గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 25, 2014

చంద్రబాబు ఓ దగాకోరు...!

kcr


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారంనాడు సచివాలయంలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు చర్యలు, వ్యాఖ్యలను కడిగిపారేశారు. చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా వ్యవహరిస్తున్నాడని, ఇక్కడ పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాల్సింది పోయి పక్కరాష్ట్రంలో నిప్పులు పోస్తున్నాడని అన్నారు. తమకు ముందు చూపు లేదన్న బాబుకు ఉన్నది దొంగచూపు మాత్రమేనన్నారు.

-తెలంగాణకు సైతాన్‌లా దాపురించిండు
-ఆయన దగా ఖరీదు రూ.608 కోట్లు
-తెలంగాణ పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టిండు
-విభజన చట్టం ఉల్లంఘించి కరెంటు ఆపుతున్నడు
-బాబు ద్రోహం మీద సుప్రీంకు వెళ్తం
-ముక్కుపిండి పరిహారం వసూలు చేస్తం
-స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
-ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు

చంద్రబాబు చేసిన మోసానికి తెలంగాణ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం రూ. 608 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నం. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను వదిలిపెట్టేది లేదు. ముక్కుపిండి వసూలు చేస్తాం. చంద్రబాబు చేసిన నష్టంమీద సుప్రీంకోర్టుకు వెళతాం అని స్పష్టం చేశారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని నిలువరించేది లేదని, పంటలను కాపాడుకోవడం తమ ప్రాధాన్యతని అన్నారు. కేటాయించిన జలాల ప్రకారం 81 టీఎంసీల నీరును వినియోగించుకునే హక్కు తెలంగాణకు వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈఆర్సీ ఛీ కొట్టినా బుద్ధిరాలేదు..


విద్యుత్ పీపీఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని ఏపీ ఈఆర్సీ చంద్రబాబుకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ బుద్ధి రాలేదు. చంద్రబాబు దొంగచూపుల వల్ల తెలంగాణ రాష్ట్రం కరెంటు కటకటలకు లోనవుతుంది. ఆయన మోసం వల్లనే 82 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 4 నెలల్లోనే నష్టపోయాం అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తెలంగాణ పాలిట సైతాన్‌లా దాపురించి ఈ ప్రాంత రైతుల ఉసురుపోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడ పంటలను ఎండబెట్టాలని శపథం తీసుకొని, పంటలు ఎండేదాక నిద్రపట్టే పరిస్థితి చంద్రబాబుకు లేనట్లు ఉందన్నారు. తెలంగాణను పూర్తిస్థాయిలో మోసం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రైతులను, డ్వాక్రా మహిళలను కూడా దగా చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దేశంలోనే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. తెలంగాణకు బాబు చేసిన అన్యాయానికి సాక్ష్యాలివిగో అంటూ కేసీఆర్ రికార్డులను విలేకరులకు చూపారు.

శ్రీశైలం మీద మాకు హక్కుంది..: శ్రీశైలం నీ అయ్య జాగీరా.. అది సంయుక్త ప్రాజెక్టు. రెండు రాష్ర్టాలకు హక్కు వుంది. 97 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించారు. కల్వకుర్తికి 25 టీఎంసీలు, బీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడు 22 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు కేటాయిస్తే ఏపీని పాలించిన ఆంధ్రా ముఖ్యమంత్రులు, సమైక్య పక్షపాతులు తెలంగాణకు న్యాయం చేయకుండా రెండు దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేశారు.

20 టీఎంసీల నికర జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా... రెండు దశాబ్దాలపాటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణాన్ని కమిటీలమీద కమిటీలువేసి జాప్యంచేసి చివరకు టన్నెల్ నిర్మాణం అంటూ కుట్రలు చేశారు. గ్రావిటీద్వారా నీరందించే అవకాశం వున్నా సకాలంలో ఆంధ్రా పాలకులు చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నీటికి పూర్తి హక్కు ఉన్నా రిజర్వాయిర్ల దగ్గర అడుక్కుతినే స్థితికి తెచ్చారు.

తెలంగాణకు ఒక్క యూనిట్ ఇచ్చావా?: తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు తెలంగాణలో ఒక్కటంటే ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. మొత్తానికి మొత్తం ఆంధ్రలోనే పెట్టారు. అవీ అన్నీ ప్రైవేటు పీపీఏలే. ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో వున్నాయి.. తెలంగాణకు కరెంటు ఇవ్వనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పైగా హిందూజా యాజమాన్యాన్ని కూడా బెదిరించాడు. తెలంగాణ కరెంటు కొరతకు కారకుడే చంద్రబాబు.

మాకు ముందు చూపుంది... ఆయనలాగా దొంగ చూపు లేదు... ఆ దొంగ చూపు చూపువల్లనే తెలంగాణకు చట్టప్రకారం రావలసిన కరెంటు రాలేదు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే 300 మెగావాట్లు సరఫరా చేస్తామంటున్నారు. ఆయన్ను ఎలా నమ్మగలం? మేమేమైనా పిచ్చివాళ్లమా. 900 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం. 300 తీసుకుంటమా? బరాబర్ ఉత్పత్తి చేస్తం. చంద్రబాబు జారీచేసిన జీవో 69 ప్రకారమే 834 అ డుగుల నీటిమట్టం వరకు కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. శుక్రవారం శ్రీశైలంలో 857 అడుగుల నీటిమట్టం వుంది.

ఆబిడ్స్‌లో చర్చకు సిద్ధమా?: మాట్లాడితే చర్చలంటున్నడు..కరెంటుపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం. రా..అబిడ్స్‌లో నెహ్రూ బొమ్మవద్ద చర్చించుకుందాం. నీ బండారం బయటపడుతుంది. లేదంటే ప్రకాశం బ్యారేజి మీద అయినా సరే..నువ్వు అక్కడి రైతులు డ్వాక్రామహిళలకు ఏం హామీలిచ్చినవో.. ఎట్ల దగా చేసినవో..సీడీలు కూడా పట్టుకొని వస్త..

నాలుకనా తాటి మట్టనా?: చంద్రబాబూ నీది నాలుకనా? తాటిమట్టనా? వైఎస్ హయాంలో జీవో 107 ప్రకారం 834 నుంచి 854 అడుగులకు పెంచితే దానిని తీవ్రంగా వ్యతిరేకించింది నువ్వే. ప్రస్తుత నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ, మరో నేత ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలో ఆనాడు ప్రకాశం బ్యారేజీవద్ద ఆందోళన చేశారు. చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తూ ఈ జీవోను వ్యతిరేకించారు. అంటే 834 అడుగుల వరకు శ్రీశైలం నీటిని వినియోగించుకోవచ్చని చంద్రబాబే ఆనాడు చెప్పారు. దృశ్యరూపకం ప్రదర్శించారు. మేలు చేయాల్సిన రాజే...అంటూ వాళ్ల పత్రిక కూడా దీనిపై వార్తలు ఇచ్చింది. ఇవన్నీ రికార్డులో ఉన్నాయి. చూసుకోవచ్చు.. నీది నాలుకనా తాటిమట్టా... ఎవరిని మోసగిస్తావు?

నీ మోసాలకు అంతే వుండదా? అని చంద్రబాబుపై కేసీఆర్ కన్నెర్ర చేశారు.

ముఖ్యమంత్రివని గౌరవమిచ్చాను..: చంద్రబాబూ.. తెలంగాణపై అంత కక్ష ఎందుకు పెట్టుకున్నావు. ఎందుకు మోసం చేస్తున్నావు. ఎంత జరిగినా ఇంతదాకా మాట్లాడలేదు.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రివనే సంస్కారంతో గౌరవమిస్తూ వచ్చాను. జూరాలలో సకాలంలో విద్యుత్ ప్లాంట్లను పునరుద్ధరించలేదని విమర్శిస్తున్నావు. వరదలో మునిగిన యూనిట్‌వల్ల నష్టపోయింది కేవలం 80 మెగావాట్లే. అసలు ఆ ప్రాజెక్టు ఇంకా ప్రారంభమే కాలేదు.

నీ ఏలుబడిలో శ్రీశైలం కుడిగట్టు పవర్ ప్రాజెక్టు మునిగిపోతే నువ్వేం చేసినవు? నీది దుర్మార్గపు పంథా. ప్రపంచ చరిత్రలో ఇలాంటి మనస్తత్వం ఎవరికీ ఉండదు. ముందుచూపు మాకుంది. నీ దొంగ చూపువల్లనే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. 

కోర్టుకు పోతున్నం..: విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని ప్రాజెక్టులనుంచి తెలంగాణకు 53.89 శాతం రావలసి వుంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు అసత్య ప్రచారం చేస్తున్నాడు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. జరుగుతున్న లోటుపాట్లపై మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు.

నేను ప్రధాని నరేంద్ర మోడీ, గోయల్‌కు కూడా వివరించాను. రూ. 8లు యూనిట్‌కు ఖర్చైనా విద్యుత్‌ను కొంటున్నాం. అవన్నీ పత్రికల్లో వేయించుకోలే. ఆ ముఖ్యమంత్రిలాగా సీఎం బిజీ.. బిజీ.. అంటూ పత్రికల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేం నిబద్ధతతో పని చేస్తున్నాం.
గవర్నర్‌కు అన్నీ చెబుతున్నాం..: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్నాను. సీఈఏ ఆర్డరును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించింది. వారి ఏపీఈఆర్సీయే వారికి చెంపదెబ్బలాంటి తీర్పునిచ్చింది.

వాస్తవాలు ఇలా ఉన్నా యి. నువ్వు తప్పు చేస్తూ మోసాలు చేస్తున్నావు. అసమర్థత మాదా? నిజం నిలకడమీద తెలుస్తుంది. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. హిందూజా, కృష్ణపట్నం ప్రాజెక్టునుంచి తెలంగాణకు కరెంటు రాకుండా ప్రయత్నిస్తున్నావు. తెలంగాణ పంటల నష్టం చెల్లించాల్సి ఉంటుంది. జాగ్రత.. దీన్ని ముక్కుపిండి వసూలు చేస్తాం. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్. ఎవర్నీ వదిలిపెట్టం.
నువ్వో చీటర్‌వి..: పైరవీలు చేసి కృష్ణా ట్రిబ్యునల్‌ను పిలిపించుకున్నావు. నీ మోసం ఎవరికి తెలియదు. సాధారణ ఎన్నికల్లో నీవు చేసిన ప్రసంగాల వీడియో ఫుటేజి మాదగ్గర వుంది. నీ బండారం బయట పెడతా. సాటి సీఎంవని మర్యాద పాటిస్తున్నాను.

నీవు చీటర్‌వు. ఏపీ రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశావు. 95వేల కోట్ల రుణాల మాఫీ ఎలా అని విమర్శలొస్తే నువ్వు బచ్చాగాడివంటూ హామీలమీద హామీలు ఇచ్చావు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను.. ఋణాల మాఫీ ఎలా చేయాలో తెలుసని అన్నావు. అయితే ఇప్పటికీ రైతులకు పైసా మాఫీ చేయలేదు. కథలు చెబుతున్నావు, మెలికలు పెడుతున్నావు, పరిమితి విధిస్తున్న పచ్చి మోసగాడివి నీవు .రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించపోయినా మేం తెలంగాణలో రుణ మాఫీ ప్రక్రియపై నిర్ణయాలు తీసుకుని రైతులకు మేలు చేశాం.

తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుండగా నీవే అక్కడ రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశావు... మేము తప్పు చేశామా.. నీ బండారం చాలా వుంది. మేము మానవత్వంతో ప్రవర్తించాము. నీవు కరెంటు ఇవ్వకపోయినా తుఫాను సమయంలో అక్కడి ప్రజలకు ఇబ్బంది వుందంటే విద్యుత్ పరికరాలను (ట్రాన్స్‌ఫార్మర్స్) తెలంగాణ రాష్ట్రంనుంచి అక్కడికి తరలించాం. కానీ నీ పెత్తనమేంది? కిరికిరి పెడుతున్నావెందుకు? ప్రతిచోటా కిరికిరే. మా బతుకు మేం బతుకుతాం....అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి