గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 06, 2014

తెలంగాణ గడ్డమీద ఆంధ్రాసాంగా?!

-ఆంధ్రా పత్రికల రుద్దుడు పాలసీ
-ఇక్కడి ఎడిషన్ల నిండా ఆంధ్రా వార్తలు
-అక్కడ మాత్రం మన వార్తలు మాయం
-అక్కడి పార్టీలను బతికించే కుట్రలు
-తెలంగాణ వాళ్లమంటూ ఆంధ్రాకు చందాలు
-ఆ మీడియాకు సర్కారు ప్రకటనలెందుకు?
-ఆ జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాలెందుకు?
-ఆపేయాలంటున్న తెలంగాణ వాదులు

మీకు మా వార్తలెందుకు? మీది తెలంగాణ పత్రిక కదా!... కొద్ది రోజుల క్రితం ఆంధ్ర శాసనసభలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రతినిధికి ఎదురైన ప్రశ్న ఇది. సింపుల్‌గా చెప్పాలంటే మా రాష్ట్రం వేరు. మీ రాష్ట్రం వేరు. మా వార్తలు మీకు అక్కర్లేదు అని చెప్పినట్టు!....
దాని ప్రకారమే అయితే మన రాష్ట్రం కాని ఆంధ్రప్రదేశ్ వార్తలు మనకూ అవసరం లేదు.

కానీ ఈ నియమం తెలంగాణ గడ్డ మీద ప్రచురితమవుతున్న సీమాంధ్ర పత్రికలు పాటించడం లేదు. సరికదా పత్రికల్లో సింహభాగం స్థలం, టీవీల్లో అత్యధిక సమయం ఏపీ వార్తలకు ఏపీకి చెందిన రాజకీయ పార్టీలకు కేటాయిస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆంధ్రాకు చెందిన ప్రధాన పత్రికలు తెలంగాణ ఎడిషన్లలో ఏపీ వార్తలు గుప్పించి ప్రచురిస్తూ..

ఆంధ్రా ఎడిషన్లలో మాత్రం తెలంగాణ వార్తలకు చోటే ఇవ్వడం లేదు. అక్కడి నాయకులు దగ్గినా తుమ్మినా మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించే పత్రికలు ఇక్కడి నాయకులకు చెందిన ఎంత ప్రధాన వార్త అయినా పట్టించుకోవడం లేదు. ఈ వైఖరి మీద పాత్రికేయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఆయా మీడియాలు, పత్రికలు తెలంగాణకు ఇచ్చే సమయం స్థలం ఆధారంగా వాటిని తెలంగాణ లేదా ఆంధ్రా పత్రికలుగా గుర్తించాలని సీనియర్ పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గడ్డమీద కూర్చుని ఆంధ్రాపాటలు పాడుతున్న పత్రికలకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ప్రోత్సహకాలు ఇచ్చేకన్నా అచ్చంగా తెలంగాణకు అంకితమైన పత్రికలను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం విధానం రూపొందించాలి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి మూడు నెలలు దాటినా కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర ఆధిపత్య వార్తలనే ఇంకా హైలెట్ చేస్తూ ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. వాటినే తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. తమ సంస్థలు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను ఇంకా ఇక్కడ సజీవంగా ఉంచడం వాటి ద్వారా ఇంకా ఆంధ్ర పెత్తనాన్ని కొనసాగించడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

తెలంగాణకు ద్రోహం చేసే విధంగా కొనసాగుతున్న వాటి వైఖరిలో మార్పు కనిపించడం లేదు. వృత్తిపరమైన విలువలకు తిలోదకాలిస్తూ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఈ మీడియా సంస్థలపై ప్రభుత్వ పరంగా ఎలాంటి వైఖరి అవలంభించాలనే విషయంపై చర్చ జరగాలి అని ఒక సీనియర్ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి తెలంగాణ వార్తలు, పూర్తి స్థాయి ఎయిర్ టైమ్ (ప్రసారాల సమయం) అందించే మీడియా సంస్థలేవి? సీమాంధ్రకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే సంస్థలేవి? అనే వాస్తవాలను లెక్కలు కట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా సమగ్ర అధ్యయనం చేసి భవిష్యత్తులో మీడియా పరంగా అనుసరించాల్సిన విధానానికి రూపకల్పన చేయాలి అని తెలంగాణ మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.

రాయితీలు తెలంగాణ పత్రికలకే దక్కాలి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పేరుతో ఇక్కడ కొన్ని పేపర్లు కొనసాగుతున్నాయని, ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే తెలంగాణ పేర్లతో ఉన్న పత్రికలను అక్కడి పాలకవర్గాలు లేదా రాజకీయ పార్టీల నేతలు వాటి ఉనికినే ప్రశ్నించే వారని జేఏసీ నేత ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పత్రిక నడుపుతూ, తెలంగాణ వాడినని చెప్పుకుంటూ ఆంధ్ర రాజధాని కోసం చందాలు వసూలు చేయడంలోని ఆంతర్యం ఏమిటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించేలా పని చేస్తున్న మీడియా సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి? వాటికి ప్రభుత్వ ప్రకటనలు ఎందుకు జారీ చేయాలి? అందులో పని చేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడేషన్) కార్డులు ఎందుకు ఇవ్వాలి? హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న వారికి మేలు చేయాలి తప్ప, ఆంధ్రా దుర్భిద్ధితో వ్యవహరిస్తున్న వారికి లబ్ధి చేకూర్చే విషయంలో పునరాలోచన చేయాలని టీజేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి