గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 29, 2014

పోల 'వరం' కాదు...జల ప్రళయం!

-ప్రాజెక్టు కడితే 397 ఆదివాసీ గ్రామాలు జలసమాధే!
-ప్రకతి సంపద సర్వనాశనమే 
-భద్రాద్రి రామయ్యకూ సంకటమే
-బ్రిటీష్ కాలంలోనే వద్దన్నారు...మళ్లీ తెరపైకి వచ్చినా కుదరదన్నారు!
-మరి ఇప్పుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు? 
నీటి రంగ నిపుణుల ఆగ్రహం


ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మిస్తే కొంతమంది నష్టపోయినా ఎక్కువమంది లాభపడుతారు. ప్రాజెక్ట్ ఎగువభాగం మునిగినా దిగువ భాగంలో బహుళప్రయోజనాలు నెరవేరుతాయి. ఇదే బహుళా సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం! కానీ అందుకు భిన్నంగా ప్రయోజనం స్వల్పంగా.. వినాశనమే ప్రధానంగా చేపడుతున్న ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? పరీవాహక ప్రాంతమే కాకుండా నీరుపారే ప్రాంతాలనుకూడా నిట్టనిలువునా ముంచే ప్రమాదకరమైన ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్మించారా..? అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రమాదమని హెచ్చరించినా.. 
జలరంగనిపుణులు వద్దని వారించినా పట్టువీడకుండా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? అంటే, అందులో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర, వివాదాస్పదంగా పేరొందిన ప్రాజెక్టు.. పోలవరం! బ్రిటీష్ హయాంనుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాల సుడిగుండాలను సష్టించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన పుణ్యమా అని జాతీయహోదా లభించింది. జాతీయ హోదా దేనికి..? తెలంగాణలో ఆదివాసీల సంస్కృతిని, మనుగడను ధ్వంసం చేయడానికా..?! దిగువ ప్రాంతాలను వరద నీటితో ముంచి ప్రళయం సస్ష్టిృడానికా..?! పాపికొండల వంటి అపురూప అభయారణ్యాన్ని, అపార ప్రకతి సంపదను పూర్తిగా నాశనం చేయడానికా..?! అన్న సంశయాలు కలుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిపుణులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు. అయినా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పోలవరం వద్ద ఆనకట్ట పనులు మొదలయ్యాయి. 

ప్రాజెక్టు ఎత్తుతో హెడ్ రెగ్యులేటరీతో నిమిత్తం లేకుండా అడ్డదిడ్డంగా కాల్వల పనులు సాగిపోతున్నాయి. ఆనకట్ట స్పిల్ వే, ఎర్త్- కం- రాక్‌ఫిల్ డ్యాం పనులు జరుగుతున్నాయి. గోదావరి నదీ గర్భంలో కట్టే ఈ ఆనకట్ట ఎందుకు తెగే ప్రమాదముందంటున్నారు..? అసలు పోలవరమే ఆటంబాంబు లాంటిదని నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు..? డిజైన్ ఎందుకు మార్చాలంటున్నారు..?! ఉగ్ర గోదారికి అడ్డుకట్ట.. భద్రాద్రికీ ముప్పే! అటవీ విధ్వంసం, పట్టణీకరణ, వ్యవసాయభూముల్లో సైతం జనావాసాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్(మెరుపు వరదలు) ఆందోళనకరరీతిలో పెరిగిపోతున్నాయి. ఉన్నట్టుండి వరదలు పోటెత్తుతున్నాయి. వర్షం నీరు నేరుగా, ఏ అడ్డూలేకుండా ఉధృతంగా నదుల్లోకి వేగంగా చేరి దిగువ, ఎగువ ప్రాంతాలను ముంచుతున్నాయి. అత్యంత పొడవైన జీవనది గోదావరిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. 

 

ఈ నదిలో వరద ఉధృతి అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. 1850లో 15లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే 1940 నాటికి అది 21లక్షలకు పెరిగింది. 1953లో 30లక్షల క్యూసెక్కులున్న వరద ప్రవాహం 1986లో 35లక్షలకు పెరిగింది. ఇప్పుడది 36లక్షల క్యూసెక్కులను దాటుతోంది. కానీ గోదావరి వరద ప్రవాహం ఎప్పుడైనా ప్రమాదకర స్థాయి 50లక్షల క్యూసెక్‌ల వరకు చేరుకోవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరించింది. 1953, 1986లో వచ్చిన గోదావరి వరదలు రాష్ట్రాన్ని వణికించాయి. 36లక్షల క్యూసెక్‌ల మేర నీరు ప్రవహించడంతో వరద నీరు భద్రాచలం గుడిని తాకింది. గత నాలుగు దశాబ్దాలలో మూడోసారి ఈ పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అడ్డుకట్ట లేకుండానే ఈ పరిస్థితి తలెత్తింది. అంటే ఇక పోలవరం వద్ద 150అడుగులతో అడ్డుగా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు!! గోదావరి వాలు భద్రాచలం నుంచి పోలవరం వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. పోలవరానికి 125కిలో మీటర్ల దూరంలో నది భూతల మట్టం 32.5మీటర్ల ఎత్తులో ఉంటే పోలవరం వద్ద ఎకాఎకిన 3మీటర్లకు పడిపోయింది. ఏటవాలుకు వరద ఉధృతి ఊహించని విధంగా ఉంటుంది. భద్రాచలం వద్ద 1200మీటర్ల వెడల్పు ఉన్న నది పాపికొండల వద్దకు రాగానే ఒక్కసారిగా 70మీటర్లకు తగ్గుతుంది. ఈ కారణంగా వరద ప్రవాహం దాదాపు 5 రెట్లు అధికమై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. 

ఈ ప్రవాహవేగం వల్ల మట్టి కట్టలను చీల్చే ప్రమాదం ఉంటుంది. ప్రవాహం 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులుంటే, నదీ గర్భంలో వాగు మధ్యలో కడుతున్న ఆనకట్టకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని డాక్టర్ కేఎల్ రావు వంటి ఇంజినీరింగ్ నిపుణులు తేల్చిచెప్పారు. పోలవరంలో 40లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపడానికి 1800 అడుగుల మేరకు స్పిల్ వే కట్టడం సరికాదని, వాస్తవానికి 12లక్షల క్యూసెక్‌ల నీటిని బయటకు పంపడానికి సర్ ఆర్థర్ కాటన్ ప్రకాశం బ్యారేజీపై 6280 అడుగుల స్పిల్ వేను ఏర్పాటు చేశారని, ఆ లెక్కన పోలవరం డిజైన్‌లో ఎంత లోపం ఉందో తెలుసుకోవచ్చని కేఎల్ రావు గతంలో పలుమార్లు చెప్పారు. ఇంద్రావతి ప్రాణహిత నుంచి వరదలు పొంగుకువస్తే డ్యామ్ బ్రేక్ అయ్యే ప్రమాదముందని ఇంజినీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ టీ శివాజీరావు హెచ్చరించారు. 


అసలుకే ఎసరు
వాస్తవానికి గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆరుగంటల్లో జలాశయం పూర్తి మట్టం 150 అడుగులకు చేరుతుంది. అప్పటికే తెలంగాణలో రెండువందల గ్రామాలు నీట మునుగుతాయి.. కానీ 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు కేవలం నాలుగుగంటలలోనే నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుని ప్రమాదం ముంచుకు వస్తుందని దేవరుప్పుల భీమయ్య అంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎస్‌ఈగా పనిచేసి రిటైరైన ఆయన పోలవరంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. వెంటనే గేట్లు తెరవకపోతే ఆ ప్రవాహ ఉధృతికి మట్టికట్ట తెగే ప్రమాదముందని భీమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రాంతీయ పరంగా కాకుండా మానవీయకోణంలో చూసినా ఇది అత్యంత ప్రమాదకరమని, పోలవరంలో మట్టికట్ట ఎత్తు 175 అడుగులు కాగా గేట్లపై మట్టం 150 అడుగులు. గేట్ల పూర్తి మట్టం, మట్టికట్ట మధ్య తేడా కేవలం 25 అడుగులే. జలాశయంలో ఏర్పడే అలలకు సరైన చోటివ్వడానికి 10 అడుగులు అవసరమవుతాయి. 15 అడుగుల వరద ఒరవడి 36 లక్షల నుంచి 50 లక్షల వరకు చేరితే 72 శతకోటి ఘనపుటడుగుల నీరు గంటకు 13 శతకోటిఘనపుటడుగుల నుంచి 19 టీఎంసీల వరకు వరుసగా జలాశయంలో నిండుతుందని భీమయ్య అంటున్నారు. డ్యామ్ అండ్ స్పిల్ వే డిజైన్‌ల విషయంలో ఇండియన్ స్టాండర్డ్ కోడ్ కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. భారీ ప్రాజెక్టుల్లో స్పిల్ వేలో డిజైన్‌ల లోపం ఉంటే డ్యామ్ బద్దలయ్యే ప్రమాదం ఉంటుందని అప్పుడు దిగువ ప్రాంతాల్లోని ప్రజలను తరలించడానికి కనీసం 24 నుంచి 48గంటల సమయం ఉండేలా సర్వే చేసి డిజైన్‌ను రూపొందిస్తారు. 

కానీ భౌగోళికంగా పోలవరం విషయంలో అలాంటి పరిస్థితి లేదు. గోదావరి వరద ఉధృతికి నాలుగు గంటల్లోనే వరద నీరు నిండిపోవడం, మరో నాలుగు గంటల్లో వరద పొంగి మట్టికట్ట తెగిపోయే ప్రమాదం ఉందని భీమయ్య విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును యథావిధిగా నిర్మిస్తే అది తెలంగాణకే కాదు కోస్తా మెడపై కూడా జలఖడ్గమవుతుందని తేల్చిచెప్పా రు. పోలవరం ఎత్తును తగ్గించడం, లేదా వరుసగా బ్యారేజీలను నిర్మించడంతో తెలంగాణలో మునకను తగ్గించడంతోపాటు ఆంధ్రలో ప్రాణనష్టాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కట్టతెగితే..?!:
ఒక వేళ కట్టతెగితే 40 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెద్ద ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ రుర్కి ఇది వరకే హెచ్చరించింది. వరద ఉధృతి 50 లక్షల క్యూసెక్కులను దాటే పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు పెను ప్రమాదం ఉంటుందని తేల్చింది. రాజమండ్రి, భీమవరం, కొవ్వూరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోకెమికల్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సెజ్‌లకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు కాదని మొదటి నుంచి బలమైన విమర్శలున్నాయి. 

ఎందుకంటే...పోలవరం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిచాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ వివాదాల కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పుష్కర, తాటిపుడి, ఛగలనాడు, తురిగడ్డ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీంతో దాదాపు ఐదులక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక మిగిలింది.. బహుళజాతి కంపెనీలు, సెజ్‌లు, సముద్రతీర ప్రాంతంలోని ఫార్మా, కెమికల్ కంపెనీలకు నీరందించటమే! ఇందుకోసం తెలంగాణ ఆదివాసీలను బలిపెట్టడంతో పాటు దిగువన ఉన్న వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి ఈ జాతీయ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. పోలవరం శాస్త్రీయంగా సాధ్యం కాదని పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు, శివాజీ లాంటి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. 1751 నుంచి బ్రిటీష్ కాలంలో ప్రతిపాదన వచ్చింది.. కానీ అప్పుడే దూరదృష్టితో వ్యవహరించారు. తగదని పక్కకు తప్పుకున్నారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మళ్లీ శ్రీరామపాదసాగర్ పేరిట తెరపైకి వచ్చింది. నాడు డాక్టర్ సావేజీతో పాటు కేఎల్ రావు కూడా సాధ్యంకాదని తేల్చారు.

భారీ విధ్వంసం తప్పదా?
పోలవరం రిజర్వాయర్ స్టోరేజీ కెపాసిటీ 194 టీఎంసీలు. అందులో 75 టీఎంసీలు లైవ్ స్టోరేజీ. స్పిల్ వే డిశ్చార్జి 36 లక్షల క్యూసెక్‌లు. వరద ఇన్‌ఫ్లో డిజైన్డ్ 49 లక్షల క్యూసెక్‌లని అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ అదనంగా వచ్చే లాభం కంటే నష్టాలు, కష్టాలే ఎక్కువ. పోలవరం ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలను ముంపునకు గురిచేస్తూ దాదాపు రెండున్నర లక్షల గిరిజన, ఆదివాసీలను నిరాశ్రయులను చేయనుంది. ఒడిశా, ఛత్తీస్‍గఢ్‌తో కలిపి 397 గిరిజన, ఆదివాసీ గ్రామాలు పోలవరంలో కొట్టుకుపోనున్నాయి. ఇంత విధ్వంసం చేసే ప్రాజెక్ట్ వల్ల ఏమి వస్తుందని ప్రశ్నిస్తే..?! కృష్ణా డెల్టాకు అదనంగా 80 టీఎంసీల నీరు! దానిలో కూడా కర్ణాటక, మహారాష్ట్రకు సగం వాటాపోగా.. మిగిలిన 45 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చిన్న లాభానికి పెద్ద విధ్వసం అన్నది తేలిపోతున్నది. ఇప్పటికైనా పాలకులకు కనీస విచక్షణ ఉంటే పోలవరం డిజైన్‌ను మార్చి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. 

ఈ విషయంలోనే మరిన్ని వివరాలకై:

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి! సీమాంధ్రలో పనికిమాలిన వెధవలు కొందరు పనికిమాలిన రాతలు రాస్తుంటే మోడరేషన్ పెట్టక ఏం చేస్తాం? అందుకే మాడరేషన్ ఐచ్ఛికం పెట్టాను! అదిసరే...

1956కన్నముందు భద్రాద్రి మాది అని తెగ వాగుతున్నారు? 1956కన్న ముందు మీకు ఎక్కడినుంచి వచ్చింది? మా తెలంగాణ ఏలుబడిలోనిది కాదా? భద్రాచలానికి తహసీలుదారు ఎవరు? మా తెలంగాణవాడు కంచెర్ల గోపన్నకాడా? మాది కాని భద్రాద్రి మీదెలా అయింది? 1956 తర్వాత ఆంధ్రనుండి భద్రాచలాన్ని పరిపాలించడం చేతకాక, మళ్ళీ మా తెలంగాణకే ఇచ్చారు! మాది చివరకు మావద్దకే వచ్చిచేరింది! మాది మాది అని తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు? మీదైతే మా తెలంగాణలో ఎందుకు కలిపారు? గతంలో అది మాదే కాబట్టి...మేమైతే బాగా పాలించగలం కాబట్టి! నోరున్నదికదా అని ఎలా పడితే అలా వాగితే మీదౌతుందా?

స్వైరోచ్చారణ మీరు సేయఁ దగునే? భద్రాచల ప్రాభవ
ప్రారబ్ధుల్ తమరా? నిజాము తమరా? రామాలయ మ్మందునన్
మీ రొక్కమ్ములు, శిస్తు లెన్ని కలిసెన్? మీ రెక్క డున్నారలో?

కారోయీ యిట స్థానికాఖ్యు లనఁగన్! కంచెర్ల గోపన్న శ్రీ
కార మ్మిచ్చట నాలయమ్ము కొఱకై కావింప నిర్మాణమున్,
దా, రొక్కమ్మది రాజ ద్రవ్య మగుటన్, ద్రవ్యమ్ము వెచ్చించుచున్,

“నా రాముండు భరించు నన్ని” యనుచున్, ధన్యాత్ముఁడైనట్టి త
త్పౌరున్, భక్తుని, రామదాసుఁ జెఱనున్ బంధింపఁగాఁ దానిషా;
మా రామయ్య మహోన్నతంపు మహిమన్ మన్నింపఁ దానీషఁ, దాఁ
జేరం బోయియు, రొక్కమిచ్చి, విడిపించెన్ రామదాసున్ వెసన్!

ఆ రాజప్పుడు తప్పు సైఁచు మని తా నా రాముఁ బూజింప, స
త్కారమ్ముల్, పలు రీతి సౌరు లమరన్, గళ్యాణ మింపారఁగన్,
జేరంగాఁ జని, మేలి ముత్యములఁ నిచ్చెన్ గాఁ దలంబ్రాలు! వే,
ధారాదత్తముఁ జేసె మాన్యముల సన్మాన్యాది సంసేవకై!

మా రామయ్యయు, రామదాసు, ప్రభువౌ మా తానిషల్ స్థానికుల్!
మీ రీ బంధము లేవి లేని పరులే! మీదైన భద్రాచలం
బౌరా! నోళ్ళును మూయ, వృద్ధిఁ గనకే, పర్వెత్తె షష్ట్యబ్దముల్!

మీ రీ వేళ మహాప్త భక్త తతి సంప్రీతాస్థ వాక్యమ్ములన్
గోరన్, మీ దిది యౌనె? యెట్టు లగునో? గోపన్న మీ వాఁడె? ప్రా
పా రాజన్యుఁడగున్ నిజాము ప్రభుఁడే భద్రాద్రిఁ బాలింపఁగా;

నా రాజెద్దియ రాజధాని యనెనో యా హైద్రబాదే యిటన్
సారాచార విచార సార్వజనియౌ భద్రాద్రిఁ దా నిమ్ముగా
సారించెన్ బరిపాలనమ్ము! కనుకన్, సాగెన్ దెలంగాణలోఁ;

బారమ్మిద్దియ! రాజ్య మిద్దియ కదా! భద్రాద్రి మాదే కదా!
మీ రెట్లందురు మాదె యంచు నిపుడున్? మీ దెట్లు? మాదే కదా!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇది కూడా చదవండి:

పూర్వ కాలమ్ము నుండియుఁ బూర్తిగాను
భద్రగిరి తెలంగాణలో భాగమోయి!
యెందఱో రాజవంశాల కందఱకును
బూజనీయ మ్మిదౌచు సమున్నతిఁ గనె!

కుతుబు షాహీల్, నిజాములు కూర్మితోడఁ
బాలనము సేసి, ప్రగతితో వఱలఁ జేయఁ,
దానిషా బంటు గోపన్న తనరు నట్టి
యాలయమ్మును గట్టించి, యర్చ సేసె!
నాంగ్ల పాలకుల్ గోరంగ నట్టి దాని
నిచ్చె మద్రాసు ప్రెసిడెన్సి యేలుబడికి!

భారతావని స్వాతంత్ర్య భాసమాన
మూర్తి కాఁగాను, నేఁబది మూఁడు వఱకు
నదియ మద్రాసు రాష్ట్రాన నటులె యుండె!

ఆంధ్రరాష్ట్ర మేర్పడిన సందర్భమందు
నేఁబదాఱున తూ.గో.జి. కిడిన పిదప,
నేఁబదియుఁ దొమ్మిదిన దాని నిడిరి ఖమ్మ
మునకు! నాఁటి నుండియు నది పూర్తిగాను
మా తెలంగాణ మందున మాకుఁ జెందె!

ఆంధ్రవారల పాలన యందు నదియ
కేవల మ్మాఱు వత్సరాల్ కిరికిరిఁ బడె!
నిట్టి కాలమ్ము నందున నిడుము లందె!
జిల్ల కేంద్రమ్మునకుఁ బోవఁ జిక్కు లెన్నొ?

ఐదు వందల మైళ్ళ ప్రయాణమునకు
లేవు రహదారులు! వరద లిచట రాఁగ,
నాదుకొనువారు లేక యున్నార లిచట!
వైద్య సౌకర్యములు లేవు! విద్య లేదు!

ఏఁబ దెన్మిదిలో గుడి కేగి, రాము
దర్శనము సేయఁగా నెంచి, తరలి వచ్చు
రెండు పడవల నున్నట్టి రెండు నూర్ల
జనులు, పడవలున్ మున్గఁగాఁ జచ్చినారు!

ఇన్ని బాధలఁ బడుచుండ నేమి కతనొ,
విడిచి, ఖమ్మ మందునఁ జేర్చి, పీడ వదలె
నంచుఁ జేతులు దులుపుకొన్నారు మీరు!

అట్టి వారలౌ మీ రిప్పు డాదరమున
"భద్రగిరి మాది" యన్నచో, ఫక్కున నగి,
మూతి మీఁదొక్క టిత్తురు! మూర్ఖు లయ్యు
నిట్టి భద్రాద్రి విడిచియు, నేఁడు పోల
వరము ప్రాజెక్టు నిర్మాణ వరము నందఁ
గోరి, భద్రాద్రి మునిఁగినన్ గూడ లెక్క
సేయకయె యుందురయ్య విచ్చేసి యిటకు?

పోలవరము వలన నెంత ముంపు కలుగు
నో తెలిసియును భద్రాద్రి నోరి కొలఁదిఁ
గోరుచుండి రనంగనుఁ, జేరి యడుగు
టిద్ది ప్రేమతోఁ గాదయ్య! హితముఁ గాదు!

దీని దుర్బుద్ధి తోడనే, తెలిసి తెలిసి,
యడుగు చుంటిరి! దీని, దుఃఖార్తిఁ ద్రోచి,
ముంపునకు గుఱిసేయు తలంపు తోడ
నే యటంచు మే మెఱుఁగమే? నీచ బుద్ధి
బయటఁ బెట్టితి రోయయ్య! వగలమారి
కోర్కి మీదయ్య! భద్రాద్రి, కూర్మిఁ బంచు
నట్టి మాదయ్య! మా హక్కు! నటులె మీకు
హక్కు లెటు లబ్బు? నాఱేండ్ల హక్కె మీది!

వంద లేండ్లుగ మాదెయౌ భద్రగిరిని
మీకు నెట్టుల నిత్తుము మేలు విడిచి?
దుష్ట చింతన తోడుత నిష్ట మనుచు
ననఁగనే, మీకు నిత్తుమే యాంధ్రవాఁడ?

మూఁడు వత్సరా లాంధ్రలో, మూఁడు వత్స
రమ్ము లాంధ్రప్రదేశానఁ గ్రాఁగి, క్రాఁగి,
చివరి కీ తెలంగాణమ్ముఁ జేరి, సుఖము
లందు భద్రాద్రి, వేఱుచేయంగఁ బూను
హక్కు లేదోయి నీ కిప్పు డాంధ్రవాఁడ!
భద్రగిరి తెలంగాణదే! బాధ యేల?

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి