గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 05, 2014

సీమాంధ్ర సర్కార్ కరెంట్ కుట్రలు!

- తెలంగాణ రైతులపై చంద్రబాబు కచ్చ
- రెండు పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి నిలిపేసిన ఆంధ్రా సర్కార్..
- వీటీపీఎస్‌లో 500 మెగావాట్లు.. ఆర్టీపీపీలో 210 యూనిట్లు
- తెలంగాణకు నిలిచిపోయిన 710 మెగావాట్ల విద్యుత్..
- లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చిన సీఎం కేసీఆర్
- ఉద్దేశపూర్వకంగానే నిలిపేశారని ఆరోపణ..
- ఉత్పత్తి సత్వర పునరుద్ధరణకు డిమాండ్
- రైతుల ఉసురు పోసుకుంటున్న ఆంధ్రా సర్కార్
- విద్యుత్ వివాదాలతో పెరుగుతున్న లోటు
- దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణలోనే విద్యుత్‌లోటు
కరెంటు కోతలతో తెలంగాణ రైతాంగం అతలాకుతలం అవుతుండగా, దీనికి మరింత ఆజ్యం పోసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన విద్యుత్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. సాటి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు అంధకారంలో మగ్గుతుండగా ఆంధ్ర ప్రాంతంలో రెండు పవర్ ప్రాజెక్టుల్లో కావాలనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. విజయవాడలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఒక యూనిట్‌ను నిలిపివేయడంవల్ల తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ రాకుండా పోయింది. 
ఇది అనైతికం..

curkutralu1ఆంధ్రా సీఎం ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడం చట్టవిరుద్ధం,అనైతికం. తోటి తెలుగు రైతులను అష్టకష్టాల పాల్జేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను అమలు చేయకుండా, మరొకవైపు ఉద్దేశపూర్వకంగా రెండు యూనిట్లలో విద్యుత్‌ఉత్పత్తిని నిలిపివేశారు. ఓవరాలింగ్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం సమంజసం కాదు.తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా, రైతాంగం కడగండ్లను తీర్చేలా తక్షణమే ఆ రెండు పవర్ యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేపట్టే విధంగా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలి.


కడప జిల్లా మద్దనూరు (ఆర్టీపీపీ) వద్ద మరో యూనిట్‌లో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం బొగ్గు కొరత సాకుగా చూపి ఈ రెండు యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసి తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి సహించలేక.. ప్రజల ముందు ప్రభుత్వాన్ని బద్నాం చేసేవిధంగా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ మేధావులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగా రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

curkutraluఆంధ్రప్రదేశ్ వైఖరిపై ఆయన కేంద్ర విద్యుత్ మంత్రికి సోమవారం లేఖ రాశారు. ఆంధ్రా సీఎం ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడం చట్టవిరుద్ధం, అనైతికమని ఆ లేఖలో పేర్కొన్నారు. తోటి తెలుగు రైతులను అష్టకష్టాలపాల్జేస్తున్న చంద్రబాబు వైఖరిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఒకవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను అమలు చేయకపోవడాన్ని, మరొకవైపు ఉద్దేశపూర్వకంగా రెండు యూనిట్లలో విద్యుత్‌ఉత్పత్తిని నిలిపివేసిన తీరును కేసీఆర్ తన లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఓవరాలింగ్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం సమంజసం కాదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారని సమాచారం. తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా, రైతాంగం కడగండ్లను తీర్చేలా తక్షణమే ఆ రెండు పవర్ యూనిట్ల నుంచి విద్యుత్‌ఉత్పత్తి చేపట్టే విధంగా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

curkutralu2తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన టీడీపీ అధినేత.. పీపీఏల రద్దు కుట్రలకు తెరలేపి తెలంగాణ విద్యుత్‌రంగాన్ని అతలాకుతలం చేసేందుకు యత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందకుండా కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడాలని, పంటలు ఎండిపోయిన రైతులు రోడ్లపైకి రావాలనే ఉద్దేశంతోనే పరోక్షంగా విద్యుత్ వివాదాలకు ఆజ్యం పోశారని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా తెలంగాణకు అందాల్సిన 53.89 శాతం విద్యుత్తును అడ్డుకోవడంతో తెలంగాణ వ్యవసాయరంగానికి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ర్టాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే 23.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటుండడం గమనార్హం.

తెలంగాణ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌లోటు ఉంది. తెలంగాణలో దాదాపు 19లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద వ్యవసాయరంగం భూగర్భజలాలపై ఆధారపడి ఉండడం వల్ల విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయి. ముందే విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్న తెలంగాణను మరిన్ని కష్టాలకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాల్లో కరెంటు కష్టాలను సృష్టించి, తద్వారా రైతాంగంలో ఆగ్రహావేశాలకు ఆస్కారం కల్పించి వారు నిరసనలకు దిగేలా రెచ్చగొట్టుడు చర్యలకు ఆంధ్రా సర్కారు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాలనపరంగా వేళ్లూనుకుంటున్న సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) పేరుతో విద్యుత్ వివాదాలకు ఆజ్యం పోసిన ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌సంస్థల ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. ఇరు రాష్ర్టాల విద్యుత్ వివాదాలపై కేంద్రం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఇఏ) చైర్‌పర్సన్ నీరజా మాథూర్ కమిటీ సూచనలను కూడా పట్టించుకోవడంలేదు. ఫలితంగా తెలంగాణకు విద్యుత్ లోటు తీవ్రమైంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా చంద్రబాబు తెలంగాణ విద్యుత్‌రంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి తెలంగాణ అభివృద్ధిని అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండడంపై తెలంగాణ మేధావులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా ఆంధ్రా సర్కారు కుట్రపూరిత వైఖరి క్షేత్రస్థాయిలో వెల్లడైందని అంటున్నారు.

రద్దు గొడవతో తెలంగాణకు కష్టాలు

ఆంధ్రా సర్కార్ పీపీఏల రద్దు రాద్ధాంతంతో తెలంగాణకు వారం రోజులుగా కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది పూర్తిస్థాయిలో వర్షాలు కురవక పోవడంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పీపీఏల పేచీతో ఆంధ్రాసర్కార్ తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన 460 మెగావాట్ల (10 మిలియన్ యూనిట్లు) విద్యుత్తును రాకుండా అడ్డుకోవడంతో తెలంగాణ విద్యుత్‌లోటుతో అతలాకుతలం అవుతున్నది. ఫలితంగా అధికారికంగా మూడు గంటల నుంచి ఆరు గంటల పాటు కరెంటు కోతలు అనివార్యమయ్యాయి.

ఆంధ్రా సర్కారు తీరు వల్ల హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మూడు గంటలపాటు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మూడు గంటలపాటు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలపాటు, మండల కేంద్రాల్లో ఆరు గంటలపాటు, గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు గంటలకు పైగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం పూర్తిగా ఆంధ్ర సర్కారు కుటిలత్వమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పీపీఏల వివాదం

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ జెన్‌కోలు వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. పీపీఏల ప్రతిపాదనలు 2009 సంవత్సరం నుంచి ఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీజెన్‌కో భౌగోళికంగా విభజన జరిగి, రెండు డిస్కమ్‌ల చొప్పున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల పరిధిలోకి వచ్చాయి. పీపీఏలను ఏపీఈఆర్సీ ఆమోదించలేదనే సాకు చూపిన జెన్‌కో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మా పవర్ ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి మాకే అంటూ తిరకాసుపెట్టి తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన విద్యుత్తును అడ్డుకుంటున్నది.

విద్యుత్ విభజనపై ఆంధ్రా రాద్ధాంతం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారంగా విద్యుత్ వినియోగాన్నిబట్టి విద్యుత్ విభజన జరిగింది. తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం అంతా భూగర్భజలాలపై ఆధారపడి ఉండడం, రాజధాని చుట్టూ పారిశ్రామికేంద్రాలు, హైదరాబాద్ జంటనగరాలు, సైబరాబాద్ పట్టణీకరణ తదితర కారణాలతో తెలంగాణ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ద్వారా మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం, సీమాంధ్రకు 46.11 శాతం వాటాల నిర్ణయం జరిగింది.

రాష్ట్ర విభజన క్రమంలో భాగస్వాములైన నిపుణులు వివాదాలకు ఆస్కారం లేకుండా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి విద్యుత్ విభజన చేశారు. భౌగోళికంగా ఎక్కడి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి చెందండంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)ల ప్రకారం విద్యుత్ లభ్యత ఇరు రాష్ర్టాలకు ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారపగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి ఆర్థిక వనరుల కొరత రీత్యా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యేట్లు లేదు. దీంతో ప్రజానీకం దృష్టిని మళ్ళించేందుకు ఆంధ్రా సీఎం చంద్రబాబు విద్యుత్ వివాదానికి ఆజ్యం పోసినట్లుగా భావిస్తున్నారు.

పీపీఏ నిప్పుల కుంపటి రాజేసిన ఏపీఈఆర్సీ

రాష్ట్ర విభజనకు ముందు నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(డిస్కమ్స్) ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపుదల(టారిఫ్ ఆర్డర్లు) ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తిరిగి వెనక్కి పంపించి పీపీఏల నిప్పును రాజేసింది. గత ఐదారేండ్లుగా ఏపీజెన్‌కో, డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించింది.

కరెంటు కోతలు

హైదరాబాద్, వరంగల్ జిల్లాలో : 4 గంటలు
జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో : 5 గంటలు
పట్టణాలు,మున్సిపాలిటీల్లో : 6 గంటలు
మండల కేంద్రాలు : 8 గంటలు
గ్రామీణ ప్రాంతాలు : 12 గంటలు

తెలంగాణలో ఆగస్టు 3న విద్యుత్ సరఫరా, వివరాలు

విద్యుత్ డిమాండ్ : 151.10 మిలియన్ యూనిట్లు
సరఫరా : 127.29 మిలియన్ యూనిట్లు
విద్యుత్‌లోటు : 23.81 మిలియన్ యూనిట్లు
పవర్ ఎక్సేంజ్ విక్రయం : 10.53 మిలియన్ యూనిట్లు

లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) వివరాలు

పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే
వ్యవసాయరంగానికి 12.69 మిలియన్ యూనిట్లు
గృహ వినియోగానికి 9.78 మిలియన్ యూనిట్లు
పారిశ్రామికరంగానికి 1.34 మిలియన్ యూనిట్లు

విద్యుత్ కొనుగోళ్ళు

ఔట్ సైడ్(జజ్జర్‌తో పాటు) 34.51 మిలియన్ యూనిట్లు
సీజీఎస్ నుంచి ఓవర్ డ్రాయల్ 6.26 మిలియన్ యూనిట్లు

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి