ప్రభుత్వం ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు దానికి మద్దతు ఇవ్వడం పత్రికల బాధ్యత. ఈ కనీస సామాజిక బాధ్యత విస్మరించి, ఒక కాంట్రాక్టు కోల్పోవడమే పెద్ద ప్రమాదమైనట్టు కథనాలు ప్రచురించడం నైతికత గల జర్నలిజం అనిపించుకోదు. ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒక కాంట్రాక్టు సంస్థకు లొంగిపోతే తప్పు పట్టడం వేరు. కానీ కాంట్రాక్టు సంస్థ బెదిరింపులను ఆసరాగా
చేసుకుని అవే సమంజసమైనవనే విధంగా కథనాలు అల్లడం ప్రజా వ్యతిరేకతను ప్రదర్శించడమే.
చేసుకుని అవే సమంజసమైనవనే విధంగా కథనాలు అల్లడం ప్రజా వ్యతిరేకతను ప్రదర్శించడమే.
సీమాంధ్ర పత్రికా వ్యవస్థ తెలంగాణ మీద ఎట్లా విషం కక్కుతుందో బుధవారం నాడు తెల్లారగానే మరోసారి వెల్లడైంది. రెండు దిన పత్రికలు మెట్రోరైలు ప్రాజెక్టుపై వెలువరించిన వార్తా కథనాలు అ(ర్ధ) సత్యాలతో లుకలుకలాడుతున్నాయి. మెదక్ ఉప ఎన్నికలో తెలంగాణ రాజకీయ శక్తి విజయం సాధించడం చర్చానీయాంశంగా మారిన దశలో ఈ వాస్తవాన్ని కనుమరుగు చేసే విధంగా రెండు దినపత్రికలు మెట్రో రైలు కథనానికి విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించడం గమనార్హం.
ఎల్ అండ్ టి ప్రభుత్వానికి లేఖలు రాయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే నాలుగైదు సార్లు లేఖలు రాసింది. 2014 ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టును టేకోవర్ చేయాలని ఎల్ అండ్ టి అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాసింది. కానీ ఆ రెండు పత్రికలు అప్పుడెప్పుడు వార్తలు రాయలేదు. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం ఇదే మొదలు. అంత మాత్రం దానికే ఆ పత్రికలు గోరంతలు కొండంతలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌కు పెట్టుబడులు రావని సీమాంధ్ర మీడియా ఎంతో కాలంగా ప్రచారం చేస్తున్నది. మెట్రో ప్రాజెక్టుపై కథనాలు కూడా ఇదే కోవలో ఉండడం గమనార్హం. ఎల్ అండ్ టి సంస్థ బెదిరింపులకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన ఈ కథనాలలో తెలంగాణ ప్రజల మనోభావాల ప్రస్తావన మచ్చుకైనా లేదు.
ఏ వ్యాపార సంస్థ అయినా ఒప్పందం కుదిరే దశలో, ఆ ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ రాయితీలు రాబట్టుకోవడానికి, అధిక లబ్ధి పొందడానికి యత్నించడం ప్రపంచ వ్యాప్తంగా జరిగేదే. ఎల్ అండ్ టి మెట్రోరైలు సంస్థ ఎన్నో సమస్యలను ప్రస్తావిస్తూ కొన్ని నెలలుగా- తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే- ఇటువంటి లేఖలు రాస్తున్నది.
ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ ప్రాజెక్టు నుంచి విరమించుకుంటామని కూడా హెచ్చరించింది. ఇది ఒత్తిడి తేవడానికి చేసిన బెదిరింపు మాత్రమే అని సంస్థ వైఖరిని, ఈ లేఖల సారాన్ని మొత్తంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. నిజాయితీగా ఆలోచించే వారెవరైనా ప్రజా ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు లొంగకూడదని కోరుకుంటారు కానీ, ప్రభుత్వ నైతిక స్థెర్యం దెబ్బతీసే కథనాలను ప్రచారం చేయరు. ఈ వార్తల వల్ల ఇబ్బంది పడిన ఆ కాంట్రాక్టు సంస్థ అధికారి కూడా తమ లేఖలలోని ఎంపిక చేసిన భాగాలతో కథనాలను రూపొందించారని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి నుంచి వివాదాస్పదమైనది. ఈ ప్రాజెక్టులో రవాణా వ్యవస్థ స్వభావం కన్నా రియల్ ఎస్టేట్ లక్షణమే ఎక్కువగా ఉందనేది ప్రధాన ఆరోపణ.
ఎల్ అండ్ టి సంస్థ లేఖలు పరిశీలించినా ఈ ఆరోపణ ధ్రువపడుతుంది. సీమాంధ్ర పాలనలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు అవినీతి పుట్టలని వెల్లడవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టు విషయమై ఆచితూచి అడుగు వేయడం అవసరం. రాష్ట్ర విభజన జరగనే జరగదని తాము నమ్మినట్టు ఈ సంస్థ లేఖలో పేర్కొన్నంత మాత్రాన, ఆ కన్నీటికి కరిగిపోవాలన్నట్టుగా సీమాంధ్ర పత్రికలు గొల్లుమంటున్నాయి. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక ఆనవాళ్ళు దెబ్బతీసే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టడాన్ని తెలంగాణవాదులు మొదటి నుంచి నిరసిస్తూనే ఉన్నారు. అందుకే సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో నిర్మాణాన్ని నిలిపివేయవలసి వచ్చింది. ఈ మార్గాలలో మెట్రోరైలు నిర్మాణానికి సీమాంధ్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తప్పు పట్టాలె కానీ పనులు నిలిచి పోవడాన్ని కాదు.
తెలంగాణలో కానీ, యావత్ భారతంలో కానీ ఒకప్పుడు సమాజ సంక్షేమమే పరమావధిగా నడిచిన పత్రికలు ఎన్నో ఉండేవి. పాత్రికేయులకూ అటువంటి నిబద్ధత ఉండేది. సురవరం ప్రతాప రెడ్డి గోల్కొండ పత్రిక తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది. షోయెబుల్లాఖాన్ ప్రజల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. అంతే తప్ప ప్రైవేటు సంస్థలు, పెట్టుబడులే గొప్పవని, అవి ప్రజల మనోభావాల కన్నా మిన్న అని చెక్కభజనలు చేయలేదు. ఆనాటి పత్రికల వల్ల, పాత్రికేయుల వల్లనే ఇవాళ పత్రికావ్యవస్థకు ఈ మాత్రం గౌరవం ఉన్నది. వారు ప్రజల పట్ల తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించడం ద్వారానే పత్రికా వ్యవస్థను బలోపేతం చేశారు. అంతే తప్ప తమకు హక్కులున్నాయంటూ విర్రవీగుతూ సమాజాన్ని, ప్రజలను అవమానించడం గతంలో ఏనాడూ లేదు. ఇటీవలి కాలంలో పత్రికలకు, టీవీ చానెళ్ళకు విశ్వసనీయత తగ్గిందంటే అందుకు కారణం సీమాంధ్ర మీడియా ప్రజా వ్యతిరేక పోకడలే.
కొన్ని దిన పత్రికలు బుధవారం మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రచురించిన కథనాల తీరు ఎవరికి అనుకూలంగా ఉన్నది? ప్రజా ప్రభుత్వానికి, ఒక కాంట్రాక్టు చేపట్టిన వ్యాపార సంస్థకు మధ్య విభేదాలు వచ్చినప్పుడు పత్రికల మొగ్గు ఏ వైపు ఉండాలె. ప్రభుత్వం ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు దానికి మద్దతు ఇవ్వడం పత్రికల బాధ్యత. ఈ కనీస సామాజిక బాధ్యత విస్మరించి, ఒక కాంట్రాక్టు కోల్పోవడమే పెద్ద ప్రమాదమైనట్టు కథనాలు ప్రచురించడం నైతికత గల జర్నలిజం అనిపించుకోదు. ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒక కాంట్రాక్టు సంస్థకు లొంగిపోతే తప్పు పట్టడం వేరు. కానీ కాంట్రాక్టు సంస్థ బెదిరింపులను ఆసరాగా చేసుకుని అవే సమంజసమైనవనే విధంగా కథనాలు అల్లడం ప్రజా వ్యతిరేకతను ప్రదర్శించడమే.
ఒక్క మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలోనే కాదు, రివాజుగా ప్రజా ప్రయోజనాల కన్నా, కంపెనీలు, పెట్టుబడులే ప్రధానమన్నట్టుగా వార్తా కథనాలు వెలువడుతుండడం సిగ్గుపడవలసిన విషయం. హక్కులు, అధికారాలు పత్రికలకు ఆకాశం నుంచి ఊడి పడవు. హక్కులు ఉండేది ప్రజలకే. ఆ విస్తృత ప్రజా హక్కుల సంరక్షణలో భాగంగానే పత్రికలు తమ హక్కులను వెదుక్కోవాలె. ప్రజలపై విద్వేషం వెళ్ళగక్కే పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చడం ప్రజా ద్రోహమే అవుతుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి