-సాగర్‌కు చేరాల్సిన 50వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడులో ఆవిరి!
-శ్రీశైలంలో 1,88,930 క్యూసెక్కుల విడుదల..
-సాగర్‌కు వస్తున్నది 1,35,600 క్యూసెక్కులే
-మిగిలిన నీరు ఎటు పోతున్నది?
-సీమ ప్రాజెక్టులకు వరదనీటినే వదలాలి.. నిబంధనలు పట్టని ఆంధ్రా అధికారులు
-తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం
-శ్రీశైలంలో 1,88,930 క్యూసెక్కుల విడుదల..
-సాగర్‌కు వస్తున్నది 1,35,600 క్యూసెక్కులే
-మిగిలిన నీరు ఎటు పోతున్నది?
-సీమ ప్రాజెక్టులకు వరదనీటినే వదలాలి.. నిబంధనలు పట్టని ఆంధ్రా అధికారులు
-తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం
ఇది ఆంధ్ర అధికారుల మాయ! వదిలిన నీటిని.. పదిలంగా తరలించుకుపోతున్న కనికట్టు! శ్రీశైలంలో విడుదలైనట్టు చెబుతున్న నీటిలో ఒకటికాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 50వేల క్యూసెక్కులకుపైగా నీరు నాగార్జున సాగర్‌కు రావటం లేదు. మరి ఆ నీళ్లు ఎటుపోయాయి? ఎటుపోయాయంటే.. తెలంగాణ రైతుల పాలిట జల పిశాచిగా దాపురించిన పోతిరెడ్డిపాడుకు! నిజానికి రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ వరద జలాల ఆధారంగా నిర్మించినవే. కృష్ణా జలాలను ముందు నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు, ఆ తర్వాత మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు ఇవ్వాలి. ఆ తర్వాతే వరదనీటి ప్రాజెక్టులకు కేటాయించాలి. అలా చూస్తే.. ముందుగా శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు పూర్తిస్థాయిలో నీళ్లు వదలాలి. సాగర్ పూర్తిగా నిండిన తర్వాతే.. వరద నీటిపై ఆధారపడిన సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లు వదలాలి. కానీ జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నం.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (టీ మీడియా): శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రిజర్వాయర్ దాదాపుగా సామర్ధ్యం మేర నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 884.9 అడుగులకు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,86,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1,88,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అయితే, అక్కడ విడుదలైన నీరు నాగార్జునసాగర్‌కు వచ్చేసరికి కేవలం 1,35,600 క్యూసెక్కులుగా మాత్రమే రికార్డుల్లో నమోదవుతున్నది.
మరి.. మిగిలిన 50,582 క్యూసెక్కుల నీరు ఎటు పోతుంది? అంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీరు మొత్తం నాగార్జునసాగర్‌కు రావడం లేదు. పై నుంచి పైనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శ్రీశైలం నుంచి మార్గమధ్యంలో కొంత నీరు ఆవిరైందనుకున్నా, మరీ 50 వేల క్యూసెక్కుల నీరు ఆవిరైందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేదన్నది వాస్తవం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా బేసిన్‌లో లేని ప్రాజెక్టులకు ఈ నీళ్లు తరలించుకుపోతున్నారు.
రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో లేకపోయినా కృష్ణా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే గత సీమాంధ్ర పాలకుల మాయాజాలం. అసలు కృష్ణా బేసిన్‌లో లేనటువంటి ప్రాజెక్టులకు నీళ్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇంతకాలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 557 అడుగుల నీటి మట్టమే ఉంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండాలంటే 590 అడుగులకు చేరుకోవాలి. ఈ పరిస్థితిని విస్మరించిన ఆంధ్ర సర్కార్.. సాగర్‌కు నీటిని విడుదల చేసే పేరుతో పోతిరెడ్డిపాడుద్వారా రాయలసీమలోని వరద నీటి జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీళ్లు వదులుతున్నదన్న ప్రచారం జరుగుతున్నది.
ఆది నుంచి వివాదమే..
పోతిరెడ్డిపాడు.. ఈ పేరు తెలంగాణ ప్రజానీకానికి ఏ మాత్రం మింగుడుపడనిది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి పోతిరెడ్డిపాడు వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కృష్ణా జలాలను కృష్ణానది పరివాహక ప్రాంతం అవతలనున్న సీమాంధ్ర ప్రాంతాలకు తరలించాలన్న ఆలోచనకు ప్రతిరూపమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. భౌగోళికంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి, పెన్నానదికి మధ్య ఉన్న ఎత్తైన ప్రదేశం శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఉన్న రిడ్జ్‌ను కట్ చేస్తే చాలు, అక్కడి నుంచి కృష్ణా బేసిన్‌కు ఆవల ఉన్న సీమాంధ్ర ప్రాంతాలకు గ్రావిటీ మార్గాన నీటిని సునాయసంగా తరలించుకుపోవచ్చు.
మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పటి నుంచీ సీమాంధ్ర నాయకత్వం ఈ మళ్లింపు ప్రయత్నాలు సాగించింది. అయితే ఇది దేశ, అంతర్జాతీయ సూత్రాలకు, సహజ న్యాయానికి విరుద్ధం. అంటే, కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ తదితర క్షామపీడిత ప్రాంతాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ ఆవలకు నీటిని మళ్లించాలి. 1955లో ఫజల్ అలీ కమిషన్ కూడా తెలంగాణ ప్రజలు తమకు కృష్ణానదిపై ఉన్న స్వతంత్ర హక్కు కోల్పోవడానికి సిద్ధంగా లేరని పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో శ్రీశైలం ప్రాజెక్టు హైడెల్ పవర్ ప్రాజెక్టు మాత్రమేనని, వేరొక పరివాహక ప్రాంతానికి నీళ్లు మళ్లించవద్దని స్పష్టంగా పేర్కొంది.
తెలుగు గంగ పేరుతో..
బచావత్ తీర్పుని అధిగమించడానికి సీమాంధ్ర నాయకత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మద్రాస్ నగరానికి తాగునీటి అవసరాలకు తెలుగుగంగ పేరుతో 15 టీఎంసీల నీటిని 1500 క్యూసెక్కుల సామర్ధ్యం గల కెనాల్ ద్వారా పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ ముసుగులో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కృష్ణానది పరివాహక ప్రాంతానికి, పెన్నానది పరివాహక ప్రాంతానికి మధ్య ఉన్న మిట్ట కొండల రిడ్జ్‌ను కట్ చేసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. అయితే తొలుత పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రతిపాదించి.. చివరకు 11,150 క్యూస్కెక్కులుగా మార్చి నిర్మించారు.
దీని ద్వారా వేరొక బేసిన్‌లో నీళ్లు తరలించవద్దన్న తీర్పును బేఖాతరు చేశారు. మద్రాసు నగరానికి తాగునీరు అన్న నెపంతో 1500 క్యూసెక్కుల సరఫరాకోసం ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాల్‌లకు హెడ్ రెగ్యులేటర్‌గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 11 టీఎంసీలు మొత్తం శ్రీశైలం కుడికాలువకు కేటాయించుకున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వివక్షపూరితంగా వాదించి తెలుగుగంగకు ప్రాజెక్టుకు 25 టీఎంసీల మిగులు జలాలు కేటాయింపు చేయించుకున్నారు. ఇందులో ఒక్క టీఎంసీ కూడా తెలంగాణకు రాకపోవడం గమనార్హం.
వైఎస్ మాయ..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోతిరెడ్డిపాడు స్వరూపమే మారిపోయింది. అసలు 11,150 క్యూసెక్కులే అక్రమమని వాదిస్తున్న తరుణంలో, వైఎస్ వచ్చాక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏకంగా 40,000 క్యూసెక్కులకు పెంచేశారు. తర్వాత మూడు నెలలకే దానిని 44,000 క్యూస్కెక్కులకు పెంచూ జీవో జారీ చేయగా, ఏ ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి కనీసం నోరు మెదపకపోవడం గమనార్హం. పోలీసుల రక్షణలో అత్యంత వేగంగా ఈ పనిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. పోతిర్డెపాడు తర్వాత బనకచర్చ రెగ్యులేటర్ ద్వారా మూడు కెనాళ్లుగా మారి, దారి పొడవునా దాదాపు వందలాది టీఎంసీల నీటిని నిలువ చేసుకునే విధంగా రిజర్వాయర్లు నిర్మించుకున్నారు.
ఇక పోతిరెడ్డిపాడు డిజైన్ విషయంలోకూడా పాలకులు చెప్పింది ఒకటి, ఆచరణలో చేసింది మరొకటి. పోతిరెడ్డిపాడువల్ల తెలంగాణకు అపార నష్టం వాటిల్లనుందని దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి మొత్తుకున్నా, నాటి సీఎం వైఎస్ ఖాతరు చేయలేదు. పైగా వరద జలాలను మాత్రమే తీసుకెళ్తుతున్నామని చెప్పిన ప్రభుత్వం, డ్యామ్‌లోని నిలువ నీళ్లను కూడా తీసుకెళ్లే విధంగా మార్చేసింది. పేరుకి 44,000 క్యూసెక్కులు అని చెప్పినా, వాస్తవంగా చూస్తే 1,10,000 క్యూసెక్కులు తరలించుకుపోయే విధంగా డిజైన్ చేశారు. తెలంగాణ ఇంజినీర్లు నెత్తి, నోరు కొట్టుకున్నా సీమాంధ్ర పాలకులు కనీసం పట్టించుకున్న పాపనపోలేదు.
అన్నింటా అన్యాయమే..
పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేసిందని టీ ఇంజినీర్లు చెబుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధిలేని ప్రభుత్వం, ఇక్కడి రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టింది. సీమాంధ్ర పాలకులవల్లే పోతిరెడ్డిపాడు, పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావలసిన నీటిని మళ్లించడానికి, తెలంగాణలో విస్తారమైన ప్రాంతాలను ముంచి, కోస్తాంధ్రకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ డబ్బుతో, తెలంగాణ పన్నులతో వాటిని కట్టి నీటిని తన్నుకుపోతుంటే కనీసం న్యాయం కోసం ఎదిరించే వేదికే లేని దుస్థితి నెలకొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి