- చిన్న దేశమైనా ఎంతో అభివృద్ధి
- ప్రజాప్రతినిధులను పర్యటనకు పంపిస్తా
- తెలంగాణ గురించి వారికి వివరించా
- మన పారిశ్రామిక విధానానికి ప్రశంసలు
- మీడియాతో సీఎం కేసీఆర్
వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైశాల్యం, జనాభాలో అతి చిన్న దేశమైన సింగపూర్ అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఐదురోజులపాటు సింగపూర్, మలేషియా దేశాల పర్యటనను ముగించుకొని వచ్చిన కేసీఆర్ సోమవారం తన అనుభవాలను, అనుభూతులను మీడియాతో పంచుకున్నారు.- ప్రజాప్రతినిధులను పర్యటనకు పంపిస్తా
- తెలంగాణ గురించి వారికి వివరించా
- మన పారిశ్రామిక విధానానికి ప్రశంసలు
- మీడియాతో సీఎం కేసీఆర్
సింగపూర్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కేసీఆర్ అన్నా రు. మంచినీళ్ల నుంచి ప్రతి చిన్న వస్తువు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన సింగపూర్ అర్థిక ప్రగతిలో ఇప్పు డు అగ్ర రాజ్యమైన అమెరికా సరసన చేరిందని శ్లాఘించారు. కేవలం 53 లక్షల జనాభా, కోటి 75 లక్షల ఎకరాల భూభాగం మాత్రమే ఉన్న సింగపూర్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అన్నిరంగాల్లో ముందడుగు వేయడం ఆ దేశ ప్రజల సంఘటిత కృషికి నిదర్శమని అన్నారు. సింగపూర్‌లో స్థిరపడిన ఇతర దేశాల పౌరులు కూడా తాము ఆ దేశ పౌరులమేనని గర్వంగా చెప్పుకోవడం తనను ఎంతో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
పరిశుభ్రతకు మారుపేరు..
సింగపూర్ దేశమంతా పచ్చిక బయళ్లతో ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని, రోడ్లపై ఎక్కడా చిన్న కాగితం ముక్కకూడా కనిపించదని కేసీఆర్ చెప్పారు. ఆ దేశ వైశాల్యం ఒకప్పుడు 640 చదరపు కిలోమీటర్లు ఉండేదని, ఇప్పుడు 700 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఇది ఆ దేశం సాధించిన విజయాలలో ఒకటని కేసీఆర్ అన్నారు. ఏమీలేని దీనస్థితి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి సింగపూర్ చేరుకుందంటే దానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, ప్రజల భాగస్వామ్యమే కారణమని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్ దేశం డాలర్ మారకం విలువ భారతదేశ కరెన్సీతో రూ.50 ఉందని, తలసరి ఆదాయం 50 మిలియన్ డాలర్లు అని సింగపూర్ ఆర్థిక వ్యవస్థ స్థాయిని కేసీఆర్ వివరించారు.
మనమెందుకు వెనకబడ్డాం..?
తక్కువ భూభాగం, తక్కువ వనరులు వున్న సింగపూర్ అంతగా అభివృద్ధి చెందినప్పుడు, విశాల భూభాగం, అపార వనరులు వున్న మన దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదనే బాధ కలుగుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ ఒకప్పుడు వెనుకబడ్డ దేశాల సరసన ఉన్న మూడవ ప్రపంచ దేశమని, ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశమని అయన అన్నారు. సింగపూర్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఆ దేశ మొదటి ప్రధాని లీ క్వాన్ యుకే దక్కుతుందని అన్నారు. లీ క్వాన్ యు రాసిన సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టు ఫస్ట్ అనే పుస్తకాన్ని 1995లోనే చదివానని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఆ దేశాన్ని స్వయంగా చూసే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతోనే తాను జన్మభూమి పథకాన్ని రూపకల్పన చేసినట్లు చంద్రశేఖర్ రావు వెల్లడించారు. లీ క్వాన్ యు రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించాలనుకుంటున్నట్లు చెప్పిన సీఎం, దీని వల్ల ప్రపంచంలోని తెలుగు వారికి ఒకనాటి సింగపూర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని తెలుస్తుందని అన్నారు. అభివృద్ధిని కోరుకునే దేశాలకు, పౌరులకు అది అవసరమైన పాఠం అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భూమి కొరత సహజ వనరుల కొరత ఉన్నా చైనా, ఇండియా, డచ్,బ్రిటీష్ దేశాల నుంచి వచ్చిన వారు సింగపూర్‌ను ఓ అద్భుతమైన దేశంగా ఎలా తీర్చిదిద్దారో ఈ పుస్తకంలో ఉంటుందని సీఎం చెప్పారు.
ప్రజాప్రతినిధులందరినీ పంపిస్తా...
సింగపూర్ పర్యటనతో తాను ఎంతో నేర్చుకున్నానని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను కూడా సింగపూర్ పంపుతానని కేసీఆర్ తెలిపారు. వారికి శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ను కోరారని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్‌తో పాటు పక్కనే ఉన్న మలేషియా కూడా గొప్పగా అభివృద్ధి చెందిందని, రెండు దేశాల మధ్య ఉన్న వారథిపై కారులో ప్రయాణం చేయడం వల్ల అక్కడి పరిశ్రమలు, వాతావరణం, ఇతర జనావాసాలను స్వయంగా చూసే అవకాశం కలిగిందన్నారు. మలేషియా ప్రతి సంవత్సరం 2.7 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు.
తెలంగాణ గురించి చెప్పా...
సింగపూర్ పర్యటనలో తెలంగాణను అక్కడి వారికి పరిచయం చేశానని కేసీఆర్ చెప్పారు. వివిధ సమావేశాలు, గ్రూప్ మీటింగ్‌లలో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో, చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో అక్కడి వారు ఎంతో అభినందించారని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్‌లో జరిపిన పర్యటనలో అనేక రంగాల అభివృద్ధిపై స్వయంగా అధ్యయనం చేశానని, ఇది తెలంగాణ పునర్నిర్మానానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
జై తెలంగాణా !! జై జై తెలంగాణా !! జై జై జై 'సింగారాంగణా' !!!
ధన్యవాదాలు Zilebi గారూ! ఆలస్యంగా స్పందించినందులకు మన్నింపఁగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి