అక్రమ ఉద్యోగులను తెలంగాణలోనే ఉంచడం...తెలంగాణ ఉద్యోగుల్ని ఆంధ్రకు బదిలీ చేయడం...పోలవరం ముంపుగ్రామాల్ని...ఏడుమండలాల్ని ఆంధ్రలో కలపడం మొదలైన సమస్యలతో తెలంగాణ తలమునకలై ఉంటే సందట్లో సడేమియాల్లా ఈ ఆంధ్రా అక్రమార్కులు తెలంగాణ భూదందా షురూచేశారు...
-ఆఖరి మోఖాలో ఆంధ్రాబాబుల భూం ఫట్
-కంటపడ్డ భూములన్నింటికీ ఎన్వోసీలు.. సహకరిస్తున్న సీమాంధ్ర అధికారులు
-రాత్రికి రాత్రే జారీఅవుతున్న జీవోలు..
-కబ్జా పెడుతున్న భూమి విలువ రూ. 1500 కోట్లు
-తెరవెనుక కేవీపీ, సీఎం రమేశ్, లగడపాటి, మాజీ సీఎం కిరణ్ సోదరుడు
-ఆంధ్రా అధికారికి తెలంగాణలో భూమి కేటాయింపు
-అక్రమంగా ఆక్రమిస్తే ఊరుకోం.. టీఆర్‌ఎస్ సీరియస్
ఆంధ్రా నాయకులు ఆఖరి దోపిడీ ప్రారంభించారు. ఇన్నాళ్లూ అబ్బ సొత్తులాగా తెలంగాణ భూములు తెగనమ్మి బొక్కసాలు నింపుకున్న నయా దోపిడీమూకలు, సమైక్యరాష్ట్రం చరమాంకంలో కూడా వంకరబుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఎంత దోచుకోగలిగితే అంత అన్నట్టు ఆఖరు నిమిషంలో ఆబగా సర్కారు, యుఎల్‌సీ, ఇనామ్ ఇలా హైదరాబాద్‌లో కంటపడ్డ భూములనన్నింటినీ చెరబట్టి దొడ్డిదారిలో క్రమబద్ధం చేసుకోజూస్తున్నారు. నాలుగు రోజుల్లో తెలంగాణ వదిలే అధికారులు వాటికి రాజముద్రలు వేస్తున్నారు. భేతాళ మాంత్రికులు, పాతాళ తాంత్రికులు పార్టీలు మరిచి కుమ్మక్కై ఇలా చెరబట్టిన భూముల విలువ రూ. 1500 కోట్లకు పైమాటే. సీమాంధ్ర పాలకులను పొలిమేరల ఆవలికి తరిమికొట్టిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన తెలంగాణ భవన్ సమీపంలో ఉన్న భూమిని సైతం ఈ బకాసురులు వదలడం లేదంటే ఎంతకు తెగించారో... సీమాంధ్ర అధికారులు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.
మరో నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు, అధికారులు ఇక్కడి విలువైన భూములను స్వాహా చేయడానికి ఆగమేఘాల మీద ఉరకలు పరుగులు పెడుతున్నారు. విలువైన కొన్ని భూములను ఇప్పటికే అడ్డదారుల్లో తమ ఖాతాల్లో వేసుకున్నారు. వీరితో కుమ్మక్కైన సీమాంధ్ర ఉన్నతాధికారులు వివాదాస్పద, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీవోలు జారీ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఎన్ని భూములను స్వాధీనం చేసుకోగలమో లెక్కలు వేసుకొని మరీ దంచుకో.. పంచుకో అన్న సూత్రాన్ని అమలు చేస్తున్నారు. నాయకులు, ఉన్నతాధికారులు ఇప్పటిదాకా కాజేసిన భూముల విలువ దాదాపు రూ. 1500 కోట్ల వరకూ ఉంటుందని తెలిసింది. సర్కారు, యూఎల్‌సీ, ఇనామ్, అవెక్యూ ఇలా ప్రభుత్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన భూములకు అడ్డదారుల్లో క్రమబద్ధీకరణ మార్క్ వేస్తున్నారు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలలో అత్యంత ఖరీదైన యూఎల్‌సీ భూములకు కూడా జిల్లా కలెక్టర్ల నుంచి మొదలు కొని సీసీఎల్‌ఏ వరకు కమిటీల్లో వేసి హడావిడిగా క్లియరెన్స్ ఇస్తున్నారు. సర్కారు భూములకు కూడా ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాలలో సర్కారు భూములకు తూట్లు పొడిచి సీమాంధ్రులు కోట్లు దండుకుంటున్నారు.
ఇదిగో ఈ రకంగా...: షేక్‌పేట మండలంలో అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ఉన్న 403 సర్వేనెంబర్‌లో 10 ఎకరాల భూమిని ఆంధ్రా బడాబాబులు, ఉన్నతాధికారులు కలిసి స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. ఆనంద్ ప్రభాత్ సొసైటీ పేరిట ఈ ప్రభుత్వ భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. రూ.300 కోట్ల విలువ చేసే ఈ భూమిని కాజేసేందుకు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌లు పార్టీలు మరిచి కుమ్మక్కై తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇదే సర్వేనెంబర్‌లో ఒక సంస్థకు కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి అధికారుల స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ కలెక్టర్ ద్వారా ఎన్వోసీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారని ప్రచారంలో ఉన్న ఒక అధికారి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నట్టు సమాచారం. సీసీఎల్‌ఏగా ఉన్న ఒక అధికారి సీమాంధ్రలో అధికార పార్టీ నాయకులకు, బడా బాబులకు తలొగ్గి హడావిడిగా ఎన్వోసీలు ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. దీని వెనుక పెద్ద లాబీ పని చేస్తున్నదని వారు చెప్పారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్11లోని రూ.150 కోట్ల రూపాయల విలువైన ఐదు ఎకరాల భూమిని స్వాహా చేయడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు సంతోష్‌రెడ్డి తన బినామి ప్రతాపరెడ్డితో తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అంజునాబేగం పేరుతో ఈ భూమికి ఎన్వోసీ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. రాయదుర్గంలోని సర్వేనెంబర్ 66, 83లోని వివాదాస్పద భూమిపై ఎన్వోసీ ఇవ్వడానికి అధికారులు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నారు.
రోడ్ నెంబర్ 10లోని 2500 చదరపు గజాల పార్కు భూమిని ఉన్న ఫళంగా ఎన్వోసీ జారీ చేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్న రూ.300 కోట్ల విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి కేవీపీ రంగంలోకి దిగాడు. రాధికా సొసైటీ ముసుగులో ఈ భూమిని ఎన్వోసీ తీసుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. నేడో రేపో ఎన్వోసీ వస్తుందన్న ధీమాతో సీమాంధ్ర బడాబాబు ఉన్నట్లు సమాచారం. మరోవైపు లోయర్ ట్యాంక్ బండ్‌లోని డీబీఆర్ మిల్స్ భూమిని స్వాధీనం చేసుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ముషీరాబాద్ మండల కార్యాలయం ఎదురుగా ఉన్న 157, 158 సర్వేనెంబర్‌లోని రూ. 250 కోట్ల విలువైన 24 ఎకరాల భూమిని రాజ్‌కుమార్ మల్సానీ పేరుతో ఎన్వోసీ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆంధ్రా అధికారి కుటుంబానికి తెలంగాణలో భూమి..: ఆంధ్రప్రాంతానికి చెందిన ఒక ఐఎఫ్‍ఎస్ అధికారి కుటుంబానికి ఉన్న ఫళంగా హైదరాబాద్‌లోని విలువైన భూమిని కట్టబెడుతూ ఈ నెల 23వ తేదీన హడావుడిగా జీవో జారీ చేశారు. కాకినాడకు చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి వీ వెంకటేశ్వరరావు 1990లో కాబూల్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆయన భార్య వీ మాలతీరావుకు జూబ్లీహిల్స్ భరణి లేఅవుట్‌లో 475 చదరపు గజాల భూమిని కట్టబెట్టారు. ఈ భూమిని ఇవ్వడానికి అంగీకరిస్తూ హైదరాబాద్ కలెక్టర్ సిఫారసు చేయగా సీసీఎల్‌ఏ ఆమోదిస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజనే జరిగిన తర్వాత కాకినాడకు చెందిన వారికి హైదరాబాద్‌లో భూమిని కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటనేది అధికారులే చెప్పాలి. సీమాంధ్రకు చెందిన అధికారికి సీమాంధ్రలోనే భూమిని కేటాయించకుండా తెలంగాణ భూములను ఎందుకు కేటాయిస్తున్నారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
టీఆర్‌ఎస్ సీరియస్..: సీమాంధ్రకు చెందిన అధికారులకు, బడాబాబులకు ఆయాచితంగా భూములు కట్టబెట్టడంపై టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రం ఆవిర్భవిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో తిష్ఠవేసిన సీమాంధ్ర అధికారుల సహకారంతో భూములు స్వాహా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ భూముల కేటాయింపులు, ఎన్వోసీల జారీపై మొత్తానికి మొత్తం సమీక్ష నిర్వహిస్తామని అంటున్నారు. ఈ అక్రమాలలో పాలు పంచుకున్న అధికారులు ఎంతటి వారైనా, సీమాంధ్రకు వెళ్లినా రప్పించి ప్రాసిక్యూట్ చేస్తాం తప్ప వదిలేది లేదని అంటున్నారు. సీమాంధ్ర అధికారులు ఇచ్చిన ఎన్వోసీలను, కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!