గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 12, 2014

రెచ్చగొట్టి...గడుపుకుంటున్న...రాజకీయ పబ్బం...!

- ఇదే చంద్రబాబు కొత్త ఫార్ములా
- ఓ పాలన లేదు..ఓ పథకాలు లేవు
- తెలంగాణపై దాడితో కాలం గడిపే యత్నం
- జాబితాలో తాజాగా జయశంకర్, పీవీ వర్సిటీలు
- మండిపడుతున్న తెలంగాణవాదులు
రాష్ట్రం విడిపోయినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద విషం కక్కుతూనే ఉన్నారని, వీలున్న అన్ని చోట్లా తెలంగాణను నష్టపరిచేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారని తెలంగాణవాదులు దుయ్యబడుతున్నారు.
ఇందుకోసం మంత్రులను, అనుయాయులను ముందు పెట్టి తెలంగాణ సర్కారు మీద బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వారు చెబుతున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే తెలంగాణను బూచీగా చూపించి ఆంధ్రలో రాజకీయపబ్బం గడుపుకునే ఎత్తుగడ అనుసరిస్తున్నట్టు తేటతెల్లమవుతుందని వారంటున్నారు. ఓవైపు తెలుగుజాతి కలిసి ఉండాలి అంటూ నీతులు చెబుతూనే మరోవైపు తెలంగాణ సమాజంపై సీమంధ్రలో వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వాదన.


పాలన శూన్యం...పథకాలు నిర్వీర్యం..

రాష్ట్రం ఏర్పాటై రెండు నెలలు గడిచాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమిటని వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం వెక్కిరిస్తున్నది. ఆ రాష్ట్రంలో పాలన పడకేసింది. పథకాలు నిర్వీర్యమయ్యాయి. సన్మానాల అట్టహాసాలు, ప్రెస్‌మీట్ల హూంకరింపులే తప్ప ఒక్కటంటే ఒక్క పథకాన్ని పట్టాల మీదికి తెచ్చింది లేదు. ఇచ్చిన ప్రతి హామీకి ఓ తొండి అడ్డం పెట్టి అన్నింటినీ నిర్వీర్యం చేసిపారేశారు.

పాలనలో చూసినా, అభివృద్ధిలో చూసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జెట్ వేగంతో దూసుకుపోతుంటే చంద్రబాబు తానెక్కడున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు అని ఓ తెలంగాణవాది విశ్లేషించారు. పాపం ఆయనకు భజన చేసే మీడియాకు కూడా ఇవాళ ఏం చేసి చంద్రబాబును నిలబెట్టాలో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని సీమాంధ్ర రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. అదీ పరిస్థితి అని ఆయన వివరించారు. ఈ పరిస్థితే చంద్రబాబును తెలంగాణపై కుట్రలు చేసే దిశగా లాగుతున్నట్టు కనిపిస్తున్నది.

సీమాంధ్ర ప్రజలు కేసీఆర్‌తో తనను పోలిస్తే అసలుకే ఎసరు వస్తుందనే ఆయన తెలంగాణకు ప్రాణప్రదమైన కరెంటు నిలిపివేతకు పూనుకున్నారు అని వారంటున్నారు. తెలంగాణలో విద్యుత్ కోత రైతులు ఆత్మహత్యలకు పాల్పడేంత విషమ సమస్య అని తెలిసీ రాష్ట్ర విభజన చట్టాన్ని కాదని వ్యవహరించిన చంద్రబాబు ఇతర విషయాల్లో మాత్రం విభజన చట్టం అంటూ నీతులు చెబుతున్నారని తెలంగాణవాదులు కూడా మండిపడుతున్నారు. చివరికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకుంటే దాన్నీ అడ్డుకోవాలని యత్నించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ఠగా వారు అభివర్ణిస్తున్నారు.

"జయశంకర్... మా సార్" అన్నవాళ్లు నోరు మెదపరా?

జయశంకర్ "మా సార్... మాకు క్లాసులు చెప్పిండు. నేను ఎన్నోసార్లు సార్ ఇంట్ల సమావేశాలు జరిపిన... కేసీఆర్ కంటే సార్ నాకే దగ్గర" అంటూ డంబాలు పలికిన టీటీడీపీ ముఖ్య నాయకుడు ఇపుడు అదే జయశంకర్ పేరును వ్యవసాయ వర్సిటీకి పెట్టకుండా చంద్రబాబు ఆంధ్రామంత్రులను పంపితే ఏం చేస్తున్నాడని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ వైతాళికులను దారుణంగా అవమానిస్తుంటే ఆ శిష్యుడికి జయశంకర్ సార్ ఎందుకు గుర్తుకు రావడం లేదని నిలదీస్తున్నారు.

ఆంధ్రామంత్రులు వారి ప్రాంతం ప్రయోజనాలకోసం గవర్నర్ బంగళా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే, టీటీడీపీ నాయకులు చంద్రబాబు అద్దాలమేడ చుట్టూ పొర్లు దండాలు పెట్టుకుంటున్నారని వారు మండి పడుతున్నారు. అడుగడుగునా బాబు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్న తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతల తీరును తప్పు పడుతున్నారు.

వ్యవసాయ వర్సిటీ తెలంగాణదే...

యూనివర్సిటీలకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టడాన్ని సహించలేకే చంద్రబాబు తన మంత్రులను గవర్నర్ వద్దకు పంపి ఫిర్యాదు చేయించడమే కాకుండా విభజన చట్టానికి వక్రభాష్యాలు చెపుతున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు గవర్నర్‌ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన మాటల్లో అన్నీ అర్థసత్యాలే వినిపించాయని, విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లలో లేని సంస్థలు,ఆస్తులు, అప్పులన్నీ ఏప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే చెందుతాయని చట్టం స్పష్టంగా చెప్పిందని స్పష్టం చేశారు.

అయితే సీమాంధ్ర మంత్రులు మాత్రం షెడ్యూల్ 9,10లలోని లేని సంస్థలు అవశేష ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని వాదించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ...అని వారు అభివర్ణించారు. తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్‌లో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీ సీమాంధ్రకు ఎలా చెందుతుందని వారు నిలదీశారు.

చెట్టుకింద పాలన ఏమైందో....

ఎన్నికలకు ముందు సీమాంధ్రలోనే ఉండి పరిపాలన కొనసాగిస్తానని, వారానికి నాలుగు రోజులు గుంటూరులో ఉంటానని డంబాలు పలికిన చంద్రబాబు ఇపుడు ఆ వేపు కూడా చూడడం లేదని తెలంగాణ వాదులు పేర్కొన్నారు. చెట్టుకింద ఉండి అయినా సరే అందరికీ అందుబాటులో సీమాంధ్రనుంచే పాలన సాగిస్తానని చెప్పిన చంద్రబాబు ఇపుడు హైదరాబాద్‌నుంచే కదలడం లేదని, సీమాంధ్రలో ఈ విషయమై చర్చ కూడా జరుగుతోందని వారు చెప్పారు.

మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని తనకు విజ్‌డమ్ ఆఫ్ ఎకానమీ ఉందని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. రాయలసీమకు పంగనామాలు పెట్టి సొంతసామాజిక వర్గం ప్రయోజనం కోసం విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మించడానికి సిద్ధమయ్యారని దీనికి ప్రజల వ్యతిరేకత రాకుండా తెలంగాణపై లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని వారంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి