-ప్రతాపరుద్రుని మరణం..
-కాకతీయ అంతం కాదు!
- దంతెవాడలో రాజ్యాన్ని స్థాపించిన అన్నమదేవుడు
- 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో సామ్రాజ్యం ఏర్పాటు
- ఆరువందల ఏండ్లపాటు 20 మంది రాజుల పాలన
- నేటికీ ప్రజా మద్దతు పొందుతున్న రాజు కమల్‌చంద్ర
- జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రతి ఏటా దసరా ఉత్సవాలు
చరిత్ర విస్మరించలేనిది! అణచివేయలేనిది! శతాబ్దాలుగా మట్టి కప్పేసినా.. వాస్తవాల మేఘాలు ఉరిమితే.. ఒక్క జోరువానతో మళ్లీ తళతళ మెరిసేది! ఈ కథనం చరిత్రలో ఒక పేజీలో నిక్షిప్తమై ఉన్న ఒక ధీర వారసత్వం మెరుపుల గురించి!! ఓరుగల్లు కేంద్రంగా తెలుగుజాతిని ఏలిన ఒక అపురూపమైన వంశం ఆనవాళ్ల గురించి! ప్రతాపరుద్రుడి మరణంతో అంతమైపోయిందని ఇన్నాళ్లూ మనకు చరిత్ర బోధిస్తూ వచ్చిన ఒక అసత్యాన్ని పటాపంచలు చేసే సత్యం గురించి! మనం చదువుకోని మన చరిత్ర ఇది! -కాకతీయ అంతం కాదు!
- దంతెవాడలో రాజ్యాన్ని స్థాపించిన అన్నమదేవుడు
- 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో సామ్రాజ్యం ఏర్పాటు
- ఆరువందల ఏండ్లపాటు 20 మంది రాజుల పాలన
- నేటికీ ప్రజా మద్దతు పొందుతున్న రాజు కమల్‌చంద్ర
- జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రతి ఏటా దసరా ఉత్సవాలు
ఓరుగల్లునుంచి వెళ్లిన కాకతీయ వంశస్తులు గోదావరికి ఎగువ భాగాన దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించారన్న వాస్తవాన్ని చాటే చరిత్ర ఇది! ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడితో మొదలైన కాకతీయ ద్వితీయ పరిపాలనా శకం.. చివరి రాజైన ప్రవీర్ చంద్రభాంజ్‌దేవ్ కాకతీయ వరకూ ఆరు శతాబ్దాలపాటు 20 మంది పాలకులను అందించిన సంగతి చరిత్ర పుటల్లో వెతికే ప్రయత్నమిది!! ఆ ప్రయత్నంలో రాణీరుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాణీ ప్రఫుల్లకుమారీదేవి పాలనా దక్షత గోచరిస్తుంది! గిరిజనులను ఏకం చేసి.. భారత సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రాణాలర్పించిన ప్రవీర్‌చంద్ర భాంజ్‌దేవ్ కాకతీయ సాహసం అచ్చెరువొందిస్తుంది! మనకు తెలియని మన చరిత్ర.. మనల్ని అబ్బురపరుస్తుంది!!
-జూలకంటి రాజేందర్‌రెడ్డి, నల్లగొండ, నూర శ్రీనివాస్, వరంగల్
అది 1323! ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉల్లుగ్ ఖాన్ చేతిలో ఓడిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు బందీగా వెళుతున్న సమయం! అంతర్గత..
బాహ్య శత్రుదాడులను ఎదుర్కొని, శత్రువును చీల్చి చెండాడిన వీరుల వంశం కుప్పకూలిపోయిందన్న వేదనకావచ్చు! ధీరుడు.. భీరువుగా మారలేని ఆత్మగౌరవం కావచ్చు! తన ప్రాణం కన్నా అభిమానమే ముఖ్యమని భావించి.. శత్రువుకు తన పార్థివ దేహమే మిగలాలనే మొండితనం కావచ్చు! ఫలితం.. ఆత్మహత్య! ఢిల్లీకి బందీగా వెళుతున్న ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయవంశం అంతరించిపోయిందన్న చరిత్రనే మనం చదువుకున్నాం. ప్రతాపరుద్రుని తర్వాత వీరభద్రుడు పాలించినట్లు చెబుతున్నా.. 1344లో ఉల్లుగ్ ఖాన్ (మహ్మద్ బిన్ తుగ్లక్) దాడితో కాకతీయ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమైందని.. 1422లో బహమనీ సుల్తానులు అధికారంలోకి వచ్చి ఓరుగల్లును తమ రాజ్యంలో కలుపుకొన్నారనే అంశమే చరిత్రలో కనిపిస్తుంటుంది. అనంతరం రెడ్డి రాజులు.. పద్మనాయకులు వంటి సామంత రాజుల ఏలుబడిలో కాకతీయ మహా సామ్రాజ్యం ముక్కలైందనే మనకు తెలుసు! అనంతర కుతుబ్‌షాహీల చరిత్ర.. తదుపరి నిజాం హయాం మాత్రమే మనం చదివాం. కానీ.. కాకతీయ వీరత్వం ఎక్కడికీ పోలేదు. ప్రతాపరుద్రుడి మరణం తదుపరి సంవత్సరమే కాకతీయ పరిపాలనా కౌశలం కొత్త చివుళ్లు పోసుకున్నది!
అది 1324! రాణి రుద్రమదేవి మనుమడు.. దత్తపుత్రుడిగా పట్టాభిషిక్తుడైన ప్రతాపరుద్రుని మరణానంతరం ఆయన సోదరుడు అన్నమదేవుడు బస్తర్ జిల్లాలో రెండవ కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. ఒక రాజ్యం పతనమై.. మరోచోట అవతరించి.. శతాబ్దాల తరబడి మనుగడ సాగించడం అరుదైన సందర్భం. ఆ అరుదైన ఘనత కాకతీయులకే దక్కింది. దట్టమైన అడవుల మధ్య, ఆదివాసీలు అధికంగా నివసించే చోట ఏర్పడిన ఈ సామ్రాజ్యం.. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేంత వరకూ కొనసాగింది. రాజ్యాలు గతించి.. రాచరికపు పాలన అంతరించినా.. నేటికీ బస్తర్ పాలకులు మహారాజ హోదాలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అన్నమదేవుడి (అన్నమ్‌దేవ్) వారసుల్లోని కమల్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ (అక్కడ అలా పిలుస్తారు) రాజ సింహాసనాన్ని అధిష్ఠించారు. తొలుత బస్తర్ అనే చిన్న గ్రామం ఈ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నా.. తదుపరి కాలంలో పాలనా కేంద్రాన్ని బడే డోంగర్‌కు.. అటు నుంచి జగదల్‌పూర్‌కు మార్చారు. ఇప్పుడు అక్కడ రాజ ఠీవి ఉట్టిపడే అద్భుత సౌధం ఒకటుంది. ఈ సౌధంలోనే మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయతోపాటు రాజమాత కృష్ణకుమారీదేవి, రాజకుమారి గాయత్రీదేవి కూడా ఉంటున్నారు.
బస్తర్ పాలకులు కాకతీయ వంశస్తులేనా?
ఎక్కడి ఓరుగల్లు.. ఎక్కడి బస్తర్? కాకతీయ రాజులకు పేరు చివర దేవుడు అని ఉంటుంది. మరి భంజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భంజ్ వంశస్తులు కాకతీయులేనా? అవును అనేందుకు అనేక ఆధారాలున్నాయి. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న రాజ్యాలు, సంస్థానాలపై ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో బస్తర్ రాజ్య వ్యవస్థాపకుడు అన్నమదేవ్ ఓరుగల్లు నుంచి వచ్చిన కాకతీయ రాజు అని స్పష్టంగా ఉన్నది. దీనితోపాటు రాజసౌధంలోని అనేక శాసనాల్లో కొన్ని తెలుగులోనూ ఉండటం గమనార్హం. నాటినుంచి నేటి వరకూ ఎందరో బస్తర్ రాజులు తమ పేరు చివర కాకతీయ అనే పదాన్ని రికార్డుల పరంగానూ కొనసాగిస్తూ వచ్చారు.
పలు న్యాయ వివాదాల్లో సైతం మధ్యప్రదేశ్ హైకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్లో కాకతీయ అనే పదం కనిపిస్తుంది. ఆచార్య ఎన్‌జీ రంగా రాసిన కాకతీయ నాయక్స్ అనే పుస్తకంలో కూడా కాకతీయ రెండో రాజ్యం బస్తర్‌లో తిరిగి మొదలైందనే ధ్రువీకరణ కనిపిస్తుంది. ప్రతాపరుద్రుడి మరణానంతరం బస్తర్, జయపూర్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిన అన్నమదేవుడు, ఆయన అనుచరులు అక్కడ చిత్రకూట్ రాజధానిగా బలమైన సామ్రాజాన్ని ఏర్పాటు చేశారని రంగా రాసిన పుస్తకంలో ఉన్నది. పవిత్రమైన పంపా నది నుంచి తమ రాజ్యానికి నీటి సరఫరాను ఏర్పాటు చేసుకున్నారని కాకతీయ నాయక్స్ పుస్తకం పేర్కొంటున్నది. తూర్పు కనుమల్లోని ఎత్తయిన పర్వతసానువుల మధ్య, దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఈ రాజ్యం ఉండటంతో బస్తర్‌ను బ్రిటిష్ పాలకులు జయించలేక పోయారు.
దాంతో బస్తర్ పాలకులకు పాక్షిక స్వయం ప్రతిపత్తితో రాజ్య హోదా కల్పించారు. ఆరు శతాబ్దాల పాటు బస్తర్‌లో కాకతీయుల సామ్రాజ్యం కొనసాగిందని ఆచార్య రంగా తన పుస్తకంలో ప్రస్తావించడం గమనార్హం. అక్కడ కొనసాగిన రాజులు తమది కాకతీయ వంశమేనని ప్రకటించుకున్నారని ఆయన తన పుస్తకంలో తెలిపారు. 1940 నాటికి బస్తర్ సామ్రాజ్యం 13,062 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. దక్షిణాన ఆంధ్ర, ఉత్తరాన ఒరిస్సా, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా బస్తర్ రాజ్యం విస్తరించింది. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలను బస్తర్ జోన్‌గా చెబుతారు.
దేవ్‌లు భంజ్‌దేవ్‌లు ఎందుకయ్యారు?
బస్తర్ పాలకుల్లో ప్రఫుల్లకుమారీదేవి తర్వాత పాలనాపగ్గాలు స్వీకరించినవారికి పేరు చివర భంజ్ అనే పదం ఎందుకు వచ్చిందనేది ఆసక్తికల్గించే అంశం. 1891-1921 మధ్య బస్తర్ రాజ్యాన్నేలిన ప్రతాపరుద్రదేవ్ (రుద్రప్రతాప్‌దేవ్)కు మగ సంతానం లేరు. దీనితో ఆయన తన కుమార్తె అయిన ప్రఫుల్లకుమారీదేవికి రాజ్యాధికారం అప్పగించారు. ఆమె ఒరిస్సాలోని మయూర్‌భంజ్ రాజైన ప్రఫుల్ చంద్ర భంజ్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో భర్త పేరులోని భంజ్ అనే పదం ఆ తర్వాతి కాలంలో బస్తర్ కాకతీయ రాజుల పేరు చివర చేరింది. మయూర్‌భంజ్‌లు చంద్రవంశస్తులు కావడంతో చంద్ర పదం కూడా తోడైంది. రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుడి పేరులోనూ దేవ అనే పదం లేకుండటాన్ని గమనించవచ్చు. రుద్రమదేవి కుమార్తె సంతానమే ప్రతాపరుద్రుడు కావడంతో ఆయనకు దేవ లేదా దేవుడు అనే పదం పేరు చివరలో చేరలేదు. సరిగ్గా బస్తర్ పాలకుల విషయంలోనూ అదే జరిగింది. ఆమె తర్వాత ఆమె వారసుడిగా ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ బస్తర్‌కు చివరి పాలకుడు అయ్యారు. ఆదివాసీల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన మహారాజుగా ఆయన నిలిచిపోయారు.
ఆదివాసుల ఆరాధ్యుడు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ
1947 వరకూ బస్తర్‌ను ఏలిన ప్రవీర్ చంద్రభంజ్ కాకతీయను 1966లో భారత ప్రభుత్వం కాల్చి చంపింది. బస్తర్ జిల్లాల్లో వలసవాదుల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా 1966లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. దీనికి ప్రవీర్‌చంద్రభంజ్‌దేవ్ స్వయంగా నేతృత్వం వహించారు. గిరిజనులను ఏకం చేసి.. పోరాడారు. కానీ.. ఆ తిరుగుబాటును భారత ప్రభుత్వం అణిచివేసింది. పోలీస్ చర్యలు చేపట్టినప్పుడు 1966 మార్చి 25న ఆయనను బంధించిన భారతప్రభుత్వం.. జగదల్‌పూర్ ప్యాలెస్ మెట్లపైనే ఆయనను కాల్చి చంపింది.
ఇదే తిరుగుబాటులో అనేక మంది ఆదివాసీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణానంతరం ఆయన సోదరుడు విజయ్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ, ఆ తర్వాత భరత్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ బస్తర్ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. అన్నమదేవుడి వంశంలో 23వ రాజు అయిన కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ ప్రస్తుతం మహారాజ హోదాలో ఉన్నారు. లండన్‌లో విద్యాభాస్యం చేసిన కమల్.. ప్యాలెస్‌లోనే ఉంటూ.. ఈ మధ్యే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. బస్తర్ వంశస్తుల ఆరు వందల ఏండ్ల పరిపాలనలో రాజధానిని నెలకొల్పిన ప్రతిచోటా బ్రహ్మాండమైన భవంతులు నిర్మించారు. వాటిలో కొన్ని శిథిలమైతే.. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు జగదల్‌పూర్‌లోని రాజప్రాసాదమే మిగిలి ఉంది.
దంతేశ్వరీదేవి వరప్రసాదం!
స్థలకాలాదుల్లో మార్పులు ఆచార వ్యవహారాల్లోనూ మార్పులకు కారణమవుతుంటాయి. అందుకే ఓరుగల్లులో కాకతీయ రాజులు శివారాధకులుగా ఉంటే బస్తర్‌లో రెండో కాకతీయ రాజ్య పాలకులు మాత్రం దంతేశ్వరీదేవిని ఆరాధించేవారు. అన్నమ్‌దేవ్ రాజ్యస్థాపన దంతేశ్వరీదేవి వరప్రసాదమని, అందుకే ఆ ప్రాంతానికి దంతేవాడ అనే పేరు వచ్చిందని ప్రతీతి. అక్కడ అన్నమ్‌దేవ్ నిర్మించిన దంతేశ్వరీదేవి ఆలయం ఇప్పటికీ కనిపిస్తుంది. అన్నమ్‌దేవ్ సామ్రాజ్య స్థాపన వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ప్రతాపరుద్రుడి మరణానంతరం బస్తర్ వెళ్లిన అన్నమదేవుడు తన ఆరాధ్యదైవమైన దంతేశ్వరికి నిత్యం పూజలు చేసేవాడట. ఆయన పూజలకు ప్రసన్నురాలైన దంతేశ్వరి.. అన్నమదేవుడికి ఒక వరాన్ని ప్రసాదించిందట. తనకు రాజ్యం కావాలని అన్నమదేవుడు కోరడంతో ఇక్కడి నుంచి తనకంటే ముందుగా నడస్తూ వెళ్లగలిగినంత దూరం వెళితే.. ఆ ప్రాంతమంతా ప్రసాదిస్తానని చెప్పిందట. ఎక్కడైతే అన్నమదేవుడు ఆగి.. వెనక్కు చూస్తాడోఅక్కడితో రాజ్యం సరిహద్దు అంతమవుతుందన్నమాట.
దంతేశ్వరిదేవి వరం ప్రకారం అన్నమదేవుడు నడుస్తూ పోయాడు. కొంతదూరం తర్వాత దంతేశ్వరి ఆగిపోయింది. కాలుకు ఉన్న పట్టీ జారిపోవడంతో దానిని తీసుకునేందుకు ఆమె అక్కడే నిలిచిందట. దాంతో ఏం జరిగిందోనని అన్నమదేవుడు వెనక్కి తిరిగి చూస్తాడు. దీంతో దేవి మాట ప్రకారం అక్కడి వరకూ అన్నమదేవుడికి రాజ్యంగా లభిస్తుంది. దంతేశ్వరిదేవి ఎక్కడైతే నిలిచిపోయిందో అదే బస్తర్ ప్రాంతంగా పేరుపడింది. ఆమె కోసం అన్నమదేవుడు అక్కడ ఒక ఆలయం నిర్మించాడు. ఇప్పటికీ ఆ ఆలయంలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మహారాజులు స్వయంగా దేవికి పూజలు నిర్వహించేవారు. ఆ సమయంలో పూజారులు కూడా అంతరాలయంలో ఉండేవారుకాదట.
ఇప్పటికీ ఘనంగా దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాలంటే మైసూర్ లేదంటే కలకత్తా నగరంలో జరిగే వేడుకలే గుర్తొస్తాయి. కానీ.. జగదల్‌పూర్‌లో బస్తర్ పాలకుల కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్న దసరా వేడుకలకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. ఆ మాటకొస్తే మైసూర్, కలకత్తాలను మించి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అది కూడా ఒకటి రెండు రోజులుకాదు.. ఏకంగా 75 రోజులపాటు! కాకపోతే.. అన్ని చోట్ల రావణాసురుడి వధకు గుర్తుగా దసరా నిర్వహిస్తే ఇక్కడ మాత్రం బస్తర్ రాజుల కులదైవమైన దంతేశ్వరిదేవి ఉత్సవాలుగా చేసుకుంటారు. దంతేవాడలోని దంతేశ్వరిదేవి ఆలయంలో మొదలయ్యే ఈ వేడుకలు 75 రోజుల తర్వాత ముగుస్తాయి. అందులో చివరి ఏడు రోజుల్లో రాజకుటుంబీకులు హాజరయ్యే సంబురాలకు మాత్రం జగదల్‌పూర్ వేదికగా ఉంటుంది. ఇక్కడి మహారాజా ప్యాలెస్‌లో ఈ వేడుకలు ముగుస్తాయి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది.
మైసూర్ దసరా ఉత్సవాలకు 400 ఏండ్ల చరిత్ర ఉంటే.. బస్తర్ వేడుకలకు మాత్రం ఆరువందల ఏండ్ల చరిత్ర ఉంది. బస్తర్ కాకతీయ రాజుల్లో నాలుగవ వాడైన పురుషోత్తందేవ్ ఈ ఉత్సవాలను మొదలు పెట్టినట్లు చరిత్ర చెబుతున్నది. దంతేవాడ నుంచి తరలి వచ్చే దంతేశ్వరిదేవి డోలీని మహారాజ పరివారం స్వీకరించే సన్నివేశం కన్నులపండువగా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో ఉపయోగించే రథాన్ని 14వ శతాబ్దంలో ఒడిశాలోని పూరీ రాజులు బస్తర్ మహారాజులకు కానుకగా ఇచ్చినట్లు చెప్తారు. దసరా ఉత్సవాల్లో దంతేశ్వరి పూజారిగా మహారాజే ఉండటం విశేషం. మహారాజును దైవాంశసంభూతునిగా భావించే ఇక్కడి ఆదివాసీలు, ఐదు జిల్లా ప్రజలు ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. పది రోజులు జగదల్‌పూర్‌లోనే గడుపుతారు. దసరా వేడుకల సమయంలో రాజదర్బార్ జనంతో సందడిగా ఉంటుంది. ప్రజలంతా రాజును దర్శించుకుంటారు. ఇక్కడి ఉత్సవాలకు ఇతర రాష్ర్టాల ప్రజలతోపాటు.. విదేశీయులు కూడా వస్తుంటారు. కానీ.. ఇంతటి ఘనమైన పండుగ బయటి ప్రపంచానికి ప్రచారం కాలేదు.
కాకతీయ సామ్రాజ్య పతనం
కాకతీయ సామ్రాజ్య వైభవం, అక్కడి అంతులేని సంపదలపై ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కన్నుపడింది. దీనిపై తొలి దాడి 1303లోనే జరిగింది. ఢిల్లీ సైన్యాలను కాకతీయ సేనలు ఉప్పరపల్లి వద్ద అడ్డుకున్నాయి. అక్కడ భీకర యుద్ధం జరిగింది. ఢిల్లీ సైన్యాలు తోకముడిచాయి. అయినా ఆశ చావని సుల్తాన్ 1309లో మరోసారి మాలిక్ కాఫర్ నేతృత్వంలో సేనలను పంపాడు. సిరిపూర్, హన్మకొండ కోటలను కాఫర్ జయించాడు. దీర్ఘకాలం యుద్ధం తర్వాత ఓరుగల్లు కోటను తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు.
పెద్ద ఎత్తున విధ్వంసానికి, దోపిడీకి, హత్యలకు తెగబడ్డాడు. ఆయనతో ప్రతాపరుద్రుడు ఒడంబడిక కుదుర్చుకుని పెద్ద మొత్తంలో కప్పం కట్టాడు. 1320లో ఢిల్లీ కోటలో అధికార మార్పిడి జరగడంతో ప్రతాపరుద్రుడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఆ సమయంలో ఖిల్జీ వంశం అంతమై.. ఘియాజుద్దీన్ తుగ్లక్ వంశం పాలన మొదలైంది. 1323లో తుగ్లక్ తన కుమారుడు ఉల్లుగ్ ఖాన్ అలియాస్ మహ్మద్ బిన్ తుగ్లక్‌ను మళ్లీ ఓరుగల్లు కోటపైకి పంపాడు. తుగ్లక్ సేనలను కూడా ప్రతాపరుద్రుడు తరిమికొట్టాడు. దీంతో నెల తర్వాత తుగ్లక్ మరింత భారీ సైన్యంతో దండెత్తాడు.
అప్పటికే పలు యుద్ధాలతో బలహీనపడిన కాకతీయ సైన్యం చివరకు పరాజయం పొందింది. ప్రతాపరుద్రుడు బందీగా చిక్కాడు. ఢిల్లీకి తరలించే సమయంలో నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడి మరణంతో సామంత పాలకుల హయాంలో గందరగోళం, అరాచకం ప్రబలాయి. ఆ తర్వాత కమ్మ రాజులు, ముసునూరి నాయకులు (గతంలో కాకతీయ రాజ్యంలో సైనిక పదవులు నిర్వహించినవారు) వివిధ తెలుగు ప్రాంతాలను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానుల నుంచి ఓరుగల్లును తిరిగి సంపాదించి దాదాపు యాబై ఏండ్లపాటు ఓరుగల్లు రాజ్యాన్ని ఏలారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణంలోనూ ఇక్కడి నుంచి వెళ్లినవారే కీలక పాత్ర పోషించారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
చరిత్రను తిరగరాయాలంటున్న చరిత్రకారులు
మూడు వందల ఏండ్లు పాలించిన కాకతీయులు ఒక్కసారిగా ఎలా కనుమరుగయ్యారు? వారి వారసులందరూ ప్రతాపరుద్రుడిలా బందీలయ్యారా? బందీలు కాకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లారా? వెళితే ఎక్కడున్నారు? అనే ఆసక్తికర అంశాలను ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కనీసం మాటమాత్రమైనా పరిశోధనలు చేయించని దుస్థితి నెలకొన్నది. మరోవైపు ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో కాకతీయుల వారసులున్నారనే ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే వాళ్లు కాకతీయుల వారసులేనా? కాదా? అన్న అంశాలపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని చరిత్రకారులంటున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలని సూచిస్తున్నారు.
కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితో ముగిసింది. ఆయన అనంతరం ఇక్కడి కాకతీయుల వారసులు మహమ్మదీయుల దండయాత్రలు, అరాచకాల వల్ల చెల్లాచెదురయ్యారు. కానీ, ప్రతాపరుద్రుడి తమ్ముడు అన్నమదేవుడు ఆ సమయంలో బస్తర్‌వైపు వెళ్లిపోయాడని కోయలు పుక్కిట పురాణంగా చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మల కథలో కాకతీయుల ప్రస్తావన ఉన్నట్టు కనిపిస్తుంది. అది మౌఖిక చరిత్రే. దానికి ఆధారాలను అన్వేషించాలి. దంతేవాడలో దంతేశ్వరీదేవి ఆలయం ఉన్నది. దాన్ని నిర్మించింది అన్నమదేవుడు అంటున్నారు. ఇక్కడ కాకతీయులు భద్రకాళీని పూజించినట్టే అక్కడ దంతేశ్వరినీ ఇప్పటికీ పూజిస్తున్నారు. కాకతీయుల సైన్యంలో లెంకల విధానం ఉంది. లెంకల సైన్యం ఒక రకంగా రాజుకు ఆత్మరక్షణకోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేక విభాగం. బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో లెంక ఇంటిపేర్లుగా ఉన్నవారు చాలా మందే ఉంటారు. దీన్నిబట్టి అన్నమదేవుడు ఒక తన రాజ్య రక్షణకు లెంకల విధానం ప్రవేశపెట్టి, ఆ సైన్యంలో పనిచేసే వారిని లెంకలుగా పిలిచి ఉంటారు.
అలా లెంకల్లో పనిచేసిన వారి పేర్లు, ఇంటిపేర్లు కాలక్రమంలో లెంకలు అని వచ్చి ఉంటాయేమో పరిశోధించాలి. ఛత్తీస్‌గఢ్‌లో కాకతీయులమని చెప్పుకునేది శుద్ధకాకతీయులా? లేదా అప్పుడున్న పరిస్థితుల్లో అన్నమదేవుడు ఆయన తరువాత రాజ్యానికి వచ్చినవారు కానీ, ఇక్కడి నుంచి వెళ్లిన వారు కావచ్చు, లేక సంకరమై ఉండవచ్చునేమో అన్నది అనుమానంగా తోస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్నవారు కాకతీయుల వారసులమని చెప్పుకుంటున్నారంటే వారి చారిత్రక ఆధారాలను పరిశోధిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు. మొత్తానికి వాళ్లు కాకతీయులు అసలే కాదు అని చెప్పడానికి, కొట్టిపారేయడానికి మాత్రం వీలులేదు.
- ప్రొఫెసర్ పోలవరపు హైమావతి, విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ
ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్నవారు కాకతీయులమని చెప్పుకుంటున్నారు. వారికి సంబంధించిన కనీస ఆధారాలైతే అందుబాటులో లేవు. గతంలో బస్తర్‌నుంచి కొన్ని కుటుంబాలు ఇక్కడికివచ్చి (ఖిలా వరంగల్‌కు) తాము కాకతీయుల వారసులమని చెప్పుకునేవారు. ఇప్పుడు వస్తున్నారో లేదో తెలియదు. వాళ్లు తాము కాకతీయులమని చెప్పుకునే నిర్ణయాధారిత ఆధారాలున్నట్టు లేదు. వాదనకు మన దగ్గర కానీ లేదా వారి దగ్గర కానీ స్పష్టమైన ఆధారాలున్నాయా? లేవా అన్నది ముందు చూడాలి. నిజానికి తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్(ఇప్పుడు ఛత్తీస్‌గఢ్), మహారాష్ట్రదాకా కాకతీయుల సామ్రాజ్యం ఉందనేందుకు ఆధారాలున్నాయి. ఇప్పటికీ మహారాష్ట్రలో ఓ ప్రాంతంలో కాకతీయ రాజవంశాలకు చెందిన నివాస గృహాలు ఉన్నాయంటున్నారు. అంతెందుకు.. ఇవ్వాళ మలేషియా మ్యూజియంలో కాకతీయుల మూలపురుషుడిగా చెప్తున్న కాకర్త్యగుండన విగ్రహం ఉంది. దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఇటీవల కాకతీయ ఉత్సవాలను ముష్టి కోటి రూపాయలు ఖర్చుచేసి నిర్వహించారు. మూడు నాలుగు రోజులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వాటితో ఎవరికి మేలు? ఎవరు కాకతీయుల గురించి తెలుసుకున్నారు? అంటే శూన్యం. అదే ప్రభుత్వం అక్కడ హంపి (విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగి 500 ఏళ్లు అయిన సందర్భంగా) ఉత్సవాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఇదే వివక్ష మొదటినుంచి అనుసరించారు. అదే వివక్షను చరిత్ర పరిశోధనలోనూ కొనసాగించారు. అందుకే ఇవ్వాళ కాకతీయుల చరిత్రేకాదు యావత్ తెలంగాణ చరిత్ర అంతా వాళ్లకు ఇష్టమొచ్చినట్టుగా రాసుకున్నారు. ఈ పద్ధతికి స్వస్తిపలకాలి. కొత్తగా శాస్త్రీయబద్ధంగా, హేతుబద్ధంగా చరిత్ర రచన జరగాల్సి ఉంది. ఇవ్వాళ విశ్వవిద్యాలయాల్లో ఆ చొరవ, చైతన్యం కొరవడింది.
- ప్రొఫెసర్ ఎనగందుల బొబ్బిలి, విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం, చరిత్ర శాఖ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి