గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 21, 2014

మళ్లీ ముంపు ముంగిట్లో..!

- అనాడు తరిమేసిన నాగార్జునసాగర్.. నేడు నక్కలగండి
- కాందిశీకులు కానున్న తెల్దేవర్‌పల్లి గ్రామస్తులు
- అప్పటివాళ్లలో నేటికీ ఎవరికీ అందని భూములు
- ఇప్పుడు మునగనున్న భూములకు నష్టపరిహారం పంపిణీ
ఉన్న ఊరు కన్నతల్లితో సమానం. ఒక్కసారిగా పుట్టిపెరిగిన ఊరు మాయమవుతున్నదంటే తట్టుకోవడం కష్టం. బాధలన్నీ దిగ మింగి మరోప్రాంతంలో ఒక తరమంతా శ్రమించి కుదురుకోగానే మరో ఉపద్రవం వచ్చిపడి మళ్లీ ఊరొదిలిపోవాలంటే.. గుండె ఆగుతుంది! ప్రస్తుతం నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్‌పల్లివాసులు అదే భయంతో వణికిపోతున్నారు.


mumpuసుమారు అరవై ఏండ్ల కిందట అతిపెద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే అనేక పల్లెలను ఖాళీచేయించారు. ఎక్కడో దూరాన గుట్టల్లో నివాసాన్ని చూపించారు. అదే కొండవాలు భూములు పరిహారంగా ఇచ్చారు. రాళ్లూ, రప్పల్లో ఏండ్ల తరబడి శ్రమించి ఇప్పుడిప్పుడే వాటిని ఓ రూపానికి తెచ్చుకున్నారు.

పునరావాసకేంద్రంగా చెప్పడమే తప్ప, ఎన్నడూ సౌకర్యాల కల్పన గురించి పట్టించుకున్న పాలకులెవరూ పోలేదు. అష్టకష్టాలు పడుతూ ఒక్కొక్కటిగా అన్నీ ఒన గూర్చుకున్న అక్కడివాళ్లకు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త. తాజాగా నిర్మిస్తున్న నక్కలగండి జలాశయం మరోసారి తమ ఊరిని ముంపుజాబితాలో చేరుస్తుందన్నదే భయం. ఒకనాడు పుట్టి పెరిగిన పల్లెను వదులుకున్న తమకు మళ్లీ అదే దుస్థితి తప్పదా అనే ఆందోళనతో గ్రామస్తులు వణికిపోతున్నారు.

ఎదురుగా జలాశయం.. కింది నుంచి టన్నెల్
నాగార్జునసాగర్ నిర్మాణంలో భాగంగా మునిగిపోయిన ఏలేశ్వరం, రాయవరం, నిడిగల్లు గ్రామాల్లోని వందలాది మంది వచ్చి చందంపేట మండలంలోని తెల్దేవర్‌పల్లిలో నివసిస్తున్నారు. గ్రామంలో సుమారు 380 కుటుంబాలతో 1200 జనాభా ఉన్నది.

అరవై ఏండ్ల క్రితం నిర్వాసితులకు ఆవాసకేంద్రంగా ప్రభుత్వం దీన్ని చూపింది. గ్రామనిర్మాణం కోసం 53 ఎకరాలు, ముంపు బాధితులకు 1375 ఎకరాలు కేటాయించారు. చాలా మందికి కృష్ణానది అవతలి వైపున గుంటూరు జిల్లాలో భూములు కేటాయించినా అక్కడికి వెళ్లలేదు. అలాంటివాళ్లకు ఈ ఊరిలో ఒక్క ఎకరమూ ఇచ్చింది లేదు.

మిగతావాళ్లకు భూములు ఇచ్చినా అన్నీ రాళ్లూ రప్పలతో కూడుకున్నవే. ఇంతకాలం శ్రమించి వాటిని ఓ రూపునకు తెచ్చుకుని వ్యవసాయం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే గ్రామంలో ఒక్కొక్కటిగా సౌకర్యాలూ సమకూరుతున్నాయి. ఆశ్రమ పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, పశు వైద్యశాల, రెండు ఆలయాలు, సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. తాగునీటికి అవస్థలున్నా, సాగునీరు అందకపోయినా నానా తంటాలుపడుతూ ఎలాగోలా బతుకు వెళ్లదీస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన దేవరకొండకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరిని.. పక్కనే పురుడు పోసుకుంటున్న నక్కలగండి రిజర్వాయర్ మరోసారి భయకంపితులను చేస్తున్నది. తెల్దేవర్‌పల్లికి ముందు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ భారీ జలాశయం నిర్మించనున్నారు.

అక్కడి నుంచి నీటిని ఈ పల్లె ముందు నుంచే సొరంగం ద్వారా నేరేడుగొమ్ముకు తీసుకెళ్లనున్నారు. తెల్దేవర్‌పల్లి కిందుగా ఇప్పటికే సొరంగం తవ్వకం పూర్తయింది. గ్రామంలోని భూములు కూడా టన్నెల్‌లోకి వెళ్లే ప్రాంతంలో చాలా వరకు ముంపునకు గురికానున్నాయి. వీటిల్లో చాలా వాటికి ఇప్పటికే ఎకరాకు 1,80,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించారు. రిజర్వాయర్ కొద్ది దూరంలోనే ఉండడం, కిందినుంచి టన్నెల్ వెళ్తుండడంతో మరోసారి తరలిపోవడం తప్పదేమోననే ఆందోళన ఇక్కడి వారిలో వ్యక్తమవుతున్నది. నక్కలగండి కోసం ముంపు ప్రాంతంగా ఈ గ్రామాన్ని గుర్తించనప్పటికీ జాలు నీళ్లు, దోమకాటు వంటి సమస్యలతో ఇక్కడ బతకడం మాత్రం అసాధ్యమే. అలాంటి సమస్యరాకుండా చూడాలని, మరోసారి ఊరు ఖాళీ చేసే పరిస్థితి కల్పించవద్దన్నదే అక్కడి వాళ్ల ఆవేదన.

నా భూమి మునిగిపోయింది :మారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్దేవర్‌పల్లి
మా నాన్న పూర్వం ఏలేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఐదెకరాలు ఇచ్చిర్రు. నక్కలగండి టన్నెల్ మా ఊరు ముందు నుంచే పోతాంది. నా భూమి మొత్తం దాంట్లో పోయింది. ఎకరానికి లక్షా ఎనభై వేలు ఇచ్చిర్రు. చాలా మంది భూములు పోతున్నయ్. ఊరు మునుగుదంటున్నరు. అధికారులు తేటగ చెప్తలేరు. మారుమూల పల్లె అయిన మాకు ఇప్పుడిప్పుడే అన్నీ వచ్చినయ్. మళ్లీ పొమ్మంటె మేం బతకలేం. మా ఊరోళ్లు దీని గురించే భయపడుతుర్రు. గప్పుడు మంత్రులు వస్తే కలిసినం. మళ్ల గూడ కలిసి మా బాధలు చెప్తం.

మళ్లా ఏ దేశం బోవాలి:వాంక్నావత్ కేళి, తెల్దేవర్‌పల్లి
మాది అప్పుడు నిడిగల్లు. నాకు బానే గుర్తుండె. మాకు గుంటూరు జిల్లాల భూమిస్తమన్నరు. మా వోళ్లందర్ని వదిలిబోలేక ఇక్కడికే వచ్చినం. భూమి ఏం ఇయ్యలే. మా వోళ్లు కష్టం జేసి అంతో ఇంతో కొన్నరు. ఇప్పుడు ఈ ఊరు మునుగుదంటున్నరు. మళ్లా మా భూములు, ఇండ్లు పోతే ఏ దేశం బోవాలి. మాకింకేం పనిలేదా? ఊకె పోతనే ఉండాల్నా? గవర్‌మెంటోళ్లకు మేమే దొరికినమా? నక్కలగండి ఇంకో కాడగట్టాలె. మేమైతే ఖాళీ జెయ్యం. గీళ్లిచ్చే నష్టపరిహారంతోని ఎక్కడా మంచి భూములు రావు. మేము యాడికీ బోం. ఈడనే ఉంటం.

మళ్లా పొవుడా.. మేంపోనేపోం :నున్సావత్ లక్ష్మ, తెల్దేవర్‌పల్లి
మేము సూర్యారావుపేట పక్కన రాయవరంల ఉండేటోళ్లం. సాగర్ కట్ట పడ్డప్పుడు పనికిపోయిన. రోజుకు రెండు రూపాల కూలీ ఇచ్చేటోళ్లు. నందికొండ కాడ పనిగాంగనే నీళ్లొస్తయ్ ఊరు ఖాళీ జేయమని నోటీసిచ్చిండ్రు. ఈ గుట్టల పక్కన ఖాళీ ఉందని తీసుకొచ్చి జూపిండ్రు. రాళ్లో, రప్పలో ఇంత భూమి ఇచ్చిండ్రు. మా వూళ్ల గూడ గిప్పుడిప్పుడే అన్నీ అయితున్నయ్. ఇగజూస్తే మళ్లా నక్కలగండి అంటున్నరు. గిట్లయితే ఎట్ల మీరైన జెప్పుర్రి? ఈడ కూడ పొందికయినం. మళ్లా పొమ్మంటె కష్టమయి్తదకద. మేం బోనే పోం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి