-మై హోం భూమిపై టీ టీడీపీ వింతధోరణి
-నాడు వేలంపాటలో కొన్న భూమిని గుంజుకున్న సీమాంధ్ర సర్కారు
-ఆగమేఘాల మీద గేమింగ్ పార్కుకు కేటాయిస్తూ నిర్ణయం
-అప్పుడే అన్యాయాన్ని ప్రశ్నించి.. మైహోంకు మద్దతుతెలిపిన టీ టీడీపీ నేతలు
-ఇప్పుడు మై హోంకు న్యాయంచేస్తే.. అడ్డుకుంటున్న పచ్చతమ్ముళ్లు
-నాడు వేలంపాటలో కొన్న భూమిని గుంజుకున్న సీమాంధ్ర సర్కారు
-ఆగమేఘాల మీద గేమింగ్ పార్కుకు కేటాయిస్తూ నిర్ణయం
-అప్పుడే అన్యాయాన్ని ప్రశ్నించి.. మైహోంకు మద్దతుతెలిపిన టీ టీడీపీ నేతలు
-ఇప్పుడు మై హోంకు న్యాయంచేస్తే.. అడ్డుకుంటున్న పచ్చతమ్ముళ్లు
పచ్చతమ్ముళ్లు.. తీరొక్క రీతిగా ప్రవర్తిస్తున్నారు! ఒకప్పుడు అన్యాయం జరిగిందని ఆందోళన చేసిన ఆ తమ్ముళ్లే.. ఇప్పుడు సర్కారు న్యాయం చేస్తే, ఎందుకు న్యాయం చేస్తున్నదని లొల్లిపెడుతున్నారు! మైహోం భూమిపై వింతధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా దెబ్బతీసే కొందరి కుట్రలకు పావులుగా మారుతున్నారు! రాష్ట్ర విభజన కాకముందు ఏ పారిశ్రామికవేత్తకు అన్యాయం జరుగుతున్నదని ధర్నాలు చేశారో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే సమస్య ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలకు మరో తీరుగా కనిపిస్తున్నది.
వాస్తవానికి హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న భూమిని ఆనాటి ఏపీఐఐసీ వేలంవేస్తే తెలంగాణ పారిశ్రామికవేత్త, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కొనుగోలు చేశారు. ఒక తెలంగాణ పారిశ్రామికవేత్తకు హైటెక్ సిటీ వద్ద భూమి ఇవ్వడం ఇష్టంలేక నాటి సీమాంధ్ర సర్కారు సతాయించడం మొదలుపెట్టింది. పొజిషన్ ఇవ్వలేదు.
చివరకు సీమాంధ్ర సర్కారు ఈ భూమిని గేమింగ్ పార్కుకు కేటాయించింది. సమైక్య రాష్ర్టానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ స్థలంలో గేమింగ్ పార్కు ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 8న శంకుస్థాపన చేశారు. దీనిపై ఆనాడు మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శంకుస్థాపన సభలోనే ఆందోళనకు దిగారు. పోలీసులు బలవంతంగా ఆయనను అక్కడినుంచి తరలించారు. నాడు వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలను రంగంలోకి దించారు. దీంతో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు, ఆనాడు టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఆందళనలో పాల్గొన్నారు.
రామేశ్వరావు కొనుగోలుచేసిన భూమిని గేమింగ్ పార్కు పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పార్కుకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త 30 ఎకరాల భూమిని ప్రభుత్వం వద్ద నుంచి ఎకరం రూ. 21 కోట్ల చొప్పున వేలంపాటలో కొనుక్కున్నారని, ప్రభుత్వానికి రూ. 450 కోట్లు చెల్లించారని తెలిపారు. రామేశ్వరరావుకు ఇప్పటివరకు భూములు ఇవ్వలేదని, పైసలు కూడా ఇవ్వకుండా ఆ స్థలంలో గేమింగ్ పార్కు ఎలా ప్రారంభిస్తారని నాడు తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించారు.
నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్యపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మరుసటి రోజు జనవరి 9న అసెంబ్లీలో ఆందోళన చేయాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ అధినేత చంద్రబాబు పురమాయించారు. బాబు ఆదేశాల మేరకు నాటి సీఎం కార్యాలయం ముందు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. చివరకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన చాంబర్ ఎదుట బైఠాయించిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలను లోపలికి పిలిపించి మాట్లాడారు.
తనకు విషయమంతా తెలియదన్నారు. అదే చాంబర్‌లో ఉన్న అప్పటి ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. తొందర పెడితే కార్యక్రమానికి వెళ్లానని వివరణ ఇచ్చుకున్నారు. దీంతో సీఎం చాంబర్‌లోనే పొన్నాలకు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గేమింగ్ పార్కుకు కేటాయింపులు రద్దు చేసి మైహోమ్‌కు భూమిని అప్పగిస్తానని చెప్పారు. చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సమైక్య రాష్ట్రంలో రూ. 450 కోట్లు చెల్లించిన భూమికి ఇప్పుడు రామేశ్వర్‌రావు న్యాయంగా పొజీషన్ తీసుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయంచేస్తే.. దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ రాజకీయం చేస్తున్నది. ఆనాడు కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. మైహోమ్‌కు భూమి ఇవ్వాలని ఆందోళన చేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ సంస్థకు భూమి ఎందుకు ఇచ్చారని లొల్లిపెడుతున్నది.
తమకు న్యాయాన్యాయాలు అక్కరలేదని, ప్రభుత్వాన్ని తిట్టడమే పని అన్నట్టుగా కొందరు తెలంగాణ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైహోమ్ సంస్థకు భూమి ఇవ్వాలని నాడు ఆందోళన చేయించిన ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు ఆ సంస్థకు భూమి ఇచ్చారంటూ ఆందోళన చేయిస్తున్నారో అర్థంకావడం లేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుందన్నారు. చివరకు తెలంగాణలో టీడీపీని బ్లాక్‌మెయిల్ పార్టీ అనే పరిస్థితి ఏర్పడుతుందా? అన్న సందేహం కలుగుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి