-జీడీపీ వృద్ధిరేటు అభివృద్ధికి సూచిక కాదు
-ప్రేమానుబంధాలు పెంచే ప్రగతిపై దృష్టి పెట్టాలి
- తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
- ప్రభుత్వం మంచిపనులు చేస్తే సహకరించాలి
- నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
జీడీపీ వృద్ధి రేటు సూచికలను అభివృద్ధి నమూనాలుగా స్వీకరించే పద్ధతులకు స్వస్తి చెప్పాలని, మానవ వికాస అభివృద్ధే నిజమైన ప్రగతి కావాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పాలకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రభుత్వాలకు మానవ వికాసమే లక్ష్యం కావాలని, ఆ పద్ధతిలోనే పాలకుల కార్యాచరణ ఉండాలని ఆయన సూచించారు. -ప్రేమానుబంధాలు పెంచే ప్రగతిపై దృష్టి పెట్టాలి
- తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
- ప్రభుత్వం మంచిపనులు చేస్తే సహకరించాలి
- నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
మానవ సంబంధాలను మెరుగుపరిచి, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను పెంపొందించే ప్రగతే నిజమైన అభివృద్ధిగా గుర్తించాలన్నారు. వ్యత్యాసాలు లేని సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయాణంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేశారని విమర్శించారు.
తెలంగాణ ప్రాంత నాయకులే హోం మంత్రులుగా ఉన్నప్పటికీ పౌరహక్కులకు మాత్రం దిక్కుఉండేది కాదన్నారు. రాజ్యహింస పరాకాష్టకు చేరినందునే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తామని హామీ ఇస్తూ ఆవిర్భవిస్తున్న తెలంగాణ వికాస సమితి ప్రజల సర్వతోముఖ వికాసానికి మార్గదర్శనం చేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వికాస సమితి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సహకరించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిరసించాలని చెప్పారు. పాలకపక్షాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోరాదని, అలాగని ఏం జరిగినా ఊరుకోరాదని సూచించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులంతా నిశబ్ధంగా మారారని, ప్రభుత్వానికి సరండర్ అయ్యారని కొంతమంది చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అనేక కష్టనష్టాలకోర్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నప్పటికీ, రాష్ట్రంపైన కుట్రల ప్రమాదాలు ఇంకా పొంచి ఉన్నాయని హెచ్చరించారు. రాష్ర్టాన్ని సాధించుకున్నామన్న సంతోషాన్ని కూడా తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంపై గవర్నర్ అధికారాలను పెంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉద్యోగ సంఘాల నేత సీ విఠల్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సంపూర్ణ తెలంగాణ ఏర్పడలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే సంకల్పంతోనే తెలంగాణ వికాస సమితి ఏర్పడిందనీ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. వికాస సమతి సలహాసంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలను, సలహాలను సమతి స్వీకరిస్తుందనీ, సలహా సంఘం ఈ బాధ్యతలను నిర్వహిస్తుందని తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్ సీతారామారావు, అండమ్మ, సదానందం, అయాచితం శ్రీధర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వీరన్న నాయక్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అడ్వకేట్ భరత్‌కుమార్, బీ ఐలయ్య పాల్గొన్నారు.
తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడిగా దేశపతి ఏకగ్రీవ ఎన్నిక
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడిగా దేశపతి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభ జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సమితి ఉపాధ్యక్షులుగా జీ వెంకటేశ్వర్లు (నల్లగొండ), సతీశ్ (వరంగల్), కోటమురళి(కరీంనగర్), వెంకటరమణి (వరంగల్)నియమితులయ్యారు. కార్యదర్శులుగా పీ వెంకన్న, నర్రా భగవాన్‌రెడ్డి, హెచ్ రవీందర్, విజయభాస్కర్, కే విమల, సీ సుధాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
ఇక సమితి కార్యవర్గ సభ్యులుగా రాచర్ల వెంకన్న, రవీందర్‌రెడ్డి, సైదిరెడ్డి,డా సురేందర్, జీ రమేశ్, గజ్జల రమేశ్, ఆయాచితం శ్రీధర్, యశపాల్, సంపత్, రాజేశ్, బిక్షపతి నాయక్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 15 రోజుల్లో సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతిలో తెలంగాణ వికాస సమితితో కలిసి భాగస్వాములు కావాలని, శ్రమించాలని భావిస్తున్న వారంతా తమకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కార్యవర్గాన్ని విస్తరిస్తామని, ప్రతి జిల్లాలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తామని దేశపతి తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి