-బోనావేకెన్సియా స్థలంలో భారీ భవనం
-రూ.30 కోట్ల భూమి కబ్జాదారుల పాలు
-లింక్ డాక్యుమెంట్ లేకుండా 15 రిజిస్ట్రేషన్లు
-టైటిల్ డీడ్ లేకున్నా జీహెచ్‌ఎంసీ పర్మిషన్
ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున సర్కారు భూమి కబ్జాదారుల ఖాతాకు చేరిన వైనమిది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు సైతం అమలుకు నోచని బాగోతమిది. కిందిస్థాయి అధికారులు ఎంత తాపత్రయపడ్డా పైస్థాయిలో కుమ్ముక్కు వ్యవహారంతో పట్టపగలు నడిబజార్లో రూ. 30 కోట్ల విలువైన భూమిలో బహుళ అంతస్తుల భవనం వెలిసిన కథ ఇది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు... రాజధాని నడిబొడ్డు కాచిగూడ చౌరస్తాలో ఈ అక్రమ బాగోతం చోటు చేసుకుంది.-రూ.30 కోట్ల భూమి కబ్జాదారుల పాలు
-లింక్ డాక్యుమెంట్ లేకుండా 15 రిజిస్ట్రేషన్లు
-టైటిల్ డీడ్ లేకున్నా జీహెచ్‌ఎంసీ పర్మిషన్
ఇదీ కథ..: కాచిగూడ రైల్వేస్టేషన్ దారిలో దాదాపు 30 కోట్ల విలువ చేసే 2554 గజాల బోనావేకెన్సియా భూమి ఉన్నది. కాచిగూడలోని లింగంపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన 190 వార్డులోని జే బ్లాక్‌లోని టౌన్‌సర్వేనెంబర్ 29లో గల ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమిత్రాబాయ్ అనే మహిళది. అందులో ఒక పాత ఇల్లు ఉంది. ఆమె మరణానంతరం ఈ ఆస్తికి వారసులెవరూ లేకుండా పోయారు. 1974లో వారసులు లేని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ఏపీ బోనావేకెన్సియా చట్టాన్ని తీసుకువచ్చింది. 1976 నాటికి కూడా ఈ భూమిని ఎవ్వరూ క్లెయిమ్ చేయకపోవడంతో ప్రభుత్వం ఈ ఆస్తిని బోనావేకెన్సియా భూమికింద ప్రకటించి స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు రికార్డుల్లో కూడా వివరాలు నమోదు చేశారు. ఈ చట్టం కింద ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ నిజమైన వారసులు ఎవరైనా వచ్చి వారసత్వాన్ని రుజువు చేసుకుంటే స్వాధీనం చేసుకున్న ఆస్తిని వారికి తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉంది. అయితే సుమిత్రాబాయ్‌కి వారసులు ఎవరూ లేకపోవడంతో ఈ భూమి తమదంటూ ఎవరూ రాలేదు. 1976 నుంచి 1982 వరకు ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, లావాదేవీలు కానీ జరుగలేదు. ఈ భూమిలో ఉన్న పాత ఇల్లు కూడా శిధిలావస్థకు చేరింది. అయినా స్వాధీనం చేసుకున్న ఈ భూమిని ప్రజాఉపయోగ కార్యక్రమాలకు వినియోగించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు.
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు
సర్కారు ఈ భూమిని నిరుపయోగంగా వదిలివేయడాన్ని అవకాశంగా తీసుకున్న కొంత మంది కబ్జాదారులు ఈ భూమిపై అనేక డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. అసలు భూమి యజమాని లేకుండా, భూమి హక్కుదారులు విక్రయించకుండా రిజిస్ట్రేషన్ అధికారులు భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది పెద్ద మిస్టరీ. ఒక భూమిని ఎవరైనా మరొకరికి రిజిస్టర్ చేయాలంటే టైటిల్ డీడ్‌ను ధ్రువీకరించే లింక్ డాక్యుమెంట్ ఉండాలి. కానీ ఈ భూమికి లింక్ డాక్యుమెంట్ లేదు. అయినా రిజిస్ట్రేషన్‌లు చకచకా జరిగిపోయాయి. ఎలాగూ వారసులు లేరు కాబట్టి ఎవరూ అడగబోరనే ధీమా ఇటు కబ్జాదారులకు అటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులకు ఉండి ఉంటుంది. మొత్తానికి 1982 నుంచి వరుసపెట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. గుండిమల్లమ్మ అనే మహిళ 1982లో జయలక్ష్మికి విక్రయించినట్లు మొదటి రిజిస్ట్రేషన్ నమోదైంది. కానీ ఈ భూమితో గుండిమల్లమ్మకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తికి యజమాని అయిన సుమిత్రాబాయ్‌కి ఈమెకు సంబంధం లేదు.
ఆమె మల్లమ్మకు విక్రయించినట్టు డాక్యుమెంటు కూడా లేదు. అయినా రిజిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. తిరిగి 1984 అక్టోబర్ 15వ తేదీన 1982 డాక్యుమెంటుతో ఎలాంటి సంబంధం లేకుండా డీ నర్సింగ్‌రావు అనే వ్యక్తి ఈభూమిని డీ కమలమ్మ, ఎం శ్రీధర్ అనే వ్యక్తులకు విక్రయించారు. మరి జయలక్ష్మి ఏమైపోయిందో తెలియదు. ఆ తర్వాత కేవలం 22 రోజుల తేడాతో1984 నవంబర్7వ తేదీన ఇదే భూమిని సయ్యద్ హిదాయత్ మొయినుద్దీన్ అనే వ్యక్తి ఎలాంటి టైటిల్ డీడ్ లేకుండా సామరాజారెడ్డికి రిజిస్ట్రర్ చేశారు. వీళ్లకూ పైన పేర్కొన్నవారితో సంబంధం లేదు. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయి. చనిపోయిన భూమి యజమానికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిపై 1983 నుంచి అక్టోబర్ 2010 వరకు దాదాపు 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అధికారులు ఏం చేస్తున్నారు..?
ఇలా వరుసగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం మౌనం దాల్చారు. ప్రభుత్వం ఒక బోనావేకెన్సియా ఆస్తిని స్వాధీనం చేసుకోగానే ఆ విషయాన్ని అధికారపూర్వకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం తెలియజేస్తుంది. ఆ భూమి మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు ఏ భూమిని రిజిస్టర్ చేయాలన్నా అందుకు సబంధించిన టైటిల్ సరైనవిధంగా ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. కానీ ఇవేవి లేకుండా రిజిస్ట్రేషన్ అధికారులు అడ్డగోలుగా రిజిస్టర్ చేయడానికి పరిశీలిస్తే ఇందులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తున్నది. ఏ రోజైనా వివాదం వచ్చినా దొరకకుండా ఉండేందుకే కబ్జాదారులు కావాలని ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా అనేక రిజిస్ట్రేషన్లు చేసినట్టు అర్థమవుతుంది.
మేలుకున్న అధికారులు..
ఇదిలా ఉంటే ఈ కబ్జాభూమిలో ఆరు అంతస్థుల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో స్థానికంగా కలకలం రేగగానే స్థానిక ఎమ్మార్వో, ఆర్డీఓలు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తి వివరాలు పైస్థాయి అధికారులకు తెలిపారు. హిమాయత్‌నగర్ రెవెన్యూ అధికారి ఈ అక్రమనిర్మాణాన్ని నిలిపివేయించారు. దీనితో భవన నిర్మాతలు తమ సొంత భూమిలో జరుగుతున్న నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు అడ్డుకుంటూ నోటీస్‌లు ఇచ్చారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాద ప్రతివాదాలను విన్న న్యాయస్థానం ఎమ్మార్వోలు, ఆర్డీఓలకు నోటీస్‌లు ఇచ్చే అధికారం లేదని చెప్పింది. ఈ మేరకు 2011 ఏప్రిల్ నెలలో ఎమ్మార్వో, ఆర్డీఓలు ఇచ్చిన నోటీస్‌లు చెల్లవని చెప్పింది. అదే సమయంలో బోనావేకెన్సియా 1974 చట్టం ప్రకారం టీ ఎస్ నెంబర్ 29కి చెందిన ఈ భూమి బోనావేకెన్సియాకు చెందినదైన పక్షంలో ఆ భూమిని రక్షించడానికి తగిన చర్యలు తీసుకునే అధికారం పై స్థాయి అధికారులకు ఉందని, ఆ మేరకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.
న్యాయస్థానం అధికారాలను గుర్తుచేసినా....
అయితే న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వాదిస్తూ కబ్జాదారులు.. రెవెన్యూ అధికారుల అభ్యంతరాన్ని తోసిపుచ్చి నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అయితే న్యాయస్థానం తీర్పు ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటీస్‌లు ఇవ్వడం.. ఆ యా నోటీసుల ప్రకారం చట్టాన్ని అమలు చేయమని కిందిస్థాయి అధికారులైన ఎమ్మారో, ఆర్డీఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగి ఉంటే ఆ ఆస్తిని కాపాడే అవకాశం ఉండేది. అయితే ఆ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నోటీస్‌లు కానీ,ఆదేశాలు ఇవ్వకపోవడం విచిత్రం. ఈ భూమిపై వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో హిమాయత్‌నగర్ ఎమ్మారో జిల్లా కలెక్టరు నివేదించినా ఫలితం లేకుండాపోయింది.
ఎన్‌ఓసీ లేకుండానే ..
ఇక జీహెచ్‌ఎంసీది మరో ఎపిసోడ్. నగరంలో ఏదైనా ఒక స్థలంలో ఒక నిర్మాణం చేపట్టాలంటే అందుకు జీహెచ్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం భవనం నిర్మించే వారు జీహెచ్‌ఎంసీకి రెవెన్యూ అధికారులు ఇచ్చే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసి), భవన నిర్మాణ ప్లాన్‌తోపాటు నిర్థిష్టమైన ఫీజులు చెల్లించి దరఖాస్తు చేయాలి. అయితే ఈ కబ్జాదారులు రెవెన్యూ ఎన్‌ఓసీ లేకుండానే దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు ఎవరికీ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. అయినా ఆరు అంతస్తుల భవనానికి జీహెచ్‌ఎంసీ ఆమోదముద్ర పడింది. జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లు మూసుకొని టైటిల్ డీడ్ లేకున్నా, రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ ఇవ్వకున్నా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఎలా ఇచ్చారన్నది వారికే తెలియాలి. మొత్తానికి ఇవన్నీ కలిసి దాదాపు 30 కోట్ల విలువ చేసే బోనావేకెన్సియా భూమి కబ్జాదారుల పరమైంది. శ్రీ సాయి బాలాజీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భవన నిర్మాణాన్ని చకచకా పూర్తి చేస్తున్నారు.
నమస్తే తెలంగాణ చేతికి ఎమ్మార్వో నివేదిక
ఈ భూమి విషయంలో జరిగిన పరిణామాలపై వాస్తవ పరిస్థితిని వివరిస్తూ స్థానిక ఎమ్మార్వో జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ నివేదిక నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది. కబ్జా అవుతున్నదని తెలిసినా కింది స్థాయి అధికారులు మొరపెట్టుకున్నా వారి మొరను ఆలకించేవాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరువయ్యారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం పరాధీనమవుతున్నది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి