గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 11, 2014

నువ్వెక్కడికి.. నేనెక్కడికి...?!

- బదిలీలు, పోస్టింగులపై ఐపీఎస్‌లలో చర్చ
- మరో వారంలో ప్రక్రియ పూర్తి

రెండు రాష్ట్రాలకు ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో ఐపీఎస్‌లలో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. సమాజానికి పరిచయం లేని పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్‌ల నుంచి జిల్లా ఎస్పీల వరకు బదిలీలపై తీవ్ర చర్చ సాగుతున్నది. ఎవరెవరు ఎక్కడికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరు ఏ జిల్లాకు ఎస్పీగా వెళ్తున్నారు? ఎవరు ఏ విభాగానికి బాధ్యులుగా నియమితులుకాబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 
police-capఈ నెల 15 తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయనున్న నేపథ్యంలో పోలీస్ అధికారులంతా బదిలీలపై దృష్టి సారించారు. గత నెల ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించిన అధికారుల లిస్ట్‌లో చాలామంది పోస్టింగ్‌లకోసం ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈ లిస్ట్‌లో ముగ్గురు ఎస్పీలు, ముగ్గురు డీఐజీలు బదిలీ కాబోతున్నారని తెలిసింది. నగరంలో పనిచేస్తున్న డీసీపీలు, జాయింట్ సీపీలు, అడిషనల్ సీపీ మొత్తం మారబోతున్నారని డీజీపీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరానికి వచ్చి ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లు కొందరు ఏసీబీ, సీఐడీ, రేంజ్ డీఐజీ, జోనల్ ఐజీలుగా రాష్ట్ర స్థాయి పోస్టింగ్‌లు కావాలని ఎవరికి వారు డీజీపీ అనురాగ్‌శర్మకు వినతులు సమర్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల ఆగ్రహానికి గురయిన అధికారులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. హడావుడి ఉండని ఫైర్, జైళ్ల శాఖకు వెళ్లేందుకు ముగ్గురు ఐజీలు, ఇద్దరు అడిషనల్ డీజీలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. సాఫీగా సాగిపోయే ఈ విభాగాలకు బదిలీచేయాలని రిటైర్మెంట్‌కు దగ్గరల్లోని అధికారులు డీజీపీని కలుస్తున్నారు. 

ప్రాముఖ్యంలేని పోస్టుల్లోకి..

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన సీనియర్ ఐపీఎస్‌లకు ప్రాధాన్యంలేని పోస్టులే దక్కబోతున్నాయని సమాచారం. ఉద్యమం జరిగినన్ని రోజులు విషంకక్కి, ఇప్పుడు పోస్టింగ్స్‌కోసం డబ్బాలు కొడుతున్నారని ఇక్కడి ఐపీఎస్‌లలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ లిస్ట్‌లో ఉన్న నలుగురు ఐపీఎస్‌లకు ప్రాముఖ్యం లేని పోస్టింగ్స్ ఇవ్వాలని ముక్తకంఠంతో డీజీపీ ఎదుట డిమాండ్ పెట్టినట్టు తెలిసింది. అలాంటి వారిని రోడ్ సేఫ్టీ అథారిటీ, తూనికలు-కొలతలు, కంప్యూటర్ సెల్, టెక్నికల్ సర్వీస్‌లాంటి విభాగాలకు పంపాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నామని వారు టీ మీడియాకు తెలిపారు. 

డిప్యూటేషన్‌లోకి ఆ ఇద్దరు....

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసులలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు డిప్యూటేషన్ పూర్తి చేసుకొని, ఆ తర్వాతే రాష్ట్రానికి రావాలని ఒక అధికారి భావిస్తుంటే, మూడేళ్లు సర్వీస్ ఉన్న మరో అధికారి కేంద్ర సర్వీసులో ఉండగానే రిటైర్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది.

వారం పట్టే అవకాశం...

ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 15న తుది సమావేశం నిర్వహించబోతున్నది. భార్యభర్తల అంశాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తదుపరి రోజే గెజిట్ రిలీవింగ్ నోటిఫికేషన్ వస్తుందని, అప్పటికి మెదక్ లోక్‌సభ, నందిగామ ఉప ఎన్నిక ముగుస్తుందని చెప్తున్నారు. ఆ లిస్ట్ వచ్చేటప్పటికే పోస్టింగ్స్ కసరత్తు పూర్తవుతుందని కొందరు ఐపీఎస్‌లు టీ మీడియాకు తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి