గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

కోర్టు కేసుల్లోని భూములు గెలిస్తేవజ్రాల తెలంగాణే!

-వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్లు
-కోర్టుల్లో కేసులు నడుపుతున్న అక్రమార్కులు
-న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు
-సంక్షేమం కోసం రూ. 100 కోట్లు విడుదల చేస్తాం
-సిటీ సివిల్ కోర్టు 150 ఏండ్ల వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

కోర్టు కేసుల్లో నలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్లకు పైమాటేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆ కేసుల్లో ప్రభుత్వం విజయం సాధిస్తే ‘బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ సాధించగలుగుతామ’ని ఆయన అన్నారు. కబ్జాలు, నకిలీపత్రాలు, అన్యాక్రాంతాలతో ప్రభుత్వ భూముల్లో తిష్ఠవేసిన అక్రమార్కులు కోర్టుల్లో కేసులు నడుపుతున్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శతాబ్దిన్నర వేడుకల్లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి దక్కేందుకు సహకరించాలని తెలంగాణ న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర శ్లాఘనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ పోరాటంలో న్యాయవాదుల త్యాగాలను విస్మరించలేమన్నారు. గోపిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి తదితర న్యాయవాదులపై కొంతమంది భౌతికంగా దాడులకు పాల్పడిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా న్యాయవాదులు పార్లమెంట్ గేట్లు ఎక్కి తెలంగాణవాదాన్ని వినిపించారని ప్రశంసించారు. 

స్వతంత్ర న్యాయవ్యవస్థ నిజాం ఘనతే..
ప్రపంచంలో న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిన రాజు నిజాం రాజేనని కేసీఆర్ అన్నారు. నిరంకుశత్వానికి చిహ్నమైన రాజరికానికి వారసుడై ఉండి కూడా, న్యాయ విభాగానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారని, తానుకూడా న్యాయస్థానాలకు బద్ధుడినేనని ప్రకటించారని చెప్పారు. చరిత్రను చాలా వక్రీకరించారని, ప్రస్తుతం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకొంటున్న సిటీ సివిల్ కోర్టు ఆయన కాలంలోనే ఏర్పాటైందన్నారు.1863లో సిటీ సివిల్ కోర్టు, 1875లో హైకోర్టును ఏర్పాటు చేశారని వివరించారు. ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణాన్ని 1900వ సంవత్సరంలో ప్రారంభించి 1919లో పూర్తిచేశారన్నారు. ఈ విషయాలను పక్కదారి పట్టించి కొంతమంది పొద్దున లేచినకాడినుంచి హైదరాబాద్‌ను మేమే నిర్మించామని గొప్పలు చెప్తుంటారని ఎద్దేవా చేశారు. 


చరిత్రను తాను వివరిస్తుంటే కొంతమందికి బాధ కలుగుతుందని కేసీఆర్ అన్నారు. నిజాం కాలంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండేదనడానికి నిదర్శనం తమ కుటుంబ స్వానుభవమేనని ఆయన చెప్పారు. కరీంనగర్‌లోని తన పూర్వీకుల స్థలాన్ని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ కాలంలో రూ. లక్షా నలభై వేల రూపాయల పరిహారం ఇచ్చిందన్నారు. అయితే నష్టపరిహారం విషయంలో తన తండ్రి అప్పటి హైకోర్టులో న్యాయవాది మహ్మద్ బారీ ద్వారా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. విచారణ చేపట్టిన హైకోర్టు మరో రూ 70 వేలను అదనంగా ఇవ్వాలని తీర్పును ఇవ్వడంతో నిజాం ప్రభుత్వం శిరసావహించి తక్షణమే నిధులను విడుదల చేసిందని తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టులో తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 55 సంవత్సరాల వరకు కూడా అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు దక్కనే లేదన్నారు. తెలంగాణలో భూమిని తల్లిగా భావించే సంస్కృతి ఉండేదని, బయటి వ్యక్తులు ప్రవేశించి చదరపు గజాలు, అడుగుల చొప్పున భూమికి రేట్లను పెంచారన్నారు. ప్రైమ్ ల్యాండ్ భూమి ధరలను పెంచడంతో భూమాఫియా సైతం పెరిగిందన్నారు. తన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈఎన్‌టీ ఆసుపత్రి స్థలానికి సైతం నకిలీ పత్రాలు స్పష్టించి కోర్టుల ద్వారా భూములను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై వాకబు చేయగా అడ్వకేట్ జనరల్‌ను ఈ కేసులో వాదించవద్దని ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టు తెలిసిందన్నారు. నిజాం హయాం నుంచి కోటి ఎకరాల ప్రభుత్వ భూమి, మరో కోటి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి అందుబాటులో ఉండేదన్నారు. గత ప్రభుత్వాల అన్యాక్రాంతాలు, కబ్జాలతో భూములు హరించుకు పోయాయని, కోర్టు లిటిగేషన్‌తో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా గుట్టలు, రాళ్లతో కూడిన 30 లక్షల ఎకరాల భూమి ఎటువంటి చిక్కులు లేకుండా అందుబాటులో ఉందని తెలిపారు. 


నూటికి 65శాతం నకిలీ సర్టిఫికెట్లు హైదరాబాద్‌వే..
రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ధోరణులు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దొరుకుతున్న 100 నకిలీ సర్టిఫికెట్లలో 65 శాతం నగరం నుంచే వస్తున్నాయన్నారు. ఇలాంటివి అరికట్టే కఠిన చట్టాలు రూపొందించవలిసి ఉందని, దీనికి న్యాయవాదులు తమవంతు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రానికి ఆవసరమైన కొత్త చట్టాలపై న్యాయవాదులతో, న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవినీతి, వేధింపులకు తావులేని విధానాలను ప్రభుత్వం తీసుకువస్తుందని కేసీఆర్ చెప్పారు. 

న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు..
నగరంలోని వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న అర్హులైన న్యాయవాదులకు గృహవసతి కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎటువంటి ఆస్తులు, ఆధారం లేని న్యాయవాదులను న్యాయవాదుల కమిటీ లేదా హౌజింగ్ కమిటీ ఆధ్వర్యంలో గుర్తించాలని కేసీఆర్ సూచించారు. నగరానికి దూర ప్రాంతంలో కాకుండా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనువుగా లేదా హౌసింగ్ సోసైటీ రూపంలో భూమిని కేటాయిస్తామని, న్యాయవాదులతోపాటు కోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 


న్యాయవాదులకు హెల్త్‌కార్డుల విధివిధానాలపై కమిటీ వేస్తామని, న్యాయవాదుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ 100 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుకు , సిటీ సివిల్ కోర్టులో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఆదివారమే ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటించారు. నగరంలో కోర్టుకు ఒక్కరి చొప్పున ఉత్తమ న్యాయవాదిని ఎంపిక చేసి రూ లక్ష నగదును బహుమతిగా ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో గట్టిగా చెప్పినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులను చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో లేదా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ స్థలానికి తరలించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని దీనిపై త్వరలోని నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 

మహామహులు పనిచేసిన చరిత్ర..
సీటీ సివిల్ కోర్టుకు ఘనమైన చరిత్ర ఉందని కేసీఆర్ ఆన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన ఈ కోర్టులో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగా రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నేతలు ప్రాక్టీస్ చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. కార్యక్షికమానికి విచ్చేసిన సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డిని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. న్యాయవాదుల సమస్యలపై తన్నీరు శ్రీరంగారావు, గోవర్ధన్ రెడ్డి, ఇతర న్యాయవాదులు తన దృష్టికి తీసుకవచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, సిటీ సివిల్ కోర్టు రెండో అదనపు చీఫ్ జడ్జి వై అరవింద్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జగత్‌పాల్‌రెడ్డి, కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కోర్టు ప్రాంగణానికి సమీపంలో ఉన్న మసీదు నుండి ఆజా వినపడడంతో సీఎం తన ప్రసంగాన్ని నిలిపివేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆజా పూర్తైన తర్వాత కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆజా(ప్రార్థనకు పిలుపు)వచ్చినప్పుడు పాటించాల్సిన నియామాలు ఈ సందర్భంగా సభికులకు వివరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి