గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

ఐదు వేల కోట్ల భూంఫట్!!

-హఫీజ్‌పేటలో 942 ఎకరాలు గల్లంతు
-ఒక వైపు నిషేధం.. మరోవైపు రిజిస్ట్రేషన్లు
-సర్కారు గెజిట్ బేఖాతర్..
-రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కెక్కని
-నిషేధ గెజిట్ వివరాలు
-పాత కేసు వివరాలు దాచి కొత్త పిటిషన్లు..
-అయినా కిమ్మనని జిల్లా అధికారులు
హైదరాబాద్ నగర శివార్లలో భూ మాఫియా రెచ్చిపోతున్నది. అవినీతి అధికారుల అండదండలతో నిబంధనలు తుంగలో తొక్కి, ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటున్నది. చివరికి ఆయా భూముల క్రయ విక్రయాలు నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్ కూడా ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. కబ్జాలు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ యథావిధిగా సాగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఒక్క హఫీజ్‌పేట గ్రామంలోనే రూ. 5 వేల 652 కోట్ల విలువ చేసే 942 ఎకరాల భూమి హారతి కర్పూరమై పోయింది. ఈ భూములు కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని సర్కారు జారీచేసిన గెజిట్ చిత్తుకాగితంగా మారిపోయింది.
గజం రూ. 20 వేల చొప్పున..

hafezpet2హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో హఫీజ్‌పేట గ్రామం ఉంటుంది. ఇక్కడ భూమిని ఎవరూ ఎకరాల చొప్పున అమ్మరు. అంతా గజాల లెక్కలే. ఇక్కడ గరిష్టంగా గజం రూ.20 వేల దాకా పలికిన సందర్భాలున్నాయి. ఎకరం భూమి విస్తీర్ణం 4840 గజాలుంటుంది. దీన్ని పౌర అవసరాలకు వాడాలంటే ఇందులో 40% రోడ్డు, ఇతర మౌలిక సదుపాయల కింద తీసివేయాల్సి ఉంటుంది. అపుడు మూడు వేల గజాలు నికరంగా వస్తుంది. ఆ లెక్కన 942 ఎకరాలకు రూ.5 వేల 652 కోట్ల విలువ అవుతున్నది. ఇంత విలువైన భూమి ఇపుడు కబ్జాల పాలైంది. కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులకే వంత పాడుతున్నది.

అమ్మకాలు నిషేధిస్తూ గెజిట్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేట గ్రామంలోని సర్వే నంబర్లు 46, 48, 55, 66, 67, 74, 75, 77, 78, 79, 80, 100, 104, 151లలోని 942 ఎకరాల 15 గుంటల భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరుపకూడదని 2013 సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 2007 జూన్ 20వ తేదీన జీవోఎంఎస్ 863 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విస్తృత అధికారాలతో ఈ గెజిట్‌ను పబ్లిష్ చేశారు. ఈ సర్వే నంబర్లపై ఎవరైనా తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లుగా భావిస్తే అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చునని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఆదేశించారు.

అభ్యంతరాలను ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఇవ్వవచ్చునని గెజిట్‌లో వివరించారు. అభ్యంతరాల సమర్పణకు నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజులవరకు అవకాశమిచ్చారు. ఆ కాల పరిమితి ముగియడంతో మొత్తం భూమిలో సర్కారు గెజిట్ ప్రకారం అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవాలి. అయితే ఈ భూమిని కబ్జా పెట్టిన భూమాఫియా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసి ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నది. మరోవైపు ఇందులో 867 ఎకరాల 27 గుంటల భూమిపై సీఎ స్14/58 సివిల్ కేసు కూడా నడుస్తున్నది. అయినా కేసు కోర్టులో ఉండగానే అమ్మకాలు మాత్రం నిరాటంకంగా జరుగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో చేరని గెజిట్

వాస్తవానికి భూములపై క్రయవిక్రయాలు నిషేధిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని సర్వే నంబర్ల వారిగా వెబ్‌సైట్లో పొందుపర్చాలి. కానీ ఇక్కడ ఇది అమలు కాలేదు. నిషేధిత జాబితాల్లో ఈ సర్వే నంబర్లను అధికారులు చేర్చలేదు. ఈ మొత్తం భూమిలో ఒక్క సర్వే నంబర్ 77ను మాత్రమే జాబితాలో చూపిస్తున్నారు. గమనార్హమైన విషయం ఏమంటే నిషేధిత జాబితాలో చేర్చిన ఈ ఒక్క సర్వే నంబర్ 77 భూమికి చెందిన భూముల కొనుగోళ్లను కూడా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటూ పోతున్నది. ఈ ఒక్క ఏడాది వ్యవధిలోనే ఈ సర్వే నంబర్ మీద 16 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే 78,79,80 సర్వే నంబర్లలో కూడా భూముల రిజిస్ట్రేషన్లు నిరాటంకంగా జరిగిపోతున్నాయి.

కోర్టు స్టేను దాచి మళ్లీ పిటిషన్

ప్రభుత్వ గెజిట్‌ను సవాలు చేస్తూ గతంలో కబ్జాదారులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో న్యాయమూర్తి అన్నింటినీ ఏక మొత్తంగా నిషేధించకుండా ఒక్కో కేసును బట్టి విచారించి నిర్ణయించాలని తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఈ స్టే ఇలా ఉండగానే కోర్టునే బురిడీ కొట్టిస్తూ మరో కేసును కింది కోర్టులో వేయడం గమనార్హం. వాస్తవానికి పైకోర్టులో కేసు విచారణలో ఉండగా.. కింది కోర్టులో ఇదే సమస్యపై మరో కేసు వేయడమంటే కోర్టులను మోసం చేసినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఘనత వహించిన అధికారులు కోర్టుకు తెలియజేయకపోవడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. హఫీజ్‌పేట భూములపై సర్కారు గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎవరికైనా అభ్యంతరాలుంటే నెలలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే రెవెన్యూ అధికారుల వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులు, గెజిట్ వచ్చిన నెల, రెండు నెలల తరువాత దాదాపు ప్రభుత్వం మీద వంద కేసులు వేశారు.

హైకోర్టు సింగల్ బెంచ్‌లో wp30526/2012 కింద ఈ కేసు వేశారు. అన్ని కేసులను కలిపి విచారించిన న్యాయస్థానం సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ చేయవద్దని గెజిట్ ఇవ్వడం కన్నా... కేస్‌బై కేసు, (దరఖాస్తులను విడివిడిగా) విచారించి, పట్టాభూములనే కొనుగోలు చేస్తే వాటికి మాత్రమే అనుమతించాలని, తప్పులుంటే తిరస్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కూడా కబ్జాదారులకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, చిన్న అవకాశం దొరికినా కబ్జాదారులు పెట్రేగిపోతారని భావించిన సర్కారు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో WA352/2013 అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌ను పరిశీలించిన న్యాయస్థానం డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ భూముల క్రయవిక్రయాలపై విధించిన నిషేధం అమలవుతూనే ఉన్నది.

కానీ అసలు తిరకాసు ఇక్కడే మొదలైంది. ఈ భూములపై కేసు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ జరుగుతున్నది. డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే హైకోర్టులోని మరో సింగిల్‌బెంచ్ వద్ద WP19069/2014 ఫైల్ చేశారు. అయితే ఈ కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రియల్ మాఫియా వేసినప్పుడు, ప్రభుత్వ అధికారులు కోర్టుకు పైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు మౌనంగా ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ. ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి రియల్ మాఫియా చేస్తున్న అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదే భూముల మీద రుణాలు!

ప్రభుత్వ భూములు బడాబాబులకు బంగారు బాతుగుడ్లే అవుతున్నాయి. అమ్మిన కాడికి అమ్ముకున్న వాళ్లు ఉన్నట్టే వీటిని ఆస్తుల కింద చూపించి రుణాలు పుచ్చుకుంటున్న ఘనులు కూడా ఉన్నారు. బడాబాబులు ప్రభుత్వ భూమిని ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా ఈ డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు రుణాలు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎగవేస్తున్నారు. ప్రభుత్వ భూమిపై ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధంలేకుండా ఒకరికి ఒకరు పరస్పర ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అధికారుల వైఖరీ అనుమానాస్పదంగానే ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తెల్లకాగితాలపై ఒప్పందాలు

సర్వే నంబర్ 78లో 10 ఎకరాల భూమిని కబ్జాదారులు సవేరా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఒక తెల్లకాగితంపై రాసిచ్చారు. దీని ఆధారంగా సవేరా కంపెనీ కోర్టులో పిటిషన్ వేస్తే రెవెన్యూ అధికారులు కనీసం అబ్జెక్షన్ మెమో కూడా వేయలేదు. గమ్మత్తేమిటంటే హఫీజ్‌పేటలోని ప్రభుత్వ భూమిని కాపాడే మహత్తర కార్యక్రమంకోసం ఇక్కడి అధికారులు కోర్టు ఖర్చుల కింద దాదాపు రూ.68 కోట్లు ఖర్చు చేశారు. తెల్లకాగితాలపై రాతలు రాసుకొని కోర్టులకు వెళితే కనీస అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయకుండా ఇంత మొత్తం ఎందుకు ఖర్చు చేశారో తెలియదు.

వాస్తవానికి రెవెన్యూ చట్టంలోని సెక్షన్17-1(ఈ) ప్రకారం తెల్లకాగితాలపై అగ్రిమెంట్లు చెల్లవు. కోర్టులు కూడా వీటిని స్వీకరించవు. అయితే ఇందుకు సంబంధిత పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ పని రెవెన్యూ అధికారులు చేయలేదు. సవేరా కంపెనీ ఈ ప్రభుత్వ భూమిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూడా కూల్చివేసేందుకు యత్నిస్తున్నది.

హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూమి కూడా కబ్జా

ఈ భూములపై జరుగుతున్న వివాదంలో సీఎస్14/58 సివిల్ సూట్ కేసు వివాదంలో సర్వే నంబర్లు 77, 78, 79, 80 ఉన్నాయి. అయితే సర్వే నంబర్ 77లోని భూమిలో 62 ఎకరాల భూమిని హెచ్‌ఏఎల్ ఉద్యోగుల సొసైటీ1981లో కొనుగోలు చేసింది. దీనిపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూమిని రియల్ రాబందులు కబ్జా చేసుకొని విక్రయాలు చేసుకుంటున్నారు. హెచ్‌ఏఎల్ ఉద్యోగులు సర్కారును ఆశ్రయిస్తే ప్రభుత్వం ఒక మెమో ఇచ్చింది. ఈ మేరకు 2004కు ముందు కొనుగోలు చేసిన వారిలో అర్హులైన వారికి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి మ్యూటేషన్ చేయాలని 2004 నవంబర్ 5వ తేదీన మెమో నంబర్ 28908/జేఏ1/ 2004-1 విడుదల చేసింది. ఈ మెమో ప్రకారం సర్వే నంబర్ 77లోని భూమికి ఒక్క హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ మాత్రమే అర్హత కలిగి ఉందని అంటున్నారు. ఈ సొసైటీకి చెందిన భూమిని కూడా రియల్ మాఫియా గుండాలను పెట్టి అమ్ముకోవడం కొసమెరుపు.

గెజిట్ అమలులో ఉంది: రాజేంద్ర నగర్ ఆర్డీవో సురేశ్

హఫీజ్‌పేట రెవెన్యూ గ్రామంలోని పలు సర్వే నంబర్లలో క్రయవిక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఇచ్చిన గెజిట్ అమలులో ఉందని రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్ నమస్తే తెలంగాణకు తెలిపారు. ఈ గ్రామలోని పలు సర్వే నంబర్లలోని భూములపై అనేక వివాదాలు నడుస్తున్నమాట వాస్తవమేనన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తూ ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. హఫీజ్‌పేటలోని వివాదాస్పద భూములపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
hafezpet3
hafezpet4

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

aa dopidi mariyu dongalu Andhra ( telugu )vaaranukonta sir

కామెంట్‌ను పోస్ట్ చేయండి