-సర్కార్ మరో చారిత్రక నిర్ణయం
-రూ.వెయ్యి కోట్లతో అమలుకు శ్రీకారం
- క్షేత్ర ఉపరితల విధానాలతో సర్వే
- డీజీపీఎస్, ఈటీఎస్ వంటి సాంకేతికత వినియోగం
- ఎన్‌ఐసీ, ప్లానింగ్, ల్యాండ్ రిసోర్సెస్ భాగస్వామ్యం
- ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు?
- తెలంగాణ భూభాగం 1.06 లక్షల చదరపు కిలోమీటర్లు
- సర్వే చేపట్టేది 79500 చ.కి.మీ. పరిధి
- 25శాతం అటవీ భూములకు మినహాయింపు
- మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల్లో అధ్యయనం
- టెండర్ల ద్వారానే సంస్థలకు సర్వే బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. సుమారు 82 ఏండ్ల్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడుతున్నది. రాష్ట్ర భూభాగాన్ని గజం గజం సర్వే చేసి పక్కా లెక్కలతో భూ రికార్డులు రూపొందించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో వాస్తవ జనాభా వారి సమస్త సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సంబంధించి పక్కా సమాచారం సిద్ధంచేసుకున్న ప్రభుత్వం ఇపుడు భూ సర్వే మీద దృష్టి పెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక వాస్తవ పరిస్థితులు వెలికి వచ్చే అవకాశముంది. ఏ భూములెవరివి? ఎవరి ఆధీనంలో ఎంతెంత భూమి? అలాగే వివిధ రకాల నేలలు, వాటి స్వభావాలు, వాస్తవ సాగు విస్తీర్ణం, బావులు, చెరువులు, కుంటలు, జల వనరులు, సాగుయోగ్యమైన భూమి, అనుకూలం కాని భూమి, మైదానాలు, గుట్టలు,లోయలు ఇలా సమస్త సమాచారం ఈ భూ సర్వేలో చోటుచేసుకోనుంది. -రూ.వెయ్యి కోట్లతో అమలుకు శ్రీకారం
- క్షేత్ర ఉపరితల విధానాలతో సర్వే
- డీజీపీఎస్, ఈటీఎస్ వంటి సాంకేతికత వినియోగం
- ఎన్‌ఐసీ, ప్లానింగ్, ల్యాండ్ రిసోర్సెస్ భాగస్వామ్యం
- ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు?
- తెలంగాణ భూభాగం 1.06 లక్షల చదరపు కిలోమీటర్లు
- సర్వే చేపట్టేది 79500 చ.కి.మీ. పరిధి
- 25శాతం అటవీ భూములకు మినహాయింపు
- మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల్లో అధ్యయనం
- టెండర్ల ద్వారానే సంస్థలకు సర్వే బాధ్యతలు
రాష్ట్రంలో 1932లో నిజాం కాలంలో భూ సర్వే జరిగింది. అది సమగ్ర సర్వే కాదు. తాత్కాలిక భూ సర్వే మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం కొనసాగిన 60 ఏండ్ల కాలంలో సీమాంధ్రపాలకులు భూమి సర్వేకు సాహసించలేక పోయారు. ఫలితంగా అనేక భూ వివాదాలు దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. మరోవైపు లక్షల ఎకరాల సర్కారు భూములకు లెక్కా పత్రం లేకుండా పోయింది. నోరు బలం ఉన్న వాళ్లు వందల ఎకరాలు కబ్జాలు పెట్టి రికార్డులను మాయామశ్చీంద్ర చేశారు. ఉన్న రికార్డులే అన్నిటికీ ప్రామాణికం కావడంతో అందులో నెలకొని ఉన్న అవకతవకలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సమగ్ర భూ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.
వెయ్యి కోట్ల ఖర్చు..
సమగ్ర భూ సర్వే పనులు మరో రెండు నెలల్లో మొదలు కానున్నాయని అధికారులు చెప్పారు. ఈ సర్వే నిర్వహించేందుకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చవుతుందని సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూ వనరుల శాఖకు రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెవెన్యూ మంత్రుల సదస్సులో కేంద్రం భూ సర్వే చేపట్టేందుకు 50 శాతం నిధులను అందజేస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిధులను కేంద్రమే మంజూరు చేయాలని కోరుతున్నది. వచ్చే వారం ఢిల్లీలో జరుగనున్న సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 15 లోగానే జరిగే బడ్జెట్ సమావేశంలో సర్వే కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ఖర్చు భరించేదెవరు?
నేషనల్ ల్యాండ్ రికార్డు మోడరనైజేషన్ ప్రోగ్రాం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద నిధులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమైక్య రాష్ట్రంలోనూ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఎన్టీఆర్ హయాంలో ఆలోచన చేసినా ఆచరణకు నోచుకోలేదు. సర్వేలు చేపట్టే రాష్ర్టాలకు కేంద్రం చ.కి.మీ.కు రూ.16,500 చొప్పున ఇస్తోంది. ఐతే ప్రస్తుత లెక్కల ప్రకారం చ.కి.మీ.కు రూ.45 వేలు వ్యయం అవుతున్నదని సర్వే లాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల విభాగం అంచనా వేసింది. ఈ లెక్కన టైటిల్ వర్క్‌తో కలుపుకొని రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి నివేదికను సమర్పించింది. దీనిపై కేంద్రం, రాష్ట్రం 50ః50 వాటాగా నిర్ణయించారు.
కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై భారం పడకుండా పూర్తిగా కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర భూ వనరుల శాఖను అభ్యర్థించింది. ఇదే సమయంలో సర్వే ఆలస్యం కాకుండా మొదటి దశగా రూ.180 కోట్లు విడుదల చేయించాలని కూడా కోరింది. అధికారికంగా నిధులను సమకూర్చుకునేందుకు సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల శాఖ కృషి చేస్తోంది. దానికి తోడు సీఎం కే చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్‌అలీలు కూడా రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు ఏళ్ల వ్యవధిలో సర్వేను పూర్తి చేయగలమని సర్వే ల్యాండ్ రికార్డుల కమిషనర్ కే హర్షవర్ధన్ టీ మీడియాకు వివరించారు.
ఆధునిక సాంకేతిక నైపుణ్యం..
సర్వే అంటే గొలుసు పట్టుకొని కొలతలేసే విధానం పాత తరం నాటి మాట. తెలంగాణలో చేపట్టబోయే సర్వేలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌లను సైతం వినియోగించనున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టం(ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) వంటి పద్ధతులను అనుసరించనున్నారు. రాళ్లు, గుట్టలు ఉంటే ఒక విధానం, సమాంతరంగా ఉంటే మరో విధానాన్ని అవలంభిస్తారు. ఈటీఎస్ సిస్టంలో జియో రెఫరెన్స్ పాయింట్స్‌ను గుర్తిస్తారు. మొదట షీట్లు రూపొందిస్తారు. వాటి ఆధారంగా హద్దు రాళ్లను పాతేస్తారు. ఎన్‌ఐసీ, ప్లానింగ్, ల్యాండ్ రీసోర్సెస్ వంటి అనేక శాఖల భాగస్వామ్యం తీసుకుంటారు.
వివిధ రాష్ర్టాల్లో అధ్యయనం..
దేశంలో అనేక రాష్ర్టాలు నేషనల్ ల్యాండ్ రికార్డు మోడరనైజేషన్ ప్రోగ్రాం కింద భూ సర్వేను చేపట్టాయి. అందులో గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ర్టాల్లో ఈటీఎస్, డీజీపీఎస్ విధానాలతో సర్వే చేపట్టారు. గుజరాత్‌లోనే మూడు, నాలుగేళ్లల్లో 12 జిల్లాల్లో సర్వే పూర్తి చేశారు. మన అధికారులు ఆ రాష్ర్టాల్లో అధ్యయనం చేశారు. తాజాగా బీహార్‌లో జరుగుతోన్న సర్వేను కూడా అధ్యయనం చేసేందుకు వెళ్లాలని కమిషనర్ హర్షవర్ధన్ నిర్ణయించారు. తెలంగాణలోనూ సర్వే 100 శాతం పక్కాగా ఉండే విధానాలను నిర్ణయించేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. సర్వేను మూడు దశలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో వివాదాలు అధికంగా ఉన్న మండలాల్లోనే చేపడుతారు.
అనుమానాలొద్దు..
గతేడాది హైదరాబాద్ జిల్లా పరిధిలో జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం) విధానం ద్వారా అన్ని స్థలాల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియ ఓ ప్రైవేటు సంస్థ అందించిన సాంకేతిక నైపుణ్యం ఆధారంగా నిర్వహించారు. ఐతే నిషేధిత రిజిస్ట్రేషన్ స్థలాలను గుర్తించే లక్ష్యంగా సాగిన ఈ సర్వేలో అనేక లోపాలు బయట పడ్డాయి. ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌లో అనేక ప్రైవేటు స్థలాలను చేర్చారు. దాంతో యజమానులు లబోదిబోమంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేలల్లో ఫిర్యాదులు రావడంతో ఈ విధానంతో రూపొందించిన పీఓబీని నిలిపివేశారు. 1968 నుంచి 1976 వరకు హైదరాబాద్‌లో జరిపిన టౌన్ సర్వే కూడా లోపభూయిష్టంగా ఉంది.
ఇలాంటివి తమ సర్వేలో ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూభారతి పథకం కింద నిజామాబాద్ జిల్లాలో రూ.33.85 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం, రికార్డు కంక్లూజివ్ టైటిల్ ఆఫ్ ఆల్ ల్యాండ్‌హోల్డర్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రాఫికల్ డైమెన్షన్లు, యాజమాన్యపు పత్రాలు, భూ వినియోగం వంటి అనేకాంశాలతో కూడిన డాటాను రూపొందించారు. జిల్లాలో 922 గ్రామాల్లోని వ్యవసాయ భూములను సర్వే చేశారు. 8.73 లక్షల రైతులు, పట్టాదారులు ఉన్నారు. 2005 నుంచి చేపట్టిన కార్యక్రమం 2012 వరకు కొనసాగింది. ఇందులో ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రీమోట్ సెన్సింగ్ సెంటర్) సంస్థ 15 శాతం ఈటీఎస్, 85 శాతం డీజీపీఎస్ విధానాన్ని వినియోగించింది.
సిబ్బంది లేమి సమస్య కాదు..
తెలంగాణలో సర్వే చేపట్టేందుకు సర్వేయర్లు ఎక్కడున్నారు? వందలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో సమగ్ర భూ సర్వే ఎలా సాధ్యం? అంటూ ఉద్యోగ వర్గాల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఐతే ఈ సర్వే బాధ్యతలను టెండర్ పద్ధతిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అప్పగించనున్నారు. వారి పనులను పర్యవేక్షించేందుకు నాలుగు కమిటీలు పని చేస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 సంస్థలు భూ సర్వే చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం.
సర్వే ఎందుకు..?
తెలంగాణ రెవెన్యూ విభాగంలో ఉన్నంత పదజాలం మరెక్కడా లేదు. ఇక్కడున్నన్ని భూమి రకాలు మరోచోట కనిపించవు. సర్ఫేఖాజ్, ఖరీజ్‌ఖాతా, లాపత్తా, ఎనిమీ ప్రాపర్టీస్, యూఎల్సీ, కాందీశీకులు, సర్కారు, ఆబాదీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కో రకమైన పదాలతో భూములను పిలుస్తారు. దానికి తోడు ప్రభుత్వం కూడా వాటికి వేల సంఖ్యలో ప్రత్యేకమైన చట్టాలు, నిబంధనలను రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 1932లో నిజాం కాలంలో చేపట్టిన సర్వేలో కామన్ ప్రాపర్టీస్ (చెరువులు, కుంటలు, గ్రామ కంఠాలు వంటివి)ను ప్రామాణికంగా తీసుకోలేదు. కేవలం శిస్తు కట్టే వారి భూములనే సర్వే చేసి హద్దు రాళ్లను పాతించారు. చాలా రాష్ర్టాల్లో భూ సర్వేలను పూర్తి చేసుకొని వివాదాలను పరిష్కరించు కుంటున్నారు.
ఆంధ్రాలో మద్రాస్ విధానంతో పక్కాగా చేసిన సర్వే వల్ల రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఇక్కడ అలాంటి వ్యవస్థలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ భూభాగంలోని 1.06 లక్షల చ.కి.మీ.లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 30 శాతం వరకు ప్రభుత్వ భూములు, వక్ఫ్, ఎండోమెంట్ భూములు ఉన్నాయి. సరైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోవడం ఆసరాగా చేసుకొని ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు. అందుకే పక్కా సర్వేతో రైతాంగానికి మేలు కలిగించాలన్న సదాశయంతో భూ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్త రాష్ట్రంలో సర్వే తప్పనిసరి
ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. బ్రిటిష్ పాలనలో ఆంధ్రాలో భూ సర్వేకు ఆధునిక విధానాలను వినియోగించారు. నిజాం కాలంలో చేపట్టిన ఇక్కడ జరిపిన సర్వే లోపభూయిష్టంగా ఉంది. దాంతో అక్రమాలు, కబ్జాలకు అంతు లేకుండా పోయింది. వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. గత నెల 19న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో భూ సర్వే చేపట్టేందుకు రూ.1000 కోట్లు కావాలని అడుగగానే అధికారులంతా ఆశ్చర్యపోయారు. రాష్ట్రం ఏర్పడగానే సర్వే చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలంగాణ పట్ల జరిగిన వివక్షను వివరించిన తర్వాత సర్వే అనివార్యతను గుర్తించారు. తెలంగాణకు మహాత్తరమైన చరిత్ర ఉంది. ప్రభుత్వ భూములే 30 శాతం, అటవీ భూములు 25 శాతం వరకు ఉన్న రాష్ట్రం మరొకటి లేదు.
ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖల భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. చెరువులు, కుంటలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ అంశాలను కేంద్రానికి వివరించాను. దాంతో సర్వేకు అంగీకరించారు. కొత్త రాష్ర్టానికి సర్వే భారాన్ని వేయొద్దని కోరాం. పూర్తి ఖర్చులను భరించాలని విజ్ఞప్తి చేశాం. వచ్చే నెల మరో సమావేశం ఉంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
- కే హర్షవర్థన్, కమిషనర్, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డులు
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి