గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

ఆంధ్రా సర్కారు పంతం...! విద్యార్థులకు శాపం...!!

తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకుండా ఒంటెత్తుపోకడ
ముందుచూపు లేకుండానే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై బీరాలు
సీట్లు మిగలడంతో రెండోవిడతకు సుప్రీంలో పిటిషన్
భిన్న వాదనలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం
బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే: రాష్ట్ర విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
తీర్పు కాపీ అందిన తర్వాతే నిర్ణయం: ఏపీ విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి


ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌ను నిరాకరిస్తూ గురువారం వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రా సర్కారుకు భారీ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు తీర్పుకు ఆంధ్ర సర్కారు వైఖరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా.. ఆంధ్రా సర్కారు పంతం పట్టడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
Supremకౌన్సెలింగ్ విషయంలో ఒంటెత్తు పోకడలకు పోవడం వల్లనే రెండు రాష్ర్టాల్లోని విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రవేశాల విషయంలో ఆంధ్రా సర్కారు వ్యవహరించిన తీరు వల్ల ఆంధ్రా పిల్లలే తీవ్ర స్థాయిలో నష్టపోతున్నట్లు ఉమ్మడి అడ్మిషన్ల అధికారులు లెక్కలు వేశారు. ఈ తీర్పు వల్ల ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసిపోయినట్లుగా భావించాల్సి వస్తున్నదన్నారు. ఈ తీర్పు ప్రభావం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీపై కూడా భారీస్థాయిలో పడింది. యాజమాన్య కోటా నిండకపోవడంపై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇంప్లీడ్‌తోనే సమస్యలు

కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, సిబ్బంది కూడా అందుబాటులో లేక పోవడంతో అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న అంశాలనేవీ పట్టించుకోకుండా ఈ కేసులో ఆంధ్రా సర్కారు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి.. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడింది. ఆగస్టు 31 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు నిర్వహిస్తామని కోతలు కోసింది.

ఆ మేరకు హుటాహుటిన ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసి.. దానినే సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఏపీ షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లను ఆగస్టు 31వరకు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గత నెలలో తీర్పు చెప్పింది. కానీ, ఆంధ్రా ఉన్నత విద్యా మండలి సకాలంలో ఉమ్మడి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. దీంతో రెండు రాష్ర్టాల్లోని ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 80 వేల పైచిలుకు సీట్లు మిగిలిపోయాయి. సుప్రీంతీర్పు ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేదు.

కానీ, రెండో దశ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని ఆంధ్రా సర్కారు ఎత్తులు వేసింది. దీనిని పసిగట్టిన సుప్రీంకోర్టు ఈ తరహా ద్వంద్వ వాదనలకు అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతిని నిరాకరించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బురద జల్లే ప్రయత్నం చేసిన ఆంధ్రా సర్కారు.. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడింది. అంతేకాకుండా వేలమంది విద్యార్థుల భవిష్యత్తునూ అంధకారంలోకి నెట్టింది. 
కోర్టులో వాదనలు ఇలా జరిగాయి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్ ఎస్ జె ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుల్ల చంద్రపంత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరఫున హాజరైన న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ.. తొలి విడత కౌన్సెలింగ్‌ను సుప్రీంకోర్టు అనుమతి మేరకు నిర్వహించి ఆ ప్రక్రియను ఆగస్టు 31వ తేదీకి పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్‌లో 1.17 లక్షల సీట్లను భర్తీ చేశామని, ఇంకా 65 వేల సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయని పేర్కొన్నారు.

ఈ సీట్లను కూడా భర్తీ చేయడానికి మరి కొంత గడువు ఇవ్వాలని, రెండవ విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు కోరిందని, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను విన్న తర్వాత ఆగస్టు 31వ తేదీకల్లా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించాలని కోర్టు నిర్ణయించిందని పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ అవసరం ఉంటుందని అప్పుడే ఎందుకు ప్రస్తావించలేదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిని జస్టిస్ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. వాస్తవానికి ఏఐసీటీఈ ఆదేశాల ప్రకారం జూలై 31వ తేదీకల్లా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిపోయి ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలని మూడు నెలల అదనపు సమయాన్ని అడిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వాదించింది. ఈ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒక నెల గడువు ఇస్తూ ఆగస్టు 31వ తేదీకల్లా పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మీరు సూచించిన తేదీల ప్రకారమే నిర్ణయం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదనపు గడువు కోరుతున్నారు. ఇది సమంజసం కాదు అని జస్టిస్ ముఖోపాధ్యాయ తేల్చి చెప్పారు.

ఇంతలో మరో న్యాయవాది జోక్యం చేసుకుని సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకున్న జాప్యం కారణంగా పంజాబ్‌లోని కొన్ని కళాశాలల్లో కూడా సీట్లు మిగిలిపోయాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కళాశాలల్లో సుమారు 180 సీట్లు మిగిలిపోయాయని చెప్తుండగానే జడ్జి జోక్యం చేసుకుని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 65 వేల సీట్లు మిగిలిపోయాయని చెప్తున్నారు. అంతే కదా.. అని అన్నారు. వెంటనే న్యాయవాది విశ్వనాథన్ జోక్యం చేసుకుని, కోర్టు అనుమతిస్తే తాము ఏఐసీటీఈని సంప్రదించి గడువు పెంచాలని కోరుతాం అని డివిజన్ బెంచ్‌కు తెలిపారు. దీనిపై జడ్జి స్పందిస్తూ... మీరు ఏఐసీటీఈకి వెళ్లినా అనుమతి ఇవ్వాల్సింది మళ్లీ ఈ కోర్టే కదా.. అని స్పష్టం చేశారు. పదేపదే గడువు పెంచాలని కోరడం సమంజసం కాదని స్పష్టం చేస్తూ రెండవ విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
ఆంధ్రా సర్కారే బాధ్యత వహించాలి : తెలంగాణ విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి

ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అక్టోబర్ 31 వరకు గడువు కోరుతూ తెలంగాణ రా్ష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే.. దీనిని వ్యతిరేకించి ఆంధ్రా ప్రభుత్వం అడ్డుపుల్ల వేసిందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కే పాపిరెడ్డి అన్నారు. దీని వల్ల ఆంధ్రా విద్యార్థులతో పాటు తెలంగాణ విద్యార్థులు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు నష్ట పోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఇందుకు పూర్తి బాధ్యత ఆంధ్ర సర్కారే వహించాల్సి ఉంటుందని తెలంగాణ విద్యా మండలి ఛైర్మన్ పేర్కొన్నారు.

అవసరమైతే రివ్యూ పిటిషన్: ఆంధ్రా ఉన్నత విద్యా మండలి చైర్మన్

ఎల్ వేణుగోపాల్‌రెడ్డి

రెండు దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిరాకరిస్తూ గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తీర్పు కాపీ రావాల్సి ఉందన్నారు. తీర్పు కాపీ పరిశీలించిన తర్వాత న్యాయనిపుణుల ఆదేశాల ప్రకారం తదుపరి నిర్ణయం తెలియజేస్తామని ఏపీ విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి చూస్తే.. ఎంసెట్-2014 ముగిసినట్టుగానే భావించాల్సి ఉంటుందని ఏపీ విద్యా మండలి ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. అయితే సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి తీర్పు వస్తుందని మాత్రం తాము ఊహించలేదన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి