గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 17, 2014

రాచరికం నుంచి.. ప్రజాస్వామ్యంలోకి...

బ్లాగువీక్షకులకు తెలంగాణ ప్రజలకు
తెలంగాణ స్వాతంత్ర్యదినోత్సవ
శుభాకాంక్షలు

-చరిత్రలో 1948 సెప్టెంబర్ 17
-ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్
-భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం
- ఐదురోజుల మహత్తర పోరు
- నైజాం పాలన చివరి ఘడియలు
తరతరాల రాచరిక పాలనకు చరమగీతి పాడిన రోజు. హైదరాబాద్ సంస్థానంలో స్వేచ్ఛా వాయువులు వీచిన రోజు 1948 సెప్టెంబర్ 17. ఆపరేషన్ పోలో పేరిట సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు జరిగిన పోలీస్ యాక్షన్ ప్రజాస్వామ్య పాలనకు దారులేసింది. అది విలీనమని కొందరు.. విమోచనమని మరికొందరు.. విద్రోహమని ఇంకొందరు? ఇలా ఎవరి వాదాలు వారికున్నాయి. మరి ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సెంటర్‌స్ప్రెడ్‌లో చూడండి.
nehruభారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించింది. కానీ హైదరాబాద్ సంస్థానం అప్పటికింకా రాజరిక పాలనలోనే కొనసాగుతోంది. బ్రిటీష్ వాళ్లు దేశాన్ని విడిచివెళ్లే నాటికి దేశంలో 565 సంస్థానాలున్నాయి. అన్ని సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమవడానికి సిద్ధమవగా అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. అప్పటికి హైదరాబాద్ సంస్థానంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉండేవి. విశాలమైన భూభాగం, నిజాం ప్రభుత్వానికి సొంత ఆర్మీ, ఎయిర్‌లైన్, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, పోస్టల్, కరెన్సీ..

రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ ఉండేది. అంతటి వైభవోపేతమైన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడం ఇష్టంలేని నిజాం ప్రభుత్వంతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని సైతం ఉల్లఘించాడు. మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటెన్ భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు రాజకీయ ప్రయత్నాలెన్ని చేసినా ఫలితం లేకపోయింది.

charminarమరోవైపు సంస్థానంలో రజాకార్ల అరాచకాలు పెరగడంతో భారత యూనియన్ నేరుగా రంగంలో దిగింది. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి హోం మినిస్టర్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌లోకి భారత సైన్యాన్ని పంపడానికి నిర్ణయించుకున్నారు. పరిస్థితిని గమనించిన నిజాం భారత ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు. నిజాం విదేశాంగ మంత్రి నవాబ్ మోయిన్ నవాబ్‌జంగ్ సారధ్యంలో ప్యారిస్ వెళ్లి 1948 ఆగస్టులో ఫిర్యాదు చేశారు. కానీ ఆ అవకాశం లేకుండా అనుకున్న దానికి ముందే భారత సైన్యం దూసుకొచ్చింది.

యుద్ధం మొదలైంది..

Golconda1948 సెప్టెంబర్ 12 అర్ధరాత్రి భారత సైన్యానికి ఆదేశాలు అందాయి. హైదరాబాద్ సంస్థానం సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. దాడికి దళాలు కదం తొక్కాయి. హైదరాబాద్ సంస్థానాన్ని రెండువైపుల నుంచి ముట్టడించాలన్నది యూనియన్ సైన్యం పథకం. జనరల్ రాజేంద్ర సింహ్వాజీ ఆధ్వర్యంలో ఒక భాగం విజయవాడ మీదుగా, బీదర్ మీదుగా మేజర్ జనరల్ జేఎన్.చౌదరి ఆధ్వర్యంలో మరో బృందం బయలుదేరింది. వైమానిక దళాన్ని సిద్ధం చేసుకున్నారు. వినియోగించాలనుకున్నారు. ఆపరేషన్ పోలో పేరిట జరిగిన ఈ పోలీసు చర్యకు అప్పటి భారత మిలిటరీ చీఫ్ జేఎన్.చౌదరి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 16 నాటికి భారత ప్రభుత్వం దాడులు ప్రారంభించవచ్చనుకున్న నిజాం సైన్యం ఆలోచనలను తారుమారు చేస్తూ సెప్టెంబర్ 13 నాటికే భారత సైన్యం దూసుకొచ్చింది. పశ్చిమ దిక్కు నుంచి ముట్టడికి ఎక్కువ దృష్టిపెట్టింది.

HYDERABAD_PATసరిహద్దు ప్రాంతం నాల్‌దుర్గ్ దగ్గర నిజాం సైన్యం ప్రతిఘటిస్తుందనుకొని కొండలు అడవులు ఉండే ఆ ప్రాంతంలో భారత సైన్యం ముందే వైమానిక దాడులు చేసింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కొంనేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. నిజాం సర్వ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ అవసరమైతే భారత సైన్యాన్ని ఆరునెలల పాటు ప్రతిఘటించగలమని గొప్పలు చెప్పుకున్నా యుద్ధంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. భారత సైన్యం యుద్ధ ట్యాంకర్లు, ఆధునిక ఆయుధాలతో దూసుకురావడంతో నిజాం సైన్యం, రజాకార్లు నిలవలేక పోయారు.

కీలక దశ..

Hyderabad-State-Forces15వ తేదీ నాటికి భారత సైన్యం హైదరాబాద్ వైపుకు దూసుకు వస్తోంది. మేజర్ ధనరాజులు నాయుడు సారధ్యంలో తూర్పు దిక్కు నుంచి వస్తున్న భారత సైన్యానికి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో సూర్యాపేట వరకు వచ్చింది. అక్కడ కొద్దిమంది ఎదురుపడ్డా నిలవలేకపోయారు. ఈ దశలో నిజాం ప్రధాని లాయక్ సైన్యాధికారిని మార్చాలని ఆలోచించారు. అదే సమయంలో కళ్యాణి బీదర్ రోడ్డు మీద భారత్ సైన్యం కదలికలు మొదలైనట్లు ప్రధాని లాయక్ అలీకి సమాచారం అందింది.

దీంతో ప్రధాని భారత సైన్యాన్ని ప్రతిఘటించేందుకు రజ్వీ సైన్యాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే నాలుగు బెటాలిన్‌లు పంపించారు. సెప్టెంబర్ 16 ఉదయం వరకు హైదరాబాద్‌కు భారత సైన్యం 25కిలో మీటర్ల దూరంలోకి వచ్చేసింది. హైదరాబాద్ సంస్థానంలో భారత యూనియన్ ప్రతినిధి అయిన కేఎం. మున్షీని కంటోన్మెంట్ నుంచి ప్రధాని నివాసం రాజ్‌భవన్ పక్కనే ఉన్న లేక్ వ్యూ అతిథి గృహానికి తరలించింది. మరోవైపు ఖాసీ రజ్వీ జన్నాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తున్నాడు. యుద్ధంలో నిజాం సైన్యం వాస్తవ స్థితిని మార్చి రేడియోల్లో ప్రసారం చేస్తున్నారు.

చివరి అంకం..

meerusmanసెప్టెంబర్ 17 నాటికి పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. ఒకవైపు నుంచి రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడంటూ ప్రచారం. మరోవైపు నుంచి దూసుకొస్తున్న భారత సైన్యం. చేష్టలుడిగిన నిజాం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజాం భారత ప్రతినిధి మున్షీకి వర్తమానం పంపి పిలిపించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కింగ్ కోఠి రెసిడెన్సీలో నిజాం కలిసిన మున్షీకి పరిస్థితి అర్థమైంది. నిజాం ప్రధాని లాయాక్ అలీ రాజీనామాను మున్షీ చేతికిచ్చారు. ఏం చేయాలో పాలుపోవట్లేదన్నట్లు సందేహం వెలిబుచ్చారు. మున్షీ సలహా మేరకు నిజాం లొంగుబాటును అంగీకరించక తప్పలేదు. ఆ రోజు సాయంత్రం దక్కన్ రేడియోలో నిజాం లొంగిపోతున్నట్లు ఫర్మాణా చదివాడు. ఆ ప్రకటనతో ఒక శకం ముగిసింది. తరతరాల రాజరిక పాలన అంతమై ప్రజాస్వామం వైపు ప్రస్థానం ఆరంభమైంది.

ప్రజాస్వామ్యంలోకి...

Syed-Kasim-Razviసెప్టెంబర్ 18 మేజర్ జనరల్ జేఎన్.చౌదరి నాయకత్వంలో భారత సైన్యాలు హైదరాబాద్ నగరంలో ప్రవేశించాయి. నిజాం నియమించుకున్న తాత్కాలిక మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేశారు. మిలటరీ గవర్నర్‌గా చౌదరి రాష్ట్ర పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించారు. ఖాసీం రజ్వీ తదితర రజాకార్ నాయకులను నిర్భంధించారు. సైనిక న్యాయస్థానంలో రజ్వీపై విచారణ జరిగింది. బీబీనగర్ కేసు బహిరంగ విచారణలో రజ్వీకి జైలుశిక్ష విధించారు. 1957 వరకు శిక్ష అనుభవించిన రజ్వీ విడుదల తరువాత పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. దేశంలోని ఇతర సంస్థానాధీశుల మాదిరిగానే భారత యూనియన్‌తో 1949 ఫిబ్రవరిలో నిజాం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన అనుభవిస్తున్న వ్యక్తిగత హక్కులన్నింటినీ కొనసాగిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మేజర్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించడంతో నిజాం నామమాత్రపు అధినేతగా మారారు. అతడి సైనిక దళాలను రద్దు చేయడంతో పాటు.. అతడి ఆధీనంలో ఉన్న రాష్ర్టాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. మిలటరీ పాలన రెండు సంవత్సరాలు కొనసాగింది. అనంతరం ఎంకే. వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రజా ప్రతినిధులను రాష్ట్రేతర సివిల్ అధికారులనతో గూడిన ప్రభుత్వం 1950లో జూన్‌లో ఏర్పడింది. నిజాం రాజ ప్రముఖ్‌గా నియమించబడ్డారు. ఈ ప్రభుత్వం 1952 మార్చిలో సార్వజనీన ఎన్నికలు జరిగి ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడు వరకు పనిచేసింది.

సెప్టెంబర్ 17.. ఓ చారిత్రక దినం. తరతరాల రాచరిక పాలనకు చరమగీతి పాడిన రోజు. హైదరాబాద్ సంస్థానంలో స్వేచ్ఛా వాయువులు వీచిన రోజు. అవును.. 1948 సెప్టెంబర్ 17 నిజాం పాలన అంతమవడమే కాదు.. ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజు కూడా. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు మహాకవి దాశరథి. కోటి రత్నాల వీణే కాదు.. నిలువెల్ల గాయాల కోన కూడా ఇది. తెలంగాణ దారిపొడవునా పారిన నెత్తుటి చారికలు కనిపిస్తాయి. రాచరిక పాలనను, రజాకార్ల అరాచకాలను, భూస్వాముల ఆగడాలను, వలస దోపిడీని, పీడనను ఎదిరించి నిలిచిన చరిత్ర తెలంగాణ సొంతం.

త్యాగాల పునాదులపై స్వయం పాలనకు పాదులేసుకుంది తెలంగాణ. ఆపరేషన్ పోలో నాటి ఐదు రోజులు మిగిల్చింది విషాదమవునో కాదో కానీ..తెలంగాణ నేలపై తరువాత స్వేచ్ఛా వాయువులు వీచింది మాత్రం నిజం. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమవడమే అందుకు నిదర్శనం. ఇది విలీనమేనా? లేదా విలీనం పేరిట జరిగిన విద్రోహమా? లేక విమోచనమా? అన్నదానిపై ఎన్నో వాదాలు.. ఎన్నెన్నో చర్చలు నేటికీ నలుగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ కాసేపు పక్కనపెట్టి 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..

దక్కన్ రేడియో..

రెండు శతాబ్దాల అసఫ్‌జాహీల పాలన దక్కన్ రేడియో వేదికగా ముగిసింది. నిజాం సైన్యం లొంగిపోవడానికి గొంతు అందించింది. మారిన పరిణామాల నేపథ్యంలో మనం ఓడిపోయాం.. అంతా లొంగిపొండి అంటూ నిజాం స్వయంగా రేడియో స్టేషన్‌లో ఫర్మాణా చదివి వినిపించారు. దీంతో నిజాం సంస్థానంలోని సైనికులు, రజాకార్లు భారత ప్రభుత్వానికి తలొగ్గారు.

షా మంజిల్..

నేటి రాజ్‌భవనే నాటి షా మంజిల్. నిజాం ప్రధాని లాయక్ అలీ నివాసం. ఆ రోజు రాత్రి లాయక్ అలీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నిద్రలేదు. భారత సైన్యాలు దూసుకొస్తున్నాయి. బీబీనగర్ వరకు వచ్చాయనే సమాచారం ఫోన్ ద్వారా అందింది. నిజాం లాయక్ అలీ నేతృత్వంలోని మంత్రి వర్గాన్ని రద్దు చేస్తాడని తెలియగానే ఆయనలో ఆందోళన మొదలైంది. చెమటలు పట్టాయి. లాయక్ అలీ నిజాం సామ్రాజ్యపు చివరి క్షణాలకు షా మంజిల్ వేదిక అయింది.

కింగ్ కోఠి రెసిడెన్సీ

కోఠి రెసిడెన్సీ నిజాం అధికారిక నివాసం. నిత్యం రాజసం ఉట్టిపడే ఈ భవనంలో సెప్టెంబర్ 17న విషాదం అలుముకుంది. అధికారం చేజారుతోందనే ఆందోళన నిజాంని ఉక్కిరిబిక్కిరి చేసింది. అధికార యంత్రాంగం, మంత్రులు రాజీనామాతో నిరాశ ఆవహించింది. వేగులు భారత సైన్యం చుట్టుముడుతోందన్న సమాచారాన్ని అందించారు. భవిష్యత్తు అంతుచిక్కక నిజాం ఆలోచనలో మునిగిపోయాడు. లొంగుబాటు తప్పదనే నిర్ణయాన్ని ఈ వేదిక నుంచే తీసుకోవడం గమనార్హం.

ఇదీ నాటి స్థితి..

విస్తీర్ణం: 82,698 చదరపు మైళ్లు
జనాభా: 16.34 మిలియన్లు
హిందువులు: 35 శాతం
ముస్లిం: 12శాతం
(1941 సెన్సెక్స్ ప్రకారం)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మధుసూధన్ గారు

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు స్వామిగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి