గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 10, 2014

రాజీపడేదే లేదు...చేసి చూపిస్తా...!!!

-ఐదేండ్లు కష్టపడితే అభివృద్ధి పట్టాలెక్కుతది
-టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
-మావి చరిత్ర కనీవినీ ఎరుగని నిర్ణయాలు..
-తొందరపడేది లేదు.. చేసిన ప్రతి వాగ్దానం అమలు చేస్తం
-ప్రతిష్ఠాత్మకంగా వాటర్‌గ్రిడ్ చేపడుతున్నాం
-చరిత్ర ఎరుగని విధంగా హరితహారం చేపడతాం
-వచ్చే ఏడాది మార్చి నుంచి గిరిజనులకు భూ పంపిణీ
-చంద్రబాబు మన కరెంటు ఆపుతున్న కర్కోటకుడు
-ఎంతచేస్తున్నా ప్రతిపక్షాలకు కనిపించడం లేదు: కేసీఆర్
చెరువుల పునరుద్ధరణ అద్భుత పథకం... దక్షిణ భారతదేశంలోని జేసీబీలు అన్నీ ఇక్కడే పనిచేయాలె. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన చెరువులల్లనే పని మొదలయితది.

తెలంగాణలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని వీధులల్ల కనపడద్దు. నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా ఇయ్యకపోతే టీఆర్‌ఎస్ మల్ల ఓట్లుకూడ అడగదని ప్రజలకు చెప్పుదాం.
KCR001హైదరాబాద్‌ల ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేటట్లు చేస్తం. నెలరోజులు దాటిన తర్వాత ఆడపిల్ల దిక్కు చూడాలంటె లాగు తడవాలె.. కండ్లు పీకేసే కార్యక్రమం కూడా ఉంటది.


అనేక త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో పునర్నిర్మాణ బాధ్యత చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి అడుగు ఆచితూచి వేస్తుందే తప్ప, ఎవరి గోలకో గొడవకో తత్తరపడి నిర్ణయాలు తీసుకోదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌నుంచి వారసత్వంగా వచ్చిన మురికిని వదిలించుకుని అభివృద్ధి దిశగా రాష్ర్టాన్ని పరుగులు తీయించే కార్యక్రమం ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అమలుచేసి చూపిస్తామన్నారు.

ఎన్నికల్లో చెప్పని, వాగ్దానం చేయని పథకాలు కూడా చేపడుతున్నామని కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కనీసం అధికారుల కేటాయింపులు కూడా జరగని స్థితిని చూసి కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కనీస ఇంగితం కూడా లేకుండా నోరు పారేసుకుంటున్నాయని, పదవి స్వీకరించిన మూడో రోజే దిష్టిబొమ్మలు కాల్చే స్థితికి దిగజారి ప్రవర్తించాయన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉందన్న విషయం మెదక్ ఎన్నికలతో స్పష్టమైందని చెప్పారు. ప్రజలు ముఖం మీద ఈడ్చి కొట్టినా సిగ్గులేకుండా ప్రతిపక్షపార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం వీటికి బెదరబోదని అన్నారు.

టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పునర్నిర్మాణాన్ని కూడా ఉద్యమంగా భావించి కృషి జరపాలని ఆయన కోరారు. రానున్న కాలంలో చెరువుల పునరుద్ధరణ, హరితహారం, తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం, దళితులకు భూపంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

కరెంటు కోతలకు బాధ్యులెవరు?
కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం.. అధికారంలో ఉన్నా అధికారులు లేరు. వర్క్ టు ఆర్డర్ పేరు మీద 35 మంది ఐఏఎస్ అధికారులతో పని చేస్తున్నం. ప్రధానమంత్రికి రెండుసార్లు చెప్పిన. జాప్యం చేయడం మంచిదిగాదు. ఎవరినిస్తరో వాళ్లను తొందరగ ఇవ్వండి అన్న. నిన్న సాయంత్రం కూడ చెప్పిన. కానీ ఫలితం లేదు. కొన్ని పార్టీలు చాలా తొందరపడుతున్నయి. ఇంగితం లేకుండ మాట్లాడుతున్నరు. కరెంటు సమస్యను తీసుకోండి.

కరెంటు కోతలకు ఎవరు నిజమైన బాధ్యులు? ఇంతకుముందు పది సంవత్సరాలు ఎవరు పాలించిండ్రు. మీరు పదేండ్లలో చేయలేనిది... మూడ్నెల్ల పసిగుడ్డు చేస్తదా? అల్లావుద్దిన్ అద్భుత దీపం వెలిగించాల్నా? కొందరికైతే తీవ్ర అసహనం. జూన్ రెండు ఉదయం 8.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేసినం. నాలుగున బ్యాంకర్లతో మీటింగు పెట్టినం. ఐదున ప్రధానమంత్రి, రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఢిల్లీకి పోయిన.

ప్రమాణ స్వీకారం చేసి మూడ్రోజులు కాలే... ఇక్కడ టీఆర్‌ఎస్ జెండా గద్దెలు కూలుతయి. కేసీఆర్ దిష్టిబొమ్మలు కాలబెడతరు. ఇదేనా రాజకీయం? దీన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదో జరుగుతుందని పెద్దగ చేసి చూపెడ్తది. ముప్ఫై రోజులకే ఏమైతంది? ఏం చేసిండ్రు అంట. ఒకవేళ 30 రోజుల్ల ఏమైనా చేసినా అది తెలివి తక్కువ పనయితది. త్త రాష్ట్రం వచ్చింది. మంచి చెడు చూసుకోవాలె. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రణాళిక జరగాలి. ఏది పడ్తె అది గుడ్డిగా చేయదల్చుకోలే. ఒక నిర్ణయం తీసుకోవాలంటె ఎంతో ఆలోచించాలి. ఇప్పుడు జరిగే ఒక్క పొరపాటు 50-100 ఏండ్లు తెలంగాణకు శాపంగా మారుతది.

సింగిల్ జీవోతో రూ.4,250 కోట్లు ఇచ్చినం..
ఒక్క మంత్రిమండలి మీటింగ్‌లో 48 అంశాలపై నిర్ణయం తీసుకున్నం. రూ.15-17వేల కోట్లతో రుణ మాఫీని అమలు చేసినం. ఆర్‌బీఐ సహకరించకున్నా.. ఎన్నడూలేని విధంగా సింగిల్ జీవోతో రూ.4,250 కోట్లను మంజూరు చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలనే లేదు. దానికి కాంగ్రెసోళ్లు ఏమాయే రుణమాఫీ అంటున్నరు.

ఎప్పుడన్న చేసిన ముఖాలా? చూసిన ముఖాలా? రుణ మాఫీకి ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం అంటే సూట్‌కేసుల్ల పైసలుండవు. ఒక నెల పన్ను మరో నెల వస్తుంది. రుణ మాఫీ లెక్కలు తీసినం. రెండు, మూడు దఫాలుగా బ్యాంకులకు ఇద్దామని అనుకున్నం. మరి డబ్బులు జమ కావాలి. ఇదంతా బయట తెల్వదు. పిచ్చిగ, బాధ్యతారాహిత్యంగ మాట్లాడుతున్నరు. మోస్తే అర్థమవుతుంది. కొందరు కుక్కలకంటే హీనంగా మొరిగిండ్రు. మెదక్ ఉప ఎన్నికల తర్వాతనైన బుద్ధొస్తదనుకున్నం. కానీ రాలేదు.

మార్చినుంచి గిరిజనులకు భూ పంపిణీ..
గోల్కొండ కోటలో ఇద్దరు మహిళలు నేరుగా నాతోటి మాట్లాడినరు. మొదటామె అంటది.. ఇగో... నీ కడుపు సల్లగుండ. నా మొగుడు తాగుతడు. ఇద్దరు పోరగాండ్లున్నరు. మంచిగున్నరు. తప్పకుండ గెలుస్త. గెలిచి సూపిస్త. నీ నమ్మకం నిలబెడ్త అన్నది. నాకు చాలా సంతోషం కలిగింది. మరో మహిళ ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది. ఆమె రూ.21 లక్షల భూమి ఇచ్చినవు. తప్పక గెలిసి చూపిస్త. వంద శాతం నీ మాట కిందపడనీయ.. అంటే చాలా పొంగిపోయిన. అప్పుడే అనిపించింది.. విషయం జనానికి అర్థమైంది. గీ పథకం సక్సెస్ అవుతదనుకున్న. భూ పంపిణీ చరిత్రల ఎన్నడూ నయాపైసా లంచం లేకుండా పథకం అమలు కాలేదు. కానీ మనం చేసినం. రేపు అట్లనె ఉంటది. ఒక్క పైస లంచం తీసుకున్నా చీరి చింతకు కడ్తనని చెప్పిన. గిరిజనులకు కూడా ఇదే విధంగా భూ పంపిణీ చేస్తం.వచ్చే ఏడాది మార్చి నుంచి మొదలుపెడ్తం.

ఎన్‌ఆర్‌ఐలు భూములివ్వండి..
హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడినవారు, అమెరికా, ఇతరత్రా దేశాల్లో బాగా స్థిరపడినవారు చాలా మంది ఉన్నరు. వాళ్లకు ఊర్లళ్ల భూములు ఉన్నయి. భూమి అంటే ఉత్పత్తి సాధనం. ఉట్టిగ (ఐడిల్) ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. పేదలకు అప్పగిస్తే బాగుంటుంది. ఉచితంగా ఇవ్వాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం డబ్బులు పెట్టేందుకు సిద్ధంగ ఉంది. ల్యాండ్ పర్చేజింగ్ స్కీం ద్వారా బాజాప్తా డబ్బులు ఇస్తం. మంచి రేటు ఇస్తం. ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై బాగా ప్రచారం చేయాలి.

చెరువుల పునరుద్ధరణ అద్భుత పథకం... 
తెలంగాణ రాష్ట్రంల 45,300 చెరువులు ఉన్నట్లు సర్వేలో తేలినయి. ఓ దిక్కు పొన్నాల లక్ష్మయ్య.. ఇటువైపు టీడీపీ, అటువైపు బీజేపీ బీద అరుపులు పెడుతుంటరు. ఏం చేయ్యాలె.. అవశేష ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన వారసత్వం, దరిద్రం అంతా మురికి. దేనికీ ఒక్క లెక్క లేదు. రాష్ట్రంలో ఎన్ని చెరువులు, కుంటలున్నయో చెప్పే నాథుడు లేడు.

ఒక డిపార్ట్‌మెంట్ ఒకటి చెప్తె ఇంకొకళ్లు ఇంకోటి చెప్తరు. ఇంత అధ్వాన్నమా? ఇంజినీర్లు అందర్ని పిలిచి లెక్కలు తెమ్మంటె 20 రోజుల్ల సర్వే చేసి లెక్కలు తెచ్చిండ్రు. చెరువుల పునరుద్ధరణకు రూ.25-30వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించినం. సమైక్య రాష్ట్రంల చెరువులన్నీ విధ్వంసానికి గురై.. ఇప్పుడు తాంబాలాలలెక్క తయారైనై. పూడికలు తీయాలె. దీన్ని ఉద్యమం లెక్క చెయ్యాలె. మీరందరూ ఈ ఉద్యమంల పాల్గొనాలి.

నేనూ పది జిల్లాల్లో తిరిగి జిల్లాకో తట్ట మట్టి మోస్త. ఒక్క సంవత్సరం చెరువు నిండితె మూడేండ్లు కరువు లేకుండా ఉంటది. ఈ సంవత్సరం బడ్జెట్‌ల కూడ నిధులు కేటాయిస్తున్నం. దక్షిణ భారతదేశంలోని పొక్లెయిన్లు, జేసీబీలు అన్నీ ఇక్కడే పని చేయాలె. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన చెరువులల్లనే పని మొదలయితది. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గంల చెరువుల పునరుద్ధరణలో పాల్గొంట. రిస్టోరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ జూలైలో మొదలయితది.

వాటర్ గ్రిడ్‌తో నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లానీరు..
వాటర్‌గ్రిడ్ పథకం మొదలు పెడ్తున్నం. రూ.20-25వేల కోట్ల ఖర్చు చేస్తున్నం. ఇవన్నీ బడ్జెట్‌లో తీసుకుందాం. తెలంగాణలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని వీధులల్ల కనపడద్దు. 70 శాతం బీమార్లు నీటి వల్ల వస్తయని డాక్టర్లు చెప్తుండ్రు. అందుకే రక్షిత మంచినీటిని అందిస్తే 70 శాతం బీమార్లను నియంత్రించిన వారమవుతం.

అప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుంది. నాలుగేండ్లలో ప్రతి ఇంట్లో నల్లా ఇయ్యకపోతే టీఆర్‌ఎస్ పార్టీ మల్ల ఓట్లుకూడ అడగదని ప్రజలకు చెబుదాం. (చప్పట్లు కొడ్తలేరు.. భయమైతున్నట్లుంది) అసలు ఎమ్మెల్యేలకు పొద్దాక హైదరాబాద్‌ల ఏం పని? గ్రామాలల్ల ఉండాలె. రాత్రింబగళ్లు అధికారులతో కలిసి తిరగాలె. చిత్తశుద్ధి ఉండాలె. ఇప్పుడు ఐదేండ్లు కష్టపడితె అభివృద్ధి పట్టాలెక్కుతది. ఒకసారి ఇవి మొదలైతే నేను ఒక్కరోజు కూడా హైదరాబాద్‌ల ఉండ. అన్ని జిల్లాలు తిరుగుత.

చంద్రబాబు కర్కోటకుడు..
కరెంటు మీద ఇప్పుడేం చేసినా.. అది షాప్‌ల దొరికేది కాదు. వచ్చే సంవత్సరం కరెంటుతో ఇన్ని బాధలు ఉండవు. ప్రజలకు ఈ విషయాన్ని అందరూ ధైర్యంగా చెప్పండి. ఎవరో అరిచిండ్రని భయపడొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొండి చేస్తున్నది.

470 మెగావాట్ల విద్యుత్తు అతి తక్కువ ఖర్చుతో వచ్చె లోయర్ సీలేరును కలుపుకొని చంద్రబాబు కర్కోటకంగా వ్యవహరించిండు. నిన్న పీపీఏలు రద్దు చేసిండు. కృష్ణపట్నం పోర్టు నుంచి లైను అనుసంధానమవుతదని నిన్నంతా ఎదురుచూసినం. 700-800 మెగావాట్ల విద్యుత్తు వస్తదనుకున్నం. తొండి పెట్టి దాన్ని కూడా వాయిదా వేసిండ్రు. అయినా భయపడం.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల పంటలు ఎండిపోకుండ కాపాడతం. 15 రోజుల్ల ఆ పని చేస్తం. కేసీఆర్ అబద్ధాలు చెప్పడు. నిన్ననే సంతకాలు అయినయి. వేగంగా పనులు చేస్తం. మూడేండ్లల్ల భారతదేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగ ఉంటం. జైపూర్, సింగరేణి, భూపాలపల్లి, కేంద్ర వాటా ఇలా 2000-2500 మెగావాట్ల విద్యుత్తు తోడవుతది. 2వేల మెగావాట్ల విద్యుత్తుకు టెండర్లు కూడా అయినయి. ఇగ చంద్రబాబు బ్లాక్‌మెయిల్ ఉండదు.

పీవీ జయంతిని జరుపుకోలేని బానిసలు మీరు..
పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. పీవీ నర్సింహారావు వాళ్ల పార్టీ నాయకుడు. తెలంగాణ బిడ్డ. ప్రధానమంత్రి అయిండు. మీ ముఖాలకు కనీసం జయంతి చెయ్యలే. మేం బాజాప్తా అధికారికంగా పీవీ జయంతిని నిర్వహించినం. వెటర్నరీ యూనివర్సిటీకి పేరుపెట్టినం. భారతరత్న అవార్డుకు కూడా ప్రతిపాదనలు పంపినం.

మీ పార్టీ నాయకుడిని మీరు గౌరవించకున్నా.. మా పార్టీ నాయకుడు కాకున్నా తెలంగాణ బిడ్డ అని గొప్పగ జయంతి చేసుకున్నం. అణచివేతకు గురైన దాశరథి పేరిట కూడా స్మారక అవార్డు ఇచ్చినం. ఆయన కుటుంబాన్ని ఆదుకున్నం. జయశంకర్‌సార్ పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నం. కాళోజీ పేరిట హెల్త్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నం.వరంగల్‌లో కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసినం. కొమురంభీం పేరిట గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నం. ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తం. ఈ నెల 8న బ్రహ్మాండంగా కొమురంభీం జయంతి జరుపుకునేందుకు జోడేఘాట్ వెళుతున్న. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పోలే.

ప్రతిదానికో రాద్ధాంతం..
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు చేస్తే దాన్నో ఇష్యూ చేసిండ్రు. సర్వేపై పంచాయితీ చేసిండ్రు. ప్రభుత్వం కాకపోతే ఎవరు సర్వే చేస్తరు? ప్రభుత్వం దగ్గర లెక్క ఉండాలి. ప్రతిపక్షాలకు ప్రతిసారీ ప్రజలు మొహం మీద తంతున్నా, కోట్లాది మంది చెంప మీద కొట్టినట్లు సర్వేలో పాల్గొన్నా బుద్ధి వస్తలేదు. ప్రధానమంత్రి స్వయంగా రావ్‌సాబ్ సర్వే ఎలా చేసిండో చెప్పండని వివరాలు తీసుకుండ్రు. బతుకమ్మ పండుగ అద్భుతంగా చేసిండ్రని ప్రపంచం ప్రశంసిస్తుంది. ఆంధ్ర వాళ్లు కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నరు. గవర్నర్ సమైక్య రాష్ట్రంల ఎందుకు జరుపుకోలేదు అని అడిగిండు. విగ్రహాల దానిని కూడా ఓ ఇష్యూ చేసిండ్రు. వాటిని తీసేందుకు ఒక లెక్క ఉంటది. గౌరవంగ తీస్తం.

మంత్రి, ఎమ్మెల్యేల కాలేజీలు కూడా పోయినయి..
ఇంజినీరింగ్ కళాశాలలు ఇష్టానుసారంగ ఉన్నయి. డైరీ, పౌల్ట్రీ ఫాంలు కూడా ఇంజినీరింగ్ కాలేజీలే. మొన్న నాస్కమ్ వాళ్లు కొన్ని విషయాలు చెప్తుంటె సిగ్గుతో తలదించుకున్న. కాలేజీల మీద చర్య తీసుకుంటామంటే చెయ్యి పడనీయరు. తోలు తీస్తమన్నం.. బ్లాక్‌మెయిల్ చేస్తే కుదరదన్నం. నన్ను హిట్లర్ అన్నరు. అవును హిట్లర్‌నే కాదు.. హిట్లర్ అయ్యను. మంచిగ ఉంటే కాళ్లు కడిగి నెత్తినపోసుకుంటం. చెడ్డగుంటె చీల్చి చెండాడుతం. టాస్క్‌ఫోర్స్ కాలేజీల జాబితాల మా మంత్రి మహేందర్‌రెడ్డి ,మన ఎమ్మెల్యేల కాలేజీలు కూడా ఉన్నయి. అయినా రాజీ లేదు.

పేకాట క్లబ్‌లపై రాజీ ముచ్చటే లేదు..
పేకాట క్లబ్‌లు బంద్ చేస్తే దానిని రాద్ధాంతం చేసిండ్రు. ఒకరోజు పేపర్ల చూసిన. కర్నూల్ జిల్లా వ్యక్తి పేకాటల డబ్బులు పోగొట్టుకొని రాజ్‌భవన్ ముందు ఎండ్రిన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిండట. ఇదేందని పోలీసోళ్లను పిలిచి అడిగిన. కఠినంగ వ్యవహరించమన్న. నిజామాబాద్ మహిళ ఒకరు ఫోన్ చేసి అలంకృత రిసార్ట్స్‌లో నా భర్త పత్తాలాడుతడు, నిజామాబాద్ వాళ్లు అక్కడే ఆడ్తరని చెప్పింది. నేను పోలీసులకు సమాచారం ఇచ్చిన. పోలీసులు పట్టుకుండ్రు. అడ్రస్ ఎక్కడని ఎవర్ని అడిగినా నిజామాబాద్ అనే చెప్పిండ్రు. వాళ్లంతా మీ ఆర్మూర్ (ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని చూపుతూ) వాళ్లేనంటా అని అనడంతో సమావేశంలో నవ్వులు పూచాయి.

పునర్నిర్మాణంలో సాంస్కృతిక వారధి కీలక పాత్ర 
అన్నం తినో, అటుకులు తినో, ఉపాసముండో పోలీసులు కేసులు పెట్టినా తెలంగాణ కళాకారులు ఉద్యమంల పాల్గొన్నరు. అందుకే సాంస్కృతిక వారధి పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసినం. ఎమ్మెల్యే రసమయి ఇతరులు కలిసి 500 మంది కళాకారుల జాబితా తయారు చేయమని చెప్పినం. వాళ్లకు కచ్చితంగా ఉద్యోగాలిస్తం.

త్వరలో 4వేల నామినేటెడ్ పోస్టులు..
టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వజ్రపు తునకలు. పదవులు లేకపోయినా కాలినడకన తిరిగిన వాళ్లున్నరు. కార్యకర్తలకు కచ్చితంగా నామినేటెడ్ పోస్టులిస్తం. మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఫుడ్ కార్పొరేషన్ ఇలా రాష్టస్థాయి కార్పొరేషన్లలో 4వేలకు తక్కువ కాకుండా పోస్టులున్నయి. జిల్లాకు 300-400, ప్రతి నియోజకవర్గానికి 30-40 పోస్టులు దక్కుతయి.

దేశం ఊహించని రీతిలో హరితహారం చేస్తం..
హరితహారాన్ని దేశ చరిత్రలో ఎవరూ ఊహించని స్థాయిలో చేస్తం. ఎన్నికలకు ముందు నా పొలం దగ్గర ఉన్నపుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం సర్వాపూర్ వ్యక్తి వచ్చి ఇక్కడ మంచిగ వ్యవసాయం చేస్తుండ్రంట. చూద్దామని వచ్చిన అన్నడు. మీ దగ్గర వర్షాలెట్ల పడుతున్నయంటే.. ఎందుకు పడవు? గ్యారంటీగా పడతయి అన్నడు. అదెట్ల అని అడిగితే మా దగ్గర అడువులున్నయి గదా అన్నడు. సమైక్య పాలకులు ఉన్న అడవిని ధ్వంసం చేసిండ్రు.

అందుకే హరితహారం తీసుకున్నం. మూడేండ్లల్ల 230 కోట్ల మొక్కలు నాటుతం. ప్రతి సంవత్సరం జూలైలో ఒక్కో గ్రామంలో 40వేల మొక్కలు నాటుతం. తెలంగాణకు రూ.1100 కోట్ల కాంపా ఫండ్ రావాలి. ప్రధానమంత్రిని కలిసినపుడు మోదీజీ మీరు సీఎంగ ఉన్నపుడు కేంద్రం కాంపా ఫండ్ ఎందుకు ఇవ్వడంలేదని అడిగిండ్రు. ఇప్పుడు మీరు ప్రధాని మరి ఇయ్యాలె గద అన్న. మళ్ల పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ దగ్గరకు పోయేసరికి ఉత్తర్వులు వచ్చినయి. మీ వల్ల అన్ని రాష్ర్టాలకు ఆ నిధులు ఇస్తున్నమని చెప్పిండు. తెలంగాణలో చెట్లు, అడవులు పెరగాలి.. వానలు వాపస్ రావాలి.. అనే నినాదంతో హరితహారాన్ని చేపడుతున్నం. ప్రతి సంవత్సరం జూలై ఒకటిన సీఎం, మంత్రుల నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వరకు వారంరోజులపాటు మొక్కలు నాటాలి.

ఆడపిల్ల దిక్కుచూడాలంటే లాగు తడ్వాలె..
మహిళల భద్రత విషయం చూస్తే మన హైదరాబాద్ కూడా ఢిల్లీ లెక్క అయితదన్నట్లుంది. అందుకే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినం. అందరం ఒక తల్లికి పుట్టినం. చెల్లెలు, అక్కలున్నోళ్లం. విచ్చలవిడితనంగ చేస్తమంటె ఎట్ల? కొన్ని బయటికి చెప్పేటివి వుంటయి, కొన్ని చెప్పకుండ ఉంటయి. హైదరాబాద్ ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేటట్లు చేస్తం. నెలరోజులు దాటిన తర్వాత ఆడపిల్ల దిక్కు చూడాలంటె లాగు తడవాలె.. కండ్లు పీకేసే కార్యక్రమం కూడా ఉంటది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం మనకు అవమానం కాదా. తల ఎత్తుకోలేం. కఠిన చట్టాలు, చర్యలు చేపడతం. అవసరమైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టాన్ని కూడా ఆమోదించుకుందాం.

ప్రతిపక్షాలకు ఇవి కనిపిస్త లేవు..
-ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ.480 కోట్లు మంజూరు చేసినం. ఎర్ర జొన్న రైతుల పరిహారం కూడా.. రూ.11 కోట్లు ఇచ్చినం.
-ఆటో, ట్రాక్టర్ ట్రాలీలకు రాష్ట్రంల పన్నే లేదు. ఉన్న బకాయిలు కూడా ఎప్పుడో మాఫీ చేసినం.
-కల్లుగీత కార్మికులకు దసరా నుంచి హైదరాబాద్‌ల కల్లు దుకాణాలు పునరుద్ధరించినం.
-కరీంనగర్, సిరిసిల్ల, నల్లగొండలోని పోచంపల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న పవర్‌లూం కార్మికుల బకాయిలు కూడా మాఫీ చేసినం.

- సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్ ఇచ్చినం. బోనస్ ఇచ్చినం. డిస్మిస్ అయిన 3600 మంది కార్మికులతోపాటు మరో 2-3వేల మంది డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలిచ్చినం.
-వృద్ధ కళాకారులకు రూ.1000 పింఛను ఆదేశాలు జారీ అయినయి.
-కల్యాణలక్ష్మి పథకం దసరా నుంచి అమలులోకి వచ్చింది. దసరా తెల్లారి నుంచి దీనితో పాటు షాదీ ముబారక్ కూడా అమలులోకి వచ్చింది. ఇది ఎవ్వరూ డిమాండు చేయలే. అడగ లేదు. ఇండ్ల వధూవరులకు 18 సంవత్సరాల కనీస వయసు పెట్టినం. దీనివల్ల బాల్య వివాహాల వంటి సాంఘిక దురాచారం కూడా ఆగుతది.

-వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు రూ.1000, 1500 పింఛన్లు అమలు చేస్తం. సర్వే కూడా అయిపోయింది. ఎమ్మార్వోలకు ఆదేశాలిచ్చినం. ఏ ఒక్క అర్హుడు, లబ్ధిదారుడికి కూడా పింఛను, రేషన్ కార్డు అందకుండ ఉండకూడదు. అదే సమయంలో ఏ ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వవద్దు. బియ్యం కోటా కూడా పెంచాలని 30-35 కిలోలు ఇవ్వాలని ఆలోచిస్తున్నం.
-మైనార్టీల 12శాతం రిజర్వేషన్‌పై కమిటీ వేసినం.
-కేజీ టు పీజీ పథకాన్ని వచ్చే ఏడాది చేపడతం.
-డబుల్ బెడ్‌రూం.. దీనిపై లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుందాం. సీఐడీ విచారణ కూడా పూర్తయింది. ప్రతి నియోజకవర్గంల అవినీతి ఉంది. దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. త్వరలో దీనిని చేపడదాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి