గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 09, 2014

ఆప్కోలో 'నిల్వ' దోపిడీ!

-రూ.కోట్ల విలువైన వస్ర్తాలు మాయం
-రికార్డుల్లో వస్త్ర నిల్వలు రూ.292.78 కోట్లు
-క్షేత్ర స్థాయిలో కనిపించని వైనం రూ. 50 కోట్ల మేర హాంఫట్!!
-హైదరాబాద్ కంటే కడపలోనే ఎక్కువ నిల్వ
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ప్రభుత్వ రంగ సంస్థల్లో సీమాంధ్ర పెత్తనం, ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. దీంతో విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలన్నీ కుదేలవుతున్నాయి. ఆంధ్రా పెత్తనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమిటెడ్(ఆప్కో) సంస్థ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆప్కో కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ.వందల కోట్ల నిధులు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు. వస్ర్తోత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగినట్లు చూపిస్తూ నిధులను బొక్కేస్తున్నారు అక్రమార్కులు. 
తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆప్కో అధికారులు చూపిస్తున్న లెక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ తెలంగాణ డైరెక్టర్ ఒత్తిడి మేరకు జారీచేసిన వస్ర్తాల నిల్వల వివరాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. ఏకంగా రూ.292.78 కోట్ల విలువైన వస్ర్తాలు పలు గోదాముల్లో నిల్వ ఉన్నట్లు చూపిస్తున్నారు. అయితే సదరు గోదాముల్లో ఆ స్థాయిలో నిల్వ సామర్థ్యం లేదని చేనేత నిపుణులు చెప్తున్నారు. పక్కాగా లెక్కిస్తే రూ.50 కోట్లకుపైగానే లోటు కనిపిస్తుందని అంచనా.

నిల్వల్లో ఎంత తేడా?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కన్నా ఆప్కో వస్ర్తాల నిల్వలు మాత్రం కడపలో అధికంగా ఉండటం గమనార్హం. ఇతర జిల్లాలతో పోలిస్తే కడపలో చేనేత కార్మికుల సహకార సంఘాలు, మగ్గాల సంఖ్య తక్కువే అయినా అక్కడ భారీగా వస్ర్తోత్పత్తి జరిగిందని అధికారులు నమ్మబల్కుతున్నారు. చేనేత, జౌళి శాఖ సంక్షేమ పథకాల నిధులు కూడా కడప జిల్లాకే అధికంగా వినియోగించినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఒక్క కడపకు కేటాయించిన నిధులు మిగిలిన అన్ని జిల్లాలకు సమానంగా ఉండడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన వస్ర్తాల నిల్వల వివరాల్లోనూ పొంతన లేదు. సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్ర్తాల ధరలను కాకుండా అమ్మకం ధరలతో నిల్వ లెక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో నిల్వలపై ఏనాడూ సమీక్ష జరిపిన దాఖలాలు లేవు.

పాలక మండలి, అధికారులదే బాధ్యత

ఆప్కోలో వస్ర్తాల నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. రూ.292 కోట్ల విలువైన వస్ర్తాల నిల్వలు ఉన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు కూడా భారీగా ఉన్నాయి. దీనిని బట్టి కార్మికుడికి సులువుగానే రూ.లక్ష దాకా పెట్టుబడులు ఇచ్చే సామర్థ్యం ఆప్కోకు ఉంటుందని చేనేత వర్గాలు చెప్తున్నాయి. ఆప్కో దశాబ్దాల తరబడి నిల్వలు చేయడం తప్ప ఏనాడూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టలేదు.

ప్రతి ఏటా నామమాత్రపు ఆడిటింగ్ రివాజుగా మారింది. నిల్వల్లో ఏదైనా తేడా అధికారులు గుర్తిస్తే ప్రాసెసింగ్ కోసం కంపెనీలకు పంపించామంటూ అధికారులు బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిసింది. ఆర్డర్లు వచ్చిన మేరకే కంపెనీలకు వస్ర్తాలు తరలించాలి. కానీ కోట్ల కొద్దీ మీటర్ల వస్ర్తాలను కంపెనీలకు పంపినట్టు లెక్కలు చూపిస్తున్నారని సమాచారం. ఆప్కో కేంద్ర కార్యాలయం పరిధిలో విజిలెన్స్ వ్యవస్థ ఉన్నా.. దానిపాత్ర నామమాత్రం. దుకాణాలు, షోరూములు, గోదాముల తాళాలు ఎవరెవరి దగ్గర ఉంటాయో బైలాస్‌లోనూ స్పష్టత లేదని రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వస్త్ర నిల్వలపై దర్యాప్తు తర్వాతే వాటా ప్రకారం పంపిణీకి అంగీకరించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

table
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి