గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 01, 2015

పాలమూరు, డిండికి ...అబద్ధాల ఆంధ్ర బాబు అడ్డుపుల్ల!!!

-అసత్యాలు, అబద్ధాలతో సీడబ్ల్యూసీకి లేఖ
-రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరిన కేంద్రం
-ఏపీ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న సర్కారు
తలాపునే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా దశాబ్దాలుగా తాగటానికి గుక్కెడు నీళ్లులేక అలమటిస్తున్న ప్రజల గొంతు తడుపాలనుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మహా తప్పుగా కనిపిస్తున్నది. ఫ్లోరైడ్‌తో కాళ్లుచేతులు వంకర్లు తిరిగి బతుక్కు చావుకు మధ్య కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకు కాసిన్ని తాగునీళ్లివ్వ టం, ఉన్న ఊరును కన్నవాళ్లను వదిలి కడుపు నింపుకొనేందుకు ఎక్కడెక్కడికో వలసపోతున్న బీద బతుకుల కన్నీళ్లు తుడువాలనుకోవటం ఆంధ్రా పాలకుల దృష్టిలో నేరమైపోయింది. 


dam


పాలమూరు, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రజల దాహార్తిని తీర్చి, సాగునీరుఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ప్రజాప్రయోజనాలకు విరుద్ధమంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులను నాడు సమర్ధించిన నోటితోనే నేడు నష్టం జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారు. 


పచ్చి అబద్ధాలతో సీడబ్ల్యూసీకి ఏపీ లేఖ


తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలన, అనుమతుల కోసం సమర్పించాలి. ఈ సంస్థలు వాటిని పరిశీలించి అనుమతి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాల్ని పరిగణనలోనికి తీసుకొన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాదు.. సీడబ్ల్యూసీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రాధాన్య అంశం.
ముఖ్యంగా ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం..
ఇదీ ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం సీడబ్ల్యూసీకి రాసిన లేఖ సారాంశం.


కొన్నిరోజుల కిందట ఏపీ ప్రభుత్వం రాసిన ఈ లేఖపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర జల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. దీంతో పాత ప్రాజెక్టులకు కొత్త రంగు పులుముతున్న ఏపీ సర్కారు తీరును ఎండగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 


దిమ్మతిరిగే ఆధారాలు


ఏపీ సర్కారు కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను సీడబ్ల్యూసీ ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.


ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. 
ఏపీ చెప్తున్నట్లు నక్కలగండి (డిండి) ఎత్తిపోతల పథకం కొత్తదేమీ కాదు. 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవో 159 (తేది. 7.7.2007) జారీ చేశారు. ఎస్సెల్బీసీలో భాగంగా నిర్మించే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్టు చేసే పథకానికి సంబంధించిన నక్కలగండి ఎత్తిపోతల పథకంపై సర్వే కోసం రూ.1.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టంగా ఆ జీవోలో ఉంది. అంటే 2007లోనే ఈ ప్రాజెక్టుకు అప్పటి ఉమ్మడి సర్కారు అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పరిశీలించేందుకు ఒక సలహా సంఘాన్ని నియమిస్తూ 2009లో జీవో నంబర్ 200 కూడా జారీ చేశారు. 


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అధికారికంగా ఆరేండ్ల చరిత్ర ఉంది. 2009 ఫిబ్రవరి 4న ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ సూత్రప్రాయంగా అంగీకరించగా, ఆయన పేషీ నుంచి నం.1800/సీఎంసీ/2009 లేఖ కూడా వెళ్లింది. దీనితోపాటు ఈ ప్రాజెక్టు డీపీఆర్ కోసం నిర్వహించే సర్వేకు రూ.5కోట్లు కేటాయించాలని సీఈపీ/ఎంబీఎన్‌ఆర్/పీఎల్‌ఐఎస్/3686 (26.2.2009) లేఖ జారీ అయ్యింది. దాని తర్వాత 2013లో ఉమ్మడి ప్రభుత్వమే స్వయంగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు సమగ్ర సర్వే కోసం రూ.6.91 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 72 (తేది 8.8.2013) జారీ చేసింది. 35 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడిందని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. 


ఈ కీలకమైన ఆధారాలతో కేంద్ర జల సంఘానికి బదులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటు రెండు జిల్లాల గోసనూ, సమైక్య సర్కారులో జరిగిన అన్యాయాన్నీ సీడబ్ల్యూసీ ముందుంచే అవకాశముంది. అంతేగాకుండా తమ ప్రాజెక్టులకు కొత్త రంగు వేసి అక్రమమంటూ వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును ఎలా చేపడుతుందనే కీలకమైన సవాలును కూడా సీడబ్ల్యూసీ ముందుంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. 


రెండు ప్రాజెక్టులకు ఇంత చరిత్ర ఉండగా, పట్టిసీమ అనేది ఫక్తు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కారు చేసిన కొత్త ఆలోచన. కనీసం ఈ పేరు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడా వినిపించలేదు. దీంతో పట్టిసీమ అనేది వాస్తవంగా కొత్త ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. ఇక అనుమతుల విషయానికొస్తే సీమాంధ్రలోని ప్రాజెక్టుల గుట్టు కూడా విప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పైగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తి కానప్పటికీ క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీల్లోనే తెలంగాణ వాటా కింద ఈ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పుష్కలంగా సరిపోతాయనే వాదన కూడా ఇటువైపు నుంచి వినిపించేందుకు సిద్ధమవుతున్నది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి