*****************************************************************************
తేది: సెప్టెంబర్ 11, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన పద్య ప్రారంభము "ఎందుల కిన్ని బాధల సహింతువు..." అను వాక్యమునకు కొనసాగింపుగా నేను పూరించిన పద్యము...
******************************************************************************
(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)
******************************************************************************
ఉత్పలమాలిక:
"ఎందుల కిన్ని బాధల సహింతువు? మద్రసుతా! యముండ నే!
నిందునిభాస్య! నీ మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వసమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక యిఁకఁ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె స్వశ్వశురు పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక వరుసన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ బోవ, హరి గొబ్బున నింకొక కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర సచ్ఛతునినింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు ద్రొక్కుచున్ "ముదిత! శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల? యిఁకఁ బోఁగదె!" యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు కోర్కెలిడి ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి నీయుమన, సూర్యజుఁ డప్పుడు "సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె! నిదె డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక మఱి వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ భర్తఁ గాంచియు, యమున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ గొంటి! మది కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ గూర్చుమయ్య!" యన, వెంటనె దండి "తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు సంతతిని వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ గన్గొనియు దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ వాక్ప్రతతిఁ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుతవై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా విధులనుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు పొందుగ నిచ్చి యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గమించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి వినసొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర మందిరి భోగము పూర్వ రీతిగన్!!
******************************************************************
-:శుభం భూయాత్:-
******************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి