తోటకము:
ఇది నమ్మకద్రోహ మిదేహ్యమగున్!
మదిలోపలఁ గుట్రల మానకయే,
వదనాయత హాసిత వంచకులై
పదునైదు దినమ్ముల వాయిద సం
సదనమ్మునఁ దెల్పఁగ సభ్యతయా?
గీతాలంబనము:
బీయేసి విధానము వీడి యిఁకన్
మాయా సహితోక్తుల మానుఁడయా!
వేయేల? స్వరాష్ట్రపు వీక్షణయన్
మా యాశ నిరాశగ మార్చెదరా?
రథోద్ధతము:
మానుఁడోయి యసమర్థ వాక్యముల్!
మానుఁడోయి యసమాన దర్పముల్!
మానుఁడోయి యవమాన వేషముల్!
పూనుఁడోయి యశమొందు కృత్యముల్!!
ప్రియంవద:
ఇటను స్పీకరిఁక నేక పక్షమౌ
కుటిల మార్గుఁడయి క్రూరయోచనా
ఘటిత దృష్టిఁ దెలగాణ బిల్లుపై
నిటుల వాయిదల నీయ భావ్యమా?
స్రగ్విణి:
న్యాయమార్గమ్ములో నవ్య రాష్ట్రమ్ము వేం
చేయనుండంగ దుశ్శీల దుర్నీతి న
న్యాయకృత్యాలతో నాపఁగాఁ బూనుచో
మాయ ఛేదించి, సన్మాన్యతన్ బొందమే?
స్వాగతము:
స్వాగతింపుఁడయ సక్రమ చర్చల్
వేగఁ జేయుఁడయ వేడుకతోడన్
సాఁగఁజేయుఁడయ చక్కని రీతిన్
గాఁగలట్టి తెలగాణకు జేజే!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
3 కామెంట్‌లు:
గుండువారూ, శాంతించండి.
నమ్మకద్రోహం అనేది నమ్మకం ఉన్నప్పటి మాటకదా? ఉన్నదంతా ఎల్లెడలా అపనమ్మకమే అనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశరాష్ట్రంలో పాలనపట్ల అపనమ్మకంతోనే తెలంగాణావారు విడిపోదామంటున్నారు. కేంద్రప్రభుత్వం చేస్తున్న విభజన తతంగంలోని అసంబధ్ధవిధానాల కారణంగా, ఢిల్లీదొరలమీద అపనమ్మకంతోనే సీమాంధ్రప్రాంతంవారు మోకాలడ్డు పెడుతున్నారు. ముఖ్యమంత్రిమీద అపనమ్మకంతోనే ఢిల్లీసర్కారువారు డిగ్గీరాజాను పెత్తనం చేయమని పంపారు. ఎక్కడ ఎవరికి ఎవరిమీద ఉంది నమ్మకం, ఒక్క తెలంగాణావారికి కొంతలోకొంతవరకూ డిల్లీవారి దయమీద తప్ప!?
శ్యామలీయంగారూ, నమ్మకం, అపనమ్మకం విషయం లోకానికి తెలుసు. మీరు ధ్రువీకరించవలసినపనిలేదు. డిసెంబర్ 11 నాటి బీయేసి తీర్మానం ప్రకారమే, సభ్యుల కోరికపై మల్లు భట్టివిక్రమార్కగారు తెలంగాణ బిల్లుపై చర్చకు అనుమతినిచ్చి, చంద్రబాబునాయుడుగారికి ముందుగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబునాయుడుగారు నోరు మెదపనందున, సభవాయిదాపడింది. ఇది జగమెరిగిన సత్యమే కదా! ఈ విషయంపై మరల బీయేసిలో చర్చ జరిగింది. స్పీకర్ స్పందించి, మరునాటినుండి చర్చలు జరుపుతానని తీర్మానించాడు. టీ నేతలంతా నమ్మారు. కానీ, ఆయన ముఖ్యమంత్రిగారి మాటలప్రకారమే చర్చలకు తావీయలేదంటే ఏమనాలి? అదీగాక ముఖ్యమంత్రిగారు, చర్చ ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావించకుండా, చర్చలింకా ప్రారంభం కాలేదనడం, స్పీకర్ వంతపాడడం నమ్మకద్రోహంకాక మరేమిటి? మీ సీమాంధ్ర నాయకుల తీరే ఇంత. నేను నిజం చెబితే, తమరికి ఎందుకు రోషం వస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఎవరు నమ్మక ద్రోహం చేశారో వాళ్ళనంటే మీరెందుకు ముందుకొస్తున్నారు? మా తెలంగాణకు జరిగిన అన్యాయం మీకు తెలియదా? ఇంకా అన్యాయానికే బలికావాలా? ప్రతిదానికీ తగుదునమ్మా అని రావడం మీకే చెల్లింది. సమంజసమైతే మేం ఎవరినీ ఊరకే అనం కదా! ఎవరు ద్రోహులో మాకు తెలియదా? మీరు మాకు చెప్పాలా? అబద్ధాన్ని అబద్ధం అని, నిజాన్ని నిజం అని ఒప్పుకొనే సంస్కారంకూడా ఉండాలి నేతలకు ఎవరికైనా! ఊరకే నోరుంది కద్దా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోడానికి ఇక్కడ ఎవరూ కాచుకొని కూర్చోలేదుగదా! పద్యాలపై స్పందించినందుకైనా తమరికి కృతజ్ఞుడను. స్వస్తి.
శ్యామలీయం గారూ,
మీమీద అపనమ్మకంతోనే విడిపోతామన్నాం. ఏప్పుడూ? యాభై సంవత్సరాలు మీ (ఆంధ్ర పాలకులు) చేసిన నమ్మక ద్రోహాలను భరించిన తర్వాత.
మరి మీరు చేసినదేమిటి? సుప్రీం కోర్టు ముల్కీ రూల్స్ సమర్థిస్తే మీరు అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం జరిపి వాటిని రద్దు చేయించారు. మా పోరాటాల ఫలితంగా 610 GOను తెచ్చినా, దాని అమలు 30 ఏళ్ళుగా నోచుకోలేదు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ, 30 సంవత్సరాలైనా పూఋతికాక పోయినా కుడివైపు మాత్రం (నీటిపై అర్హత లేకున్నా) పదమూడు కాల్వలు వెలుస్తాయి! మద్రాసు దాకా వెళ్తాయి.
ప్రతిరోజూ సినిమాల్లోనూ సాహిత్యంలోనూ పత్రికల్లోనూ తెలంగాణా సాహిత్యంపై,వ్యవహారికంపై, నాయకత్వం పై అవహేళనలు. తెలంగాణా వారిని జోకర్లుగా రౌడీలుగా చూపడం రోజురోజుకూ పెరిగి పోయింది. మిమ్ములను నమ్మలేంతగా మీరే మీ పై నమ్మకాన్ని వమ్ము చేసుకొన్నారు.
ఇపుడు తెలంగాణా ప్రజలెవరూ మిమ్ములను నమ్మడం లేదు. మీకు విభజనను అంగీకరించడం తప్ప వేరొక మార్గం లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి