదు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలసిన అవసరం ఉన్నది. కొందరు పనిగట్టుకుని ఈ సర్వేను తప్పు పడుతున్నారు. లేనిపోని భయాలను ప్రచారం చేస్తున్నారు. రేషన్లు కార్డులు తొలగించడానికి, సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ఈ సర్వే చేపట్టినట్టుగా పుకార్లను పుట్టిస్తున్నారు. ఒక ప్రాంత ప్రజలను గుర్తించడానికి ఈ సర్వే చేపట్టినట్టు కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తద్వారా కొన్ని వర్గాలను భయ భ్రాంతులను చేయాలనే కుతంత్రం సాగుతున్నది. మరి కొందరైతే ఒక్క రోజులో ఇది అయ్యే పని కాదని అపశకునాలు పలుకుతున్నారు. వ్యక్తుల ఆదాయ పన్ను, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, పౌరసత్వం అనేవి కేంద్రం పరిధిలోని అంశాలని, రాష్ట్రం ఆ సమాచారాన్ని సేకరించడం అక్రమమని చెప్పుకొస్తున్నారు. సవివరమైన, వాస్తవ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండటం పట్ల ఎందుకు భయమో వారికే తెలియాలి.
నిజానికి సర్వేలకు ఈ భరతావనిలో సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ప్రజానుకూల పాలన చేయాలనుకున్న పాలకులంతా జనాభా గణనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా మొఘల్ చక్రవర్తి అక్బర్ దేశంలో మొదటిసారి 1581లో జనాభా గణన చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఆతర్వాత కాలంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన కాలంలో 1790 ప్రాంతంలో బ్రిటిష్ ఇండియాలో జనాభా గణన ప్రారంభించారు. స్వతంత్ర భారతావనిలో ఎన్నో దఫాలుగా సర్వేలు నిర్వహించినా అన్నింటికీ పునాదిగా ఉన్న గ్రామం, దాని స్వరూప, స్వభావాల వివరాలు సమగ్రంగా ఎప్పుడూ సేకరించలేదు.
ఆయా సందర్భాల్లో ప్రజలనుంచి వచ్చిన డిమాండ్లు, పాలకుల అవసరాల కనుగుణంగానే సర్వేలు నిర్వహించారు. దీంతో భారతీయ సమాజానికి ప్రతిబింబంగా చెప్పుకునే గ్రామానికి సమగ్ర చిత్ర పటం ఎప్పుడూ రూపు కట్టలేదు. కాబట్టే ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసమని ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా అవి అసలు లబ్ధిదారులకు చేరడం లేదు. పేదరికం రూపుమాసి పోవడం లేదు. ఈ అనుభవాల నేపథ్యం నుంచే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేకు రూపకల్పన చేసింది. కుటుంబ సమగ్ర సమాచారం లక్ష్యంగా సర్వే చేపడుతున్నది.
ఈ సర్వేకు నోడల్ సంస్థగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వ్యవహరిస్తున్నది. రెవెన్యూ యంత్రాంగం కీలక భూమిక పోషిస్తున్నది. ఈ సర్వే వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ ,కుల, నివాస, ఆదాయ, జనన ధృవీకరణ పత్రాలకు ఆధారంగా చేస్తున్నది. అలాగే ఈ హౌజ్ హోల్డ్ సర్వే, ఆధార్ కార్డులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో. నెం. 5ను తెచ్చింది. దీన్ని బట్టి ఈ సర్వే వివరాలు ఎంత కీలకమైనవో తెలుస్తున్నది. కాబట్టి కొందరు దుర్బుద్ధితో మాట్లాడే వంకరమాటలకు మోసపోకుండా ఈ సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి