గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

బెజవాడకు కార్మిక సంక్షేమ నిధి?

- రాష్ట్ర ఖాతాలో చేరని టీ వాటా
ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయి నాలుగు నెలలవుతున్నా కార్మిక సంక్షేమ బోర్డు నిధులకు మోక్షం కలుగడం లేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుతోపాటు బ్యాంక్ ఖాతా ప్రారంభించినా ఆ నిధులను మళ్లించే వారే లేరు. ఆంధ్రాప్రాంత ఉన్నతాధికారులు ఈ నిధులను తెలంగాణ ఖాతాకు మళ్లించకుండా విజయవాడలోని ఆంధ్రాబ్యాంక్‌కు తరలించే ఏర్పాట్లు కార్మిక శాఖలో కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలోని ఉమ్మడి ఖాతాలో దాదాపు రూ. 1500 కోట్లు మూలుగుతున్నాయి. తెలంగాణ వాటా నిధులు ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఆంధ్రాబ్యాంక్‌లో తెరిచిన ఖాతా (1422100 11805015) లోనే మగ్గుతున్నాయి. భవనాలు, ఇతర నిర్మాణాల ద్వారా వసూలైన సెస్ మొత్తంలో అధిక వాటా తెలంగాణదే. 2007 నుంచి చూస్తే తెలంగాణ నుంచే 60 నుంచి 70శాతం వసూలవుతున్నట్లు తేలింది. ఈ నిధిని 52: 48 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తే తెలంగాణకు రూ. 600 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 900 కోట్లు కేటాయించాలని నిర్ధారించారు. 
జూన్ రెండోతేదీ నుంచి ఇప్పటి వరకు రూ.80 కోట్ల సెస్ వసూలైందని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. దీనిప్రకారం ఉమ్మడి కార్మిక సంక్షేమ నిధిలో రూ.1580 కోట్లు ఉన్నట్లు లెక్క. రాష్ట్రప్రభుత్వం మూడు నెలల తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తదనుగుణంగా బ్యాంక్ ఖాతా ప్రారంభించినా ఒక్క రూపాయి కూడా అందులో చేరలేదు. స్థిరాస్తులు, సెస్ లెక్కలు తేలేవరకు ఒక్క పైసా కూడా తరలించొద్దని తెలంగాణ లేబర్ కమిషనర్ యూనిట్ ఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌గౌడ్ కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

ఉద్యోగుల విభజనపై కేంద్రం, ఏపీ సాచివేత...!!

ఉద్యోగుల విభజన పట్ల కేంద్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా దీపావళి పండుగ తర్వాత ఆందోళన బాట పట్టాల్సిందేనని వారు భావిస్తున్నారు.
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వారి సొంత ప్రాంతానికి బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు, కమల్‌నాథన్ కమిటీ నచ్చచెబుతూ రావడంతో ఇప్పటివరకు ఉద్యోగులు ఓపిగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఏపీకి బదిలీ అయిన తెలంగాణ ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధించడంతోపాటు ప్రాధాన్యంలేని సెక్షన్లలో నియమించారు. దీనికితోడు అధికారులు చీటికిమాటికి విసుక్కోవడంతో ఉద్యోగులు దాన్ని దిగమింగుకోలేక ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు నెలలుగా కమల్‌నాథన్ కమిటీ కేవలం శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల విభజనపైనే ఎటూ తేల్చుకోలేకపోతున్నదని టీ ఉద్యోగులు చెప్తున్నారు.

ఇక జిల్లా, జోనల్, మల్టీజోన్‌లలో ఉద్యోగుల విభజనను ఎప్పుడు చేపడ్తారని ప్రశ్నిస్తున్నారు. మండలస్థాయి నుంచి శాఖాధిపతి కార్యాలయం వరకు శాస్త్రీయంగా క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్దారించకుండా, శాఖాధిపతుల కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, దసరాసెలవులు పెంచడం, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, బోనాలు, దసరా పండుగలకు అడ్వాన్సులు ఇవ్వడం, దసరా సందర్భంగా ఈనెల 26నే వేతనాల చెల్లింపు తదితర ప్రోత్సాహకాలతో తొలి రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల స్నేహశీల ప్రభుత్వమన్న విషయాన్ని రుజువు చేసుకుంటున్నది.

ఇటువంటి ప్రోత్సాహకాలేమీ ఆంధ్రప్రదేశ్‌లో లేకపోగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని టీ ఉద్యోగులు చెప్తున్నారు. ఇలాగైతే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయలేమని వారు బాహాటంగానే అంటున్నారు. కమలనాథన్ కమిటీ న్యాయమైన రీతిలో వ్యవహరించి స్థానికత ఆధారంగా తెలంగాణ ఉద్యోగులందరినీ సొంత రాష్ర్టానికి బట్వాడా చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన నిర్వహించి, తమ డిమాండ్లు సాధించుకుంటామని ఏపీకి బదిలీ అయిన టీ ఉద్యోగులు చెప్తున్నారు. తమపై దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని అంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

సోమవారం, సెప్టెంబర్ 29, 2014

సీమాంధ్రుల అడ్డాగా స్టేట్ రూరల్ కార్పొరేషన్...!!!

- తెలంగాణ సంస్థపై స్థానికేతరుల పెత్తనం
- అవినీతిపరులకు అందలం
- తెలంగాణ ఎండీకి సతాయింపులు
సీమాంధ్ర అధికారులు తెలంగాణలోని సంస్థలపై పెత్తనం సాగిస్తున్నారు.స్టేట్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఆ అధికారుల గుప్పిట్లో విలవిలలాడుతున్నది. అక్రమార్కులు దోపిడీదారులకు అడ్డాగా మారిం ది. కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న చైర్మన్ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తందారే కావడంతో సంస్థలోని సీమాంధ్ర అధికారులు మళ్లీ జూలు విదిలిస్తున్నారు. ఇప్పటికే అవినీతికి పాల్పడి సస్పెన్షన్‌కు గురైన సీమాంధ్ర ఉద్యోగులు కూడా మాయోపాయంతో తిరిగి విధుల్లో చేరాలని ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో సస్పెన్షన్‌కు గురైన ఈఈ ఒకరు ఇదే దారిలో పైరవీలు చేస్తున్నారు. వాస్తవానికి సదరు ఈఈ సస్పెన్షన్‌పైన న్యాయస్థానాలను ఆశ్రయించారు. 
-న్యాయస్థానంలో గ్యారెంటీగా తనకు అనుకూలంగా తీర్పు వస్తున్నదని చెప్పుకుంటూ చైర్మన్‌తో బేరాలకు దిగినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
-కాంట్రాక్టర్లు చేయని పనులకు కూడా ఈయన రూ.19లక్షల నుంచి రూ.25లక్షల వరకు అవినీతి జరిపిన  ఆరోపణలున్నాయి.
-అలాగే ఒక కాంట్రాక్టర్ చేసిన పనిని ఇంకొక కాంట్రాక్టర్ పేరుమీద రికార్డు చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
-గతంలో సహకారమంత్రిగా పనిచేసిన కాసుకృష్ణారెడ్డికి ఈయనపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
-అవి చాలవన్నట్టు సంస్థలో రూ.72లక్షలు ఇర్రెగ్యులర్ అడ్జెస్ట్‌మెంట్ చేసినట్లు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఏప్రిల్ 9న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
-గ్రామీణ నీటి పారుదల సంస్థ మాజీ ఛైర్మన్, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీమాంధ్ర వారే కావడంతో ఇద్దరు కలిసి సంస్థను పీల్చిపిప్పి చేశారనే ఆరోపణలున్నాయి.

ఖర్చులు వద్దు బాబోయ్..ఈ సంస్థ ప్రభుత్వ నిధులతో కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్‌తో నడుస్తుంది. ఆదాయం అంతంత మాత్రం. ఇక్కడ ఉద్యోగులకే జీతాలు లేని పరిస్థితి . ఇలాంటి పరిస్థితిలో తమపై ఛైర్మన్ ఖర్చులు కూడా రుద్దవద్దని ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపిఎస్‌సీఆర్‌ఐసీ)అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ శివశంకర్‌రెడ్డి, పీ రవిచంద్రరాజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆగస్టు 11న మరో సారి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుత ఎండీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో సీమాంధ్రకు చెందిన ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడబలుక్కొని ఎండీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంస్థకు నిధులు లేకున్నా ఎండీ చొరవచేసి నిధులు సమకూర్చి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించడం, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించడం, మరణించిన ఉద్యోగుల వచ్చే బెనిఫిట్స్ అందజేయడం చూసి వారు భరించలేక వేధింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

ట్యాంక్‌బండ్‌పై కొండా లక్షణ్ ’బాపూజీ’ విగ్రహం పెట్టిస్తాం...!!!

 
-అక్కడ అవసరం లేనివి తీసేస్తం.. లారీలో ఆంధ్రాకు పంపిస్తం
-జగమెరిగిన మహానేత లక్ష్మణ్‌బాపూజీ
-తెలంగాణ కోసం తొలి పదవీత్యాగం చేసిన మహనీయుడు
-జలదృశ్యం కూల్చిన పాపం చంద్రబాబుదే
-దానిని సమీక్షించి.. చిరస్మరణీయం చేస్తాం
-త్వరలో చేనేత అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం
-బాపూజీ విగ్రహావిష్కరణ సభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు
‘తెలంగాణ కోసం ప్రాణమున్నంతకాలం తపించి పోరాడిన మహనీయుడు.. తొలి పదవీ త్యాగం కూడా ఆయనదే. 1969లోనే మంత్రి పదవిని తృణప్రాయమనుకున్నడు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జగమెరిగిన మహానేత’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో యూనివర్సిటీకో, లేదంటే ఏదైనా గొప్ప సంస్థకో ఆ మహానుభావుడి పేరు పెట్టి భావితరాలకు గుర్తుండిపోయేటట్లు చేస్తం అని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్ ముందు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడున్న అవసరం లేని వ్యక్తుల విగ్రహాలను తీసేస్తామన్నారు. వాటిని లారీల్లో తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రాకు తరలిస్తుందన్నారు.
chandraదానికి టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా కలిసి రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల ఆకలిచావులు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. అందుకే త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, ఆ తర్వాత కార్యాచరణను కొండా లక్ష్మణ్‌బాపూజీ మిషన్‌గా నామకరణం చేసి అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది బాపూజీ శతజయంతివేడుకల సందర్భంగా ప్రతి నెలా కార్యక్రమాలు ఉండేటట్లుగా అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ‘అందరూ ఉద్యమం 2001లో పుట్టిందంటారు.. కానీ 2000లోనే తెలంగాణ ఐక్యవేదిక పేరిట ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీల సారథ్యంలో జలదృశ్యంలోనే పని మొదలుపెట్టారు’ అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ’ఆ తర్వాత ఏడాది పాటు 3, 4 వేల గంటల చర్చలు జరిగాయి. అప్పుడే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి’ అని వివరించారు. ఇదంతా కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశీస్సులతోనే జరిగిందన్నారు. ‘కర్కోటకుడైన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే పార్టీని ఏర్పాటు చేశాం. అప్పట్లో ఆంధ్రా పత్రికలు, ఆంధ్రా మీడియా, మా అడుగు ముందుకు పడనియ్యలేదు. మా పార్టీకి కిరాయికి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సీఎం కార్యాలయం నుంచే బెదిరింపులు వచ్చేవి ’ అని చెప్పారు. ’చంద్రబాబునాయుడు జలదృశ్యంపై దాడి చేయించాడు.. మా పార్టీకి సంబంధించిన ఫర్నీచర్‌ను, కంప్యూటర్లను బయట పడేయించిండు. ఇప్పుడు జలదృశ్యంపై సమీక్ష జరుపుతం.. బాపూజీని చిరస్మరణీయుడిని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుత’మని సీఎం హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ, ’కేసీఆర్ తెలంగాణ రథసారథి, తెలంగాణ సాధకుడైతే, బాపూజీ తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ సాధనలో భాగం’ అని కొనియాడారు.

రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని, అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కోర్టు కేసుల్లోని భూములు గెలిస్తేవజ్రాల తెలంగాణే!

-వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్లు
-కోర్టుల్లో కేసులు నడుపుతున్న అక్రమార్కులు
-న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు
-సంక్షేమం కోసం రూ. 100 కోట్లు విడుదల చేస్తాం
-సిటీ సివిల్ కోర్టు 150 ఏండ్ల వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

కోర్టు కేసుల్లో నలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్లకు పైమాటేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆ కేసుల్లో ప్రభుత్వం విజయం సాధిస్తే ‘బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ సాధించగలుగుతామ’ని ఆయన అన్నారు. కబ్జాలు, నకిలీపత్రాలు, అన్యాక్రాంతాలతో ప్రభుత్వ భూముల్లో తిష్ఠవేసిన అక్రమార్కులు కోర్టుల్లో కేసులు నడుపుతున్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శతాబ్దిన్నర వేడుకల్లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి దక్కేందుకు సహకరించాలని తెలంగాణ న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర శ్లాఘనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ పోరాటంలో న్యాయవాదుల త్యాగాలను విస్మరించలేమన్నారు. గోపిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి తదితర న్యాయవాదులపై కొంతమంది భౌతికంగా దాడులకు పాల్పడిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా న్యాయవాదులు పార్లమెంట్ గేట్లు ఎక్కి తెలంగాణవాదాన్ని వినిపించారని ప్రశంసించారు. 

స్వతంత్ర న్యాయవ్యవస్థ నిజాం ఘనతే..
ప్రపంచంలో న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిన రాజు నిజాం రాజేనని కేసీఆర్ అన్నారు. నిరంకుశత్వానికి చిహ్నమైన రాజరికానికి వారసుడై ఉండి కూడా, న్యాయ విభాగానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారని, తానుకూడా న్యాయస్థానాలకు బద్ధుడినేనని ప్రకటించారని చెప్పారు. చరిత్రను చాలా వక్రీకరించారని, ప్రస్తుతం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకొంటున్న సిటీ సివిల్ కోర్టు ఆయన కాలంలోనే ఏర్పాటైందన్నారు.1863లో సిటీ సివిల్ కోర్టు, 1875లో హైకోర్టును ఏర్పాటు చేశారని వివరించారు. ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణాన్ని 1900వ సంవత్సరంలో ప్రారంభించి 1919లో పూర్తిచేశారన్నారు. ఈ విషయాలను పక్కదారి పట్టించి కొంతమంది పొద్దున లేచినకాడినుంచి హైదరాబాద్‌ను మేమే నిర్మించామని గొప్పలు చెప్తుంటారని ఎద్దేవా చేశారు. 


చరిత్రను తాను వివరిస్తుంటే కొంతమందికి బాధ కలుగుతుందని కేసీఆర్ అన్నారు. నిజాం కాలంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండేదనడానికి నిదర్శనం తమ కుటుంబ స్వానుభవమేనని ఆయన చెప్పారు. కరీంనగర్‌లోని తన పూర్వీకుల స్థలాన్ని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ కాలంలో రూ. లక్షా నలభై వేల రూపాయల పరిహారం ఇచ్చిందన్నారు. అయితే నష్టపరిహారం విషయంలో తన తండ్రి అప్పటి హైకోర్టులో న్యాయవాది మహ్మద్ బారీ ద్వారా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. విచారణ చేపట్టిన హైకోర్టు మరో రూ 70 వేలను అదనంగా ఇవ్వాలని తీర్పును ఇవ్వడంతో నిజాం ప్రభుత్వం శిరసావహించి తక్షణమే నిధులను విడుదల చేసిందని తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టులో తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 55 సంవత్సరాల వరకు కూడా అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు దక్కనే లేదన్నారు. తెలంగాణలో భూమిని తల్లిగా భావించే సంస్కృతి ఉండేదని, బయటి వ్యక్తులు ప్రవేశించి చదరపు గజాలు, అడుగుల చొప్పున భూమికి రేట్లను పెంచారన్నారు. ప్రైమ్ ల్యాండ్ భూమి ధరలను పెంచడంతో భూమాఫియా సైతం పెరిగిందన్నారు. తన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈఎన్‌టీ ఆసుపత్రి స్థలానికి సైతం నకిలీ పత్రాలు స్పష్టించి కోర్టుల ద్వారా భూములను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై వాకబు చేయగా అడ్వకేట్ జనరల్‌ను ఈ కేసులో వాదించవద్దని ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టు తెలిసిందన్నారు. నిజాం హయాం నుంచి కోటి ఎకరాల ప్రభుత్వ భూమి, మరో కోటి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి అందుబాటులో ఉండేదన్నారు. గత ప్రభుత్వాల అన్యాక్రాంతాలు, కబ్జాలతో భూములు హరించుకు పోయాయని, కోర్టు లిటిగేషన్‌తో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా గుట్టలు, రాళ్లతో కూడిన 30 లక్షల ఎకరాల భూమి ఎటువంటి చిక్కులు లేకుండా అందుబాటులో ఉందని తెలిపారు. 


నూటికి 65శాతం నకిలీ సర్టిఫికెట్లు హైదరాబాద్‌వే..
రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ధోరణులు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దొరుకుతున్న 100 నకిలీ సర్టిఫికెట్లలో 65 శాతం నగరం నుంచే వస్తున్నాయన్నారు. ఇలాంటివి అరికట్టే కఠిన చట్టాలు రూపొందించవలిసి ఉందని, దీనికి న్యాయవాదులు తమవంతు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రానికి ఆవసరమైన కొత్త చట్టాలపై న్యాయవాదులతో, న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవినీతి, వేధింపులకు తావులేని విధానాలను ప్రభుత్వం తీసుకువస్తుందని కేసీఆర్ చెప్పారు. 

న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు..
నగరంలోని వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న అర్హులైన న్యాయవాదులకు గృహవసతి కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎటువంటి ఆస్తులు, ఆధారం లేని న్యాయవాదులను న్యాయవాదుల కమిటీ లేదా హౌజింగ్ కమిటీ ఆధ్వర్యంలో గుర్తించాలని కేసీఆర్ సూచించారు. నగరానికి దూర ప్రాంతంలో కాకుండా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనువుగా లేదా హౌసింగ్ సోసైటీ రూపంలో భూమిని కేటాయిస్తామని, న్యాయవాదులతోపాటు కోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 


న్యాయవాదులకు హెల్త్‌కార్డుల విధివిధానాలపై కమిటీ వేస్తామని, న్యాయవాదుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ 100 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుకు , సిటీ సివిల్ కోర్టులో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఆదివారమే ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటించారు. నగరంలో కోర్టుకు ఒక్కరి చొప్పున ఉత్తమ న్యాయవాదిని ఎంపిక చేసి రూ లక్ష నగదును బహుమతిగా ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో గట్టిగా చెప్పినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులను చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో లేదా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ స్థలానికి తరలించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని దీనిపై త్వరలోని నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 

మహామహులు పనిచేసిన చరిత్ర..
సీటీ సివిల్ కోర్టుకు ఘనమైన చరిత్ర ఉందని కేసీఆర్ ఆన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన ఈ కోర్టులో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగా రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నేతలు ప్రాక్టీస్ చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. కార్యక్షికమానికి విచ్చేసిన సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డిని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. న్యాయవాదుల సమస్యలపై తన్నీరు శ్రీరంగారావు, గోవర్ధన్ రెడ్డి, ఇతర న్యాయవాదులు తన దృష్టికి తీసుకవచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, సిటీ సివిల్ కోర్టు రెండో అదనపు చీఫ్ జడ్జి వై అరవింద్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జగత్‌పాల్‌రెడ్డి, కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కోర్టు ప్రాంగణానికి సమీపంలో ఉన్న మసీదు నుండి ఆజా వినపడడంతో సీఎం తన ప్రసంగాన్ని నిలిపివేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆజా పూర్తైన తర్వాత కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆజా(ప్రార్థనకు పిలుపు)వచ్చినప్పుడు పాటించాల్సిన నియామాలు ఈ సందర్భంగా సభికులకు వివరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


శనివారం, సెప్టెంబర్ 27, 2014

అది మీడియా స్వేచ్ఛను కాలరాయడమే...!!!

-చంద్రబాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు కొందరు విలేకరులను అడ్డుకోవడంపై జస్టిస్ కట్జూ స్పందన
-ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు, టీవీ చానళ్లకు చెందిన పాత్రికేయ ప్రతినిధులను అనుమతించకపోవడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే, మీడియా స్వేచ్ఛను కాలరాయడమే నని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు.


markandeya-kajjuప్రభుత్వ కార్యక్రమాలకు పత్రికలు, చానళ్ల ప్రతినిధులను నిరోధించడం భారత రాజ్యాంగంలోని 14, 19(1) (ఏ) అధికరణలను ధిక్కరించడమేనని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ పాత్రికేయులు రాజీవ్ రంజన్ నాగ్ కన్వీనర్‌గా వ్యవహరించే విచారణ కమిటీలో కే అమర్‌నాథ్, ప్రజ్ఞానంద్ చౌదరి సభ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులు ఈ నెల30వ తేదీన హోంశాఖ, సమాచార శాఖ కార్యదర్శులతో సమావేశం కానుంది. అక్టోబర్ 1వ తేదీన పాత్రికేయుల అభిప్రాయాలు తీసుకుంటుంది. అనంతరం పూర్తిస్థాయి నివేదికను పీసీఐ చైర్మన్ కట్జూకు కమిటీ అందజేయనున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

అక్రమ అధికారి పదోన్నతికి చెక్...!!!

-నమస్తే తెలంగాణ ఎఫెక్ట్
-కార్మికశాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌పై అంతర్గత విచారణ
-వరంగల్ జేసీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగింపు
కార్మికశాఖలో అక్రమంగా తిష్ఠవేసిన రాయలసీమ ప్రాంత అధికారి ఆటలకు చెక్ పడింది. కార్మికశాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ నరేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. వరంగల్ జాయింట్ కమిషనర్ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి మోహన్‌బాబును నియమించారు.
కార్మికశాఖలో అక్రమ అధికారి అన్న శీర్షికతో నమస్తే తెలంగాణలో ఈ నెల 22న ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు ఈమేరకు స్పందించారు. కార్మికశాఖలో రాయలసీమకు చెందిన నరేశ్‌కుమార్‌ది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఆయనకు తాజాగా వరంగల్ జాయింట్ కమిషనర్‌గా అదనపు ఇన్‌చార్జి బాధ్యతలుకూడా కేటాయించడం కార్మికశాఖలో కలకలం రేపింది. 11 మంది సీనియర్ అధికారులను కాదని, తెలంగాణకు చెందిన సీనియర్ అధికారులను పక్కనబెట్టి, ఒక జూనియర్‌ను, పైగా తెలంగాణేతరుని నియమించడంపై విమర్శలు వచ్చాయి.

నిబంధనలకు విరుద్ధంగా నరేశ్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టడం.. అది కూడా తెలంగాణ కార్మికశాఖ మంత్రి ఆమోదం లేకుండానే జరిగిన విషయాన్ని నమస్తే తెలంగాణ వెల్లడించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. అడ్డదారిలో పదోన్నతులను నిరోధించాలని, వెంటనే వరంగల్ జాయింట్ కమిషనర్ ఇన్‌చార్జిగా అర్హులను నియమించాలని నాయిని సూచించినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు హడావుడిగా నరేశ్‌ను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించి..మోహన్‌బాబుకు ఆ బాధ్యతలను అప్పగించారు. నరేశ్‌పై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు హోంమంత్రికి ఉన్నతాధికారులు తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

గురువారం, సెప్టెంబర్ 25, 2014

మా పేద విద్యార్థులను ఆదుకోవడానికే...


-మా విద్యార్థులను ఆదుకోవాలనే ఫాస్ట్ జీవో
-హైకోర్టుకు నివేదించనున్న న్యాయశాఖ 

తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్ట్ జీవోపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ విషయమై సమగ్రమైన వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫాస్ట్ పథకంపై సవివరమైన నివేదికను రూపొందించాలని న్యాయశాఖను ప్రభుత్వం పురమాయించింది. తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది తప్ప ఇతర ప్రాంత విద్యార్థుల పట్ల వివక్ష చూపడానికి కాదని, వారి అవకాశాలను దెబ్బతీసే ఉద్దేశంతో జీవోలో ఎలాంటి క్లాజ్‌లు లేవని ప్రభుత్వం వివరించనుంది. 

రాజ్యాంగ పరిధిలోనే ఫాస్ట్ పథకంపై జీవో జారీచేశామని, తెలంగాణలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఇతోధికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని న్యాయశాఖ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. 

ఫీజుల చెల్లింపు విషయంలో ఇతర అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ సొంత రాష్ట్ర విద్యార్థులను ఆదుకునేందుకు.. ఫాస్ట్ జీవోను జారీ చేసిందని హైకోర్టుకు నివేదించనున్నది. స్థానికత గుర్తింపునకు, 1956 నిబంధన వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని, తమ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే దీనిని తెచ్చామని తెలుపనున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికెట్లు కోరుతున్నదని న్యాయశాఖ నివేదికలో వివరించనున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

సాధికారికంగా బతుకమ్మ పండుగ సంబురాలు!

image of batukamma festival in telangana కోసం చిత్ర ఫలితంimage of batukamma festival in telangana కోసం చిత్ర ఫలితంimage of batukamma festival in telangana కోసం చిత్ర ఫలితంimage of batukamma festival in telangana కోసం చిత్ర ఫలితంimage of batukamma festival in telangana కోసం చిత్ర ఫలితం

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలమే అయినా పండుగల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. బోనాలు, వినాయక చవితి నిర్వహణపై కూడా ఇదే విధమైన ఆసక్తి కనబరిచింది. తెలంగాణ పునర్నిర్మాణ వ్యూహాలు రచించి అమలు చేసే బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ పండుగల నిర్వహణకు మొదటి ఏడాదిలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది.

"బంతి పూల తోట నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ" అంటూ తన పాటలో ఈ ప్రాంత సాంస్కృతిక జీవనాన్ని హృద్యంగా వర్ణించిండు ప్రముఖ కవి నందినీ సిద్ధారెడ్డి. తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, బంతిపూలు గుర్తుకొస్తయి. బతుకమ్మ పండుగలో తెలంగాణ హృదయం అగుపడతది. వలస పాలనలో తెలంగాణ సంస్కృతి అణచివేతకు గురైంది.

బతుకమ్మ వంటి గొప్ప పండుగ కూడా ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు మన రాష్ట్రం సాధించుకున్నాం. మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. మన సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటున్నాం. బతుకమ్మ ఆడుకోవడానికి పది కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు, ఈ పండుగ విశిష్టతను, తద్వారా తెలంగాణ సం స్కృతిని ప్రపంచానికి చాటడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. దేశంలోని వివిధ రంగాల మహిళామణులు ఆతిథులుగా టాంక్‌బండ్‌పై తొలి పెద్ద బతుకమ్మను జరుపుకోవడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. 

బతుకమ్మ, దసరా, హోలీ మొదలైనవన్నీ తెలంగాణ మనసుకు అద్దం పట్టే సామాజిక ఉత్సవాలు. ఇవి ఇంటిలో తలుపులు బిడాయించుకుని జరుపుకునే పండుగలు కాదు. సామూహికంగా జరుపుకునేవి. బతుకమ్మ వంటి గొప్ప పండుగ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఇవాళ ఎంగిలి పూలు మొదలుకొని సద్దుల వరకు- ప్రతి రోజూ పల్లె పల్లెనా జరిగే ఈ సంబురాలు ప్రజలు జరుపుకునే మహిళా దినోత్సవాలు.

హైదరాబాద్‌తో సహా తెలంగాణవ్యాప్తంగా వరంగల్, కరీంనగర్ తదితర నగరాలలో భారీ ఎత్తున మహిళలు తరలి వస్తారు. మహిళా వ్యాపారస్తులు, విద్యావంతులు, విద్యార్థులు మొదలుకొని సామాన్య కూలీల వరకు అంతా ఒక్క చోట చేరే సందర్భమిది. పెండ్లయిన మహిళలు తల్లిగారింటికి వచ్చి కుటుంబ సభ్యులతో, చిన్ననాటి స్నేహితురాళ్ళతో గడుపుకొని పాత రోజులను గుర్తుకు తెచ్చుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం వల్ల మనసు తేలిక పడుతది. మహిళలంతా ఇంటి నుంచి బయటికి వచ్చి ఆడుతూ పాడుతూ గడపుతరు. ఫలహారాలు పంచుకుని తింటరు.

బొడ్డెమ్మ అయితే టీనేజి పిల్లల పండుగ! బొడ్డెమ్మ, బతుకమ్మలకు ముందు ఆ తరువాత కొద్ది రోజుల పాటు అన్ని రకాల పప్పులు ముద్ద చేసి ఇవ్వడం- కౌమార బాలికలకు పౌష్టికాహారం అందించడమే. ఈ పూల పండుగ మనిషిని ప్రకృతికి మరింత దగ్గర చేస్తుంది. వేల కొద్ది పాటలు మహిళలే పాటలు రచించి పాడుకోవడం ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతం. ఈ పాటలలో అత్తగారింటికి వెళ్ళే బిడ్డకు తల్లి చెప్పే బుద్దులు ఉంటాయి. తల్లిగారింటిపై తల్లడిల్లే మన సు ఉంటుంది.

సున్నితమైన శృంగారం ఉంటుంది. చిరునవ్వులు చిలికే హాస్యం ఉంటుంది. కన్నీటి కథలు ఉంటాయి. స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించే సాహిత్య సంపద ఇది. చారిత్రక ఘటనలపై కూడా పాటలు కట్టి పాడుకోవడం పల్లె స్త్రీల విజ్ఞాన విస్తృతికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ పండుగ అస్తిత్వానికి, పోరాటానికి చిహ్నంగా మారిపోయింది. వలస పాలకులు ట్యాంక్‌బండ్‌పై ఆడుకోవడానికి అంగీకరించనప్పుడు న్యాయస్థానానికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవలసి వచ్చింది. ఆ విధంగా సీమాంధ్ర దుశ్శాసనానికి ధిక్కారంగా- టాంక్‌బండ్‌పై మహిళలు చిరునవ్వులు చిందిస్తూ బతుకమ్మ ఆడడాన్ని చూసి తెలంగాణ సమాజమంతా మురిసిపోయింది. తెలంగాణ అంతటా ఉద్యమ గౌరమ్మలు ఊరేగాయి. అందుకే తెలంగాణ సాధించుకున్నాం కనుక ఈ బతుకమ్మ ఆటలు విజయోత్సవ సంబురాలు. 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలమే అయినా పండుగల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. బోనాలు, వినాయక చవితి నిర్వహణపై కూడా ఇదే విధమైన ఆసక్తి కనబరిచింది. తెలంగాణ పునర్నిర్మాణ వ్యూహాలు రచించి అమలు చేసే బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ, పండుగల నిర్వహణకు మొదటి ఏడాదిలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది. 

భవిష్యత్తులో బతుకమ్మ పండుగ నిర్వహణ మరింత శోభాయమానంగా మారుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పొడుగునా ఉల్లాసంగా బతుకమ్మ ఆడడానికి వీలుగా పాత కట్టడాలను, నిర్మాణాలను తొలగించైనా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలె. సీమాంధ్ర పాలకుల మాదిరిగా బతుకమ్మ ఆటను ఏ ఒక్క ప్రదేశానికో పరిమితం చేయకూడదు. హైదరాబాద్‌లోని ఇతర చెరువుల దగ్గర కూడా తగినన్ని ఏర్పాట్లు చేయాలె. వలస పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారు. దీనివల్ల తెలంగాణ జీవనమే అస్తవ్యస్థమైంది. తెలంగాణ ప్రభుత్వం చెరువుల మరమ్మత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ఈ చెరువుల మరమ్మత్తు పూర్తయితే ఊర్లు బాగుపడతాయి. అప్పుడు ఊరూరా బతుకమ్మ పండుగ మరింత సంబురంగా సాగుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!