గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

ఖనిజాభివృద్ధిలో ఆంధ్రా దాష్టీకం!

స్వరాష్ట్రం ఏర్పడి వందరోజులు గడిచినా ప్రభుత్వ రంగ సంస్థలపై స్పష్టత రాకపోవడంతో అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు కడగండ్లపాలవుతున్నారు. కనీసం ప్రతినెలా వేతనాలు పొందలేని దుస్థితి వారికి ఎదురవుతున్నది. ఇదే కోవలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో మూడునెలల నుంచి సక్రమంగా జీతాలు అందక తెలంగాణ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లుగా విభజించారు. నిధుల వాటాలు మాత్రం కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం సంస్థ నిధుల్లో 42శాతం వాటా తెలంగాణకు రావాల్సి ఉంది. అవేవీ తేల్చకుండా, పైసా ఇవ్వకుండా సంస్థను విభజించారు. ఆనాటినుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ శాలినీమిశ్రా చట్టాలు, మార్గదర్శకాలు బుట్టదాఖలా చేసి దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సైతం వాటాల విషయమై విజ్ఞప్తి చేసినా ససేమిరా అంటున్నారు. ఫలితంగా తెలంగాణ ఉద్యోగులకు ఆగస్టు నెల వేతనం ఇంతవరకు అందలేదు. 


టీఎస్‌ఎండీసీకి ప్రత్యేక ఖాతా తెరిచినప్పటికీ పైసా కూడా నిల్వ లేకపోవడంతో తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ టీఆర్‌కే రావు వేతనాలు ఇవ్వలేకపోతున్నారు. జూన్, జూలై నెలల వేతనాలు స్వీకరించేటప్పుడు ఇదే సమస్యను ఎదుర్కున్నారు. ఇంకా జీతాలు రాకపోవడంతో చిరుద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. కనీసం వేతనాల వరకైనా నిధులను సర్దుబాటు చేయాలని టీఆర్‌కే రావు శాలినీ మిశ్రాను కోరారు. ఐతే పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్‌ను వివరణ కోరుతానంటూ ఆమె దాటవేశారని తెలిసింది. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన 89 ప్రభుత్వ రంగ సంస్థల్లో 80కి పైగా సంస్థలకు తెలంగాణ నుంచే 75 శాతానికి పైగా రెవెన్యూ వచ్చింది. ఏపీఎండీసీకి మాత్రం ఆంధ్రానుంచి రెవెన్యూ ఎక్కువగా ఉంది. అయితే మిగిలిన సంస్థలనుంచి ఎగబడి ఆదాయం పంచుకున్న ఆంధ్రా అధికారులు ఖనిజాభివృద్ధి సంస్థ విషయానికి వచ్చే సరికి మా ఆదాయమే ఎక్కువ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి