గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 18, 2014

"సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి" -చంద్రబాబు

- ఇరు రాష్ర్టాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం కుదిరింది
- ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చేనెల ఏడో తేదీ వరకు
- తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు

రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న సమస్యలు తొలుగుతాయన్న నమ్మకం కలిగిందని.. తెలంగాణ రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్‌రావుతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నేను, కేసీఆర్ ఇద్దరం మిత్రులమే.. శత్రువులం కాదు. గతంలో ఇద్దరం కలిసి పనిచేశాం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజల కోసం సమగ్ర సర్వే చేస్తున్నది. ఒక రాష్ట్రం చేపట్టే కార్యక్రమాలపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడటం సరికాదు. 
babuఆ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలనేది.. ఆ ప్రజలు మ్యాన్‌డేట్ ఇచ్చారు. ఆ మేరకు చేస్తారు అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన నివాసంలో మీడియాకు చర్చల సారాంశాన్ని వివరించారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. మొదటిసారి జరిగిన ఈ భేటీలో అధికారులు/ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9, 10తోపాటు ఈ రెండు షెడ్యూళ్లలో లేని అంశాలపై చర్చ జరిగిందన్నారు.

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, పీపీఏలపై మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడుతూ.. ఒక్కో ప్రభుత్వం ఒక్కో తీరును అనుసరిస్తుందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాను కూడా అమలుచేయడం లేదని, కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలనే తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై మాట్లాడకూడదని అన్నారు. భేటీలో స్కాలర్‌షిప్ అంశం చర్చకు రాలేదని తెలిపారు. కేంద్ర సర్వీస్ అధికారుల విషయం ప్రత్యూష్ కమిటీ చూసుకుంటుందన్నారు. లాటరీలో అధికారులు ఏ రాష్ర్టానికి వస్తే.. ఆ రాష్ర్టానికి పని చేయాలన్నారు.

ఉద్యోగుల సమస్యలపై స్థాయీ చర్చలు: విభజనలో ఆలస్యం అవుతుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల విభజన అంశం కమలాథన్ కమిటీ చూస్తుందని.. ఈ విషయంలో రెండు రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలు సమావేశమై ఎవరికీ అన్యాయం జరుగకుండా సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఇద్దరు సీఎంలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

రెండు రాష్ర్టాలను కేంద్రం అభివృద్ధి చేయాలి: ఇరు రాష్ర్టాలు అభివృద్ధి చెందేలా కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలిపారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన అంశాల్లో వివాదాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ముందుకు పోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పుంజుకునేవరకు సహకరించాల్సిన అవసరం ఉందని.. నిధుల విషయంలో పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండున్నర నెలలు అవుతున్నా పాలనపై దృష్టి పెట్టలేదన్నారు. తాను గెస్ట్‌హౌస్ నుంచేపాలన సాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ఆంధ్రలోని అన్ని పోర్టులు వినియోగించుకోవచ్చు..: హైదరాబాద్‌ను అందరం కలసి అభివృద్ధి చేశామని, 10 ఏళ్ల తరువాత అన్ని హక్కు లు తెలంగాణకే చెందుతాయని చంద్రబాబు అన్నా రు. తెలుగు వారు అంతటా ఉన్నారని, ప్రత్యేక ఉద్యమాల నేపథ్యం లో సెక్షన్ (8)ను తీసుకున్నారని వివరించారు. కేంద్రం తాను చెప్పిన అంశాలకు గైడ్‌లైన్స్ ఇవ్వలేదని.. స్పష్టత లేకపోవడంతో ఇవన్నీ వచ్చాయని అన్నా రు. తమ సమావేశంలో కొన్ని విషయాల్లో లోతుగా చర్చించామని.. మరికొన్ని సమస్యలపై తరువాత చర్చించాలని అనుకున్నామని తెలిపారు. నౌకారవాణా నిమిత్తం బందరుపోర్టు కావాలని కేసీఆర్ కోరారని..

అన్ని పోర్టులు వినియోగించుకోవచ్చునని తెలిపినట్లు చెప్పారు. కేసీఆర్ తనకు కొత్త కాదని చెప్పిన చంద్రబాబు.. రాజకీయాల్లో కొన్నిసార్లు, కొన్ని విధానాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఏది మంచిదో ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పారు. మొదటిసారి జరిగిన చర్చల్లో కాన్ఫిడెన్స్ పెరిగిందని, అపోహలు తొలగిపోయాయని అన్నారు. తాను ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ తెలుగువాడేనని, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేశారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆంధ్రా అధికారులే ఎక్కువగా ఉన్నారని, వాళ్లు వెళ్లిపోతే ఇబ్బందేనని కేసీఆర్ అన్నట్లు చంద్రబాబు తెలిపారు. 1956 రూల్స్ అమలు చేద్దామన్నా కేసీఆర్ చేయలేరని, ఎవరూ చట్టాలకు అతీతం కాదన్నారు. 8వ తేదీన వినాయక చవితి ఉండడంతో అసెంబ్లీ సమావేశాలను 7వ తేదీకి కుదించుకోవాలని కేసీఆర్ కోరారు. దీంతో తాము సమావేశాలను ఆలోపు ముగించేలా చూడాలని స్పీకర్‌ను కోరాం. తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి అని చంద్రబాబు అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి