గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

చెరువుకు ఉరేసి.. శిఖం కబ్జా చేసిన అక్రమార్కులు!!

-రూ.170 కోట్ల చెరువు భూమికి ఎసరు
-లోకాయుక్తకు తప్పుడు నివేదిక.. తాజాగా మంత్రి ఆదేశాలూ బేఖాతర్!
-ముష్కిని చెరువు వ్యవహారంలో అధికారుల హైడ్రామా
నిబంధనలు పట్టవు. లోకాయుక్త అంటే లెక్కలేదు. మంత్రి ఆదేశాలూ బుట్టదాఖలు.. చెరువుకు ఉరేసి... శిఖాన్ని బడాబాబులకు కట్టబెడుతున్న అధికార యంత్రాంగం తీరిది. హైదరాబాద్ శివారులోని పుప్పాలగూడ పరిధి ఉన్న ముష్కిని చెరువు శిఖం భూమి వ్యవహారంలో అధికారులు బిల్డర్లతో కుమ్మక్కయి.. అక్షరాల రూ. 170 కోట్ల భూమికి ఎసరుపెట్టారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన లోకాయుక్తను, ప్రభుత్వాన్ని తప్పుడు నివేదికలతో బురిడీ కొట్టిస్తున్నారు.


muskini-cheruvu-ideతాజాగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ చెరువు ఆక్రమణలను తొలగించాలంటూ ఆదేశించినా.. అధికారులు మాత్రం ఇప్పటికీ విచారణను ప్రారంభించలేదు.
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని ముష్కినీ చెరువు 115.20 ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతోపాటు చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు భూగర్భజలాలకు జీవాధారంగా ఉంది. రెవిన్యూ రికార్డులు, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇది 52 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సర్వేనంబర్ 259లో ప్రభుత్వ భూమి 20.33 ఎకరాలు ఉండగా, మిగతాది సర్వేనంబర్ 255, 257, 258, 260 (పాక్షికం)ల్లో ఉంది. ఇవి పట్టా భూములు అయినప్పటికీ ఎఫ్‌టీఎల్ (పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం) పరిధిలో ఉన్నందున ఇక్కడ వ్యవసాయానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే ఈ భూమిపై కన్నేసిన బిల్డర్లు చెరువును భారీఎత్తున మట్టితో పూడ్చి, ప్రహరీగోడ నిర్మించారు. ఫిర్యాదులు అందడంతో 2008లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ చెరువు ఆక్రమణకు గురైందంటూ పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చింది. దీంతో బిల్డర్లు సచివాలయం స్థాయిలో చక్రం తిప్పి, రెవిన్యూ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ, జలమండలితోపాటు సమైక్య రాష్ట్రంలోని సంబంధిత మంత్రిని సైతం ప్రసన్నం చేసుకున్నారు. అంతే.. గత ఏడాది ఎఫ్‌టీఎల్ పరిధిలోని 17.25 ఎకరాలను గ్రీన్‌బెల్టు నుంచి మల్టీపుల్ జోన్‌గా మార్పిస్తూ జీవో వచ్చింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించింది.

నివేదికల్లోనూ హైడ్రామానే..
1926లో నిజాం హయాంలో ఉస్మాన్‌సాగర్ నుంచి గండిపేట నీటిని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్‌కు తరలించే కాలువ (కాండ్యూట్)ను నిర్మించారు. అనేక ఏండ్లుగా చెరువు పూర్తిగా నిండినా.. ఈ కాలువకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కానీ జలమండలి అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా, చెరువు నీటి వల్ల కాలువ దెబ్బతింటున్నదంటూ ముష్కిని చెరువు ఎఫ్‌టీఎల్ స్థాయిని 535.385 మీటర్ల నుంచి 531.200 మీటర్లకు తగ్గించాలని ఇరిగేషన్ శాఖకు సిఫారసు చేశారు.

దీనిని ఆసరాగా చేసుకొని.. రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు నివేదికలను ఇస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, అందులో వచ్చే సర్వేనెంబర్లను మాత్రం వివరంగా నివేదికల్లో పేర్కొనడం లేదు. చివరకు లోకాయుక్త ఆదేశానుసారం ఇచ్చిన నివేదికలోనూ అంతా గందరగోళమే.

మంత్రి ఆదేశించినా మొదలుకాని విచారణ
కొన్నిరోజుల కిందట పుప్పాలగూడ స్థానిక ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చెరువులోని ఆక్రమణలను తొలగించి, నీటి వనరులను కాపాడాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఆయన లేఖ రాశారు. దీనిపై గతంలో ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంతో మంత్రి ఆదేశాల మేరకు విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి ఆర్డీవో తహసిల్దార్‌కు ఆదేశాలు వెళ్లాయి. కానీ విచారణ మాత్రం మొదలుకాలేదు. ఈ విషయమై రాజేంద్రనగర్ ఆర్డీవో పీ సురేష్, తహసిల్దార్ చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. ఆదేశాలు వచ్చినాగానీ విచారణ మొదలుకాలేదని తేలింది. విచారణ జరుపుతానని తహసిల్దార్ చెప్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి