గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో...!!

- ప్రాజెక్టులెవరివి.. నీటి కేటాయింపులెవరికి?

కృష్ణా బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకేమో నీటి కేటాయింపులు లేవు. అదే సీమాంధ్రకి చెందిన సాగునీటి ప్రాజెక్టులు అసలు బేసిన్‌లోనే లేకపోయినా కృష్ణా జలాల కేటాయింపులు జరిగిపోయాయి. రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులు అసలు కృష్ణా బేసిన్‌లోనే లేవు. అయినా ఈ ప్రాజెక్టులకు కృష్ణా నీళ్లు వెళ్తున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులను ఎండగట్టి, సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగాయంటే ఇదంతా సీమాంధ్ర పాలకుల మాయాజాలమే. ఇంతకాలం రాష్ర్టాన్ని పాలించిన వలసపాలకుల వల్ల రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. 
నిలదీసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

ఐదు దశాబ్దాలకుపైగా కొనసాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయమే జరిగింది. తెలుగు గంగకు 25 టీఎంసీల కృష్ణాజలాలు కేటాయించారు. సీమాంధ్ర పాలకుల కుటిల రాజకీయమే ఇందుకు కారణం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరిగిన సమయంలో కృష్ణా బేసిన్‌లో లేని ప్రాజెక్టులకు తీవ్రఅన్యాయం జరిగిపోయిందని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వాదించింది. కే సీ కెనాల్, కృష్ణా డెల్టా ద్వారా నీటిని తీసుకెళ్తున్నారు కదా? అని ట్రిబ్యునల్ ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. పైగా రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిపోతున్నదని అప్పటి ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించడంతో ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేస్తూనే తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. ప్రస్తుతం దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులివీ..

కృష్ణా బేసిన్‌లో నికరజలాలపై ఆధారపడి రాష్ట్ర ప్రాజెక్టులు భీమా-1, భీమా-2, కోయల్‌సాగర్ ఉన్నాయి. మిగులుజలాలపై ఆధారపడి ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు ఉన్నాయి. 

వాస్తవానికి ముందుగా నికరజలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు, ఆ తరువాత మిగులు జలాలు, చివరకు వరద జలాలు కేటాయిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. 1956 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం లేకపోవడంతో, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతూనే ఉందని టీ ఇంజినీర్లు వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్రభుత్వం లేకపోవడంతో, అడిగేవారే లేరనే ధీమాతో ఇంతకాలం సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఆ ప్రాంతపాలకులు గట్టిగా పట్టుబట్టి సాధించుకుంటూనేవున్నారు. 

మీ రాష్ట్రంలో క్షామపీడిత ప్రాంతాల వివరాలు ఇవ్వడంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రశ్నించిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లో వెనుకబడిన ప్రాంతాల వివరాలు తెలిపాయి. కానీ మన రాష్ర్టానికి చెందిన సీమాంధ్ర పాలకులు మాత్రం కృష్ణా బేసిన్‍లో ఉన్నవాటిని వదలి, అసలు కృష్ణా బేసిన్‌లోనే లేని ప్రాజెక్టుల పేర్లు చెప్పి నీటి కేటాయింపులు చేయించుకోవడం గమనార్హం. కృష్ణా బేసిన్‌లో కృష్ణా జలాలపై ఆధారపడి రాబోయే ప్రాజెక్టులు మరికొన్ని ఉన్నాయి. అవి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జూరాల-పాకాల, డిండి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి