గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 18, 2014

మెట్రో ముసుగులో తెలంగాణపై కుట్ర...!!!

-ఎల్‌అండ్‌టీ లేఖ లీకువీరులెవ్వరు?
- పాత్రధారులనేకం.. పావుగా ఎల్‌అండ్‌టీ

ఎల్‌అండ్‌టీకి ఏపీ రాజధాని నిర్మాణం ఆఫర్ 
-సంస్థ యాజమాన్యంతో బాబుకు బంధం
-మెట్రో వదులుకోవాలని సంస్థకు ఎరలు
-మబ్బుల్లో నీళ్లకు ఆశపడుతున్న ఎల్‌అండ్‌టీ
-అందుకే మెట్రోపై లేనిపోని రాద్ధాంతం
-మండిపడుతున్న తెలంగాణవాదులు

ప్రాజెక్ట్ వదిలేస్తామని గతంలోనూ బెదిరింపు
-కిరణ్ సర్కారుకూ లేఖ రాసిన ఎల్‌అండ్‌టీ
-అప్పుడు లీక్ కానిది ఇప్పుడెందుకు లీకైంది?

నానాటికీ పెరుగుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠ
-ఉప ఎన్నికలో గులాబీసేనకు ఘన విజయం
-అందుకే దుగ్ధ మసాలాలు.. కక్ష కారాలు చల్లి కథనం
మెట్రో రైలు బోగీల్లో తెలంగాణ వ్యతిరేక కుట్రలు పోగవుతున్నాయి! హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చాటే మెట్రో పట్టాలపై సీమాంధ్ర కుతంత్రాలు తిష్ఠవేస్తున్నాయి! తెలంగాణలో ప్రాజెక్టులు ముందుకు కదలవన్న ఒక అపప్రథ మోపేందుకు భారీస్థాయిలో విద్రోహపుటాలోచనలు మెట్రో స్టేషన్లకు చేరుకుంటున్నాయి! ఎలాంటి సమస్యలు లేకున్నా.. ఉన్నాయంటూ ఎల్‌అండ్‌టీ రాసిన లేఖ వెనుక.. దానిని మహాప్రసాదంగా స్వీకరించడమేకాక, దానికి చిలువలు పలువలు చేర్చి సీమాంధ్ర పత్రికలు వండివార్చిన కథనాల వెనుక కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తున్నది! తెలంగాణ అభివృద్ధిని సహించలేని ఏపీ రాజకీయ నాయకత్వ అక్కసు గోచరిస్తున్నది! ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో! ఈనాడు తెలంగాణ ఇంటిపార్టీ పాలనా సమయంలో! అదే తరహా కుట్రలు.. అదే తరహా దుగ్ధ! నాడు తెలంగాణ రాకూడదని.. నేడు వచ్చిన తెలంగాణ సెహభాషనిపించుకునేలా మనజాలకూడదని! అందుకే విచ్చుకత్తులు దూసుకొచ్చాయి! తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలన్న ఆలోచనతో మెట్రోరైల్ నిర్మాణ సంస్థ రాసిన లేఖలోని కొన్ని భాగాలను ఎత్తిచూపుతూ మొత్తంగా తెలంగాణ ఉనికిని ప్రశ్నించేందుకు సీమాంధ్ర పత్రికల దుస్సాహసం! తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డే దుర్మార్గం! కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాల్జేసే కుయుక్తి! కానీ.. ఈ కుట్రబాజీల దుష్టయత్నాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది! లేని సమస్యలపై రాద్ధాంతం చేస్తున్న ఎల్‌అండ్‌టీకి తలంటుపోసింది. 


metrorail-eenaduబిజినెస్ చేస్తున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అంటూ మెట్రో నిర్మాణ సంస్థను నిగ్గదీసింది! పత్రికలకు లీకులు ఇచ్చి.. తమ ముందు అమాయకుల్లా నిలబడుతున్నారని ఆగ్రహించింది! నీళ్లు నమిలిన ఎల్‌అండ్‌టీ.. ఈ లీకుల వ్యవహారంతో తమకు సంబంధం లేదని సర్దుకునే ప్రయత్నం చేసినా.. విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో తోకముడిచింది. మెట్రో నిర్మాణం నుంచి వైదొలిగేది లేదని మీడియాకు వివరణ ఇచ్చుకుంది. ప్రభుత్వం నుంచి సహకారం పూర్తిస్థాయిలో ఉన్నదన్న వాస్తవాన్ని పత్రికాముఖంగా ఒప్పుకుంది!


కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, దానికి నేతృత్వం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ను అప్రదిష్ఠపాల్జేసేందుకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ముసుగులో భారీ కుట్రకు తెరలేచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్రో రైల్ నిర్మాణ సంస్థ తన స్వార్థంకోసం ఒక విధంగా ప్రయత్నిస్తే, దానిని వాడుకుని సీమాంధ్ర పత్రికలు ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మేలుచేసేందుకు మరోవిధంగా కుట్ర చేస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తున్నది. జరిగిన పరిణామాలు గమనిస్తే అవి నిజమేననే అభిప్రాయాలు బలపడుతున్నాయి. అందులో ఒకటి మెట్రో రైలు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టాలని ఎల్‌అండ్‌టీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ లేఖరాసింది. అప్పుడు లీక్‌కాని వార్త.. లీక్‌కు అర్హత లేని వార్త.. ఇప్పుడే లీక్ కావడం ఒక ఎత్తయితే.. ఒకనాడు మోడీని, చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పత్రికలు.. తెలంగాణ ఉద్యమంపై విషంగక్కిన పత్రికలు ఇప్పుడు ఉప ఎన్నికల్లో అదే బీజేపీ పతనాన్ని, మరోవైపు టీఆర్‌ఎస్ ఘన విజయాన్ని మరుగునపర్చేందుకు మెట్రో లేఖను పావుగా వాడుకున్నాయని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి అవకాశం కోసం చూస్తున్న సీమాంధ్ర పత్రికలకు మెట్రోరైల్ సీఈవో గాడ్గిల్ పన్నిన కుయుక్తి ఆసరాగా దొరికింది. ఇదే మహాభాగ్యమనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వాటికి మరికాస్త మసాలా జోడించి, తప్పులతడక కథనాన్ని వండి వార్చి, తెలంగాణ ప్రభుత్వంపై తమ అసూయను, అక్కసును వెళ్లగక్కాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితం ప్రచురించాల్సిన రోజే ఈ వంటకాన్ని ముందుకు తెచ్చాయని పలువురు అంటున్నారు. అందుకే 2014 ఫిబ్రవరిలో ఇదే విషయంపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాస్తే పట్టించుకోని సీమాంధ్ర పత్రికలు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాసిన మొదటి లేఖనే ఆహా అంటూ స్వీకరించాయని అంటున్నారు.

ఎల్‌అండ్‌టీకి, బాబుకు మధ్య బంధం!

మెట్రో నిర్మాణ సంస్థ రాసిన లేఖ వెనుక ఏపీ అధికారవర్గాల కుట్ర దాగి ఉందన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఎల్‌అండ్‌టీ సంస్థకు మధ్య అవినాభావ సంబంధం ఉందని జేఏసీ నేతలు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయంలోని డీ బ్లాక్ నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బ్లాక్ నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

నాలుగో వంతు నిధులు దుర్వినియోగ మయ్యాయని విజిలెన్స్ నివేదికలు ఇచ్చినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస చర్యలు తీసుకోలేదని జేఏసీ నేత ఒకరు గుర్తు చేశారు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఎల్‌అండ్‌టీ వారు ఆనాడు టీడీపీ ఆఫీసుకోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ అనుబంధంతోనే ఎల్‌అండ్‌టీ యాజమాన్యం చంద్రబాబు ప్రకటించిన కొత్త రాజధాని కాంట్రాక్టులను పొందేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానికి అప్రదిష్ట అంటగట్టే దుస్సాహసానికి ఒడిగట్టిందని టీఆర్‌ఎస్ నాయకుడొకరు అన్నారు. ఇందుకు ఏపీ అధికారవర్గాలు కూడా కొత్త రాజధాని నిర్మాణంలో కాంట్రాక్ట్‌ల ఆఫర్ ఇచ్చాయని తెలుస్తున్నది.

కిరణ్ హయంలోనూ ఎల్‌అండ్‌టీది ఇదే మాట

ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఆయా సమస్యలపై ఇప్పటి వరకూ ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకు మధ్య ఎనిమిదిసార్లు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. 2014 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి రాసిన లేఖలోనూ ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వమే చేపట్టాలని, తమను రిలీవ్ చేయాలని స్పష్టంగా రాశారు.

ఈ లేఖను ఆనాడు ఎల్‌అండ్‌టీ సంస్థ పత్రికలకు లీక్ చేయలేదు. సీమాంధ్ర పత్రికలు కూడా ఈ విషయాలను వెల్లడించేందుకు ప్రయత్నం చేయలేదు. ఈ లేఖకు బదులుగా ఈ ఏడాది మే 12న హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి ఎల్‌అండ్‌టీకి లేఖ రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వీకరించాలనే ప్రతిపాదనకు తాము సుముఖంగా లేమని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రం నుంచే ఎల్‌అండ్‌టీ ఈ వైఖరితో ఉంది. ఒకే విషయంపై పదేపదే లేఖలు రాస్తున్న ఎల్‌అండ్‌టీ వ్యవహారం తెలిసినప్పటికీ, కావాలని దుగ్ధతో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సదరు లేఖను ప్రముఖంగా ప్రచురించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబుకు మేలుచేయాలన్న తపనలో మునిగితేలుతున్న ఈ సీమాంధ్ర పత్రికలు.. ఏకంగా తెలంగాణకు పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా దుస్సాహసం చేస్తున్నాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇందుకు ఎల్‌అండ్‌టీ కూడా తోడ్పాటునందించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించడం, బుధవారంనాడు పత్రికల్లో వచ్చిన ఆంశాన్ని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించడం చూస్తే అంతా కుట్రపూరితంగా జరుగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 8 ఉత్తర ప్రత్యుత్తరాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వని ఈ సీమాంధ్ర పత్రికలు ఈ నెల 10న రాసిన లేఖను పాత లేఖలోని అంశాలతో కలగలిపి పనిగట్టుకుని భూతద్దంలో చూపుతూ అత్యధికప్రాధాన్యం ఇవ్వడం వెనుక మతలబులేంటన్న చర్చ జరుగుతున్నది.తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సీమాంధ్ర పక్షపాతంతో వ్యవహరించిన ఈపత్రికలు తెలంగాణరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని పలువురు తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జంట లక్ష్యాలతో ఎల్‌అండ్‌టీ!

జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎల్‌అండ్‌టీ లక్ష్యం రెండు విధాలుగా ఉందన్న అభిప్రాయాన్ని తెలంగాణవాదులు వ్యక్తంచేస్తున్నారు. త్వరలో ఏపీ రాజధాని నిర్మాణ పనులు మొదలుకావాల్సి ఉంది. అక్కడ భారీ స్థాయిలో కాంట్రాక్ట్ పనులు ఎదురు చూస్తాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురి చేస్తే.. చంద్రబాబు తమకు మార్కులేసి, ఏపీ రాజధాని కాంట్రాక్ట్‌లు ఇస్తారనేది ఒక ఆలోచనైతే.. తాము కోరుకుంటున్న అంశాలపై పత్రికల్లో ప్రముఖంగా వస్తే తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి గురై, తమకు లొంగి, సమస్యలను సత్వరమే పరిష్కరిస్తుందనేది మరొక ఆలోచనగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో మెట్రో రైల్ నిర్మాణానికి ఎలాంటి సమస్యలూ లేవు.

ఒక్క అలైన్‌మెంట్ మార్పు అంశం.. అదీ అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ పాయింట్ల వద్దే పెండింగ్‌లో పడింది. అసెంబ్లీ వద్ద భద్రతాకారణాలు తదితర అంశాలతో,సుల్తాన్ బజార్ వద్ద ఏళ్లతరబడి ఉంటున్న మార్కెట్‌ను బలి చేయకూడదన్న ఆలోచనతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్పుపై పట్టుదలతో ఉంది. దీంతో బెదిరింపుల ద్వా రా అలైన్‌మెంట్ మార్పుల విషయంలో పెద్ద మొత్తం లో డిమాండ్ చేయవచ్చనే దురాశ కూడా ఎల్‌అండ్‌టీకి ఉన్నదనే అభిప్రాయం ఉంది. వీటన్నింటికీ తోడు ప్రాజెక్టు ఆలస్యమైతే దాన్ని తెలంగాణ ప్రభుత్వంపై నెట్టివేసే ప్రధాన కుట్ర కూడా ఇందులో దాగి ఉన్నదని తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. ప్రాజెక్టులో జాప్యం జరిగితే పెనాల్టీ క్లాజ్ కూడా ఉన్నందున ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వంపై తోసివేసేందుకు వీలుగా, లేఖల ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామని చెప్పుకునేందుకు కేసును బిల్డప్ చేసుకునేందుకే ఎల్‌అండ్‌టీ ఈ ప్రయత్నం చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని, ఇందుకు ప్రభుత్వ తోడ్పాటు అవసరమని వాదించి, కనీసం 3 వేల కోట్లు అదనంగా పొందాలనే పేరాశతో ఎల్‌అండ్‌టీ ఈ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. లాభాలు పెంచుకునే దురుద్దేశంతో జరిగిన ఈ వ్యవహారాన్ని రాష్ట్రప్రభుత్వం ముందుగానే పసిగట్టి, ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని వివరిస్తూ అలైన్‌మెంట్ మార్పు వల్ల నిర్మాణ పనులు ఆగిపోయిన దాఖలాలు లేవని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్‌లో అన్నిచోట్ల పనులు యథాతథంగా జరుగుతున్నందున కార్మికులకు పనిలేని పరిస్థితి లేదు.

భూసేకరణ చట్టం అన్ని రాష్ర్టాలు అమలుచేయక తప్పదని, ఈ విషయంలో ఏ విధంగా ఎల్‌అండ్‌టీకి సహకరించాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అలైన్‌మెంట్ మారిస్తే జరిగే నష్టంపై ఒకవైపు పరిశీలన జరుపుతూ మరోవైపు పనులు కొనసాగేందుకు అవకాశ మిచ్చి, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఒత్తిడి ఇప్పటివరకు చేయలేదని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి ఇలా ఉండగా ఎల్‌అండ్‌టీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణప్రభుత్వాన్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇబ్బంది కలిగేలా చర్యలు తీసుకుంటున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజినెస్ చేస్తున్నారా?బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?

ఎల్‌అండ్‌టీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పత్రికలకు లీకులు ఇస్తూ అమయాకుల్లా రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలకు హాజరైన ఎల్‌అండ్‌టీ ప్రతినిధుల ధోరణిని కేసీఆర్ తప్పుపట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పతాక శీర్షికలో మెట్రో మీరే కట్టుకోండి వచ్చిన వార్తలపై కేసీఆర్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌టీ సీఈవో గాడ్గిల్‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ మీరు బిజినెస్ చేస్తున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు? ఒక పథకం ప్రకారం ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారా? ఆ రెండు పత్రికలకు లీకులు ఇస్తారు.

మరుసటి రోజు అవి ప్రచురితం కాగానే ఉదయమే టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతారు. ఈ ప్రభుత్వం మీకు ఎలా కనిపిస్తున్నది? ఏమీ తెలియని అమాయకుల్లా మా ముందు నిలబడతారు. నాపై వ్యక్తిగతంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఫర్వాలేదు, కాని ప్రభుత్వంపై, తెలంగాణపై ఇలాంటి కుట్రలు చేస్తే సహించేది లేదు అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కొనసాగించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలాంటి కుట్రలు చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు.

మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి సూచనల ప్రకారం ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు? అని వారిని నిలదీశారు. అయితే తాము ఏ పత్రికలకు లీకులు ఇవ్వలేదని, గాడ్గిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా సమావేశంలోనే ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారి జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉంటాయి. ఈ లీకేజీల వ్యవహారంపై విచారణకు ఆదేశించమంటారా? ఇందులో మెట్రో యాజమాన్యం ప్రమేయం ఉందో, లేదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అన్నారు. అయితే లీకు ఇవ్వలేదని చెప్పేందుకు వారు ప్రయత్నించగా మీరు దానికి కట్టుబడి ఉంటే ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఎల్‌అండ్‌టీ సీఈవో గాడ్గిల్ సచివాలయంలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

పని ఆగలేదు కదా

ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో బుధవారం జరిగిన చర్చలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మెట్రో రైలు నిర్మాణ పనులకు ఇబ్బంది ఏమీ రాలేదు. ట్రాఫిక్ అధికంగా ఉండే నగరంలోని ఖైరతాబాద్‌వంటి ప్రాంతాల్లోనూ పనులకు అవకాశం కల్పించారు. అలైన్‌మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ దానిపై ఒత్తిడి పెంచలేదు.

ఈ విషయంలో మార్పుల వల్ల ఎల్‌అండ్‌టీకి నష్టం వస్తే న్యాయ సమ్మతంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగానే ఉంది. కొత్తగా వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. అయినప్పటికీ ఎల్‌అండ్‌టీ వారు సమస్యలు ఉన్నాయని లేఖలు రాయడంలో ఔచిత్యం లేదు. ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తున్నది. సమస్యలు అన్నింటిని సానుభూతిగా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నది అని సీనియర్ అధికారి ఒకరు టీ మీడియాకు చెప్పారు. భూసేకరణ చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల ఎల్‌అండ్‌టీకి వచ్చే నష్టం లేదు. అయినప్పటికీ హైదరాబాద్ బ్రాండ్‌ను చెడగొట్టేలా మెట్రో రైలు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి, ఇతర అధికారులు తప్పు పడుతున్నారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వంటి విషయాలు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును ప్రస్తావించాల్సిన అవసరం ఎల్‌అండ్‌టీకి ఏ మాత్రం లేదు. కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే లక్ష్యంతో ఎల్‌అండ్‌టీ వ్యవహరించిందని అంటున్నారు.

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి