గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 12, 2015

సాంకేతిక కళాశాలల దారెటు?

పాత వ్యవస్థను మార్చేందుకు తెలంగాణ రాష్ర్టాన్నే పోరాడి తెచ్చుకోవటం జరిగింది. ఇపుడు పునర్నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను నెలకొల్పాలని ఐటీ మంత్రి కేటీఆర్ కృషి మొదలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కూల్‌ను నిర్మించేందుకు నిష్ణాతులతో ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ గ్రూప్‌ను పెట్టాలన్న ఆలోచనలున్నట్లు చెబుతున్నారు.అందుకోసం కేటీఆర్ తనదైన శైలిలో కృషి మొదలుపెట్టారు. 

juluru


ఇంజినీరింగ్ విద్యపై వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. సెల్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు జరుగుతున్న ఈ సమయంలో మన దగ్గర ఇంజినీరింగ్ కాలేజీలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న అనేకసార్లు వచ్చింది. మన రాష్ట్రంలో ఏటా ఎంతో మంది ఇంజినీర్లను తయారు చేయటం గొప్ప విషయమే. కానీ ఆ చదువులో వారి ప్రమాణాల గురించి ఆలోచిస్తే ఆందోళన కలుగుతున్నది.
ఎంసెట్ కౌన్సెలింగ్, అఫిలియేషన్ల గొడవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జేఎన్టీ యూ నిర్వహణ, ఉన్నత విద్యామండలి నడక, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదా లు, సీట్ల కోత, సీట్ల పెరుగుదల తదితర అంశాల చుట్టూతా ఇంజినీరింగ్ విద్యను తిప్పుతున్నారు. సీట్ల కోతపై, కౌన్సెలింగ్ ఆలస్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై జరిగే చర్చ ఇంజినీరింగ్ విద్యలో నాణ్యతపై జరగకపోవటం విచారకరం. పాలనాపరమైన విషయాలపై జరిగే చర్చలే ఇంజినీరింగ్ విద్యను కమ్మేయటంతో అసలు మన ఇంజినీరింగ్ విద్య ఎటు పోతుందోనన్న సంశయం ఆలోచనాపరులను వెంటాడుతున్నది. ఇక్కడ వందలాది కాలేజీలున్నా పరిశోధనలు మాత్రం జరగటం లేదు. కళ్ల ముందున్న అనేక సమస్యలకు విరుగుళ్లను శాస్త్ర సాంకేతిక రంగాలు కనిపెట్టాలి. ప్రజల కన్నీళ్లను తుడిచేందుకే సాంకేతిక విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతున్నట్లు తొలి ప్రధాని నెహ్రూ చెప్పారు. ఉన్నత ఆశయాలతో ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలు నెలకొల్పారు. కానీ ఆచరణలో అవి క్రమంగా నాణ్యతలేని కాలేజీలుగా మారుతున్నాయి. వందల సంఖ్యలో కాలేజీలున్నా పరిశోధనలు ఎందుకు జరగటం లేదంటే మన కాలేజీలన్నీ బ్యాచిలర్ డిగ్రీ కాలేజీలు అని దాటవేస్తున్నారు. పరిశోధనలు చేయవలసిన పాత్ర మాది కాదు అని కాలేజీలు పక్కకు తప్పుకుంటున్నాయి. దీంతో మన ఇంజినీర్లు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు. ఆ వలస పోయేందుకు కూడా కావాల్సిన నైపుణ్యాలు లేక లక్షలాదిమంది సాంకేతిక నిరుద్యోగ సైన్యంగా మారిపోతున్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేవన్నది సత్యమే. కానీ కనీసంగా నైపుణ్యమున్న మానవవనరులుగా తీర్చిదిద్దలేకపోవటమే ఈ వ్యవస్థలో మరో ప్రమాదకర సంకేతంగా మారిపోతున్నది. దీనికి కారకులెవరన్నది ప్రశ్న కాదు. ఇప్పటికైనా సాంకేతిక కళాశాలలు స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలుగా మారవలసిన అవసరం ఉన్నది. ట్రిపుల్ ఈ చదువుకున్న విద్యార్థి కనీసం ఇంటి దగ్గర కరెంటు ఫ్యూజు పెట్టుకోలేని పరిస్థితి. కనీస ఆచరణకు పనికిరాని చదువుగా మారింది. 


ప్రజా ధనంతో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలు ప్రజా సమస్యలకు విరుగుడుగా సాంకేతిక విద్యను మలచవలసి ఉన్నది. ఆ పని ఎన్ని ఇంజినీరింగ్ యాజమాన్యాలు చేస్తున్నాయి. ఈ కాలేజీలున్న పరిసర ప్రాంతాలలో వడ్రంగి పని చేసేవాళ్లు తమ జీవనానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు కృషి చేయకపోగా, అనేక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చైనాకు పోయి అక్కడ నుంచి కాలేజీకి కావాల్సిన కుర్చీలు, బల్ల్లలు, బ్లాక్ బోర్డులు, టేబుళ్లు దిగుమతి చేసుకుంటున్నాయి. అది కారు చౌకగా వస్తుండవచ్చును. కాలేజీలకు ఫర్నీచర్‌ను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే వడ్ల కమ్మరులు ఆత్మహత్య చేసుకుంటుంటే వారి వృత్తిని ఆధునికీకరించే పరిశ్రమలను నెలకొల్పేందుకు పరిశోధనలు చేసి ప్రభుత్వానికి, వృత్తిదారులకు అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత సాంకేతిక విద్యారంగానికి ఉన్నది. చైనాలో కొబ్బరి టెంకలతో ఫర్నీచర్ తయారు చేశారు. అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మన సాంకేతిక విద్యారంగం ఇప్పటివరకు ఏ రకమైన కృషి చేసింది? మన ఇంజినీరింగ్ కాలేజీలలో పరిశోధనలు జరిగితే ప్రపంచం స్టాన్‌ఫర్డ్ వైపు కాదు, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది.


పరిశోధనలకు బీజాలు వేసి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దవలసిన ఉన్నత విద్యామండలి గత దశాబ్ద కాలంగా గురకబెట్టి నిద్రపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత స్థితిని మార్చివేసి కొత్త నిర్మాణం చేయటానికి కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. ఉన్నత విద్యామండలి ఆయన ఆలోచనలను అమలులోకి తేవాలె. తెలంగాణ రాష్ట్రం కోసం గూగుల్ రెండవ ప్రధాన కార్యాలయం హైద్రాబాద్‌లో నెలకొల్పేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. అందుకు కావాల్సిన సాంకేతిక విద్యా పరిపుష్టిని ఇచ్చే విధంగా మన విద్యారంగాన్ని తీర్చిదిద్దాలె. 


జేఎన్టీయూ ఏర్పడిన నాటి నుంచి వేల సంఖ్యలో పరిశోధనలు జరిగాయి. కానీ అందులో సీరియస్ పరిశోధనలు ఎన్నంటే వేళ్లమీదనే లెక్కించవలసి వస్తుంది. ఇక పరిశోధన అంటే దాదాపుగా ఐఐటీలదే అయ్యింది. మన జేఎన్టీయూ పరిధిలో వేల సంఖ్యలో పరిశోధనలు జరిగినప్పటికీ ఆరు పరిశోధనలకు మాత్రమే పరిశ్రమలు పెట్టుకునేందుకు పేటెంట్‌లు వచ్చాయని అంటున్నారు. జేఎన్టీయూ ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుంచే పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. కానీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో పరిశోధనలు అంతగా జరుగలేదు. 


తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గతం కంటే భిన్నంగా వేగవంతంగా పరిశోధనలు కొనసాగించవలసి ఉంది. పరిశోధనలను పరిశ్రమలకు అనుసంధానం చేయవలసి ఉన్నది. సమాజ కల్యాణం కోసం ఆ పరిశోధనలను అంకితం చేసే విధంగా, ఉత్పత్తికి అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా నూతన పరిశ్రమలను మన సొంత టెక్నాలజీతో నిర్మించుకోవాలె. తెలంగాణ నేలలో సహజ సంపదలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని ఉత్పత్తి వైపుకు మళ్లించగలగాలె. నల్లగొండ జిల్లా కృష్ణపట్టె ప్రాంతంలో కావల్సినంత సున్నపురాయి ఉన్నది. అది మరో 200 సంవత్సరాల వరకు సిమెంటు పరిశ్రమలకు సరిపోతుంది. దీంతో నల్గొండ జిల్లా సిమెంట్ క్యాపిటల్‌గా మారింది. అక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ ఇంజినీరింగ్‌పై కాలేజీలు పెట్టాలె. 


ఆదిలాబాద్ నేలలో ఎన్నెన్నో విలువైన ఖనిజాలున్నాయి. వాటిని వెలికి తీసేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుపాల్సి ఉన్నది. ఇందుకోసం అక్కడ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు వెలయాలి. కరీంనగర్ అన్నది గ్రానైట్ మైన్ క్యాపిటల్‌గా మారింది. ఆ మైనింగ్‌పైన పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో పెడితే తెలంగాణ సకల సంపదలతో తూగుతుంది. కరీంనగర్ వరి పంటలో అగ్రస్థానంలో ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు కేంద్రంగా ఉంది. ఖమ్మం గ్రానైట్ సంపదకు నిలయంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో గరుకునేలపైకి గంగమ్మను తీసుకురావాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో వున్నన్ని ఖాళీస్థలాలు దేశంలో మరెక్కడా లేవు. వరంగల్ జిల్లాలో అటవీ సంపద, గోదావరి తీర ప్రాంతం ఉంది. మెదక్ జిల్లా అత్యధిక పరిశ్రమలు నెలకొల్పబడ్డ ప్రాంతం. 


తెలంగాణ 10 జిల్లాల్లో కావాల్సినన్ని సహజ వనరులు, సంపదలు ఉన్నాయి. అట్లాగే పేరుకు పోయిన సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి విరుగుళ్లుగా పరిశోధనలు జరగాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధతో దూసుకువస్తున్నారు. ఈ సందర్భంలో తెలంగాణను సంపద గల ప్రాంతంగానే గాక పరిశోధనలకు కూడా తిరుగులేని ప్రశస్తిగల తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలి. ఇంజినీరింగ్ కాలేజీలు ఈ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. నాణ్యమైన విద్యను అందించటం సాంకేతిక విశ్వవిద్యాలయం బాధ్యత. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సమస్యలు లేవనటం లేదు. కానీ ఇప్పుడు తక్షణం పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి. నాణ్యమైన విద్యతోపాటుగా స్కిల్ రీసెర్చ్ జరగాలి. మనదేశంలో ఇప్పటి వరకు సుమారు 300 రకాల స్కిల్స్ ఉన్నాయని గుర్తిస్తే అమెరికాలో 3000 రకాల స్కిల్స్‌ను గుర్తించారు. వీటిపైన ఆ దేశంలో శిక్షణనిస్తున్నారు. అమెరికాలో టప్పా విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంటు స్కూల్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 


పాత వ్యవస్థను మార్చేందుకు తెలంగాణ రాష్ర్టాన్నే పోరాడి తెచ్చుకోవటం జరిగింది. ఇపుడు పునర్నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను నెలకొల్పాలని ఐటీ మంత్రి కేటీఆర్ కృషి మొదలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కూల్‌ను నిర్మించేందుకు నిష్ణాతులతో ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ గ్రూప్‌ను పెట్టాలన్న ఆలోచనలున్నట్లు చెబుతున్నారు. అందుకోసం కేటీఆర్ తనదైన శైలిలో కృషి మొదలుపెట్టారు. ఒక్కొక్క జిల్లా ముఖచిత్రం మార్చివేసేందుకు ఆ జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి భౌతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్‌మెంట్ చేయవలసి ఉన్నది. ప్రతిభావంతులు ఎక్కడైనా నెగ్గుకొస్తారు. జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానికత దృష్టిలో విస్తృత పరిశోధనలు చేయవలసి ఉన్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి