గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

భోజగుట్టలో భూకబ్జా!

-రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
-సుమారు రూ.70 కోట్ల విలువ
-ఫంక్షన్‌హాల్, బహుళ అంతస్తుల నిర్మాణం
-రెవెన్యూ డివిజనల్ అధికారుల లోపాయికారి ఒప్పందం
-పట్టించుకోని కలెక్టర్
"నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..నా యిచ్చయేగాక నాకేటి వెరపు" అన్న చందంగా మారింది హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారుల తీరు. ప్రభుత్వానికి నష్టం జరిగితే మాకేమిటి, మా జేబులు నిండితే చాలు అన్నట్లు రెవెన్యూ అధికారులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కోట్ల విలువైన భూ ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు లోపాయికారిగా సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌నగర్ మండల పరిధిలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
bukabjaభోజగుట్ట ప్రాంతంలో రూ.70 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల ప్రభుత్వభూమి ఆక్రమణకు గురైతే రెవెన్యూ డివిజన్ అధికారులు నిద్రమత్తు నటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆక్రమణదారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్‌హాల్, బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుంటే చర్యలు శూన్యమే. దీనికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లోపం కారణంగానే వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 68 సమీపంలో జరుగుతున్న భూ కబ్జాపై టీ మీడియా కథనం..

పక్కా ప్రభుత్వ భూమి..
ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుడిమల్కాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 294/1/2, 297/1/3, 298/2, నుంచి 12 వరకులో 78 ఎకరాలు భూమి ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్, రెవెన్యూ రికార్డు ప్రకారం కచ్చితంగా ప్రభుత్వభూమి అని రెవెన్యూ అధికారులు గతంలోనే తేల్చారు. భోజగుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకోవడంతో వాటిపై ఇప్పటికే వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మిగిలిన భూముల్లో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కొంత భూమి అన్యాక్రాంతమైంది. అక్కడే ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఓ వ్యక్తి కబ్జాచేసి బహుళ అంతస్తుల భవనం, ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నాడు.వాటిని అడ్డుకునేందుకు వెళ్తే గూండాలు జులుం ప్రదర్శిస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు.

కొంత కొనుగోలు?.. ఆపై కబ్జా 
గతంలో రోడ్డు విస్తరణలో రాణి అనే మహిళ భూమి కోల్పోవడంతో ఆమెకు మరెక్కడైనా భూమి కేటాయించాలని కోర్టు ప్రభుత్వ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ నవీన్‌మిట్టల్ భోజగుట్టలోని వార్డు నెంబర్-19, బ్లాక్‌నెంబర్-ఎఫ్, సర్వేనెంబర్ 200 (టౌన్‌సర్వే నెంబర్-10)లో ఆ మహిళకు సుమారు 500గజాల స్థలం కేటాయించారు.

అయితే కబ్జాచేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్న కబ్జాదారులు రాణి అనే మహిళ వద్ద స్థలం కొనుగోలు చేశామంటున్నారు. కానీ ఆమెకు ప్రభుత్వం కేటాయించిన స్థలం కేవలం 500 గజాలు మాత్రమే. ఇక కబ్జాదారుడు నిర్మిస్తున్న భవనం సుమారు అర ఎకరం స్థలంకు పైనే ఉంటుంది. గతంలో ఈ మండల రెవెన్యూ పరిధిలో పని చేసిన అధికారులు మా వద్ద అందినకాడికి దండుకున్నారని కబ్జాదారుడి మద్దతుదారులు సాక్షాత్తు మండల కార్యాలయంలో వీరంగం సృష్టించారని, మేము చేస్తున్నది కబ్జానే...ఏం చేసుకుంటారో చేసుకోపోండి.. అంటూ బెదిరిస్తున్నారని రెవెన్యూ అధికారులు సైతం వ్యక్తంచేశారు.

మిగులు భూమి అన్యాక్రాంతం...
ఆసిఫ్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని వార్డ్ నెంబర్ 21, బ్లాక్ నెంబర్ ఎన్‌లో టౌన్‌సర్వే రికార్డుల ప్రకారం 294/1/2, 297/1/2, 297/1/3, 298/2, నుంచి 12వ సర్వేనెంబర్ వరకు టౌన్‌సర్వే నెంబర్లలో 78ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నది. దీనిని 1995లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రికార్డుల్లో చేర్చారు. ఈ 78 ఎకరాల్లో అయోధ్యనగర్ హౌసింగ్ సొసైటీకి 16.29 ఎకరాలు, ముస్తఫాహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 6 ఎకరాలు, భోజగుట్ట రిజర్వాయర్‌కు రెండున్నర ఎకరాలు, గ్రేవ్‌యార్డులకు ప్రభుత్వం అధికారికంగా కేటాయించింది.

మరికొంత భూమి రోడ్డు విస్తరణలో పోగా, 9.32 ఎకరాలల్లో 1450 గుడిసెలు వెలిశాయి. దీంతో అధికారులు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. ఆదేశాలను పాటించని కొందరువ్యక్తులు 2.15ఎకరాల్లో 325 గుడిసెలు వేసుకున్నారు. కబ్జాలు పోను అక్కడక్కడ కొంత మిగులు భూమి ఉన్నది. ఏదేమైనా నగరం నడిబొడ్డున కబ్జాకు గురైన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆసిఫ్‌నగర్ మండలంలోని గుడిమల్కాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కొందరు కబ్జాదారులు ఫంక్షన్‌హాల్‌ను, బహుళ అంతస్తును నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలని కబ్జాదారులకు నోటీసులు జారీ చేసినా ఆపడం లేదు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివేదిక అందజేశాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది కచ్చితంగా ప్రభుత్వ భూమినే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి