-20 ఏళ్లయినా పూర్తికాని సాగర్ కాల్వ పనులు
-20% కూడా నెరవేరని సాగు లక్ష్యం
-అధికారుల నిర్లక్ష్యం అన్నదాతకు శాపం
-చిన్న చిన్న పనులు పూర్తయితే.. 65వేల ఎకరాలకు సాగునీరు
నాగార్జునసాగర్ జలాల కోసం అన్నదాతలు అరవై ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆనాటి నాయకుల కుట్రల ఫలితంగానే ఎడమ కాల్వ ఆ పల్లెల పాదాల కిందుగా వెళ్లింది. అరికాళ్లకు కూడా తడి తగలకుండానే కృష్ణమ్మ బిరబిరా దిగువకు మళ్లిపోయింది. 20 ఏండ్ల క్రితం ప్రారంభమైన వరద కాల్వ అయినా తమ భూముల దాహాన్ని తీరుస్తుందని ఆశించిన రైతులకు చివరికి ఎదురుచూపులే మిగిలాయి. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 572 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఉద్దేశంతో సాగర్ వరద కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో 1994లో ప్రారంభమైన ఈ కాల్వ పనులు 1999 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. ఎస్సెల్బీసీ అధికారుల అలసత్వం, ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఐదేండ్లలోనే పూర్తి కావాల్సిన పనులు.. ఇరవై ఏండ్లు దాటినా పూర్తి కాలేదు. -20% కూడా నెరవేరని సాగు లక్ష్యం
-అధికారుల నిర్లక్ష్యం అన్నదాతకు శాపం
-చిన్న చిన్న పనులు పూర్తయితే.. 65వేల ఎకరాలకు సాగునీరు
జిల్లాలోని పెద్దవూర మండలం పొట్టి చెలిమ నుంచి ప్రారంభమయ్యే ఈ కాల్వ.. వేములపల్లి మండలం తోపుచర్ల వద్ద సాగర్ ఎడమ కాల్వను చేరుతుంది. ఈ మధ్యన ఉండే 85.3 కిలోమీటర్ల పరిధిలో చెరువులు, కుంటలు నింపడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు భావించారు. కానీ, అధికారులు చిన్న సమస్యలు పరిష్కరించకపోవడంతో కాల్వ నిర్మాణం కునారిల్లుతున్నది. అష్టకష్టాలు పడుతూ ఇరవై ఏండ్లలో 72 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినప్పటికీ.. సాగునీరు 65 కిలోమీటర్ల వరకే వస్తున్నది. తిప్పర్తి మండలంలోని చెర్వుపల్లి సమీపానికి వరద కాల్వ నీరు చేరుతున్నా.. అక్కడికి దగ్గర్లో ఉన్న మాడ్గులపల్లి, దాచారం, మర్రిగూడెం, ఇందుగుల గ్రామాలకు నీటిని చేర్చడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
చెర్వుపల్లి సమీపంలో రైల్వే అండర్ పాస్ పనులు, మాడ్గులపల్లి వద్ద అద్దంకి - నార్కట్‌పల్లి హైవే పై రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మించడంలో అధికారులు ఏండ్ల తరబడి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించకుండా కాలం వెల్లదీస్తూ అక్కడి రైతాంగం ఆశలపై నీళ్లు చలుతున్నారు. 65 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 10 నుంచి 15 వేల ఎకరాలకే సాగర్ వరద కాల్వ జలాలు పరిమితమయ్యాయి. చెర్వుపల్లి వద్ద కాల్వ రైల్వే ట్రాక్‌ను దాటాల్సి ఉంది. దీంతో అండర్ పాస్ కోసం అధికారులు రైల్వేశాఖకు దరఖాస్తు చేసి.. ఆ విషయం మరిచిపోయారు. డిస్ట్రిబ్యూటరీల కోసం రెండు పాయింట్ల వద్ద అండర్ పాస్‌లు వేయడానికి రూ.6.2 కోట్లు విడుదల చేయడంలోనూ జాప్యం చేశారు. డబ్బు చెల్లించిన తర్వాత రైల్వే శాఖ కూడా ఆలస్యం చేయడంతో నేటికీ పూర్తి అనుమతులు రాలేదు. దీనికితోడు మాడ్గులపల్లి హైవేపై అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఆర్ అండ్ బీకి రూ.98.4 లక్షలు చెల్లించారు.
డబ్బు చెల్లించినా అనుమతులు తీసుకురావడంలో ఎస్సెల్బీసీ అధికారులు అలసత్వమే ప్రదర్శించారు. దీంతో ఎప్పుడో మూణ్నాలుగేళ్ల క్రితమే పూర్తి కావాల్సిన ఈ రెండు చిన్న పనులకు నేటికీ మోక్షం కలగలేదు. 65వ కిలోమీటర్ వద్ద రైల్వే ట్రాక్ సమస్య, 71వ కిలోమీటర్ వద్ద రోడ్ కటింగ్ సమస్యల కారణంగా మాడ్గులపల్లి, దాచారం, మర్రిగూడెంతోపాటు పలు గ్రామాలకు సాగర్ జలాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. మాడ్గులపల్లి తర్వాత 72.5 నుంచి 73.5 వరకు మధ్య ఉన్న కిలోమీటర్ దూరం మాత్రం భూ సేకరణ కేసు కోర్టు పరిధిలో ఉంది. దీనిపైనా సరైన వాదనలు వినిపించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వహించినట్లు తెలుస్తున్నది. 73.5 నుంచి 85.3 కిలోమీటర్ వరకు ఉన్న కాల్వ పనులు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం తిప్పర్తి మండలంలోని చెర్వుపల్లి వరకు చేరుతున్న నీరు కాల్వ నిర్మాణం పూర్తికాకపోవడంతో వృధాగా వాగులో కలుస్తున్నది.
అనుమతుల్లో జాప్యమే కారణం:
రైల్వే ట్రాక్‌పై అండర్ పాస్ నిర్మాణానికి రైల్ సేఫ్టీ కమిషన్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డబ్బు చెల్లింపులో కాస్త ఆలస్యమైనా రూ.6.2 కోట్లు గతంలోనే చెల్లించాం. హైవేపై అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.98.4 లక్షలు గత మార్చిలోనే చెల్లించాం. రైల్వే, ఆర్ అండ్ బీ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
- శేషగిరిరావు, సర్కిల్-2 ఎస్ఈ
అధికారులు, ప్రభుత్వాల వైఫల్యం:
1999లోనే కాల్వ పనులు పూర్తి కావాలి. ఇప్పటికీ పూర్తికాకపోవడానికి కాంట్రాక్టర్ల స్వలాభం, వాళ్లకు వంతపాడిన అధికారులు, ప్రభుత్వాలే కారణం. 65 వేల ఎకరాలకు సాగునీటి లక్ష్యంలో ఇప్పటికి 15 వేలు కూడా చేరుకోలేకపోవడం సిగ్గుచేటు.
-నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
బీడు భూములు సాగులోకి వస్తాయి
కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడం, బోర్లు సక్రమంగా పోయక పోవడంతో ఎక్కువ శాతం పొలాలు పారడం లేదు. వరద కాల్వ రావడం వల్ల బీడు భూములు సాగులోకి వస్తాయి.
- మిర్యాల కరుణాకర్‌రెడ్డి, రైతు, ఇందుగుల
కరువు ఉండదు
సంవత్సరానికి ఒకసారి వరద కాల్వ నీటిని విడుదల చేసినా మాడ్గులపల్లి పరిసర ప్రాంతాల్లో కరువు ఉండదు. పరిసర ప్రాంతాల ప్రజలకు, తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవు.
- వెన్న కోటిరెడ్డి, మాడ్గులపల్లి
భూగర్భ జలాలు పెరుగుతాయి:
వరద కాల్వతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. భూగర్భ జలా లు పెరగడంతోపాటు బీడు భూము లు సాగులోకి వస్తాయి. వరద కాల్వ దాచారం సమీపం వరకు పరిమితమైంది. ప్రభుత్వం కాల్వ పనులు పూర్తిచేయాలి.
-చాడ లింగారెడ్డి, రైతు, మాడ్గులపల్లి
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి