-ఆత్మబంధువులు
-నేటితో కేసీఆర్ పాలనకు వంద రోజులు పూర్తి
-నేడు ప్రజాకవి కాళోజీ శతజయంతి వేడుక
-కాళోజీ కేంద్రం శంకుస్థాపనకు వరంగల్‌కు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్
ఆ ఇద్దరిదీ ఉద్యమ బంధం. తెలంగాణ పోరుపథం. వాళ్లది వీడదీయరాని తెలంగాణ ఆత్మగౌరవబంధం. వాళ్లిద్దరూ తెలంగాణకు ఆత్మబంధువులు. ఒకరు తన కవితాధాటితో తెలంగాణ అన్యాయాన్ని ఎదిరించి నిలిచిన రౌద్రముని. ఇంకొకరు తెలంగాణ కోసమే పుట్టిన అపరభగీరథుడు. తన అకుంఠిత దీక్షాదక్షతలతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి, స్వరాష్ట్ర స్వప్నంకోసం అహర్నిశలు పోరాడి నిలిచి గెలిచిన ధీరుడు. వారే ఒకరు ప్రజాకవి కాళోజీ. ఇంకొకరు ప్రజారంజక పాలనాధీశుడు కేసీఆర్. ఇవ్వాళ ఒకరిది శతజయంతి ఉత్సవం. ఇంకొకరిది శతదిన పాలనా సంరంభం. నిజంగా ఇది అపురూప సన్నివేశం. అనిర్వచనీయ సందర్భం. కాళోజీ కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ పాలనకు ఇవ్వాళ్టితో వంద రోజులు పూర్తయ్యాయి. -నేటితో కేసీఆర్ పాలనకు వంద రోజులు పూర్తి
-నేడు ప్రజాకవి కాళోజీ శతజయంతి వేడుక
-కాళోజీ కేంద్రం శంకుస్థాపనకు వరంగల్‌కు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్
అన్యాయ్యాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు అన్న కాళోజీ స్ఫూర్తితో ఉద్యమాన్ని మొదలుపెట్టి తుదకు సాధించి రెండున్నర జిల్లాల రెండున్నర కులాల సంపన్న వర్గాల కబంధ హస్తాల్లోంచి తెలంగాణ తల్లిని విముక్తం చేసిన ధన్యుడు కేసీఆర్. కాళోజీ కవితలు ప్రజల నాల్కల్లో ఇవ్వాళ నానడానికి ఒకరకరంగా కారకుడు కేసీఆర్. తెలంగాణ భాషను, యాసను కించపరుస్తున్న నేపథ్యాన్ని గ్రహించి.. తన ప్రసంగాల్లో ఊరూరా ఉగ్రనరసింహుడై మాటను మండించిన ధిక్కార స్వరం కేసీఆర్‌ది. ఏ భాషను ఎక్కిరించారో అదే భాషను అందుకొని ఇవ్వాళ అధికార పీఠమెక్కించిన ఘనత కేసీఆర్‌ది. సమైక్యాంధ్ర సర్కారు తెలంగాణ అణచివేత, దోపిడీ, పీడనలపై కాళోజీ అక్షర శరాలు సంధిస్తే కేసీఆర్ వాటిని ఆయుధాలుగా మలచుకున్న కార్యదీక్షాపరుడు.
అన్యాయంపై...
అన్యాయాన్నెదిరిస్తే నాగొడవకు సంతృప్తి/అన్యాయం అంతరిస్తే నాగొడవకు ముక్తి ప్రాప్తి/అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు.. అన్న కాళోజీ పద్య పాదాలను జీవితపథంలా ఎంచుకొని ఉద్యమించిన పోరు కెరటం కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లు ప్రజలకు ప్రజల భాషలో వివరించి, ఉద్యమకార్యోన్ముఖుల్ని చేయడంలో కేసీఆర్ తనకు తానే సాటి అనిపించుకున్నారు.
వనరుల దోపిడి, మానవ వనరుల అణచివేతను ఊరూరా ఉద్యమ ప్రసంగాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బాటలు వేసినవాడు కేసీఆర్. ప్రాంతేతరుడు దోపిడి చేస్తే ప్రాంతం దాకా తన్ని తరుముతం/ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తోనే పాతరవేస్తం.. లాంటి కాళోజీ కవితాస్ర్తాలను సంధించి తెలంగాణవ్యాప్తంగా ప్రజల్ని ఉగ్రనర్సింహులను చేసి, దోపిడి చేసే సీమాంధ్ర దురమదాంధులను తెలంగాణ పొలిమేరల దాకా సాగనంపిన సాహసి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందు కేసీఆర్ స్వయంగా వరంగల్‌కు వచ్చి కాళోజీ ఇంటికెళ్లి ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. అప్పటినుంచి మడమ తిప్పని పోరు సలిపి, తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారు. ఆనాడు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, నాగిళ్ళ రామశాస్త్రి తదితరుల సమక్షంలో ఆనాడు కేసీఆర్ కాళోజీ ఇంటికి వెళ్లి ఆయన సహకారాన్ని,ఆశీస్సులను అందుకున్నారు.
కేసీఆర్ వెళ్లిన తరువాత..
కాళోజీ ఇంటికి కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరువాత అప్పుడున్న రాజకీయ నాయకులు, తెలంగాణ కోసమే పనిచేస్తున్నామనేవాళ్లు కొంతమంది కాళోజీతో మీరు ఎవరు పడితే వారికి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. కానీ ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీ అవసరమా? అప్పుడున్న పార్టీలతో సాధ్యం కానిది ఇక ఆయనతోటి అవుతుందా?.. అని అడగబోతుండగా కాళోజీ వారించి అరేయ్.. మీకు చాతనైతే చేయండి, లేకపోతే ఊరుకోండి. నడిచే వాని కాళ్లల్లో కట్టెలు పెట్టకండి. మీరు చెబుతున్న పార్టీలన్నింటికీ ఒక హైకమాండ్ ఉంది.
కానీ వానికి వాడే హైకమాండ్, పార్టీలకు వాడే మొగుడు అని నిష్కర్షగా మొహాలమీద చెప్పి, వాళ్ల నోళ్లు మూయించిన ఘనాపాఠి కాళోజీ. కాళోజీ అన్నట్టుగానే టీఆర్‌ఎస్‌కుగానీ, కేసీఆర్‌కుగానీ హైకమాండ్ ఎవరూ లేరు. ఇదే విషయాన్ని కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు కూడా. ప్రజలే తన హైకమాండ్ అంటూ విస్తృత ప్రజా ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ సాధించారు. కాళోజీకి, కేసీఆర్‌కు ఉన్న ఉద్యమానుబంధాలను వారి సామీప్యతను, సాంగత్యాన్ని, సమరశీల స్వభావాలు ఏకోన్ముఖంగా కలగలిసి తెలంగాణ. అచ్చమైన తెలంగాణకు మచ్చలేని పోరాట పటిమకు వారిద్దరూ ఆత్మగౌరవ బంధువులు.
శతదిన దిన సంరంభం
కాళోజీ శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు వందరోజుల సందర్భం. తెలంగాణ ప్రాంతానికి ఒక అపురూప జ్ఞాపకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పోరాటాల పోరుఖిల్లా వరంగల్‌కు.. అదీ కాళోజీ గడ్డమీద కాలుపెడుతున్నాడు. ఈ వందరోజుల్లో ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ప్రజారంజక పాలనను అందిస్తూ దేశం గర్వించదగ్గ, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న పాలనాధ్యక్షుడుగా కేసీఆర్ నిలిచిపోతారు.
తనది మాటల పాలన కాదు, చేతల పాలన అని రుజువు చేసేందుకు చరితార్థులైన కాళోజీ లాంటి మహనీయుల ఆశయాలకు అద్దం పట్టేలా పాలన అందిస్తామని మరోసారి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు వరంగల్‌కు వస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒకే కార్యక్రమానికి, అదీ ప్రజాకవి కాళోజీ శతజయంతి ఉత్సవాలకు రావడం అన్నది అరుదైన, అపురూప ఘట్టంగా కాళోజీ ఫౌండేషన్ సహా ప్రజలందరూ కొనియాడుతున్నారు. మొదటిసారిగా కాళోజీ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తుండడమంటే, తెలంగాణ స్వీయ అస్తిత్వపతాకాన్ని సమున్నతంగా ఎగరేయడమే. ప్రజాకవికి పట్టాభిషేకం చేయడమే.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి