గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

సాగర్ వెనుక కన్నీటి కథలు!

- జలాశయం నిర్మాణంతో భూములు కోల్పోయిన నిర్వాసితులు
-ఎకరానికి రూ.90 పరిహారం.. కొండ భూములపై పునరావాసం
- పైనా,కిందా నీళ్లున్నా తడవని మోచేయి.. అర్ధశతాబ్దం తర్వాతే రోడ్డు
- పావురాలగట్టులో నిర్వాసితులకు సమకూరని కనీస సౌకర్యాలు
సాగునీటి ప్రాజెక్టులు.. ఆధునిక దేవాలయాలని దేశ తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించారు. ఆయకట్టులో బంగారం పండించే ప్రాజెక్టులు నిజంగా దేవాలయాలే. కానీ దేవాలయాల నిర్మాణనానికి భూములిచ్చిన రైతులు మాత్రం బక్కచిక్కిపోయారు. మహత్తరమైన సాగునీటి ప్రాజెక్టు మాభూమిలో ఉన్నదని గొప్పలకు పోవడం తప్ప, కనీసం నీళ్లు లేని దుస్థి తి వారిది. దేశచరిత్రలో అతిపెద్ద రాతికట్టడమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న మరో కన్నీటి కోణమిది.

greenసుందర కట్టడం వెనుక దారిద్య్రం: కృష్ణమ్మ పరవళ్లను బంధిస్తూ నల్లగొండ జిల్లా నందికొండ వద్ద పురుడు పోసుకున్న మానవనిర్మిత సుందర కట్టడం నాగార్జునసాగర్. 1955లో శిలాఫలకం పడితే, 1967 నిర్మాణం పూర్తిజేసుకుంది. రెండు రాష్ర్టాల్లోని 22 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ జలాశయం ఆనకట్ట ఎత్తు 124 మీటర్లు, పొడవు కిలోమీటరు కంటే ఎక్కువే. 26 క్రస్ట్‌గేట్లతో 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. సాంకేతికత బొత్తిగా పరిచయం లేని రోజుల్లోనే సుంకేసుల క్వారీ నుంచి రాళ్లు, హాలియా, రాయవరం వాగుల నుంచి ఇసుక తీసుకొచ్చి సుందర సౌధానికి రూపునిచ్చారు.

ఎడమ, కుడి కాల్వలతో అతిపెద్ద కెనాల్ వ్యవస్థను కలిగిన ఈ కట్టడం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సుమారు 70 వేల మంది. పనులు జరుగుతుండగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు 174 మంది. సాగరం కారణంగా ఆవాసాలు కోల్పోయిన వాళ్లు 24 వేల మంది. 52 పచ్చని పల్లెలు సాగరంలో నిండిన కృష్ణా జలాతో ఆనవాళ్లు కోల్పోయాయి. నీటమునిగిన గ్రామాల్లో 70 శాతానికి పైగా నల్లగొండ జిల్లాలోనివే. నాటి దేవరకొండ తాలూకాలోని ఎన్నో పల్లెలు నేడు చూస్తున్న సాగరంలో మరుగునపడ్డాయి. నీట కలిసిన పొలాలు లక్ష ఎకరాలకు పైనే.

ప్రస్తుతం సాగర్ పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తేశారు. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. భూములు పచ్చగా చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉభయకుశలోపరిగా మారిన సాగర్‌కు భూములిచ్చిన నిర్వాసితులకు మాత్రం ఇసుమంతైనా ఆనందం ఇప్పటికీ లేదు. ఆనాడు సాగర్‌కు భూములు ఇచ్చి కొత్తగా పురుడు బోసుకున్న గ్రామాలు కోకొల్లలు. సాగర్ చుట్టూనే ఉన్నప్పటికీ ముంజేతికి చుక్క తాకనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పల్లెల్లో ఒకటి పెద్దఅడిసర్లపల్లి మండలంలోని పావురాలగట్టు. వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆ గూడెంవాసులు అర్ధశతాబ్దంగా పడుతున్న అరిగోస చదవండి.

ఇస్తమన్నయి ఇయ్యరాయె:వడ్త్య బీక్యా, పావురాలగట్టు
ఒకల పొట్ట నింపనీకి మరొకలి పొట్ట కొడతరా సారూ? ఇస్తమన్నయి ఇయ్యరాయె.. గా శెర్వుల(నాగార్జునసాగర్) మునిగిపోయిన పాత గుమ్మడం మా ఊరు. అప్పట్లనే 30 ఎకరాలు ఉండె. సస్తె కూడా ఊరు ఇడవం అని గూసున్నం. నీళ్లు నింపుతం, సస్తె మాకు తెల్వదన్నరు. నేను చిన్న పోరగాణ్ని. మస్తుగేడిసిండు మా నాయిన. ఎత్తున ఉన్నది ఈ గుట్ట అని ఇక్కడికొచ్చి గుడిసెలేసుకున్నం. సర్కారోళ్లు గూడా గీడనే ఉండమన్నరు. 5 ఎకరాల అడివి జూపిండ్రు. తతిమ్మ భూమికి ఎకరం రూ.90 లెక్కన జేసిచ్చిండ్రు. గిప్పటిదాక ఎవ్వడు తొంగిజూడలె.

మాయదారి శెర్వు మా పాణానికొచ్చింది:వడ్త్య చాంది, పావురాలగట్టు
మా నాయినకు 50 ఎకరాలు. అంతా నీళ్లల్లనే పోయింది. మాది అప్పుడు పాత గుమ్మడం. మా వోళ్లంతా తలో దిక్కు పక్షులోలె ఎగిరిపోయిండ్రు. మాయదారి శెర్వు మా పాణానికొచ్చింది. పుట్టినూరు, అయినోళ్లు దూరమై, గీ కొండ మీద జేరినం. మమ్ముల జూసినోడే లేడు. మా ఊర్ల డాక్టరు కూడా లేడు కొడకా. మా ఊరి సుట్టూ నీళ్లే ఉంటయ్. పైనంగ పుట్టంగండి. కింద జూస్తె సాగర్ శెర్వు. గుట్ట కొస నుంచి తొంగి జూస్తె నిండా నీళ్లు. ఆ పక్కన పచ్చని పొలాలు. నా కొడుకులకు మాత్రం ఎకరం భూమిల గూడ నీళ్లు లేవు. అన్ని కొన్క తినుడే.

ఎడ్ల బండి యిప్పి మోసుకుంట పైకెక్కినం:చెరుకు వెంకమ్మ, పావురాలగట్టు
మాది దేవరకొండ తాలుక పాత సూర్యారావుపేట. సాగర్‌ల మొత్తంబోయింది. అప్పుడు నాకు 20 ఏండ్లు. పెద్దోడు, రెండోడు గాడ్నే పుట్టిండ్రు. ఊరొదిలి వస్తుంటె మా మామ బండి కట్టిండు. గీ గుట్టపైనే మన కొత్త ఊరు అని జెప్తె పైకి జూసిన. కండ్లు గిర్రున తిరిగినయి. అంతెత్తుంది మరి. బండి యాడికాడికి యిప్పి తలో పయ్య మోసుకుంట పైకెక్కినం. మా పెనిమిటికి 5 ఎకరాలిచ్చిండ్రు. పిల్లలకు సదువు, సందెలు లేకపాయె. నిరుడే మా ఊరికి రోడ్డేసిండ్రు. కరెంటు కూడా నాలుగేండ్ల కింద వచ్చింది. మా పిల్లల పోరలైనా సల్లగుంటె బాగుండు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

akkadi vaallu baane vunnaaru.......edupu edupu edupu......meede.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు మీకు కూడా దృష్టిలోపం ఉంది కాబోలు! అంత స్పష్టంగా వాళ్ళు తమగోడు వెళ్ళబోసుకొంటుంటే ఏమీ ఎరగనివాడిలా మధ్యలో మీ ఏడుపేమిటి? వాళ్ళు బానేవున్నారని మీరు కలగానీ కన్నారా? లేక వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నారా, తాము బాగున్నామని!
ఏడుపుగొట్టు వ్యాఖ్యలాపి, నిప్పులాంటి నిజాల్ని కనండి మీ పచ్చకామెర్ల కళ్ళతో!

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

మీరు రాసినవి పచ్చి నిజాలు మధుసూదన్ గారు. ఈ విషయంలో నాకు కొంత అనుభవముంది. నష్టపోయే వారి వివరాలు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించకుండా జనాభా లెక్కలు ముందేసుకుని వాడికి రెండు ఎడ్లు, వీడికి రెండు కోళ్ళు ఉన్నట్లు కాకి లెక్కలు రాస్తారు. ఎవరికైతే పట్టాదారు పుస్తకాలు ఉంటవో వారికే ఏ కొంతో సొమ్ము అందుతాయి. ఇక ఏ పట్టా లేకుండా ఉన్న భూములు ఎన్నేళ్ళ బట్టి చేసినా అవి హక్కుదారునిగా లెక్కకురావు-నష్టపరిహారమూ రాదు. పాత కాలంలో భూమి పట్టాల గురించి అంత పట్టించుకునే వారు కారు. ఇక ఆ ప్రకటించిన సొమ్ము కూడా ఎప్పుడు చేతికి అందుతాయో ఆ దేవునికే ఎరుక. పోలవరం ప్రాజెక్టు వలన నష్టపోయేది చాలామంది. అందులో ఏ కొద్ది మందికో పట్టాలు కలవారు. వారికి వచ్చినా ఆ డబ్బుతో ఇంకోచోట అలాంటి భూమి కొనడం అసాధ్యం. ఇక ఏ పట్టాలు లేక నేల, చెట్లపై ఆదారపడి బ్రతికేవారి బ్రతుకులు ఇంకా రోడ్డుపాలే కానున్నాయి. ఒక ప్రదేశంలో స్థిరపడినవాడు ఇంకో ప్రదేశానికి వెళ్లి బ్రతకాలంటే చాలా కష్టం. ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడ ఉండే ప్రతి వ్యక్తికి ఒక ఆధారం చూపాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చాలా బాగా చెప్పారు స్వామిగారూ! సీమాంధ్ర ప్రజలు మా సోదరులనీ, సీమాంధ్ర అక్రమార్కులు తెలంగాణకు ద్రోహం చేశారు కాబట్టి మాకు శత్రువులనీ...ఈ శత్రువులనే మేం దుయ్యబడుతున్నామనీ...ఈ పైన పేర్కొన్న పచ్చకామెర్ల రోగపువాళ్ళకు ఎంత చెప్పినా చెవికెక్కడం లేదు. మన బ్లాగుల్లోకొచ్చి విషం కక్కుతున్నారే తప్ప వాస్తవం గ్రహించడం లేదు. సిగ్గులేని జన్మలకు ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఏం లాభం? మీ వ్యాఖ్యతోనైనా బుద్ధి తెచ్చుకొంటాడో వేచిచూడాలి.

ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించగలరు. ధన్యవాదాలతో...
మీ మిత్రుడు...
గుండు మధుసూదన్

శ్యామలీయం చెప్పారు...

శా. అంతామిధ్య తలంచిచూడ జనులారా రాజకీయంబుగన్
వింతల్వింతలు బల్కువారలకు మీ విజ్ఞాపనల్ సొక్కుటల్
పంతం బేటికి మానుడన్న వినరే వాదింతురే వెఱ్ఱులై
చింతాకంతయు బుధ్ధి యుండదు కదా సీమాంధ్రలో వారికిన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కం.
సత్యములఁ దెల్పుచుండఁగ
నిత్యమ్మీ విధపు వ్యాఖ్య నిడువారలకున్
గత్యంతరమే లేదా?
యత్యంతాక్షేపణములె హర్ష మొసఁగునా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి