గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

వీఎం హోంపై కుట్ర...!!

-అనాథల నోటిముద్దకు ఎసరు!
-నిజాం దాతృత్వాన్ని కాజేసేందుకు ఆంధ్రా యత్నం
-ప్రభుత్వరంగ సంస్థల్లో వీఎం హోం సొసైటీని చేర్చిన వైనం
-రూ.వెయ్యి కోట్ల స్థలం 58ః42 నిష్పత్తిలో కొట్టేయాలని ఎత్తు
-ఆంధ్రాకు ఏం సంబంధం అంటున్న ఉద్యోగులు, విద్యార్థులు
-విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ఆర్ఫన్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ దీనగాథ..

సిగ్గు అనే పదం కూడా సిగ్గుతో తలదించుకుంటదేమో! నిజాం ప్రభువు దాతృత్వంతో ఇచ్చిన అనాథ పిల్లల ఆశ్రమంలోనూ వాటాల కోసం సీమాంధ్రులు జోలె పట్టారు. చిట్టిపొట్టి చేతుల్లో ఉన్న గోరుముద్దలను లాక్కునే కుట్రకు తెరతీశారు. విభజన గాయిలో తలఒగ్గిన కేంద్రంపై ఒత్తిడితెచ్చి ఒక సొసైటీని ప్రభుత్వ రంగసంస్థల జాబితాలో చేర్పించారు. ఒక్క మెతుకు విదల్చకుండానే అన్నం గిన్నెలో భాగం ఆబగా పంచుకుంటున్నారు. ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ అంటే భూగోళాన్ని రూకల్లో తూచడమా? మనుషుల్ని కరెన్సీలో లెక్కించడమా?
1903లో ఆంధ్రులెక్కడున్నారు? నిజాం రాష్ట్రంతో వాళ్లకున్న వరుస ఏంది? ఆ కాలంలో నిజాం అనాథ పిల్లలకు ఇచ్చిన ఒక ఆస్తి ఇపుడు ఎవరి సొత్తు అవుతుంది? నెక్కరేసుకోని పిల్లగాడైనా తెలంగాణదని ఠక్కున చెప్తాడు. కానీ సీమాంధ్ర నాయకత్వం మాత్రం అది ఉమ్మడి రాష్ట్రపు సొత్తు అంటూ పంపకాల్లో చేర్పించింది. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు .. అన్నట్లుగా అనాథ పిల్లల సొమ్మునూ కాజేయడానికి తెగించింది. నిజాం దాతృత్వంతో ఏర్పాటైన విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ఆర్ఫన్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 షెడ్యూల్ 10లో చేర్చింది. పదో షెడ్యూల్‌లో తొలుత 42 సంస్థలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ సంఖ్యను 107కు పెంచారు. మొదటి జాబితాలో లేని వీఎం హోం రెండోసారి చేరిపోయింది. దాని ప్రకారం హైదరాబాద్ సమీపంలోని 9వ నెంబరు జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్ దగ్గర ఉన్న విక్టోరియా మెమోరియల్ హోం ఇపుడు పంపకాల జాబితాలో చేరింది. వారి లక్ష్యం సొసైటీ లేదా హోం నిర్వహణ కాదు. దాని పేరిట ఉన్న అత్యంత ఖరీదైన సుమారు రూ.1000 కోట్ల విలువైన 72 ఎకరాల ఆస్తి. ఈ స్థలం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినది కాదు.. ఒక రకంగా హైదరాబాద్ స్టేట్‌ది కూడా కాదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనాథ చిన్నారుల ఆస్తి. వీఎం హోం బైలాస్‌లోనూ వారికే సర్వహక్కులూ కల్పించారు. దానిని అమ్మడం, కొనడం, లీజుకివ్వడం, వేలం వేయడం వంటి ఏ చర్యలైనా వర్తించవు. ఆస్తుల పంపిణీలో ఆంధ్రాసర్కార్ పాటించిన దమననీతికి ఇదో ఉదాహరణ.


memorial1903లో నిజాం రాష్ట్రంలో బ్రిటిష్ మహారాణి పర్యటన ప్రతిపాదించారు. అప్పటికి దేశానికి రాజధాని కలకత్తా. అక్కడ మహారాణికి ఒక గొప్ప విడిది ఉండేది. ఆ విడిదికి దీటుగా ఇక్కడ మహారాణికి బస నిర్మించాలని ఆరో నిజాం మీర్ మహబూబ్‌అలీఖాన్ బహదూర్ సంకల్పించారు. సరూర్‌నగర్ సర్వే నెం.6/1 నుంచి 6/7 లో ఉన్న 72 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. ఐతే మహారాణి పర్యటన రద్దయింది. దానితో ఆ భవనంలోకి తన బసనే మార్చాలని అనుకున్నారు.ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో ఉడుము ఎదురు కావడంతో అది దుశ్శకునంగా భావించి విరమించుకున్నారు.

వేద పండితుల సలహా మేరకు దాన్ని అనాథ చిన్నారులకు రాసిచ్చారు. ఒక సొసైటీగా మార్చి ప్రభుత్వం గానీ, ఇతరులు గానీ అమ్మడం, లీజుకు ఇవ్వడం వంటి ఏదీ చెల్లదని దానపత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగని రాసిచ్చిన వీలునామా పత్రాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్కివ్స్ విభాగంలో భద్రపరిచినట్లు సమాచారం. మొత్తానికి ఆ భవనంలో అనాథలకు చదువుకునే భాగ్యం కల్పించారు. దీనికో ట్రస్టును ఏర్పాటు చేశారు. అందులో ఒకరిని నిజాం ట్రస్టు నుంచి, ఇద్దరిని ప్రభుత్వం నియమించాలని నిర్ణయించారు. స్కూల్‌లో బాలికలు ఉంటారు కాబట్టి ఒక మహిళా సభ్యురాలు కూడా ఉండాలని నిర్దేశించారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వం నామినేట్ చేసిన వారిలో ఒకరు గౌరవ కార్యదర్శిగా నిర్ణయించారు.

ఉమ్మడి రాష్ట్రంలో..

ఉమ్మడి రాష్ట్రంలో నిజాం ఆశయాలన్నింటికీ పాలకులు తూట్లు పొడిచారు. నిర్వహణ కోసం విధించిన మార్గదర్శకాలను తుంగలో తొక్కి రెండు దశాబ్దాలుగా నామినేటెడ్ సభ్యులు లేకుండానే కొనసాగిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారే గౌరవ కార్యదర్శిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పైగా ఆంధ్రాకు చెందిన వారు అక్రమ పద్ధతిలో ఆరుగురు కాన్సాలిడేటెడ్ పే కింద పని చేస్తున్నారు. 14 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. సీమాంధ్రకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల చేతికి పెత్తనం ఇచ్చారు. నియామకపు ఉత్తర్వులు లేకుండానే బంధుగణాలతో నింపేశారు. స్కూల్‌కు ప్రిన్సిపల్‌గా మాత్రం సీమాంధ్రకు చెందిన ఓ అధికారిణి వ్యవహరిస్తున్నా రు. ఇక్కడ ప్రిన్సిపల్ క్యాడర్ అవసరం లేకపోయినా ఉద్దేశ్యపూర్వకంగా ఆమెను డిప్యూటేషన్‌పై కొనసాగిస్తుండడం గమనార్హం.

ఉమ్మడి రాష్ట్రంలో సొసైటీ ఆస్తులను కరిగించడం ప్రారంభించారు. వీఎం హోంకు చెందిన 3190 గజాల స్థలాన్ని టీడీపీ సర్కారు వేలం కూడా వేసింది. ఆ స్థలంలో ప్రస్తుతం హోటల్ నడుస్తోంది. మోడల్ రైతు బజార్ పేరిట 4 ఎకరాలను రాసిచ్చారు. రిలయన్స్ గ్యాస్ పంప్‌కు ఎకరం స్థలాన్ని 33 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చారు. ఆలిండియా రేడియోకు చింతలకుంటలో 40 ఎకరాల స్థలం ఉంది. దీనికి అవసరం లేకపోయినా 2 ఎకరాలను కేటాయించారు. చుట్టూ ఉన్న కాలనీవాసులు, వ్యాపార సంస్థలు కూడా కబ్జాలకు పాల్పడ్డారు. వీఎం హోం పేరిట 72 ఎకరాలు ఉండాలి. కానీ ఇపుడు 60 ఎకరాలు కూడా ఉండదని భావిస్తున్నారు.

అన్యాయం.. సహించం..

ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో తొలి నుంచి సీమాంధ్ర పెత్తనం నడుస్తోంది. విభజన జనాభా ప్రాతిపదికన కొన్నింటినీ, లొకేషన్ బేసిస్‌లో మరికొన్నింటిని విభజించాలని నిర్ణయించారు. కానీ ఆఖరికి అనాథలకు చెందిన సొత్తునూ కొట్టేయ్యాలని చూడడం విడ్డూరంగా ఉంది. షెడ్యూల్ 10లో పేర్కొనడం అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం.
- కే సుధీర్‌బాబు, బీ రాజేశం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు

దుర్మార్గపు చర్య

అనాథల సొమ్మును కూడా మింగేందుకు కుట్ర చేశారు. పదో షెడ్యూల్‌లో చేర్చిన ఏ సంస్థ ఆస్తులను పంచేది లేదు. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ ప్రాంతానికే చెందుతుంది. ఆస్తులు కూడా అంతే. వీఎం హోంపై ఇన్నాళ్లుగా వారి పెత్తనమే అనైతికం. నిజాం అనాథలకు ఇచ్చిన ఆస్తిపై వారికి హక్కు ఎలా ఉంటుంది. ఖరీదైన భూమి ఉందన్న ఉద్దేశ్యంతోనే దాన్ని పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఎట్టి పరిస్థితుల్లో పంపిణీకి అంగీకరించం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి