గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 25, 2014

మా పేద విద్యార్థులను ఆదుకోవడానికే...


-మా విద్యార్థులను ఆదుకోవాలనే ఫాస్ట్ జీవో
-హైకోర్టుకు నివేదించనున్న న్యాయశాఖ 

తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్ట్ జీవోపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ విషయమై సమగ్రమైన వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫాస్ట్ పథకంపై సవివరమైన నివేదికను రూపొందించాలని న్యాయశాఖను ప్రభుత్వం పురమాయించింది. తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది తప్ప ఇతర ప్రాంత విద్యార్థుల పట్ల వివక్ష చూపడానికి కాదని, వారి అవకాశాలను దెబ్బతీసే ఉద్దేశంతో జీవోలో ఎలాంటి క్లాజ్‌లు లేవని ప్రభుత్వం వివరించనుంది. 

రాజ్యాంగ పరిధిలోనే ఫాస్ట్ పథకంపై జీవో జారీచేశామని, తెలంగాణలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఇతోధికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని న్యాయశాఖ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. 

ఫీజుల చెల్లింపు విషయంలో ఇతర అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ సొంత రాష్ట్ర విద్యార్థులను ఆదుకునేందుకు.. ఫాస్ట్ జీవోను జారీ చేసిందని హైకోర్టుకు నివేదించనున్నది. స్థానికత గుర్తింపునకు, 1956 నిబంధన వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని, తమ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే దీనిని తెచ్చామని తెలుపనున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికెట్లు కోరుతున్నదని న్యాయశాఖ నివేదికలో వివరించనున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

NavaCHAITANYA Competitions చెప్పారు...

సర్‌
ప్లీజ్ ఇకనైనా ప్రతీ దానికి ఆంధ్రప్రదేశ్‌ వారు కారణం అంటూ నిందించే ప్రయత్నం చేయకుండా, లోపానికి మూలం ఎక్కడ ఉందో తెలిపే ప్రయత్నం చేయండి. బ్లాగు అనేది ఒక గొప్ప మాధ్యమం. దయచేసి దానిని తప్పుడు భావనలు ప్రచారంచేయడానికి ఉపయోగించకండి. కారణాలేవైనా, . . మంచైనా చెడైనా, . . రాష్ట్రం విడిపోవడం పూర్తి అయింది. తెలంగాణా ఎదగడానికి ఎన్నో ప్రతికూలతలున్నాయన్నది, ఒప్పుకోవడం లేని వాస్తవం. దయచేసి ఆయా లోపాలను అధిగమించే ప్రయత్నం ప్రారంభించడానికి సహకరించండి. ఇప్పటి మీ తప్పులు తరువాత తరాలు మిమ్మల్ని నిందిస్తూ, వారి అభివృద్ధిని అడ్డుకునేలా ఉంటాయి.
మీ
చైతన్యకుమార్ సత్యవాడ
విఙ్ఞతతో రిప్లై పంపాలనుకుంటే
పంపండి.
menavachaitanyam@gmail.com

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చైతన్యకుమార్‍గారూ!

నా గురించి మీరు పొరపడ్డారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకిని కాను. సీమాంధ్రులు మాకు సోదర సమానులు.
మా తెలంగాణకు అన్యాయం చేసిన అక్రమార్కులను, వారి చేతలను ఎండగడుతున్నానే తప్ప, సీమాంధ్ర ప్రజలను నేను ఎన్నడూ నిందించే ప్రయత్నం చేయలేదు. మీకు తెలుసు "అన్యాయం చేసే వారికన్నా, దాన్ని చూస్తూ సహించేవారే నిజమైన దోషులు" అనేది. మా చుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని నేను ఎత్తిచూపుతున్నాను. అది తప్పుగా మీకు కనపడితే నేనేం చేయలేను. నేను చేస్తున్నది అధర్మపరుల అకృత్యాల బట్టబయలు. తద్వారా తెలంగాణులకు తమ చుట్టూ జరుగుతున్న వాస్తవాల అవగాహనం...నా లక్ష్యం. సీమాంధ్రులను నిందించడం నా లక్ష్యం కాదు....సీమాంధ్ర అక్రమార్కులను దుయ్యబట్టడమే నా లక్ష్యం. నా బ్లాగులోని అన్ని టపాలనూ అన్యాయానికి గురైన తెలంగాణ సగటు పౌరుని కోణంలో చూడండి. వాటిల్లోని నిజం మీకు తప్పక అవగతం అవుతుంది.

"తెలంగాణా ఎదగడానికి ఎన్నో ప్రతికూలతలున్నాయన్నది, ఒప్పుకోవడం లేని వాస్తవం" అని మీరు అంటూనే, నన్ను నిందిస్తున్నారు. ఇది మానండి.

మీరు ఎందరో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనన్యసామాన్యమైన సేవ చేస్తున్నారు. అభినందనీయులు. ఈ విధంగా మీపై నాకు గౌరవభావం ఉంది. కానీ, ఈ విధంగా సీమాంధ్ర అక్రమార్కులను వెనకేసుకొని రావడం మీవంటివారికి తగని పని. అక్రమార్కులు ఎక్కడైనా అక్రమార్కులే. మీ ఆంధ్రప్రదేశ్‍లో ఇలాంటి నీచమైన పనులు ఎవరైనా చేస్తే మీరు ఊరకుంటారా? మీ బ్లాగుద్వారానో మరెలాగునో తప్పును ఎత్తిచూపుతారుగదా! నేనూ ఆ పనే చేస్తున్నాను. నన్నాపకండి...నిందించకండి. సీమాంధ్రులపై నాకు కోపం లేదు...ద్వేషం లేదు...వారు మా సోదరులు.

నేను చేస్తున్నది తప్పుకాదని మరోసారి తెలుపుతూ.....
స్వస్తి

వజ్రం చెప్పారు...

అక్రమార్కులలో తెలంగాణా అక్రమార్కులు, ఆంధ్రా అక్రమార్కులు అని ఉండరని విజ్ఞులు గ్రహించాలి. కేవలం ఒకవైపు తప్పులనే పదే పదే ఎత్తి చూపటం కూడా వివక్ష క్రిందికే వస్తుంది !

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి వజ్రంగారూ, తెలంగాణ రాష్ట్రానికీ, తెలంగాణ ప్రజలకూ అన్యాయం చేసేవారు సీమాంధ్రులైనా, తెలంగాణులైనా నా దృష్టిలో అక్రమార్కులే. చైతన్యకుమార్‍గారు సీమాంధ్రులను నేను నిందిస్తున్నాననగా, సీమాంధ్ర అక్రమార్కులను మాత్రమే నిందిస్తున్నానంటూ వ్యాఖ్యానించాను. తెలంగాణులు కూడా అక్రమాలు చేస్తే వాళ్ళనూ వదలను! నాకు ఇద్దరూ సమానులే. ఎవరి పైనా వివక్ష చూపను. అన్యాయాన్ని ఎఱుకపరుస్తాను. ఉపేక్షించను. నన్ను అపార్థం చేసుకోవద్దు. మేం ఎందుకు తెలంగాణను కోరుకున్నామో మరువవద్దు. అన్యాయానికి గురైనాం కనకనే కదా! ఈలాంటి అన్యాయాలు ఇంకా కొనసాగడం అభిలషణీయమా? పరిహార్యమా? ఆలోచించండి. సీమాంధ్ర అక్రమార్కులను వెనకేసుకు వచ్చి మీరు చెడ్డవారు కాకండి. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి