-భవిష్యత్ తరాలు నష్టపోవద్దు
-ప్రజల గోస తెలిసిన వాడిగా చెబుతున్నా
-సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం
తెలంగాణ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా నష్టపోయారు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నష్టం జరిగితే వచ్చిన రాష్ర్టానికి అర్థమే లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. 14 ఏళ్ల రాజకీయ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పడ్డ ఎన్నో కష్టాలను చూశాను, నిన్న నా తండ్రికి నష్టం కలిగింది, నేడు నా తరం వారికి జరిగింది, రేపు భవిష్యత్ తరాలకు నష్టం కలగకూడదన్నదే నా లక్ష్యం అని కేసీఆర్ అన్నారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. -ప్రజల గోస తెలిసిన వాడిగా చెబుతున్నా
-సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం
యువకులు వారి భవిష్యత్‌ను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడారని, అలాంటి వారి భవిష్యత్ రాబోయే రోజుల్లో ఇంకా నష్టపోకూడదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.ఐదు వందల కోట్లో, వెయ్యి కోట్లో ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదు, కానీ దాని వల్ల భవిష్యత్తులో జరిగేనష్టం గురించి ఆలోచించాలని సీఎం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అన్నారు. నా ఆవేదనను అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రజల గోస తెలిసిన వాడిగా చెబుతున్నానుఅంటూ ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, చేపడుతున్న అభివృద్ధి పథకాలకు సారథులు, వారథులు జిల్లా కలెక్టర్లేనని అన్నారు.
అంకిత భావంతో పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. అధికారులపై ఎలాంటి వత్తిడులు ఉండవు, ప్రజలకు ఉపయోగపడే పనులను ధైర్యంగా చేయండి అని కేసీఆర్ ఐఏఎస్ అధికారులకు ఉద్బోధచేశారు. శంకరన్ వంటి ఐఏఎస్ అధికారిని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆయన పనితీరే కదా, అలా ప్రతి ఐఏఎస్ అధికారి పనిచేయాలి, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలి, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం తపించాలని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అధికారులనే నమ్ముతోంది, మీరే మాకు పాలనను అందించేవారు.
తరతరాలుగా తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాలను పూడ్చకపోతే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ప్రయోజనం ఏమిటని సీఎం తన ఆవేదనను వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, అలాంటివే తాను తీసుకుంటున్నానని ఆయన అన్నారు. ప్రజల క్షేమం కోసం తీసుకునే నిర్ణయాలను అధికారులు అర్థం చేసుకొని పనిచేయాలని కోరారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి