గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 25, 2015

తగిన చర్యలు తీసుకోకపోవడంలోని...లోగుట్టు పెరుమాళ్ళకెరుక...!!!

govt


సర్కారు భూమికి రెక్కలు...156 ఎకరాలు.. విలువ 300 కోట్లు:

సుమారు రూ.300 కోట్ల విలువైన సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నది. కాపాడాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా బాజాప్తా నమోదై ఉన్నా.. నిబంధనలు అనుమతించకున్నా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా వాటిని రద్దు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అడిగినవారు లేరు. వివిధ విభాగాల ఉద్యోగులు పక్కవారి మీదికి బాధ్యతలు నెట్టేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. నగర శివార్లలోని అత్యంత విలువైన గండిపేట గ్రామంలో జరుగుతున్న బాగోతమిది. 


-22-ఏ కింద గుర్తించినా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు
-మీనమేషాలు లెక్కిస్తున్న ఉన్నతాధికారులు
-బాధ్యతలు దులిపేసుకుంటున్న ప్రభుత్వ శాఖలు
-రిజిస్ట్రేషన్ల రద్దుపై కొనసాగుతున్న అయోమయం
ఇదీ జరుగుతున్నది.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట గ్రామ పరిధిలో సర్వేనంబరు 65లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 65/1 నుంచి 65/33 వరకు ఉన్న సర్వేనంబర్లలోని 156.17 ఎకరాలు సర్కారుదేనని ఇప్పటికే ఆర్‌ఓఆర్‌లో నమోదైంది. చాలా ఏండ్ల కిందటే ఈ భూమిని 22-ఏ కింద గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ చట్టం ప్రకారం 22-ఏ కింద గుర్తించిన భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. ఒకవేళ దీనిపై న్యాయస్థానాల నుంచి ఏవైనా ఉత్తర్వులు ఉన్నట్లయితే, జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధనలు చెప్తున్నా యి. అయినా రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. విలువైన ఈ భూమిని యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతున్నారు. 


1999లో మొదలైన ఈ అక్రమ ప్రక్రియ ఇవాల్టికీ కొనసాగుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సుమారు 40 ఎకరాలకు పైగా భూమి ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా అత్యంత విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. 


మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు:
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం మీద ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయినా చర్యలు తీసుకోవడం, రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంపై వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే అమ్మినవారు, కొన్నవారి అంగీకారంతోనే జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అయినందున సంబంధిత శాఖ నుంచి సిఫార్సు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు రద్దుకు సిఫార్సు చేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిసింది. అయితే జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము జోక్యం చేసుకోబోమని స్థానిక రెవిన్యూ అధికారులు చేతులు దులుపుకొన్నట్టు తెలిసింది. ఇలా ఈ రెండు శాఖల మధ్య వ్యవహారం నలుగుతుండగా మరోవైపు రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి.

సమైక్య సర్కారులో పట్టించుకునే దిక్కు లేదు:
సమైక్య సర్కారు హయాంలో మరీ ఘోరం. వాస్తవంగా 65 సర్వేనంబరులో మొత్తం 958 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 65/1 నుంచి 65/33 వరకు విస్తరించి ఉన్న 156.17 ఎకరాల విస్తీర్ణం గండిపేట-శంకర్‌పల్లి ప్రధాన రహదారికి అనుసరించి ఉంది. ఇది సీబీఐటీకి అతి సమీపంలో ఉండటంతో ఈ భూములకు బాగా డిమాండు ఉంది.

దీంతో కొందరు పెద్దలు కన్నేసి ఇది తమ భూమి అంటూ రంగంలోకి వచ్చారు. దీంతో 2005 సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎం రిజ్వీ సమగ్ర విచారణ జరిపి అది ప్రభుత్వ భూమిగా తేల్చారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత మరో ప్రైవేటు వ్యక్తి కూడా హైకోర్టుకు వెళ్లి, అదేరీతిలో తన భూమి అంటూ మరో ఆర్డర్‌ను తీసుకువచ్చారు. తెరవెనక పావులు కదలడంతో ఆనాడు ప్రభుత్వపరంగా ఈ భూమిని కాపాడుకునేందుకు అధికారుల వైపునుంచి సరైన చర్యలు తీసుకోలేదు. పైగా పరోక్షంగా ప్రైవేటు వ్యక్తులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే ఇప్పటివరకు ప్రభుత్వ రికార్డుల్లో ఆ 156.17 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే ఉంటూ వస్తున్నది.

ముఖ్యంగా 22-ఏ జాబితా నుంచి వాటిని తొలగించలేదు. నిబంధనల ప్రకారం ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఒకవైపు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మరోవైపు గతంలో జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేల్చి స్వాధీనం చేసుకున్న భూమిపై అధికారులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇంత విలువైన భూమిపై న్యాయ పోరాటం సాగించాలని, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండు చేస్తున్నారు.

పరిశీలించి, చర్యలు తీసుకుంటాం... ఆర్డీవో:


ఈ విషయంపై నమస్తే తెలంగాణ రాజేంద్రనగర్ ఆర్డీవో పొద్దాటి సురేష్‌ను సంప్రదించగా నిబంధనల ప్రకారం 22-ఏ కింద గుర్తించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. సర్వేనంబరు 65కు సంబంధించిన అంశంపై పరిశీలిస్తామని, రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌ను సంప్రదించగా దీనికి సంబంధించిన నివేదికను పది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు సమర్పించానని తెలిపారు. కలెక్టర్ తుది నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరెందుకో ఈ తాత్సారం.........???!!!


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి