గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

అంతా అడ్డం...పొడుగూ...

-అస్తవ్యస్తంగా మారిన హైదరాబాద్
-ఒక్కో శాఖకు ఒక్కో పరిధి.. శాస్త్రీయత శూన్యం
-నగర విస్తరణలో ప్రణాళికాలోపం..
-గాడిలో పెట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయం.
హైదరాబాద్ అంటే ఏమిటి? నగరం కచ్చిత స్వరూపం ఏమిటి? పరిధి..పాలనా వ్యవస్థ.. పౌర సౌకర్యాల తీరు తెన్నులు ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ నగర స్వరూపం ఒక బ్రహ్మ పదార్థం. పౌరసౌకర్యాల్లో కొన్నింటికి పరిధి జీహెచ్‌ఎంసీ. రెవెన్యూ అవసరాలకు పరిధి రెండు జిల్లాలు. శాంతిభద్రతల వ్యవస్థకు రెండు కమిషనరేట్లు.. కొంతమేర పక్కజిల్లా పరిధి. నిర్మాణాలు, మాస్టర్‌ప్లాన్ పరిధి ఐదు జిల్లాలతో కూడిన హెచ్‌ఎండీఏ. రహదారుల వ్యవస్థ కొంత జీహెచ్‌ఎంసీ మరికొంత ఆర్‌అండ్‌బీ.. అందులోనూ సిగపట్లు.. ఇక వైద్యారోగ్య శాఖ పరిస్థితి మరింత అయోమయం. హైదరాబాద్, రంగారెడ్డి డీఎంహెచ్‌ఓలు.. మళ్లీ జీహెచ్‌ఎంసీలో మరో వైద్య విభాగం. ఇందులోనూ పరిధుల పంచాయతీలు.. సింపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ అనేక వ్యవస్థల సాలెగూడు ! పౌరుడు అందులో చిక్కిన అర్భక ప్రాణి!


పట్టణీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో జనాభా గణనీయంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో సంబంధిత ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి, ఆయా నగరాలపై ఒత్తిడి పడకుండా విస్తరణ చేపట్టడం సహజం. కానీ హైదరాబాద్ విస్తరణ అందుకు విరుద్ధంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు హైదరాబాద్ నగరాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మాత్రమే పరిగణించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం, భూములను అమ్ముకోవడానికి మాత్రమే ఈ విస్తరణను ఉపయోగించుకున్నారు. నగరాన్ని అడ్డగోలుగా విస్తరిస్తూ పోయారు. రియల్టర్ల లాభాల కోసం రింగురోడ్లు, హైటెక్ సిటీలు, గోల్ఫ్‌కోర్టులు పుట్టుకొచ్చాయి.

charminarఎక్కడా శాస్త్రీయత, భవిష్యత్తు ప్రణాళిక అనే దృష్టి లేదు. నగరం కోసం అనేక రకాల వ్యవస్థలు ఏర్పాటుచేయడం గందరగోళానికి దారి తీసింది. ఎవరి బాధ్యతలు ఏమిటో, పరిధి ఏమిటో తెలియని పరిస్థితి. విస్తరణకు సరిపడా మంచినీటి వ్యవస్థగానీ, డ్రైనేజీ వ్యవస్థగానీ, రహదారుల విస్తరణ గానీ, ప్రజా రవాణా వ్యవస్థ, విద్య, వైద్య సౌకర్యాల కల్పన జరగలేదు. ఫలితంగా నగర శివార్లలోని కాలనీల్లో చిన్నపాటి వర్షానికే ఇండ్లు నీట మునుగుతున్నాయి. డ్రైనేజీ రోడ్లమీద ప్రవహిస్తున్నది. ఇరుకు రహదారుల్లో ట్రాఫిక్‌జాం నిత్యకృత్యమైపోయింది. శివార్లలో పదిరోజులకోసారి మంచినీరు వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అడ్డగోలువిస్తరణకు స్వస్తి పలికి గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మెరుగైన రీతిలో విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.

సీమాంధ్రుల కోసం...:

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాత్తుగా హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 12 శివారు మున్సిపాలిటీల ను జీహెచ్‌ఎంసీలో కలిపేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నగరంలోని సీమాంధ్రులు హైదరాబాద్ మీద విస్తృతమైన హక్కులు డిమాండ్ చేయవచ్చుననేది దీని వెనక ఉద్దేశ్యం. ఆ తర్వాత హెచ్‌ఎండీఏ పరిధి అనకొండలా పక్క జిల్లాల భూభాగాలను కూడా మింగేసి విస్తరించింది. దీని లక్ష్యం నగరం చుట్టూ ఉన్న సీమాంధ్రుల భూముల రక్షణ. చంద్రబాబునాయుడు హయాంలో సైబరాబాద్ రూపకల్పన జరిగింది. చంద్రబాబైనా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయినా నగర విస్తరణకు ప్రాధాన్యమిచ్చారేగానీ అందులో తగిన ప్రమాణాలు, సౌకర్యాలను కల్పించలేదు. చంద్రబాబునాయుడు తన ప్రతి ప్రసంగంలోనూ హైటెక్ సిటీని తానే నిర్మించానంటూ చెప్పుకుంటారు. కానీ ఇప్పటిదాకా ఆ సిటీకి డ్రైనేజీ వ్యవస్థ లేదు. నగరాన్ని విస్తరించే ముందు అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించాలనేది ప్రాథమిక సూత్రం. కానీ హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో పట్టించుకోలేదు. మంచినీటి సరఫరా వ్యవస్థ లేదు. మురుగునీటి వ్యవస్థ నిర్మాణం కాలేదు. ఆయన హయాంలోనే సైబరాబాద్ ఏర్పాటు చేశారు. కాగితాలపై దీన్ని ఏర్పాటు చేశారే తప్ప అదనపు వసతులు కల్పించలేదు.

ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ పరిపాలనాపరంగా ఎలాంటి చిక్కులొస్తాయి.. ఇతర శాఖల్లో గ్రేటర్ ఏర్పాటు ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలు పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పటికే శివారు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలను కలపడంతో గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలు రోజుకు 459 మిలియన్ గ్యాలన్లకు పెరిగాయి. కానీ అందుకు అనుగుణంగా మంచినీటి సరఫరాను పెంచలేదు. దీంతో రోజుకు 119 మిలియన్ గ్యాలన్ల నీటి కొరతతో పదిరోజులకోసారి మంచినీరు సరఫరా అవుతున్న దుస్థితి. నగరం చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. రోడ్లను విస్తరించలేదు. ఫలితంగా నగర శివారు ప్రాంతాల్లోనూ గంటలకొద్దీ ట్రాఫిక్‌జాంలతో జనానికి అవస్థలు తప్పడంలేదు.

అశాస్త్రీయంగా జీహెచ్‌ఎంసీ..:

జీహెచ్‌ఎంసీ పూర్తిగా అశాస్త్రీయంగా ఏర్పాటైంది. దీనితో పాలన అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్ శివారులో ఉన్న ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా అటువైపున ఉన్న కుత్బుల్లాపూర్ కూడా రంగారెడ్డి జిల్లాలోకే వస్తుంది. ఈ రెండు ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే మాత్రం హైదరాబాద్ జిల్లాను పూర్తిగా దాటాలి. రెవిన్యూ శాఖాపరంగా హైదరాబాద్, రంగారెడ్డి రెండు వేర్వేరు జిల్లాలు. గ్రేటర్ హైదరాబాద్ కోణంలో చూస్తే రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భూముల వ్యవహారాలు రెవిన్యూ శాఖ చూస్తే... మౌలిక వసతుల అంశాన్ని గ్రేటర్ కార్పొరేషన్ చూడాలి.

నగరంలోని రోడ్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటాయి. కానీ దిల్‌సుఖ్‌నగర్-మియాపూర్‌లాంటి ప్రధాన రహదారులు ఆర్ అండ్ బీ పరిధిలోకి వస్తాయి. అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్ విస్తరణ అంతా గందరగోళం. రెవిన్యూ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు శాఖ... ఒక్కో శాఖ రికార్డుల్లో సరిహద్దులు ఒక్కోలా ఉంటాయి. వీటి మధ్య సమన్వయం ఉండదు. అలా వాటిని నడిపించే విధానాలకు రూపకల్పన జరపలేదు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నిపుణుల సూచనలు, అంతకుమించి అంతర్జాతీయ ప్రమాణాలు.. వేటినీ పట్టించుకోకుండా కాగితాలపై మాత్రమే పురుడుపోసిన విస్తరణలతో అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగలేదు. దాని ఫలితంగానే ఇవాళ సామాన్య జనం పరిపాలనలో అవస్థలు పడుతున్నారు.

మాస్టర్‌ప్లాన్‌లోనూ అయోమయమే..

గ్రేటర్ హైదరాబాద్ తర్వాత సమైక్య సర్కారు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించింది. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 5,018 చదరపు కిలోమీటర్ల పరిధికి కొత్తగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. దీంతో హైదరాబాద్ జిల్లాతో కలుపుకొని హెచ్‌ఎండీఏ పరిధి 7,448 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అయితే గత ఏడాది కొత్త మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇందులో భూమి వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించారు. కానీ ఇది శాస్త్రీయంగా జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరం నలువైపులా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా ప్రణాళిక లేదనేది నిపుణుల అభ్యంతరం. దీంతో పాటు ఇష్టానుసారంగా జనావాసాలు.. వాటి మధ్యలో పారిశ్రామిక వాడల గుర్తింపు జరిగిందనే విమర్శలున్నాయి.

ఆదర్శంగా ఇతర రాష్ర్టాలు..:

దేశంలోని ఇతర మెట్రో నగరాలను పరిశీలించినపుడు ఆదర్శమైన విభజన జరిగినట్లు స్పష్టమవుతుంది. ఢిల్లీ మహా నగరం తీసుకుంటే సుమారు 842 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ నగరాన్ని మూడుగా విభజించారు. ఒకో కార్పొరేషన్ పరిధిలోని 50 వార్డుల చొప్పున ఏర్పాటు చేసి... నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీలుగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కోట్ల జనాభా ఉన్నప్పటికీ మౌలిక వసతులు, ట్రాఫిక్‌పరంగా పెద్ద ఇబ్బందులు తలెత్తడం లేదు. పైగా పరిపాలనపరంగా అనుమతులు, టౌన్ ప్లానింగ్‌పై పర్యవేక్షణ పకడ్బందీగా జరిపేందుకు వీలుంది. ముంబై మహా నగరం తీసుకుంటే 971.24 చదరపు కిలోమీటర్లు ఉండే ఈ నగరాన్ని కూడా మూడుగా విభజించారు. బృహన్‌ముంబై 480.24 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో 227 వార్డులు ఏర్పాటు చేశారు. నవీ ముంబై 344 చదరపు కిలోమీటర్లు ఉండగా దానిని 89 వార్డులుగా విభజించారు. ఠాణే 147 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని 65 వార్డులుగా విభజించారు. దీంతో 1.27 కోట్ల జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం సులువుగా మారింది. చక్కటి రవాణా వ్యవస్థతో అనుసంధానించడంతో ప్రధాన నగరంపై తీవ్ర ఒత్తిడి తగ్గింది.

సొంత పాలనలో సరికొత్త ఆలోచనలు..

ఇన్నాళ్లూ సమైక్య పాలనలో మగ్గిపోయిన హైదరాబాద్‌కు తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారంలోకి రావడంతో మంచిరోజులు రానున్నాయి. 625 చదరపు కిలోమీటర్ల గ్రేటర్ హైదరాబాద్‌ను 150 వార్డులుగా చేయడంతో పాలనా వ్యవస్థ గందరగోళంగా తయారైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ దుస్థితిపై దృష్టిసారించి గ్రేటర్ హైదరాబాద్ విభజనపై దృష్టి సారించారు. మెరుగైన పాలన ఏ రకంగా వెళితే అందుతుంది? ప్రజలకు మౌలిక వసతులు ఏ రకంగా కల్పించవచ్చు? అనే దానిపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఇతర మెట్రో నగరాలను బేరీజు వేసుకుంటే హైదరాబాద్‌ను కూడా మూడు భాగాలుగా చేసే వెసులుబాటు ఉందనేది నిపుణులు సూచన. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి మరో రెండు విమానాశ్రయాలు అవసరమనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నగరం చుట్టూ ఒక్కో రంగాన్ని ఒక్కోవైపు ఏర్పాటు చేయడం.. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా అనుసంధానించడంతో ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఒక్కో శాఖకు ఒక్కో పరిధి...

పరిపాలనలో అన్ని ప్రభుత్వ శాఖలు సమాంతరంగా ఒక గొడుగు కింద ఉంటేనే అభివృద్ధి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. శాఖల మధ్య సమన్వయంతో ఇబ్బందులు కూడా రావు. కానీ హైదరాబాద్‌లో ప్రభుత్వ శాఖల పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఇప్పటికీ వేర్వేరుగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైనా ప్రజలకు నిత్యం అవసరముండే అనేక శాఖల్లో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి గతంలో మాదిరిగానే ఉంది. రవాణా శాఖలో రెండు జిల్లాల పరిధి వేర్వేరు. పోలీసు శాఖకొచ్చే సరికి హైదరాబాద్, సైబరాబాద్‌లుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా పూర్తిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంది. సైబరాబాద్‌లోకి రంగారెడ్డి జిల్లాలో సగ భాగం మాత్రమే వచ్చింది. మిగిలిన భాగాన్ని గ్రామీణ రంగారెడ్డిగా పరిగణిస్తున్నారు. ఫలితంగా మల్కాజిగిరిలో ఉండే ఒక వ్యక్తి పోలీసు శాఖలో పని కోసం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఆశ్రయించాలి. భూమి పని కోసం రంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లాలి. డ్రైనేజీ సమస్య ఉందంటే జీహెచ్‌ఎంసీకి పోవాలి. డ్రైవింగ్ లైసెన్సు సమస్య ఉంటే తిరిగి రంగారెడ్డి డీటీసీని కలవాలి. ఇక వైద్యారోగ్య శాఖ పరిస్థితి మరింత అయోమయం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రత్యేకంగా డీఎంహెచ్‌ఓలు ఉన్నారు. మళ్లీ జీహెచ్‌ఎంసీలోనూ వైద్య విభాగం ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిని ఆ జిల్లా వైద్యాధికారి, జీహెచ్‌ఎంసీ, నగరం చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీలను రంగారెడ్డి జిల్లా వైద్యాధికారితో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు చూస్తారు.

గత లోపాలను సవరించాల్సిందే...

గతంలో హైదరాబాద్ విస్తరణ, కార్పొరేషన్ల ఏర్పాటు గందరగోళంగా ఉందనేది వాస్తవం. పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆలోచనలు, ఇతర మెట్రో నగరాల తీరుతెన్నులను పలు ప్రసంగాల్లో వినిపించారు. దీంతో ఆయనకు ఒక విజన్ ఉందనేది సుస్పష్టం. అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేపుడు ఇతర మెట్రో నగరాలను అధ్యయనం చేయడంతో పాటు నగరంలోని ప్రధాన శాఖల ఉన్నతాధికారులందరినీ అందులో భాగస్వాములను చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి