తేది:అక్టోబర్ 13, 2013 నాటి విజయ దశమి పర్వదినమున నేను తెలంగాణ నిమ్మని కోరుతూ ఆదిపరాశక్తియగు సింహవాహనను స్తుతించాను. ఇప్పుడు ఆ తల్లి మనకు మన రాష్ట్రాన్ని ఇచ్చింది. అందుకు కృతజ్ఞతతో మళ్ళీ ఆ టపాను పునః ప్రకటము చేస్తున్నాను. తెలంగాణ సోదరులు దీనిని ఆదరించగలరని మనవి.
తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!
చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)
నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)
పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)
నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)
ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)
-: శుభం భూయాత్ :-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి