-ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ప్రహరీలు
-చెరువులోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు
-హద్దురాళ్లు ఊడబెరికి ఫాంహౌజ్‌లు
-ఉత్సవ విగ్రహంలా హెచ్చరిక బోర్డులు
-జీవోలు బుట్టదాఖలు.. పట్టని అధికారులు
-చెరువులోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు
-హద్దురాళ్లు ఊడబెరికి ఫాంహౌజ్‌లు
-ఉత్సవ విగ్రహంలా హెచ్చరిక బోర్డులు
-జీవోలు బుట్టదాఖలు.. పట్టని అధికారులు
అదో చారిత్రక తాగునీటి వనరు! హైదరాబాద్ దప్పికతీర్చే కల్పతరువు! కనుచూపు మేర జలకళలాడుతూ గంభీరంగా కనిపిస్తుంటుంది! కానీ.. అదే చెరువులో కనిపించని మరో కోణం కబ్జాల పర్వంతో కలుషితమవుతున్నది! నిజానికి చెరువును కబ్జా చేయడం మహా నేరం! కానీ.. కబ్జాల్లో ఆరితేరినవారికి అది నేరం కాదు! చెరువులో అంతర్భాగమైన భూమిని రిజిస్టర్ చేయకూడదు! కానీ.. అమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులకు ఆ నిబంధన వర్తించదు! ఫలితంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు! హెచ్చరిక బోర్డులు ఉన్నా బేఖాతర్ చేస్తూ.. కంచె వేసిన ప్రాంతంలో ఎఫ్‌టీఎల్‌ను సూచిస్తూ ఏర్పాటుచేసిన హద్దురాళ్లను పెకలించి వేస్తూ.. గండిపేట పరివాహక ప్రాంతాన్ని మింగేస్తున్నారు! అందమైన ఫాంహౌజ్‌లు, చెరువు అందాలను ఆస్వాదించేలా బహుళ అంతస్తుల భవనాలను మొలిపిస్తున్నారు! ఒకటికాదు.. పది కాదు.. దాదాపు వందెకరాల చెరువు పరివాహక ప్రాంతం కబ్జాకోరుల కోరల్లో చిక్కుకుని.. విముక్తికోసం ఎదురు చూస్తున్నది!
తాగునీటి జలాశయమైన గండిపేట చెరువు చుట్టూ భారీస్థాయిలో ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు మిన్నకుండటంతో చట్టాన్ని చుట్టంలా మార్చుకుంటున్న కబ్జాకోరులు.. యథేచ్ఛగా చెరువులోకి చొరబడుతున్నారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సూచించే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ హద్దు రాళ్లను ఊడబెరికి.. తమ సొంత కంచెలు నిర్మించుకుంటున్నారు. అందులో అందమైన బంగళాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారు. ఆక్రమించడమే కాకుండా.. కాస్త అతి తెలివి కూడా ప్రదర్శిస్తున్న రియల్టర్లు.. చెరువులోకి వర్షపు నీరు వచ్చేందుకు గతంలో ఏర్పాటు చేసిన తూములను కుదించేస్తున్నారు.
దీంతో చెరువులోకి వర్షపు నీరు రాకుండా అడ్డుకోవడంతోపాటు.. తాము కబ్జా చేసిన భూమి నీట మునిగిపోకుండా ఎత్తులు వేస్తున్నారు. దీంతో గండిపేట చెరువు గరిష్ఠ పరిమితులు కుదించుకుపోతున్నాయి. ఇలా దాదాపు వంద ఎకరాల మేరకు చెరువును కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చెరువు పరిసర ప్రాంతాలైన జన్‌వాడ, బుల్కాపూర్, అజీజ్‌నగర్, ఖానాపూర్, మేకన్‌గడ్డ, చిల్కూరు తదితర ప్రాంతాలలో ఆక్రమణలు జోరందుకున్నాయి. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ భూములు పరిరక్షించాలని, చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని తపిస్తుంటే.. ఆ లక్ష్యాన్ని దెబ్బకొట్టే విధంగా రియల్టర్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన జలమండలి, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖలకు చెందిన అధికారులు ఇదేదో తమకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దురాక్రమణ పరంపర కొనసాగితే.. నగరానికి తాగునీటి సమస్య మరింత జటిలమయ్యే రోజు ఎంతోదూరంలో లేదని పలువురు సామాజిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా కబ్జా చేస్తున్నారు..
చెరువు పక్కనే ఎకరమో.. అరెకరమో పట్టా భూమి కొనుగోలు చేయడం.. దానికి అనుకుని ఉన్న చెరువును చెరపట్టడం.. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోకి ప్రవేశించి.. కంచె వేసేయడం! ఆపై హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందాలు.. వాటికి అధికారులు సంతృప్తి చెందగానే.. వారు కళ్లుమూసుకున్న మరుక్షణమే పునాదుల తవ్వకాలు.. ఆపై అందమైన భవంతుల నిర్మాణాలు! ఇదీ గండిపేట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్‌లోపల జరిగే బాగోతం! ఒక్కోసారి ఈ చొరబాట్లు ఏకంగా ఐదు నుంచి పదెకరాల వరకూ చెరువులోకి ఉంటున్నాయి. అక్కడ పడి ఉన్న ఎఫ్‌టీఎల్ హద్దు రాళ్లు.. వాటిని కనీసం దూరంగా కూడా పారేయకుండా వాటిని కలుపుకొంటూ వేసుకున్న కంచెలు.. ప్రహరీ గోడలు ఈ బడాబాబుల ఆక్రమణలకు మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
జీవో 111 బుట్టదాఖలు...
జలాశయాలను కలుషితం చేసే ఎలాంటి ప్రక్రియను ఉపేక్షించరాదంటూ 1996లో సుప్రీంకోర్టు కచ్చితమైన నిబంధనలను జారీ చేసింది. ఈ క్రమంలోనే జీవో 111 అమలులోకి వచ్చింది. ఈ జీవో పరిధిలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి నూతన నిర్మాణాలు, వాతావరణాన్ని కాలుష్యం చేసే కర్మాగారాలు ఏర్పాటు చేయరాదు. అయినా కబ్జాకోరులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. జలాశయాన్ని కలుషితం చేసేలా ఆక్రమించి మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు. పేదవాడు చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఆగమేఘాల మీద పరుగెత్తి వచ్చి.. బుర్రగోక్కొని మరీ నిబంధనలు గుర్తు చేసుకునే అధికారులు.. దాదాపు వందెకరాల కబ్జాకు గురైనా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో చెరువు పక్కనే ఉన్న ఖానాపూర్, మేకన్‌గడ్డ, జన్వాడ, అజీజ్‌నగర్, చిల్కూరు తదితర గ్రామాల పరిధిలోని పట్టా భూములను కొనుగోలు చేస్తున్న రియల్టర్లు, బడాబాబులు.. అందులో అందమైన భవనాలు నిర్మిస్తున్నారు.
కలుషితమౌతున్న తాగునీరు...
చెరువు చెంతనే ఫాంహౌజ్‌ల నిర్మాణాలు చేపడుతుండటంతో తాగునీటి జలాశయమైన గండిపేట కలుషితమవుతున్నది. ఇప్పటికే ఫాంహౌజ్‌ల పేరిట నిర్మాణాలు పూర్తిచేసుకున్న బడాబాబులు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో మురుగునీరు, ఇతర వ్యర్థాలు చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో తాగునీరు కలుషితమవుతున్నది. ఇలాంటి విషయాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఈ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వర్షపునీటికి ఆటంకం...
వర్షపు నీరు జలాశయంలోకి చేరుకునేందుకు సైతం కబ్జాదారులు ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇప్పటికే గండిపేట చెరువు పరిసరాల్లో ఏర్పాటైన ఫాంహౌజ్‌లు, రిసార్టులు, ఇళ్ల నిర్మాణాలతో వర్షం నీరు చెరువులోకి రాకుండా పోతున్నది. ఇక చెరువు ఎగువ ప్రాంతంలోని జన్వాడ, మేకన్‌గడ్డ, బుల్కాపూర్, అజీజ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి జలాశయంలోకి నీరు రావడానికి ఉన్న తూములను ఆక్రమణదారుల ముందు చూపుతో కుదించేశారు. దీంతో వర్షాలు పడినప్పుడు జలాశయంలోకి ఆ నీరు రావడానికి ఆటంకాలేర్పడుతున్నాయి. ఇది చెరువులో నీటి నిల్వను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
అంతా కబ్జాలమయం
గండిపేట చెరువు చుట్టుపక్కల పెద్ద పెద్దోళ్లు అంతా కలిసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసిన భూముల్లో పెద్ద పెద్ద బంగ్లాలను నిర్మిస్తున్నారు. మా లాంటి పేదోడు చిన్న ఇల్లు కట్టుకుంటే వెంటనే వచ్చి అడ్డుకునే అధికారులు ఇక్కడ రానేరారు. ఇదెక్కడి న్యాయం సారు? ఇప్పటికైనా కేసీఆర్‌సారు పట్టించుకుని చారిత్రకమైన చెరువును రక్షించాలి.
-హుస్సేన్‌పురం జంగయ్య
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి