గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 07, 2014

హైకోర్టు తీర్పును తప్పుదోవ పట్టించారు!

-అక్రమ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు ఉద్యోగి సూత్రధారి
-జస్టిస్ రవిశంకర్ ప్రతినిధినంటూ వ్యవహారం
-అమలులో లేని ఆదేశాలు చూపించి రిజిస్ట్రేషన్లు
-సబ్ రిజిస్ట్రార్ లేఖతో వెలుగులోకి
-హఫీజ్‌పేట సర్వే నంబర్ 77 కబ్జాలో కొత్త కోణం
సింగిల్ బెంచ్ తీర్పు చెల్లుబాటు కాదని డబుల్ బెంచ్ స్పస్టం చేసిన తర్వాత కింది పాత తీర్పుకు ఎలాంటి విలువ ఉండదు! డబుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయి! కానీ.. మాయగాళ్లకు మాత్రం అదో అడ్డంకి కానేకాదు! డివిజన్ బెంచ్ తీర్పు అమల్లో ఉండగానే.. సింగిల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాన్నే తప్పుదోవ పట్టించాడో ఘనుడు! పైగా.. తాను హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ప్రతినిధిగా వచ్చానని చెప్పుకొని సబ్ రిజిస్ట్రార్‌నే మోసంచేశాడు! ఎంచక్కా ఆరు రిజిస్ట్రేషన్లు చేసుకుని వెళ్లిపోయాడు!
scanజరిగిన పొరపాటును గుర్తించిన సదరు రిజిస్ట్రార్ ప్రత్యేక లేఖ ద్వారా ఈ విషయాన్ని హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌కు దృష్టికి తీసుకురావడంతో దీంతో హైకోర్టు పరిపాలనా కార్యాలయం అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది! హైకోర్టు కోర్టు చరిత్రలో ఇప్పటివరకు ఇలా వివరణ కోరిన దాఖలు లేవని న్యాయనిపుణులు అంటున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టుకు వెళతారు. ప్రజలకు అంతో ఇంతో ఇప్పటికీ న్యాయవ్యవస్థపైనే నమ్మకమున్నది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా జరిగిన ఈ ఘటన వివరాల్లో వెళితే..

శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 77లోని భూమిలో కబ్జాదారులు అనేక వివాదాలు సృష్టించారు. ఈ భూమిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావించి ఖలీల్, ఖాసీమ్‌అలీఖాన్, అంజుం అరాలు హైకోర్టు సింగిల్ బెంచ్‌కు వెళ్లి తమకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అప్పీల్ నంబర్ 566/2013 పిటిషన్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ధర్మాసనం 2013 జూలై15న సర్వే నంబర్ 77లో దరఖాస్తుదారులకు భూమిని జీరో విలువ కింద రిజిస్ట్రేషన్ చేయాలని డిక్రీ ఇచ్చింది. దీంతో తమ భూమి తమకు కాకుండా పోతుందని భావించిన ప్రతివాదులు 946మంది డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు.

అప్పీల్ నంబర్1204/2013 కింద డివిజన్ బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత సింగిల్ బెంచ్ ఇచ్చిన డిగ్రీ చెల్లుబాటు కాదని 2013 డిసెంబర్18న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు కోర్టు ప్రాసెస్‌ను దుర్వినియోగం చేసి కింది కోర్టులో డిగ్రీ తీసుకున్నారు. ఈ సీపీసీ చెల్లుబాటుకాదు అని స్పష్టం చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు నేటికీ అమలులో ఉన్నాయి. ఈ ఉత్తర్వులు అమలులో ఉండగానే హైకోర్టు ప్రతినిధిగా సాయిబాబా అనే వ్యక్తి 2014 మార్చి17 నుంచి 20వ తేదీ వరకు ఆరు రిజిస్ట్రేషన్లు చేశారు. సింగిల్‌బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చిన తరువాత సింగిల్‌బెంచ్ ఉత్తర్వులు చెల్లుబాటు కావు. ఎప్పుడైనా పైకోర్టు ఉత్తర్వులే చెల్లుబాటు అవుతాయి.

పై కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా.. ఏకంగా కోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రవిశంకర్ ప్రతినిధినంటూ సాయిబాబా అనే కోర్టు ఉద్యోగి గండిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఏ విధంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించాన్నది అంతు పట్టని ప్రశ్న. సహజంగా ఏ అధికారి అయినా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలంటే భయపడతారు. ఎవరైనా, ఎంతటి పెద్దవారైనా, ఎవరి ఆదేశాలూ అమలు చేయకపోయినా.. కోర్టు ఆదేశాలను మాత్రం తు.చ. తప్పకుండా అమ లు చేస్తారు. కోర్టు ఉత్తర్వులను భారతీయ సమాజం అంత పవిత్రంగా చూస్తుంది.

అలాంటి కోర్టు ఉత్వరులకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఒక కోర్టు ఉద్యోగి అనుసరించిన తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా భూముల ఆక్రమణలు ఆగకపోతే తమను రక్షించేవారెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబా ఇలా రిజిస్ట్రేషన్లు చేయడంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వుల విషయం తెలుసుకున్న గండిపేట జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తన చేత ఎందుకు సర్వే నంబర్ 77లో రిజిస్ట్రేషన్లు చేయించారని ప్రశ్నిస్తూ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్‌ఎల్‌ఎన్ చార్యులుకు ఈ ఏడాది జూలై 21న ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు అధికారులు ఇప్పటి వరకు కనీస వివరణ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి