గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 15, 2014

ఆంధ్రకు తెలంగాణ ఆపన్న హస్తం...

-తుఫాన్ పీడిత జిల్లాలకు రూ.18కోట్ల విద్యుత్ పరికరాలు
-530 ట్రాన్స్‌ఫార్మర్లు, 2500 విద్యుత్ స్తంభాలు
-900 కి.మీ. పొడవైన విద్యుత్ వైర్లు : సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడి
-సహాయ చర్యలకు తాజాగా 9 మంది డిప్యూటీ కలెక్టర్లు
హుదూద్ తుఫాన్‌వల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చింది. హుదూద్ తుఫాన్‌తో ఆంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్ర నష్టంవాటిల్లింది. ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లు పాడై, స్తంభాలు ఒరిగిపోయి.. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. సత్వరం పరిష్కరించాల్సిన అంశంగా విద్యుత్ సమస్య ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. సుమారు రూ.18 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను అందించింది. 
ఏపీకి 50 పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు, 180 మీడియం ట్రాన్స్‌ఫార్మర్లు, 300 చిన్న ట్రాన్స్‌ఫార్మర్లను అందించినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. వాటితోపాటు 28,500 విద్యుత్ స్తంభాలు, వాటికి అవసరమైన.. 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరాలకు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా విద్యుత్ వైర్లను అందజేసినట్లు రాజీవ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే ఐదుగురు ఐఏఎస్ అధికారులను, మరికొంత మంది సిబ్బందిని కూడా పంపించామని చెప్పారు.

ఆంధ్రాలో సేవలకు 9మంది డిప్యూటీ కలెక్టర్లు


తుఫాన్ ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు తాజాగా తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పంపించనుంది. వీరిలో ధర్మారావు, ఎస్ వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈ మురళి, కే వెంకటేశ్వర్లు, ఎన్ సత్యనారాయణ, కే చంద్రశేఖర్‌రావు, వీ నాగన్న ఉన్నారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల జాబితాను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా మంగళవారం సాధారణ పరిపాలన(పొలిటికల్) శాఖకు ప్రతిపాదించారు. ఎంపిక చేసిన డిప్యూటీకలెక్టర్లందరూ బుధవారం ఆంధ్రాకు వెళ్లనున్నారు.

నాడు కశ్మీర్‌కు.. నేడు ఆంధ్రప్రదేశ్‌కు..


ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఇటీవల కశ్మీర్‌లో తీవ్ర వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తాగునీటిని శుద్ధిచేసే వాటర్ ఫిల్టర్లు హైదరాబాద్‌లోనే లభిస్తాయన్న సమాచారం మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో సహకారం కోరింది. వెంటనే స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం వాటిని సత్వరమే కశ్మీర్‌కు పంపించింది. దీనితోపాటు కశ్మీర్ వరదబాధితులకు రూ.10కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

తాజాగా హుదూద్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలను ఆదుకునేందుకు కేసీఆర్ చొరవ చూపారు. ఏపీ అడిగిన సహాయం సత్వరమే అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశం మేరకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను, కొంతమంది విపత్తుల నిర్వహణ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించారు. ఇప్పుడు దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు కూడా సహాయం చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉదారతకు నిదర్శనమని ఉన్నతాధికారులు అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి