గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 24, 2014

ఆయనొక చోట.. ఆమె ఒక చోట!

-సర్వీసు అధికారుల కేటాయింపులో సిత్రాలు
-తెలంగాణ వ్యతిరేకులు ఇక్కడకు
-తెలంగాణ అనుకూలురు అక్కడకు
-కేటాయింపులపై మార్పులుండేనా?
-ఐఏఎస్, ఐపీఎస్‌లలో జోరుగా చర్చ
-సీఎంల దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌లకు వినతులు
అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో పలు చిత్రాలు చోటుచేసుకున్నాయి. సర్వీసు అధికారుల్లో పలువురు భార్యాభర్తలు కూడా ఉన్నారు. అయితే.. వీరిలో భర్త ఒక రాష్ర్టానికి ఎలాట్ అయితే.. భార్య మరో రాష్ర్టానికి ఎలాట్ అయ్యారు. అంతేకాదు.. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడిన కొందరు అధికారులు తెలంగాణకు వస్తుంటే.. తెలంగాణపై అభిమానంతో, తెలంగాణకోసం అంకిత భావంతో పనిచేసిన మరికొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళుతున్నారు. ఈ లోటుపాట్లపై సర్దుబాటు ఉంటుందా? అధికారులు కోరుకుంటే మార్పులు ఉంటాయా? లేక రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుంటే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అసలు అందుకు కేంద్రం అంగీకరిస్తుందా? అనే చర్చ ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. 
వారం వ్యవధిలో తమ అభ్యంతరాలను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. వారి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను రూపొందించేలోగా ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే కొన్ని మార్పులు సాధ్యమేనని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు తమకు కేటాయించిన రాష్ర్టాల్లో పనిచేసేందుకు ఆసక్తి లేనివారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రులను సంప్రదిస్తే, ఈ మేరకు ఇరు రాష్ర్టాల సీఎంలు అంగీకరిస్తే మార్పు సాధ్యం కావచ్చునని అంటున్నారు. భార్యభర్తలిద్దరు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉంటే వారిద్దరూ ఒకే రాష్ర్టానికి ఆప్షన్ కోరుకుంటే ఈ విషయాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ క్యాడర్‌కు సీనియర్ ఐఎఎస్ అధికారి బీపీ ఆచార్యను కేటాయించారు. అయితే ఆయన సతీమణి రంజీవ్ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అజయ్‌సహానీని ఏపీకి కేటాయించగా ఆయన భార్య నీలం సహానీని తెలంగాణకు కేటాయించారు. ఇతర సీనియర్ అధికారులు రెడ్డి సుబ్రమణ్యం, ఆయన భార్య పుష్ప సుబ్రమణ్యం, ఆర్‌ఆర్ మిశ్రా, ఆయన భార్య వసుధ మిశ్రాలు కూడా రెండు రాష్ర్టాలకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర క్యాడర్‌కు చెందిన యోగితారాణా, మాణిక్‌రాజ్ దంపతులను కూడా వేర్వేరు రాష్ర్టాలకు కేటాయించారు. అయితే ప్రస్తుతం వారిద్దరు డిప్యూటేషన్‌పై జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఉన్నారు. దంపతులిద్దరూ ఒకే రాష్ట్రంలో పనిచేయాలని భావిస్తే ఈ మేరకు వెసులుబాటు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పీవీ రమేశ్ పరిస్థితేంటి?
ఉద్యోగుల విభజనకు సంబంధించి కీలక భూమిక నిర్వహించిన ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ విషయంలో ఐఏఎస్ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆయన తెలంగాణ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే విమర్శలు చేశాయి. అయితే ఆయన ఇతరత్రా ప్రత్యామ్నాయాలను ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తున్నది. డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం, లేదా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లడం ఆయన ముందున్న మార్గాలని భావిస్తున్నారు. కాదూ కూడదని తెలంగాణలోనే పని చేస్తానంటే ఆయనకు ప్రాధాన్యం కలిగిన పోస్టు లభించకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేక పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో అత్యంత చొరవ తీసుకుని పనిచేశారు. కమిషనర్‌గా తన బాధ్యత నిర్వహించినప్పటికీ ఆయన తెలంగాణ కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబరిచారని సీమాంధ్ర వర్గాలు భావిస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులో వెళ్లనున్నారు. వారు చీఫ్ సెక్రటరీని సంప్రదించి తెలంగాణలో కొనసాగేలా ప్రయత్నిస్తే అది ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఐపీఎస్ అధికారుల్లోనూ సీమాంధ్రకు చెందిన పలువురు హైదరాబాద్‌లో చదువుకున్న రికార్డుతో తెలంగాణ క్యాడర్‌కు వచ్చారు.

మార్పులు చేర్పులు జరిగిన తరువాత తుది జాబితా విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీలోగా తెలంగాణకు అధికారులందరినీ కేటాయిస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారందరూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి