-ఉద్యోగులంతా తెలంగాణ వారే..
-వేతనాల చెల్లింపునకు ససేమిరా
ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఏపీ ఇన్వెస్ట్ (సొసైటీ) బాగోగులు పట్టించుకునే వారే లేరు. దీనికి కారణం ఇందులో పని చేస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణ ఉద్యోగులే. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ర్టానికి సీఎంగా ఉన్నప్పుడే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపడం, పెట్టుబడులు రప్పించడం ఇన్వెస్ట్ లక్ష్యం. ఈ సంస్థ చైనా, పోలాండ్, రష్యా తదితర దేశాలకు ఇన్వెస్ట్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఐటీ, బయోటెక్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చేయాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ అధిగమించింది.-వేతనాల చెల్లింపునకు ససేమిరా
ఈ సంస్థను ఏర్పాటు చేసిన వారిపైనే కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. కానీ విభజన నేపథ్యంలో దాని శాశ్వత మూసివేతకు ప్రయత్నిస్తున్నారు. విభజన తర్వాత సచివాలయంలో అధికారులు ఈ సంస్థకు చోటే లేకుండా చేశారు. ఇందులో పని చేస్తున్న ఉద్యోగులంతా తమ మాతృశాఖలకు వెళ్లిపోయారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ సంస్థ సిబ్బంది వేతనాల చెల్లింపునకు ఏపీ సర్కార్ నిరాకరిస్తున్నది. జూలై వరకు మాత్రమే ఇందులో పని చేస్తున్న సిబ్బంది వేతనాలు చెల్లించారు. ఏపీ ఇన్వెస్ట్ కొనసాగించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సచివాలయంలో స్పెషల్ చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పెట్టుబడిదారులకు స్వాగతం పలకడం, వారి ప్రాజెక్టు నివేదికల స్వీకరణ, రెండు వారాల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల అనుమతుల మంజూరు తదితర బాధ్యతలు సెల్ నిర్వహించనున్నది.
కనుక ఏపీ ఇన్వెస్ట్ సొసైటీని తెలంగాణలో కొనసాగించే అవకాశాల్లేవు. ఐతే ఆంధ్రప్రదేశ్‌తోనే సొసైటీ రిజిస్ట్రేషన్ ఉన్నందున ఆ రాష్ట్రప్రభుత్వానికి దాని కొనసాగింపు అవసరం. దీని ఏర్పాటు ఆలోచన, ఆశయం, వ్యూహమంతా చంద్రబాబు హయాంలోనిదే. కనుక ఏపీ ఇన్వెస్ట్ కొనసాగింపు బాధ్యత పూర్తిగా ఆయనకే ఉన్నదని చెప్తున్నారు. కనీసం ప్రభుత్వ రంగ సంస్థల విభజన ప్రక్రియ వరకైనా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి