గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

ఉద్యోగులపై సీఎం వరాలజల్లు!!

-పీఆర్సీ, హెల్త్‌కార్డులపై సానుకూలత
-జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో పదోన్నతులు
-విద్యుత్తు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
-పరిశీలనలో రిటైర్డ్ ఉద్యోగులకు టీ ఇంక్రిమెంట్
తెలంగాణ ఉద్యోగులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. పీఆర్సీ, హెల్త్‌కార్డులపై సానుకూలత వ్యక్తం చేయడంతోపాటు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో పదోన్నతులకు శుక్రవారం జీవో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సైతం టీ ఇంక్రిమెంట్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.


DSC_3410తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం నుంచి వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులందరూ టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డిలతో కలిసి వచ్చారు. ఉద్యోగుల సమస్యలను దేవీప్రసాద్ సీఎంకు వివరించారు. 2013, జూలైనుంచి తెలంగాణ ఉద్యోగులు పదవ పీఆర్సీకోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. దసరానాటికి ఉద్యోగులకు 69% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. త్వరలో ఆర్థికశాఖ అధికారులతో, ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో ఉద్యోగుల పదోన్నతులపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని సీఎం స్పష్టం చేశారు.

వెంటనే జీవో ఇవ్వాల్సిందిగా అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై శనివారం జీవో రానుంది. పదోన్నతులకు ప్రతిబంధకంగా ఉన్న జీవో 2147ను రద్దు చేస్తామని సీఎం పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యోగులందరికీ వర్తించే విధంగా నగదు రహిత హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకొంటామని, ఉద్యోగసంఘాల నాయకులతో చర్చిస్తామని, వారు కోరుకున్న విధంగా హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, ప్రతిబంధకాలను తొలగించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని వేశామని సీఎం పేర్కొన్నారు.

విద్యుత్ ఉద్యోగులకు టీ ఇంక్రిమెంట్

విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ జేఏసీ నాయకులు శివాజీతో వచ్చిన బృందానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. టీ ఇంక్రిమెంట్‌పై జీవో జారీ చేయాలని విద్యుత్‌శాఖ కార్యదర్శి జోషిని సీఎం ఆదేశించారు.వాస్తవానికి విద్యుత్ ఉద్యోగులు కార్పొరేషన్లకింద పనిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంక్రిమెంట్ జీవో వారికి వర్తింపచేయలేదు. దీంతో విద్యుత్ ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేకుండానే ఆగస్టు నెల వేతనం తీసుకున్నారు.

సీఎం తాజా ఆదేశాల నేపథ్యంలో ఆగస్టు నెల నుంచి విద్యుత్ ఉద్యోగులకు టీ ఇంక్రిమెంట్ రానుంది. సీఎంతో భేటీ అయిన వారిలో నాయకులు స్వామిరెడ్డి, మోహన్‌రెడ్డి, జానయ్య కూడా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయడానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇక ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు ఎంతో సాహసంతో పోరాటాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆంధ్రసంఘాలు సమ్మెకు వెళ్లాయి. అయినా తెలంగాణ ఉద్యోగులు మాత్రం కేసీఆర్ సీఎం అయిన తరువాతే పీఆర్‌సీని తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీఆర్‌సీని అమలు చేయాలని ఈ బృందం సీఎంను కోరింది.

వెంటనే స్పందించిన సీఎం దీనికి ఎంత వ్యయం అవుతుంది? ప్రభుత్వంపై ఎంత భారం పడనుండదనే దానిపై ఒక నివేదికను తయారుచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావుకు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. పీఆర్‌సీ, ఇంక్రిమెంట్ ద్వారా 23వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. టీఎస్‌జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఈ బృందం సీఎంను కోరింది. దీనికి సీఎం సుముఖత వ్యక్తం చేశారు. కమలనాథన్ కమిటీ సిఫార్సులు అందిన వెంటనే ఉద్యోగులను విభజిస్తామని సీఎం హామీఇచ్చారు. పెన్షనర్ల సమస్యలపైన సీఎం సానుకూలంగా స్పందించారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తించేవిధంగా చర్యలు తీసుకుంటామని టీఎన్జీవో నాయకులకు హామీ ఇచ్చారు.

గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు ట్రెజరీ వేతనాలు

రాష్ట్ర గ్రంథాలయ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ట్రెజరీ వేతనాలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయంలో గ్రంథాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేవీప్రసాద్ నేతృత్వంలోని బృందానికి స్పష్టం చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అనుముల సోమయ్య, ప్రధానకార్యదర్శి శాగంటి అయోధ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ కే దేవేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు. గ్రంథాలయశాఖకు జీహెచ్‌ఎంసీ రూ.80 కోట్ల గ్రంథాలయసెస్ బకాయి పడిఉన్నదని గ్రంథాలయ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సెస్ వస్తే గ్రంథాలయాలను మరింత సుసంపన్నం చేయడానికి, నూతన భవనాలను నిర్మించడానికి అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు హౌసింగ్ ఉద్యోగుల విరాళం

స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు ఒకటిన్నర రోజు వేతనానికి సంబంధించిన రూ.8,85,000లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా చెక్కు రూపంలో అందచేశారు. రూ.4,44,058 చెక్కును అమరవీరుల కుటుంబాల సహాయనిధికోసం ఇచ్చారు. హౌసింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్ మోహన్, జీ రఘువీర్‌ప్రసాద్, పీ అప్పారావు, సీ కొండయ్యలు సీఎంకు ఈ చెక్కును అందచేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి